ముంబై: మణిపూర్, గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొట్టిపారేశారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డ ఈ రెండు రాష్ట్రాల్లో తాము మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని ఆయన సమర్థించుకున్నారు.
'హంగ్ అసెంబ్లీ వచ్చిన రాష్ట్రాల్లో ఏ పార్టీకి అయితే అత్యధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందో.. వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అదే సంప్రదాయాన్ని గోవా, మణిపూర్‌లో మేం పాటించాం' అని ఇండియా టుడే సదస్సులో షా పేర్కొన్నారు. గోవా, మణిపూర్‌లో బీజేపీ దొడ్డిదారిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ రెండు రాష్ట్రాల కమలం పార్టీకి అత్యధిక స్థాయిలో ఓట్లు లభించాయని, ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ తెచ్చుకోలేకపోయిందని, అందుకే తాము ప్రభుత్వాలను నెలకొల్పామని చెప్పారు. 'ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలమున్న పార్టీనే గవర్నర్‌ను కలుస్తుంది. అదే మేం చేశాం. గోవాలో కాంగ్రెస్ పార్టీ మేం కలిసిన తర్వాత కూడా గవర్నర్ కలువలేదు. ఇంకా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది' అని ఆయన అన్నారు.
మేం చేసింది తప్పేమీ కాదు!
Published Sat, Mar 18 2017 10:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement