సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ వరంగల్ టూర్‌ను బహిష్కరించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో బీజేపీ, కేంద్రం తీరును ఎండగట్టాలని కేసీఆర్ సిద్ధమైనట్లు తెలిసింది. మోదీ పర్యటనకు తాము వెళ్లమంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నామని, తెలంగాణపై విషం చిమ్ముతున్న వ్యక్తి ప్రధాని మోదీ అంటూ మండిపడ్డారు.
గుజరాత్‌లో రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించి తెలంగాణకి రూ.520 కోట్లతో ఏదో దిక్కుమాలిన ఫ్యాక్టరీ ఇస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి కాబట్టే మోదీని ఒక్కమాట అనడు. రేవంత్‌రెడ్డివి పిచ్చిమాటలు. రాహుల్‌గాంధీ ఏ హోదాలో రూ.4వేల పెన్షన్ ప్రకటించారు. 50 ఏళ్లు తెలంగాణను పీక్కుతిన్నారు. ఇప్పుడు ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు’’ అంటూ మంత్రని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. విపక్షాల విమర్శలను ఉపేక్షించకూడదని, విరుచుకుపడే విధానాన్ని అవలంబించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ.. ఇరు పార్టీల విధానాలను, అనుసరిస్తున్న పంథాను ఎండగట్టాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
చదవండి: 'ఏ'కేద్దాం.. 'బీ' రెడీ!
ఆ రెండు పార్టీలు బీఆర్‌ఎస్‌ను అనవసరంగా విమర్శిస్తూ, తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని.. ఇలాంటి సమయంలో ఎదురుదాడి చేయకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతున్నారని వివరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment