
ప్రజల తిరుగుబాటు తప్పదు!
పెద్ద నోట్ల రద్దు ఓ దిక్కుమాలిన నిర్ణయమని.. దీనితో దేశం ముఫ్ఫై ఏళ్లు వెనక్కి పోయే ప్రమాదముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడినట్లు తెలిసింది
నోట్ల రద్దు దిక్కుమాలిన నిర్ణయమన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ఓ దిక్కుమాలిన నిర్ణయమని.. దీనితో దేశం ముఫ్ఫై ఏళ్లు వెనక్కి పోయే ప్రమాదముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయమని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. నోట్ల మార్పిడితో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని... దీనిపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నోట్ల రద్దు, మార్పిడి పరిణామాలపై ముఖ్య నేతలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి తన అభిప్రాయాలను, నిర్ణయాలను వివరించారు.
నోట్ల రద్దుపై సరైన కసరత్తు లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా.. కొత్త రాష్ట్రమైన తెలంగాణ వేసుకున్న భారీ అంచనాలన్నీ తలకిందులయ్యాయని, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. నిత్యావసరాలకు నగదు కోసం కూడా బ్యాంకుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి తెచ్చిపెట్టారని మండిపడ్డారని... ఈ సమయంలో ఊరుకునే ప్రసక్తి లేదని, వివిధ మార్గాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారని సమాచారం. దీనిపై స్వయంగా ప్రధానిని కలసి వాస్తవ పరిస్థితులను వివరిద్దామని నేతలతో పేర్కొన్నట్లు తెలిసింది. బీజేపీకి చెందిన ఒకరిద్దరు సీనియర్ నాయకులు ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆ పార్టీ సీఎంలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని చర్చించినట్లు సమాచారం.
ముఖ్యనేతలు, అధికారులతో..
నోట్ల రద్దు నిర్ణయం కారణంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే రంగాలన్నీ కుదేలయ్యారుు. ప్రతి వ్యాపారంపై నోట్ల రద్దు ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా వాటిల్లిన నష్టాన్ని, వివిధ రంగాల వారీగా వాస్తవ పరిస్థితులను కేసీఆర్ స్వయంగా అంచనా వేస్తున్నారు. వివిధ రంగాల నిపుణులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో వాస్తవ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఎంత నష్టం వాటిల్లుతుందనే సమగ్ర నివేదికను తయారు చేయిస్తున్నారు. నోట్ల రద్దుతో రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితులను సైతం కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాలపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు నోట్ల మార్పిడికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని పరిశీలించారు.
అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్టింగ్‌లను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్... ఆరంభంలో ఓ వర్గం మోదీని నెత్తిన పెట్టుకున్నా, కార్యాచరణకు వచ్చే సరికి అన్ని వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘నోట్ల రద్దు ఓ దిక్కుమాలిన నిర్ణయం. సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కుటుంబం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర రేయింబవళ్లు క్యూ కట్టే దుస్థితి వచ్చింది. కేవలం రూ.4 వేలు మాత్రమే మార్పిడి చేసే నిబంధన, రూ.2.5 లక్షల పరిమితి దాటితే ఆదాయపు పన్ను పడుతుందని భయపెట్టడం సరికాదు. మేకలు, గొర్?రలు పెంచే రైతులు సైతం లక్షల్లో నగదు లావాదేవీలు చేస్తారు. అంతమాత్రాన వాళ్లు నల్లధనం దాచుకున్న సంపన్నులు కారు. ఇవన్నీ కేంద్రం పట్టించుకోకుండానే.. తన నిర్ణయాన్ని ప్రజలపై రుద్దింది..’’ అని నేతలు, అధికారుల వద్ద సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.