‘శత్రు’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో పాకిస్తాన్, చైనాకు తరలివెళ్లిన వారి వారసులకు భారత్‌లో వదిలివెళ్లిన ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. ఆ మేరకు 1968 నాటి శత్రు ఆస్తుల (ఎనిమి ప్రాపర్టీస్) చట్టంలో సవరణలకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. శత్రు ఆస్తుల(సవరణ, చెల్లుబాటు) బిల్లు –2016ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇంతకముందే బిల్లును లోక్‌సభ ఆమోదించినా.. ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యసభలో కొన్ని సవరణలు చేయడంతో..మరోసారి లోక్‌సభ ముందుకు వచ్చింది. ఇక నుంచి ఈ ఆస్తులు ‘కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా’ విభాగం అధీనంలో ఉంటాయి.
సవరణలకు ముందు కాలానికి వర్తింపు
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలకు బిల్లు ఆమోదంతో పరిష్కారం దొరుకుతుందని బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్‌కు వెళ్లినవారికి భారత్‌లోని ఆస్తులు చెందకపోవడమే సహజ న్యాయమన్నారు. సవరణల అమలులో భాగంగా ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకోవని హామీనిచ్చారు.
నదీజలాల ట్రిబ్యునల్ ఏర్పాటుకు లోక్‌సభలో బిల్లు
రాష్ట్రాల మధ్య జలవివాదాల్ని పరిష్కరించేందుకు ఏకసభ్య, శాశ్వత ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ముందుగా రాష్ట్రాలను సంప్రదించాలని కోరుతూ బీజేడీ సభ్యుడు భర్తృహరి మహతబ్ బిల్లును వ్యతిరేకించారు. అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956కు సవరణల ద్వారా రాష్ట్రాల విజ్ఞప్తుల్ని త్వరితగతిన పరిష్కరించవచ్చని జల వనరుల మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. అలాగే ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆధునికీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
గోవా, మణిపూర్‌పై కాంగ్రెస్ తీవ్ర నిరసన
గోవా, మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాల్ని తప్పుపడుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ ఎంపీలు లేవనెత్తారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ కాంగ్రెస్ నేత ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు అనుమతించకపోతే తామెక్కడికి వెళ్లాలని ఖర్గే ప్రశ్నించారు. స్పీకర్ అనుమతించకపోవడంతో కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీలు వాకౌట్ చేశాయి. అనంతరం సభలోకి వచ్చిన ఆ పార్టీలు జీరో అవర్ చేపట్టడంలేదంటూ మరోసారి నిరసనకు దిగాయి.