Enemy properties
-
జీఓ 111 రద్దు.. సంబరాల్లో ఆ ప్రాంత ప్రజలు.. కానీ, కొత్వాల్‌గూడ పరిస్థితి వేరు
శంషాబాద్: రాష్ట్ర సర్కారు ఇటీవల జీఓ 111ను పూర్తి స్థాయిలో ఎత్తివేసినట్లు చేసిన ప్రకటన.. ఈ పరిధిలోని అన్ని గ్రామాలు, బస్తీల్లోని ప్రజలకు ఎంతో కొంత సంతోషాన్ని కలిగించింది. కానీ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడ రైతులు, భూ యజమానుల్లో మాత్రం ఆ ఛాయలు ఏ మాత్రం లేవు. దశాబ్దాలుగా భూములు సాగు చేస్తున్న రైతులకు సర్కారు జారీ చేస్తున్న రైతుబంధు, రైతుబీమాలు కూడా లేవు. అత్యవసరాల కోసం భూమిని విక్రయించుకునే కనీస వెసులుబాటు కూడా లేదు. జీఓ 111 మించిన సమస్య కొత్వాల్‌గూడ వాసులకు శత్రువుగా మారింది. అదే ‘ఎనిమి ప్రాపర్టీ’ సమస్య అసలు సమస్య ఇది.. ‘ఎనిమి ప్రాపర్టీ’ పేరులాగే అక్కడి రైతుల పాలిట శత్రువుగా మారింది. అరవై ఏళ్లుగా సాగుచేస్తున్న రైతులు అవస్థల పాలయ్యేలా చేస్తోంది. అసలు విషయం ఏమిటి? అప్పట్లో కొత్వాల్‌గూడ జాగీర్దారుగా ఉన్న సయ్యద్ హసన్ అబేదీ వారసుడు ఖమ్రుద్దీన్ వారసత్వంగా తనకు దక్కిన 650 ఎకరాల భూమిని 1967లో ముంబైలోని కస్టోడియన్ ప్రాపర్టీకి అప్పగించి పాకిస్థాన్ వెళ్లి స్థిరపడ్డాడు. ఇలా అప్పగించిన సదరు భూములను కేంద్ర హోంశాఖ పరిధిలోని ఎనిమి ప్రాపర్టీ కింద కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ పరిధిలోకి వెళ్లిపోయాయి. మరోవైపు 1969 వరకు స్థానికంగా ఉన్న సయ్యద్ హసన్ అబేదీ ఇక్కడి రైతులకు తన భూములను విక్రయించాడు. ఆయన వద్ద భూములు కొనుగోలు చేసిన సుమారు 200 పైచిలుకు రైతులు పట్టా, పహణీలతో పాటు 38ఈ భూ యజమాన్య హక్కుపత్రాలను రాష్ట్ర రెవిన్యూ విభాగం నుంచి పొందడంతో పాటు ఏళ్లుగా పన్ను లు సైతం చెల్లిస్తూ భూములను సాగు చేసుకోవడం ఇతరత్రా పనులతో జీవనోపాధి పొందుతున్నారు. ఏడేళ్ల కిందట పిడుగులా.. ఏడు సంవత్సరాల క్రితం కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ప్రాపరీ బోర్డు నుంచి కొత్వాల్‌గూడలోని సర్వేనంబరు 1 నుంచి 174 పరిధిలో మొత్తం 650 ఎకరాలు ఎనిమి ప్రాపర్టీ ఉందని జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక రెవిన్యూ అధికారులక లేఖలు అందాయి. దీంతో ఒక్కసారిగా రైతుల గుండెల్లో పిడుగు పడింది. సదరు భూములకు కొత్త పాస్‌బుక్‌లు సైతం రాష్ట్ర సర్కారు జారీ చేసింది. కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ ఆదేశాల మేరకు మూడేళ్ల క్రితం కొత్వాల్‌గూడకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లను సైతం నిలిపివేశారు. అప్పటి నుంచి భూములు ఎక్కడ కోల్పోతామోననే దిగులుతో రైతులు బతుకులీడిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం మళ్లీ.. ● 2021 అక్టోబరులో ముంబై కస్టోడియన్ ప్రాపర్టీ కార్యాలయం నుంచి అధికారులు మరోసారి రంగంలో దిగారు. ఎనిమి ప్రాపర్టీలో ఉన్న రైతులు కొందరికి నోటీసులు సైతం జారీ చేశారు. కొత్వాల్‌గూడ వార్డు కార్యాలయం వద్ద ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఎనిమి ప్రాపర్టీ సూచిస్తున్న సర్వే నంబర్లలోని భూ యజమానులు ఈ మెయిల్, లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పూర్తి వివరాలను పంపాల్సిందిగా సూచించారు. ● భూ యజమానులకు సగం యజమాన్య హక్కులు కచ్చితంగా దక్కుతాయని మిగతా సగం భూములకు సంబంధించి వేలంలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత కల్పిస్తామని సూచించారు. దీనిపై కొత్వాల్‌గూడ వాసులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నేతలతో పాటు అధికార పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే సహా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్వాల్‌గూడ వాసులు ఆందోళన విరమించారు. కస్టోడియన్ ప్రాపర్టీ అధికారులు మరోసారి ఇక్కడికి రాలేదు. సదరు భూముల్లో క్రయవిక్రయాలకు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. తాజాగా జీఓ 111 తొలగిస్తున్నట్లు ప్రకటించినా ఎనిమి ప్రాపర్టీ సమస్య తీరేంతవరకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు తీవ్ర నిరాశలో ఉన్నారు. -
ఎనిమీ భూముల వేలం?
సాక్షి, హైదరాబాద్ : యుద్ధ సమయంలో దేశం విడిచి వెళ్లి శత్రు దేశాల్లో స్థిరపడినవారి భూముల (ఎనిమీ ప్రాపర్టీస్)ను వేలం వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక అందజేయాలని కోరుతూ గత నెల లో రాష్ట్రానికి లేఖ రాసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రజనీ సిబల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి రాసిన లేఖలో ఎనిమీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఆ భూముల స్థితిగతులేంటి? ఆక్రమణలున్నా యా? అసలు మొత్తం భూములెన్ని? ఖాళీగా ఉన్న భూములెన్ని? వాటి విలువ ఎంత? వంటి వివరాలతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ కమిటీలతో నిర్ధారణ చేయించాలని కోరినట్టు సమాచారం. కేంద్రం లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ భూములు 490 ఎకరాల వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 100 ఎకరాలను మెట్రో రైలుకు కేటాయించారు. కొన్ని భూములు కబ్జా అయ్యాయి. 2017 మార్చి 14న అమల్లోకి వచ్చిన ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్– 1968(సవరణ) చట్టం ప్రకారం ఎనిమీ భూములపై సర్వాధికారాలు కేంద్రానికి సంక్రమించాయి. దీంతో మియాపూర్ భూము ల్లో ఖాళీగా ఉన్న 100 ఎకరాలను సీఆర్పీఎఫ్కు కూడా కేటాయించింది. మొత్తం మీద ఈ నెలాఖరు కల్లా ఎనిమీ భూముల వివరాలతో నివేదిక పంపా లని కేంద్రం ఆదేశించడంతో రాష్ట్ర యంత్రాంగం ఆ నివేదిక తయారీలో నిమగ్నం కావడం గమనార్హం. రూ.5 వేల కోట్లపై మాటే ఎనిమీ భూములకు బహిరంగ మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఆ భూములను వేలం వేస్తే వచ్చే ఆదాయంలో రాష్ట్రా నికి కూడా వాటా ఉంటుంది. కస్టోడియన్ హోదాలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎనిమీ భూముల్లో రాష్ట్రానికి కూడా వాటా దఖలు పడుతుంది. అయితే, వీటిని వేలం వేస్తారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
‘ఎనిమీ’తో ఆందోళన వద్దు
శంషాబాద్ : కొత్వాల్‌గూడ గ్రామస్తులు తమ భూములకు సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ సురేష్‌తో కలిసి ఆయన గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకే కృషి చేస్తుందన్నారు. బోగస్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన లావాదేవీలతో గ్రామస్తులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. సదరు సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ ప్రజలకు అనుగుణంగానే అధికారులు ఇప్పటికే పలుమార్లు నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. అనవసర అపోహలకు గురై భూములను విక్రయించవద్దని సూచించారు. సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఇప్పటికి రెండు సార్లు సమీక్ష... ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు జరిగాయని రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని 1–174 సర్వే నెంబర్లలో మొత్తం 2700 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. ఇందులో 286 ఎకరాల ప్రభుత్వ భూమి పోను, 685 ఎకరాల సీలింగ్ భూమి, 125 ఎకరాల భూదాన్ భూమి ఉందన్నా రు. మొత్తం 1621.12 ఎకరాల భూమిలో పట్టాదారులు, కౌలుదారులున్నారన్నారు. మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను సేకరిస్తుందన్నారు. మార్చి నెలాఖరు వరకు ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతకు ముందు స్థానికులు ఎనిమీ ప్రాపర్టీ కారణంగా గ్రామస్తులు ఎదు ర్కొంటున్న సమస్యలను విన్న వించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
‘ఎనిమీ’ నుంచి విముక్తి కల్పించాలి
శంషాబాద్ : కొత్వాల్‌గూడ గ్రామస్తులకు ఎనిమీ ప్రాపర్టీ సమస్య నుంచి విముక్తి కలిగించాలంటూ మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు శుక్రవారం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యతో గత మూడు నెలలుగా భూముల మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ నిలిపివేశారని తెలిపారు. సుమారు 80 ఏళ్లుగా సాగుపైనే ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. గ్రామస్తుల భూముల వివరాలను సేకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కు వివరించినట్లు గ్రామ సర్పంచ్ గుర్రంపల్లి ప్రసన్నలింగం తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ పత్తి నర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తీక్‌రెడ్డి, వేణుగౌడ్, గుర్రంపల్లి లింగంయాదవ్, మాజీ ఉపసర్పంచ్ శేఖర్‌గుప్త, గుంటి మిట్టు, శంకర్‌రెడ్డి తదితరులున్నారు. -
‘శత్రు’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో పాకిస్తాన్, చైనాకు తరలివెళ్లిన వారి వారసులకు భారత్‌లో వదిలివెళ్లిన ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. ఆ మేరకు 1968 నాటి శత్రు ఆస్తుల (ఎనిమి ప్రాపర్టీస్) చట్టంలో సవరణలకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. శత్రు ఆస్తుల(సవరణ, చెల్లుబాటు) బిల్లు –2016ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇంతకముందే బిల్లును లోక్‌సభ ఆమోదించినా.. ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యసభలో కొన్ని సవరణలు చేయడంతో..మరోసారి లోక్‌సభ ముందుకు వచ్చింది. ఇక నుంచి ఈ ఆస్తులు ‘కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా’ విభాగం అధీనంలో ఉంటాయి. సవరణలకు ముందు కాలానికి వర్తింపు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలకు బిల్లు ఆమోదంతో పరిష్కారం దొరుకుతుందని బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్‌కు వెళ్లినవారికి భారత్‌లోని ఆస్తులు చెందకపోవడమే సహజ న్యాయమన్నారు. సవరణల అమలులో భాగంగా ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకోవని హామీనిచ్చారు. నదీజలాల ట్రిబ్యునల్ ఏర్పాటుకు లోక్‌సభలో బిల్లు రాష్ట్రాల మధ్య జలవివాదాల్ని పరిష్కరించేందుకు ఏకసభ్య, శాశ్వత ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ముందుగా రాష్ట్రాలను సంప్రదించాలని కోరుతూ బీజేడీ సభ్యుడు భర్తృహరి మహతబ్ బిల్లును వ్యతిరేకించారు. అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956కు సవరణల ద్వారా రాష్ట్రాల విజ్ఞప్తుల్ని త్వరితగతిన పరిష్కరించవచ్చని జల వనరుల మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. అలాగే ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆధునికీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గోవా, మణిపూర్‌పై కాంగ్రెస్ తీవ్ర నిరసన గోవా, మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాల్ని తప్పుపడుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ ఎంపీలు లేవనెత్తారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ కాంగ్రెస్ నేత ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్లో ప్రస్తావించేందుకు అనుమతించకపోతే తామెక్కడికి వెళ్లాలని ఖర్గే ప్రశ్నించారు. స్పీకర్ అనుమతించకపోవడంతో కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీలు వాకౌట్ చేశాయి. అనంతరం సభలోకి వచ్చిన ఆ పార్టీలు జీరో అవర్ చేపట్టడంలేదంటూ మరోసారి నిరసనకు దిగాయి.