నోట్లరద్దే మన ప్రచారాస్త్రం!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా
► సర్జికల్ దాడులు, నోట్లరద్దు చారిత్రక నిర్ణయాలని ప్రశంస
► ఐదు రాష్ట్రాల్లో విజయం సాధిస్తామంటూ ధీమా
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోట్లరద్దే ప్రధాన ప్రచారాస్త్రమని.. దీని వల్ల జరిగే మేలును సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. కోజికోడ్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ భేటీ తర్వాత మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన, చరిత్రాత్మక నిర్ణయాలు చేపట్టిందని చెప్పారు. పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలకు ప్రజలు, ప్రత్యేకించి పేదలు మద్దతు పలికారన్నారు. ఇవే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్రా్తలన్నారు.
నోట్ల రద్దు వల్ల పన్నుకట్టేవారి సంఖ్య పెరగటంతో.. ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరిగి.. పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. ఇదే విషయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తే మరోసారి భారత్ భారీ చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ కార్యవర్గ సమావేశం వివరాలను కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కొద్దిరోజులపాటు ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సహనంగా మద్దతు తెలిపారని.. దీని వల్ల దేశవ్యాప్తంగా నగదురహిత లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు.
వారం రోజుల క్రితం ప్రధాని విడుదల చేసిన ‘భీమ్’ యాప్‌ను 70 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. 5 రాష్ట్రాలలో ఎన్నికలను అమిత్ షా ప్రస్తావిస్తూ పార్టీకి కార్యకర్తలు, నాయకులే బలమని.. ఈ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏ మార్పుకోసమైతే మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు ప్రజలు మద్దతిచ్చారో.. ఆ మార్పును గమనిస్తున్నందున రాష్ట్రాల్లోనూ బీజేపీకి పట్టంగడతారన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం, పార్టీలకు అందే నిధులపై పారదర్శకతపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగాల్సిన ఆవశ్యతపై సమావేశంలో చర్చించినట్లు జవదేకర్ వెల్లడించారు.
మమతది రాజకీయ అసహనం
విపక్షాలు.. ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న రాజకీయ తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొని ప్రజాస్వామ్య సంస్థలపై గౌరవాన్ని మంటగలిపాయని తీర్మానంలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వ దుష్పరిపాలనలో రాజకీయ కార్యకలాపాలు దుర్భరమయ్యాయని, బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడులతో అధికార పార్టీ ప్రదర్శిస్తున్న రాజకీయ అసహనం స్పష్టమైందని, పశ్చిమ బెంగాల్, కేరళల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని తీర్మానంలో ప్రస్తావించారు.
కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో మత, రాజకీయ హింసతో నష్టపోయిన ప్రజలకు కార్యవర్గం సానుభూతి ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో పార్టీ అధికారాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఏర్పడిందని, 5 రాష్ట్రాలలో తీర్పు బీజేపీ అనుకూలంగా సాధించేందుకు కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చింది.