వాచ్ డాగ్ లా పని చేస్తాం: ఇబోబి
ఇంఫాల్ : కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహిస్తుందని మాజీ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండి వాచ్ డాగ్ పాత్రను పోషిస్తున్నామని ఆయన బుధవారమిక‍్కడ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత బిరేన్ సింగ్‌తో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఇబోబి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. సంకీర్ణంగా ఏర్పడ్డ ప్రభుత్వం విధానాలపై తాము నిరంతరం వాచ్ డాగ్‌లా ఉంటామన్నారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ, బీజేపీకే అవకాశాలు దక్కాయన్నారు. కాగా వాస్తవానికి 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో చాలాకాలంగా బలమైన ప్రతిపక్షం లేదనే చెప్పాలి.
కాగా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. 28 స్థానాలు గెలుచుకుని తాము అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ముందు తమనే పిలవాల్సిందని కాంగ్రెస్ వాదిస్తోంది. అధికారం చేపట్టాలంటే కనీసం 31 మంది మద్దతు అవసరం. అయితే బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ దాదాపు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలందరూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంతో తొలిసారి మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.