గవర్నర్లతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: రఘువీరా
అమరావతి: గవర్నర్లతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి రాజకీయాలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్లు ఆహ్వానించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. హంగ్ వచ్చినప్పుడు గవర్నర్లు అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించే ఆనవాయితీ 60 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు.
ఈనెల 11న ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ తర్వాత వెంకయ్యనాయుడు, అమిత్‌షాలు బరితెగించి మణిపూర్, గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమన్నారు. బీజేపీ నేతలు మిగిలిన వారితో బేరసారాలు చేసుకునే వరకు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించరా? అని ధ్వజమెత్తారు. తమిళనాడులో కూడా ఇదే జరిగిందని, అక్కడ అవినీతి ముసుగు అడ్డంపెట్టుకొని నాటకం ఆడారన్నారు. మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ బల నిరూపణ చేసుకోలేనప్పుడు ఇతర పార్టీలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.