శంషాబాద్: రాష్ట్ర సర్కారు ఇటీవల జీఓ 111ను పూర్తి స్థాయిలో ఎత్తివేసినట్లు చేసిన ప్రకటన.. ఈ పరిధిలోని అన్ని గ్రామాలు, బస్తీల్లోని ప్రజలకు ఎంతో కొంత సంతోషాన్ని కలిగించింది. కానీ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడ రైతులు, భూ యజమానుల్లో మాత్రం ఆ ఛాయలు ఏ మాత్రం లేవు. దశాబ్దాలుగా భూములు సాగు చేస్తున్న రైతులకు సర్కారు జారీ చేస్తున్న రైతుబంధు, రైతుబీమాలు కూడా లేవు.
అత్యవసరాల కోసం భూమిని విక్రయించుకునే కనీస వెసులుబాటు కూడా లేదు. జీఓ 111 మించిన సమస్య కొత్వాల్‌గూడ వాసులకు శత్రువుగా మారింది. అదే ‘ఎనిమి ప్రాపర్టీ’ సమస్య అసలు సమస్య ఇది.. ‘ఎనిమి ప్రాపర్టీ’ పేరులాగే అక్కడి రైతుల పాలిట శత్రువుగా మారింది. అరవై ఏళ్లుగా సాగుచేస్తున్న రైతులు అవస్థల పాలయ్యేలా చేస్తోంది.
అసలు విషయం ఏమిటి?
అప్పట్లో కొత్వాల్‌గూడ జాగీర్దారుగా ఉన్న సయ్యద్ హసన్ అబేదీ వారసుడు ఖమ్రుద్దీన్ వారసత్వంగా తనకు దక్కిన 650 ఎకరాల భూమిని 1967లో ముంబైలోని కస్టోడియన్ ప్రాపర్టీకి అప్పగించి పాకిస్థాన్ వెళ్లి స్థిరపడ్డాడు. ఇలా అప్పగించిన సదరు భూములను కేంద్ర హోంశాఖ పరిధిలోని ఎనిమి ప్రాపర్టీ కింద కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ పరిధిలోకి వెళ్లిపోయాయి.
మరోవైపు 1969 వరకు స్థానికంగా ఉన్న సయ్యద్ హసన్ అబేదీ ఇక్కడి రైతులకు తన భూములను విక్రయించాడు. ఆయన వద్ద భూములు కొనుగోలు చేసిన సుమారు 200 పైచిలుకు రైతులు పట్టా, పహణీలతో పాటు 38ఈ భూ యజమాన్య హక్కుపత్రాలను రాష్ట్ర రెవిన్యూ విభాగం నుంచి పొందడంతో పాటు ఏళ్లుగా పన్ను లు సైతం చెల్లిస్తూ భూములను సాగు చేసుకోవడం ఇతరత్రా పనులతో జీవనోపాధి పొందుతున్నారు.
ఏడేళ్ల కిందట పిడుగులా..
ఏడు సంవత్సరాల క్రితం కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ప్రాపరీ బోర్డు నుంచి కొత్వాల్‌గూడలోని సర్వేనంబరు 1 నుంచి 174 పరిధిలో మొత్తం 650 ఎకరాలు ఎనిమి ప్రాపర్టీ ఉందని జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక రెవిన్యూ అధికారులక లేఖలు అందాయి. దీంతో ఒక్కసారిగా రైతుల గుండెల్లో పిడుగు పడింది. సదరు భూములకు కొత్త పాస్‌బుక్‌లు సైతం రాష్ట్ర సర్కారు జారీ చేసింది. కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ ఆదేశాల మేరకు మూడేళ్ల క్రితం కొత్వాల్‌గూడకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్‌లను సైతం నిలిపివేశారు. అప్పటి నుంచి భూములు ఎక్కడ కోల్పోతామోననే దిగులుతో రైతులు బతుకులీడిస్తున్నారు.
ఏడాదిన్నర క్రితం మళ్లీ..
● 2021 అక్టోబరులో ముంబై కస్టోడియన్ ప్రాపర్టీ కార్యాలయం నుంచి అధికారులు మరోసారి రంగంలో దిగారు. ఎనిమి ప్రాపర్టీలో ఉన్న రైతులు కొందరికి నోటీసులు సైతం జారీ చేశారు. కొత్వాల్‌గూడ వార్డు కార్యాలయం వద్ద ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఎనిమి ప్రాపర్టీ సూచిస్తున్న సర్వే నంబర్లలోని భూ యజమానులు ఈ మెయిల్, లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పూర్తి వివరాలను పంపాల్సిందిగా సూచించారు.
● భూ యజమానులకు సగం యజమాన్య హక్కులు కచ్చితంగా దక్కుతాయని మిగతా సగం భూములకు సంబంధించి వేలంలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత కల్పిస్తామని సూచించారు. దీనిపై కొత్వాల్‌గూడ వాసులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నేతలతో పాటు అధికార పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే సహా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్వాల్‌గూడ వాసులు ఆందోళన విరమించారు. కస్టోడియన్ ప్రాపర్టీ అధికారులు మరోసారి ఇక్కడికి రాలేదు. సదరు భూముల్లో క్రయవిక్రయాలకు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. తాజాగా జీఓ 111 తొలగిస్తున్నట్లు ప్రకటించినా ఎనిమి ప్రాపర్టీ సమస్య తీరేంతవరకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment