బీజేపీ సెల్ఫ్‌గోల్ చేసుకుందా?
బీజేపీ సెల్ఫ్‌గోల్ చేసుకుందా?
Published Fri, Jan 20 2017 11:42 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM
ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. నాయకులు పార్టీలు మారడం సర్వసాధారణం. కానీ, అప్పటి వరకు పార్టీ జెండాను భుజాన మోసి ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను విస్మరించి కొత్తవారికి మాత్రమే టికెట్లు ఇస్తూ పోతే పాతవాళ్లలో తీవ్ర అసంతృప్తి రేగక తప్పదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క మణిపూర్ తప్ప.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆ పార్టీలోకి కొత్త నాయకుల రాక వెల్లువెత్తుతోంది. కానీ, టికెట్ల కేటాయింపు వ్యవహారం మాత్రం దాదాపు నాలుగు రాష్ట్రాల్లోను ఆ పార్టీకి తలనొప్పిగానే మారింది. కొత్తవాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ క్రమంగా బలహీన పడటంతో పాటు, సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నట్లు అవుతోంది.
యూపీలో పాతిక మంది బయటివాళ్లే
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బయటి వాళ్లకు టికెట్లు ఎక్కువగానే ఇచ్చింది. ఇది సొంత పార్టీ వాళ్లను ఆగ్రహానికి గురిచేసింది. యూపీలో బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో మొత్తం 149 మంది అభ్యర్థులుండగా.. వాళ్లలో 25 మంది ఈమధ్యే పార్టీలో చేరినవారు. గత సంవత్సరం పార్టీలో చేరిన బీఎస్పీ మాజీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య.. తన కోటాలో రావల్సినన్ని టికెట్లు రాలేదని ఆగ్రహంగా ఉన్నారు. దాంతో పార్టీ నుంచి బయటకు వెళ్లాలని కూడా చూస్తున్నారు.
తివారీ ఎందుకు
ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్‌డీ తివారీని బీజేపీలో చేర్చుకోవడంపై అక్కడ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తన కొడుకు టికెట్ కోసం ఆయన బీజేపీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన అశ్లీల సీడీలు బయటపడిన నేపథ్యంలో అలాంటి వ్యక్తిని ఎందుకు దగ్గరకు తీసుకోవాలని అంటున్నారు. దాంతో తివారీ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గింది. ఆయన చేరలేదని.. కేవలం రోహిత్ మాత్రమే చేరాడని చెప్పింది. తివారీ కేవలం బీజేపీకి మద్దతు మాత్రమే పలికారని చెప్పింది.
ఇలా వచ్చారు.. అలా టికెట్ ఇచ్చారు
ఉత్తరాఖండ్‌లో మొత్తం 64 మంది అభ్యర్థులను ప్రకటించగా, అందులో 15 మంది బయటివారే. జనవరి 16వ తేదీన ఆ రాష్ట్ర రెవెన్యూ, నీటి పారుదల శాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య తన కొడుకు సంజీవ్, మాజీ ఎమ్మెల్యే కేదార్ సింగ్ రావత్‌లతో కలిసి బీజేపీలో చేరిపోయారు. వాళ్లు చేరిన కొద్ది గంటలకే బీజేపీ ఉత్తరాఖండ్ అభ్యర్థుల జాబితా రాగా.. అందులో ఈ మూడు పేర్లూ ఉన్నాయి. ఇంతకుముందు హరీష్ రావత్ సర్కారుపై తిరుగుబాటు చేసిన పలువురు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లిచ్చారు. దీంతో పార్టీలో ఎప్పటినుంచో ఉన్నవాళ్లు ఆగ్రహంతో ఉన్నారు.
పంజాబ్ చీఫ్ అసంతృప్తి
పంజాబ్‌లో టికెట్ల కేటాయింపుతో అసంతృప్తి చెందిన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి విజయ్ సంప్లా సిద్ధపడ్డారు. అయితే, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆయనను బుజ్జగించి వెనక్కి పంపారు. ఒక సిటింగ్ ఎమ్మెల్యేను తప్పించి, తాను చెప్పిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలన్నది సంప్లా డిమాండు.
గోవాలో తిరుగుబాట్లు
గోవాలో ఇప్పటికే బీజేపీ తిరుగుబాట్లతో ఇబ్బంది పడుతోంది. 2016 ఆగస్టులో నాటి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ వేలింగ్‌కర్ ప్రాంతీయ భాష విషయంలో ఆగ్రహించి, గోవా సురక్షా మంచ్ (జీఎస్ఎం) అనే పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), శివసేన కలిసి కూటమిగా ఏర్పడి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 35 చోట్ల ఈ కూటమి పోటీ చేస్తోంది. ఎంజీపీ కూడా ఇంతకుముందు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement