రాత్రికి రాత్రే.. మొత్తం తిప్పేశారు! | BJP turns total picture of goa and manipur overnight to gain power | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే.. మొత్తం తిప్పేశారు!

Published Mon, Mar 13 2017 3:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

రాత్రికి రాత్రే.. మొత్తం తిప్పేశారు! - Sakshi

రాత్రికి రాత్రే.. మొత్తం తిప్పేశారు!

రాజకీయాలు చదరంగం లాంటివి. అవతలి వాళ్లు వేయబోయే రెండు మూడు ఎత్తులను మనం ముందే ఊహించి ఎత్తు వేయాల్సి ఉంటుంది. కీలకమైన సమయంలో చకచకా స్పందించకుండా ఊరుకుంటే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లాగే ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ.. గోవా, మణిపూర్‌లలో కూడా అతి పెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరో నిర్ణయించుకోవడం, తమకు ఎవరు మద్దతుగా ఉంటారో వాళ్లతో సంప్రదింపులు అన్నీ చకచకా సాగించాలి. కానీ.. ఆ పార్టీ ఆ స్థాయిలో స్పందించలేకపోయింది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతులు చాచి ఆహ్వానించింది. అంతే, చిన్న పార్టీలు వచ్చి వాలిపోయాయి. దాంతో.. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేయగల అవకాశం నుంచి ఒక్క రాష్ట్రానికి మాత్రమే కాంగ్రెస్ పరిమితం అవ్వాల్సి వచ్చింది. గోవా, మణిపూర్.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్సే నిలిచింది. ఏమాత్రం ముందడుగు వేసినా రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభుత్వాలే వచ్చేవి. కానీ అమిత్‌ షా మంత్రాంగంతో రెండు రాష్ట్రాలూ 'చే'జారిపోయాయి. గోవాలో బీజేపీకి 13 స్థానాలుంటే కాంగ్రెస్‌కు 17 ఉన్నాయి. అలాగే మణిపూర్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలుంటే బీజేపీకి 21 మాత్రమే ఉన్నాయి. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు రావడం లేదు. వాస్తవానికి రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి.. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తామని చెప్పగలిగే నైతిక హక్కు లేదు.

గోవాలో పరిస్థితి చూస్తే.. గత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్‌ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. అందుకే ఆయనతో సహా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి పారికర్ మీద మాత్రం సొంత పార్టీ వాళ్లతో పాటు ఇతర పార్టీల వాళ్లకు కూడా గట్టి నమ్మకం ఉంది. అందుకే ఎన్నికల ప్రచార సమయంలో కూడా పరోక్షంగా పారికర్‌ను గోవాకు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేశారు. ఆ వ్యూహం వెంటనే ఫలించింది. మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ సహా ఇతర చిన్న పార్టీలు సైతం పారికర్‌ను ముఖ్యమంత్రిగా ఆమోదించేందుకు ముందుకొచ్చాయి. చివరకు బీజేపీ వ్యతిరేక పార్టీగా ప్రారంభమైన గోవా ఫార్వర్డ్ పార్టీలోని ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరు బీజేపీ వైపు వెళ్లిపోయారు. కాంగ్రెస్ వాళ్లు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని పెడదామని చర్చలు మొదలుపెట్టేలోపే అక్కడ మొత్తం చుట్టేశారు. రక్షణ మంత్రి పదవికి పారికర్ రాజీనామా చేయడం, దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం, పారికర్ కోసం ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయడం, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని చెప్పడం.. ఇలాంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి.

మణిపూర్ విషయంలో కూడా అలాగే అయ్యింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో అధికారం కావాలంటే 31 మంది మద్దతు అవసరం. కాంగ్రెస్ 28 స్థానాలు గెలుచుకుంది. బీజేపీకి 21 మాత్రమే వచ్చాయి. ఇతరులు మరో 11 చోట్ల గెలిచారు. ఓక్రమ్ ఇబోబి సింగ్ ఒక కాగితం పట్టుకుని తనకు మద్దతు ఉందని చెప్పేలోపే.. రాత్రికి రాత్రే బేరసారాలు పూర్తిచేసుకున్న కమలనాథులు.. మొత్తం 32 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ నజ్మా హెప్తుల్లా వద్ద పెరేడ్ నిర్వహించారు. దాంతో ముఖ్యమంత్రిని తక్షణం రాజీనామా చేయాలని చెప్పిన గవర్నర్.. బీజేపీకే అవకాశం ఇచ్చారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శ్యాం కుమార్ సింగ్ అనే ఎమ్మెల్యే గోడదూకి బీజేపీ పంచన చేరారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరఫున పోటీ చేస్తారని టాక్.

గోడ దూకడం కొత్త కాదు...
ఎమ్మెల్యేలు పార్టీలు మారడం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఒక పార్టీ తరఫున ఎన్నికై, ఆ పదవులకు రాజీనామా కూడా చేయకుండా వేరే పార్టీల కండువాలు కప్పుకోవడాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే చాలా చూశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కావల్సినంత మెజారిటీ స్పష్టంగా ఉన్నా.. టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ నుంచి ఏడుగురిని ఆకర్షించిన విషయం తెలిసిందే. పార్టీలు మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయంలో మాత్రం అడుగులు ముందుకు పడటం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఉన్నవే రెండు పార్టీలు. అందులో ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను నయానో భయానో ఆకట్టుకుని, వాళ్లకు పచ్చ కండువాలు కప్పేశారు. వాళ్లకు మంత్రి పదవులు కూడా ఇస్తామంటున్నారు.

ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే గోవా, మణిపూర్‌లలో బీజేపీ చేసింది తప్పేమీ కాదనిపిస్తుంది. తమ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అక్కడ చిన్న పార్టీలను చేరదీసింది. ఎమ్మెల్యేలు తమంతట తాముగా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు చెప్పేంత విశాల హృదయం ఉండకపోవచ్చు గానీ.. తెరవెనక ఏం జరిగిందన్నది, ఎంత మొత్తాలు చేతులు మారాయన్నది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. భారత రాజకీయ వ్యవస్థలో అధికారాన్ని చేపట్టడానికి ఇలాంటి వ్యవహారాలు యథేచ్ఛగా జరిగిపోతున్నా, వాటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలు అచేతనంగా ఉండిపోవడం దారుణం. ఈ పరిస్థితి మారనంత కాలం కప్పల తక్కెడలు ఉంటూనే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement