బెంగళూరు: వొక్కలిగ వర్గం నుంచి ఎదురైన వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్య జేడీఎస్ నాయకుడు జీటీ దేవెగౌడ చేతిలో సుమారు 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలోని మాం డ్య, తుమకూరు, హసన్, కోలార్, చామరాజనగర్‌లోని చాలా స్థానాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలే వీచాయి.
కోలార్‌లో మూడు, తుమకూరులోని మొత్తం 11 సీట్లలో ఆరింటిని గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లోని మొత్తం 45 స్థానాల్లో జేడీఎస్ 20కి పైగా సీట్లు గెలుచుకోవడం విశేషం. మాండ్యలో ఉన్న ఆరు సీట్లూ ఆ పార్టీ ఖాతాలోకే చేరాయి. తాజా ఫలితాలపై జీటీ దేవెగౌడ స్పందిస్తూ..‘ సిద్దరామయ్య అంటే వొక్కలిగలకు ఎలాంటి ద్వేషం లేదు. కానీ ప్రచారంలో ఆయన హెచ్‌డీ దెవెగౌడపై చేసిన వ్యాఖ్యలు ఆ వర్గానికి ఆగ్రహం తెప్పించాయి.
దీని వల్లే హసన్, మాండ్యనే కాకుండా వొక్కాలిగల పట్టున్న ఇతర ప్రాంతాల్లోనూ సిద్దరామయ్యపై వ్యతిరేకత పెరిగింది’ అని అన్నారు. ఇక హెచ్‌డీ దేవెగౌడ స్వస్థలమైన హసన్‌లోని ఏడు సీట్లలో జేడీఎస్ ఆరింటిని గెలుచుకుంది.
‘గోవా, మణిపూర్‌లో మీరు చేసిందేమిటి?’
న్యూఢిల్లీ: కర్ణాటకలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పార్లమెంటు సంప్రదాయాల్ని వల్లెవేస్తున్న బీజేపీ.. గోవా, మణిపూర్, మేఘాలయ విషయంలో ఆ సంప్రదాయాన్ని ఎందుకు విస్మరించిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. జేడీఎస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటును ఆ పార్టీ సమర్థించుకుంది. రాజ్యాంగ నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే కాంగ్రెస్ నడుచుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు.
ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీ లేదా పార్టీల కూటమిని ఆహ్వానించాలన్న సంప్రదాయానికి అనుగుణంగానే 1996లో వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉందని గుర్తు చేశారు. అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలన్న సంప్రదాయాల్ని ఆ మూడు రాష్ట్రాల విషయంలో బీజేపీ ఎందుకు అతిక్రమించిందని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment