తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో తామూ ముందులోనే ఉన్నామని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలో దిగినట్లు కనిపిస్తుంది. తద్వారా బీఆర్‌ఎస్‌తో రాజీ ఏమి పడలేదని బీజేపీ వాదించడానికి ఈయన అస్త్రం ఇచ్చినట్లుగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంటోందన్న వార్తల నేపథ్యంలో ఆయన అప్రమత్తం అయ్యారు. మోదీ మొన్న భోపాల్‌లో జరిగిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె కవితల గురించి ప్రస్తావించడం సంచలనమైనదే అని చెప్పాలి. ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన కుటుంబ రాజకీయాల విమర్శ తెలంగాణకు కూడా వర్తింప చేశారు. అదే క్రమంలో వీరందరిపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు.
గతంలో మోదీ తెలంగాణకు వచ్చినా కేసీఆర్ పై పేరు పెట్టి ఆరోపణలు చేయలేదు. ఈసారి కేసీఆర్ కుమార్తె కవిత బాగుపడాలంటే బీఆర్‌ఎస్‌కు ప్రజలు ఓటు వేయాలని, ప్రజలు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఈడీ దాడుల నేపధ్యంలో మోదీ ప్రసంగం తెలంగాణ బీఆర్‌ఎస్‌నేతలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితమే డిల్లీ వెళ్లి ఆయా కేంద్ర నేతలను కలిసి వచ్చారు. హోం మంత్రి అమిత్ షా ను కూడా కలవవలసి ఉన్నా, చివరి నిమిషంలో బీజేపీ తెలంగాణ నేతలు కొందరి ఒత్తిడి వల్ల అది రద్దు అయింది. ఆ సందర్భంలో కేటీఆర్ అమిత్ షా పై పెద్దగా విమర్శలు చేయలేదు. అమిత్ షా భేటీ రద్దు చేయడం తెలంగాణను కించపరచడం అని కూడా వ్యాఖ్యానించలేదు.
✍️ అంతేకాక ఒక వార్తా సంస్థకు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇస్తూ జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతూ ఒకరిని దించడమే లక్ష్యం కారాదు అని అన్నారు. మరొకరిని అందలం ఎక్కించాలనుకుంటున్నారు.. కాని పోరాటం చేయాల్సింది దేశ సమస్యలపైన అని సన్నాయి నొక్కుడు మాదిరి మాట్లాడారు. కానీ, ఆ తర్వాత మోదీ బీఆర్‌ఎస్‌ను కేసీఆర్, కవితలను తీవ్ర స్థాయిలో విమర్శించడంతో ఒక టివి చానల్ లో కేటీఆర్ కూడా తన స్వరం మార్చి ఆయనను అసమర్ద ప్రధాని అని అన్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ రాజకీయ మాటల యుద్దం పెరుగుతుందా?అన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు.
✍️ ఒకవైపు కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించి హంగామా చేసి వచ్చారు. ఆయన ఆలయాల సందర్శనకు , ఒక చిన్న రాజకీయ కార్యక్రమం కోసం 600 వాహన శ్రేణితో హైదరాబాద్ నుంచి వెళ్లాలా? మామూలుగా అయితే హెలికాఫ్టర్ లో వెళ్లేవారు. మహారాష్ట్రలో బలప్రదర్శన చేయడానికి కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ రాష్ట్రంలో వందల వాహనాలతో జనం ఎదురు వచ్చి స్వాగతం చెబితే ప్రయోజనం కాని, ఆయనే వాహనాలతో వెళ్లితే వచ్చే ఉపయోగం ఏముంటుంది.కేవలం ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవడం తప్ప. ఈ సభలో తాము బీజేపీకి బి టీమ్ కాదని, కాంగ్రెస్‌కు ఎ-టీమీ కాదని, తాము రైతులు, దళితులు తదితర బలహీనవర్గాల టీమ్ అని రాజకీయ డైలాగు చెప్పినా , విపక్షాలు ఆయనను అనుమానంగానే చూస్తున్నాయి.
✍️ శివసేన నేత సంజయ్ రౌత్, ఇతర ప్రముఖులు అదే వ్యాఖ్య చేశారు. ఇక కేటీఆర్ పిటిఐ ఇంటర్వ్యూలో ఎవరో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఏకం కారాదని, కాంగ్రెస్,బీజేపీ రెండూ దేశానికి ప్రమాదకరమేనని తెలియచేశారు. వారి మద్దతుతో కట్టే కూటమి విఫలం అవుతుందని ఆయన తేల్చుతున్నారు. తాము జాతీయ స్థాయిలో ఎదగాలని అనుకుంటున్నామని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇలా పలు అంశాలపై ఆయన తన అబిప్రాయాలు వెల్లడించడం ద్వారా పార్టీ ఇంతకాలం ప్రధాని మోదీపైన చేసిన పోరాటం సరికాదని ఆయనే అంటున్నట్లుగా ఉంది. మోదీ ప్రభుత్వం నిరంకుశంగా ఉందని, దేశాన్ని అబివృద్దివైపు నడిపించలేకపోతున్నారని కదా ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసింది. రాజకీయాలంటే, పార్టీలంటే వ్యక్తుల సమూహం కాకుండా ఏదైనా జడ పదార్దం ఉంటుందా! మోదీ పాలనకు వ్యతిరేకంగా పట్నాలో వివిధ ప్రతిపక్షాలు సమావేశం అయ్యాయి. ఆ పార్టీలకు ఏకాభిప్రాయం కుదరలేదు.అది వేరే విషయం.
✍️ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ,ప్రత్యేకించి కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కూడగడతానని కేసీఆర్ కొంతకాలంపాటు చెప్పేవారు కదా! ఆ తర్వాత సొంతంగా జాతీయ పార్టీని స్థాపించినట్లు ప్రకటించి టిఆర్ఎస్ను బీఆర్‌ఎస్‌గా మార్చారు కదా! కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ నేతలతో కలిసి డిల్లీలో జరిగిన విపక్ష భేటీలలో పాల్గొన్నారు కదా! అంతకుముందు కొన్నిసార్లు మోదీని కూడా బాగా పొగిడేవారు . తర్వాత కాలంలో విమర్శించేవారు. ఇవన్నీ కాలగమనంలో జరిగిన పరిణామాలే కదా! బీజేపీని ఓడించడం అంటే మోదీ పాలనను తిరస్కరించడమనే కదా! ఎవరో ఒకరిని దించడమే లక్ష్యం కారాదు అని కేటీఆర్ సుద్దులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదో ఒక పార్టీ లేదా కూటమి ద్వారా ఎవరో ఒకరిని గద్దె ఎక్కించడం, మరొకరిని దించడం సర్వసాధారణం. . కాంగ్రెస్ ,బీజేపీలతో కట్టే కూటమి విఫలం అవుతుందని ఆయన చెబుతున్న విషయం ఆశ్చర్యంగా ఉంది.
✍️ 1999 లో వాజ్ పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వం దాదాపు ఐదేళ్లు ఏలింది. తదుపరి అధికారంలోకి వచ్చిన యుపిఎ ప్రభుత్వం పదేళ్లు పాలన చేసింది. అనంతరం పాలనపగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ పదో సంవత్సరం కూడా పూర్తి చేసుకుంటున్నారు. గత నాలుగు దశాబ్దాలలో కాంగ్రెస్ ,బీజేపీలు లేని మూడో ప్రంట్ సఫలం కాలేదు. ఆ రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్న కూటములు మధ్యే ప్రదాన పోటీ అవుతోంది. ఈ సంగతిని కేటీఆర్ విస్మరించి కొత్త చరిత్రను చెప్పడం అంటే జనం చెవిలో పూలు పెట్టడమే. దేశం అంతటా బీఆర్‌ఎస్‌విస్తరించే పరిస్థితి నిజంగా ఉండి ఉంటే ఆ పార్టీ కొద్దికాలం క్రితమే జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేకపోయింది. మహారాష్ట్ర మీద దృష్టి పెట్టి పార్టీని విస్తరించాలని ప్రయత్నిస్తున్నా, అవి అంతంతమాత్రమే అవుతాయన్నది వాస్తవం. ఒక మార్కెట్ కమిటీ ఎన్నికలో సైతం ఈ పార్టీ గెలవలేకపోయింది కదా! ప్రాంతీయ పార్టీలు అన్ని ఒకటి కావాలంటూ బీహీరు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో కేసీఆర్ జరిపిన సమావేశాలేవీ సక్సెస్ కాలేదన్న విషయం ప్రజలందరికి తెలుసు.
✍️ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో విజయ సాదన కోసం తమ ఇమేజీ పెంచుకోవడానికి కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి తాను దేశానికి ప్రత్యామ్నాయం ఇవ్వబోతున్నట్లు కనిపించారు. బీఆర్‌ఎస్ నేతలైతే ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ దేశ ప్రధాని కావాలని డిమాండ్ చేసేవారు. వారు ఇటీవలికాలంలో ఆ నినాదాన్ని పక్కనబెట్టినట్లు ఉన్నారు. కేంద్రం తమకు ఏమీ ఆర్ధిక సాయం చేయడం లేదని ఇంతకాలం బీఆర్‌ఎస్‌ప్రచారం చేసింది. అలాంటప్పుడు డిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను ,అది కూడా ఎన్నికలకు నాలుగు నెలలముందు కలవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి ఉంటుంది.ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన కీలకమైన సమావేశాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదు కదా! ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తేనే కలవడానికి సుముఖత చూపలేదు కదా! అయినా కేటీఆర్ ప్రత్యేకంగా డిల్లీ ఎందుకు వెళ్లారన్నదానిపై ఎవరి భాష్యాలు వారు చెబుతున్నారు.
✍️ బీజేపీతో రహస్య అవగాహనకోసమేనని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపించింది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరు చార్జీషీట్ లో పలుమార్లు ప్రస్తావనకు వచ్చినా, ఆమెను అరెస్టు చేయకపోవడంలోని మతలబుపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ,కాంగ్రెస్ ,తదితర పార్టీలు పలు ఆరోపణలు చేస్తుంటాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై అభియోగాలు మోపుతుంటాయి. అయినా కేంద్రం వాటి గురించి ఎందుకు విచారించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటారు. వాటిలో నిజం ఉందా?లేదా? అన్నది వేరే విషయం. స్వయంగా బీజేపీ తెలంగాణ నేతలుకాని, కొంతమంది కేంద్ర బీజేపీ నేతలు కాని ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపుతామని దూకుడుగా మాట్లాడుతుంటారు. అవన్ని కేవలం రాజకీయ విమర్శలుగానే పరిగణించవచ్చా? ఒక దశలో తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందని అంతా అనుకున్నారు. అప్పట్లో కేసీఆర్ కూడా అది వాంచించారు. తద్వారా కాంగ్రెస్ ,బీజేపీ ల మధ్య ఓట్లు చీలి తమకు తేలికగా విజయాన్ని అందిస్తుందని కేసీఆర్ భావించారు. కొంతకాలం అది వర్కవుట్ అయినా, కొన్నిసార్లు ఇద్దరి మద్య మాటల తూటాలు హద్దులు దాటినా, కర్నాటక ఎన్నికల తర్వాత కాస్త తేడా వచ్చింది. బీజేపీ వెనుకబడిపోయి కాంగ్రెస్ ముందుకు వస్తోందన్న భావన ఏర్పడింది. ఇది బీఆర్‌ఎస్, బీజేపీలు రెండు పార్టీలకు అంతగా రుచించదు. ఈ నేపద్యంలో మోదీ భోపాల్‌లో చేసిన విమర్శల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఎంత పడుతుందన్నది చర్చనీయాంశం.
✍️ మోదీ వ్యాఖ్యల ఆధారంగా డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఇబ్బంది పెట్టే రీతిలో ఈడీ ప్రయత్నాలు సాగిస్తే అప్పుడు నిజంగానే ఈ రెండు పార్టీల మధ్య వాతావరణం బాగా దెబ్బతింటుంది. తెలంగాణ బీజేపీ కాని, ఇతర విపక్షాలు కాని కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణల గురించి కేంద్రం ఏమైనా విచారణకు దిగితే అది మరింత తీవ్రం అవుతుంది. దీనివల్ల బీజేపీ తెలంగాణలో పెరుగుతుందా?లేదా?అన్నది చెప్పలేం. ఒకసారి రాజకీయంగా వెనుకబడితే మళ్లీ పుంజుకోవడానికి టైమ్ పట్టవచ్చు.పైగా మోదీచేసిన ప్రకటనలోని చిత్తశుద్ది ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఒకవైపు బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టిన కొందరు టిడిపి ఎంపీలను అప్పట్లో బీజేపీలో చేర్చుకుని వారికి రక్షణ ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. అలాగే బీజేపీకి దగ్గరైతే అవినీతి ఆరోపణల విషయంలో పెద్దగా సీరియస్‌గా ఉండకపోవచ్చు. ఈ భావన బీజేపీకి నష్టం చేస్తోంది.
✍️ కాంగ్రెస్ ఈ పదేళ్లలో తెలంగాణలో బాగా దెబ్బతిన్నా, పార్టీకి నియోజకవర్గాలలో క్యాడర్, ఒక స్థాయి నేతలు ఉండడం కలిసి వచ్చే అంశం. ప్రజలలో ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడి కాంగ్రెస్ అయితేనే బీఆర్‌ఎస్‌ను ఓడించగలదు అన్న భావన ఏర్పడితే కాంగ్రెస్ కు కలిసి వస్తుంది. అలాకాకుండా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా కేంద్రం ఏదైనా చర్య తీసుకున్నా బీజేపీపై వ్యతిరేకత వస్తుందా?లేక బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం అవుతుందా? లేక కేసీఆర్‌కు సానుభూతి వస్తుందా అన్న చర్చ కూడా ఉంటుంది. కేసీఆర్ ను ఇలాంటి వాటిలో తక్కువ అంచనా వేయకూడదు. ఈ క్రమంలో బీజేపీ పుంజుకుంటే అది కొంతమేర కాంగ్రెస్‌కు నష్టం కలిగించవచ్చన్న అంచనా ఉంది. బీజేపీ ఏమీ చర్య తీసుకోకపోతే మాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ప్రత్యర్దుల నుంచి వస్తాయి. ఏదైనా చర్య తీసుకుంటే దానివల్ల బీఆర్‌ఎస్‌కు అడ్వాంటేజ్ వస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏ రకం పరిశీలించినా, ఈ మొత్తం ప్రక్రియలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్నదానిపై ఇప్పటికైతే గ్యారంటీ ఇవ్వలేం.
::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment