మోదీ తీన్‌మార్‌.. కేసీఆర్‌ మౌనం కరెక్టేనా? | Kommineni Comments On Modi Attacks KCR In Nizamabad Speech | Sakshi
Sakshi News home page

మోదీ తీన్‌మార్‌.. కేటీఆర్‌ రియాక్షన్‌- కేసీఆర్‌ మౌనం కరెక్టా?

Published Wed, Oct 4 2023 10:40 AM | Last Updated on Wed, Oct 4 2023 11:11 AM

Kommineni Comment On Modi Attacks KCR In Nizamabad Speech - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గమ్మత్తుగానే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లో చేసిన ప్రసంగం కన్నా.. నిజామాబాద్‌లో ఘాటైన స్పీచ్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. అందులో కొన్ని రహస్యాలు చెప్పిన తీరు అందరిని ఆకర్షిస్తోంది. వాటిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఖండించినప్పటికీ..  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదో అర్ధం కావడం లేదు. తెలంగాణలో దెబ్బతిన్న బీజేపీ గ్రాఫ్‌ను ఓ మోస్తరుగా అయినా నిలబెట్టడానికి మోదీ చేసిన ప్రయత్నంగానే ఇది కనిపిస్తోంది. ఆ పార్టీ క్యాడర్ లో కాస్త జోష్ నింపడానికి ఆయన కృషి చేశారు. అది కొంతవరకు సఫలం అవుతున్నా, తెలంగాణలో బీజేపీ విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది సందేహమే అని చెప్పాలి.

మోదీ రెండు లక్ష్యాలతో వేడి పెంచినట్లుగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బీజేపీ ప్రత్యామ్నాయమే అని ప్రజలు భావించడానికి.. అధికారం రాకపోయినా గణనీయమైన సీట్లు గెలుచుకోగలిగితే పార్టీ పరపతి పెరుగుతుందన్న అభిప్రాయం కూడా ఉండవచ్చు. అలాగే క్రమేపి రాజకీయాన్ని హంగ్ అసెంబ్లీ వైపు నడిపించాలన్న ఉద్దేశమూ ఉండవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే..  కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో దేనివైపు బీజేపీ మొగ్గు చూపాల్సి ఉంటుందన్నది విశ్లేషిస్తే రాజకీయం అర్థం అవుతుంది. ఇదే సమస్య కాంగ్రెస్ వైపు నుంచి కూడా ఉంటుంది.

✍️బీజేపీ, బీఆర్ఎస్‌లలో ఏది తమ ఆప్షన్ అనుకుంటే.. సహజంగానే బీజేపీ అధికారంలోకి రాకూడదని భావిస్తుంది. ఇది ఏతావాతా బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌గా మారవచ్చు. తాజాగా టైమ్స్ నౌ సర్వేలో.. బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత వస్తుందని తేలింది. అందువల్ల ఇవన్నీ ఊహాగానాలే. అయినా రాజకీయ పార్టీలు తమ వంతు కృషి చేస్తాయి. అందులో భాగంగానే మోదీ.. బీఆర్ఎస్‌పై కొంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బహుశా మొదటిసారి ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన విమర్శలలో మూడు ముఖ్యమైనవి కనిపిస్తాయి.

1.. తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నానని.. అందుకు ఆశీర్వదించాలని తనను కేసీఆర్‌ కోరారని ప్రధాని చెప్పారు. ఇందుకు తాను అంగీకరించలేదని, అప్పటి నుంచి తన వద్దకు రావడం మానుకున్నారని ఆయన అంటున్నారు.

2.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత NDAలో చేరాలని కేసీఆర్‌ భావించి తనను అడిగారని.. అందుకు ఒప్పుకోలేదని ఆయన చెబుతున్నారు.

3 మరింత తీవ్రమైనది. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్‌కు కేసీఆర్‌ ఆర్ధిక సాయం చేశారని ఆయన ఆరోపించారు. 

వీటిలో ఏది నిజం, ఏది కాదు అంటే మనం ఏమి చెప్పగలుగుతాం.

✍️కేసీఆర్‌ కొంతకాలం వరకు ప్రధాని మోదీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. నోట్ల రద్దు విషయంలోకాని, జీఎస్టీ బిల్లు ఇతరత్రా మరికొన్ని బిలుల ఆమోదంలో బీఆర్ఎస్ సహకరించింది. శంషాబాద్ విమానాశ్రయంలో వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునేంత చనువు కూడా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఎక్కడ తేడా వచ్చిందో కాని.. ప్రధాని తెలంగాణకు వచ్చినా కేసీఆర్‌ స్వయంగా స్వాగతం చెప్పడం మానేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను ప్రోటోకాల్ మంత్రిగా నియమించారు. ఆయనే మోదీకి స్వాగతం చెబుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు వచ్చినా అదే పరిస్థితి నెలకొంది.

✍️జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 48 సీట్లు పొందడం, దుబ్బాక.. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలుపుతో బీజేపీలో తెలంగాణపై ఆశ పెరిగింది. ఇక్కడ కష్టపడితే గెలవవచ్చనే భావన ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలోకి తెచ్చి ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలో పోటీచేయించగా.. కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ ఆయన ఓడిపోయేలా చేశారు. దాంతో బీజేపీ కాస్త దెబ్బతింది. అదే టైమ్ లో కర్నాటకలో బిజెపి అధికారం కోల్పోవడంతో ఇక్కడ కూడా డల్ అయిపోయింది. కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఆరంభం అయింది.

✍️కేసీఆర్‌ ఒక దశలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా, మారిన పరిణామాలలో కాంగ్రెస్ పైనే ఎక్కుపెడుతున్నారు.ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమయం ఆసన్నమైనందున మూడు పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో దిగుతున్నాయి. మోదీ స్వయంగా నడుం బిగించి ఎన్నికల కదనరంగంలో దిగినట్లుగా ఉంది. ఆయన మహబూబ్ నగర్ లో కుటుంబ పార్టీలు అని మాత్రమే విమర్శించారు. కానీ, నిజామాబాద్ లో కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు. ఈ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ ఎన్.డి.ఎ.లోకి రావాలని కోరుకుంటే తాను ఒప్పుకోలేనని, అవినీతిపరులను తాను దగ్గరకు రానిస్తానా? అని మోదీ ఎదురు ప్రశ్నించారు. ఇది కాస్త అవాస్తవికంగానే ఉంది. తెలుగుదేశం నుంచి నలుగురు ఎంపీలను బీజేపీలోకి చేర్చుకున్నప్పుడు, వాళ్లలో ముగ్గురిపై బ్యాంక్ రుణాలు ఎగవేసిన కేసులు ఉన్నా ఎదురుగా కూర్చోబెట్టుకున్న ఘటనను అంతా మర్చిపోతారా! ఇదే విషయాన్ని కేటీఆర్‌ కూడా గుర్తు చేశారు.

జీహెచ్‌​ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం అప్పటికే మిత్రపక్షంగా ఉండగా.. బీజేపీతో కలవాల్సిన అవసరం ఏమి ఉంటుంది?. బహుశా కేంద్రంలో కూడా పట్టు ఉంటుందని కేసీఆర్‌ ఏమైనా అడిగారేమో తెలియదు. మోదీ దానిని తిరస్కరించానని అంటున్నారు. ఇందులో నిజం ఉండవచ్చు.. లేకపోవచ్చు. కానీ కేంద్రంతో కేసీఆర్ సఖ్యతతో ఉండాలని అనుకుని ఉండవచ్చు. అంతేకానీ బీజేపీతో కలిసి ప్రయాణించాలని అనుకుంటే అది ఆశ్చర్యమే అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ముస్లిం ఓట్లు కూడా గణనీయంగా ఉంటాయి.

✍️ఇక్కడ మరో పాయింట్.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే దానికి మోదీ ఆశీర్వాదం ఎందుకు అవసరం ఉంటుంది. దేశానికి పెద్ద కాబట్టి ఆయనకు మర్యాదపూర్వకంగా చెప్పారేమో తెలియదు. ఎప్పటి నుంచో కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలని ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రకరకాల కారణాలతో అది జరగడం లేదు. కాని ఇది రాజరికం కాదని మోదీ అన్నారట. దానికి కేటీఆర్‌ కూడా గట్టి సమాధానమే చెప్పారు. కర్నాటకలో దేవెగౌడ కుమారుడు కుమారస్వామిని ఎన్.డి.ఎ.లో ఎలా  చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. కుమారస్వామి కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన వాళ్లే కదా అన్నారు.

అన్నింటికన్నా సీరియస్ అయినది.. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్‌కు కేసీఆర్ ఆర్దికసాయం చేశారని!. అప్పట్లో జేడీఎస్‌కు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారు.. కాని కాంగ్రెస్ కు కాదు. ఇంతవరకు ఇలాంటి ఆరోపణ కేసీఆర్‌పై రాలేదు. కానీ.. తాను రహస్యాలు చెబుతున్నానంటూ మోదీ ఈ సంగతులు చెప్పడం ద్వారా కొత్త చర్చకు తెరదీసినట్లయింది. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య బంధం బట్టబయలైందని టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినా.. ఢిల్లీలో ఇటీవలికాలంలో కాంగ్రెస్ అధ్వర్యంలోని కూటమితో కూడా బీఆర్ఎస్ సన్నిహితంగా మెలిగింది. అంత మాత్రాన కాంగ్రెస్ తో కలిసి పోయినట్లు అవుతుందా?

✍️ బీజేపీ,బీఆర్‌ఎస్‌లు ఒకటేనని కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటటేనని బీజేపీ నేతలు విమర్శించుకోవడం సాధారణం అయిపోయింది. ఈ మూడుముక్కలాటలో చివరికి ఎవరు ఎవరితో కలుస్తారో, ఎవరితో కలవరో, అసలు ఆ అవసరం వస్తుందో రాదో చెప్పడానికి ఎన్నికల ఫలితాల వరకు ఆగావలసిందే. మోదీ చెప్పినవి వినడానికి ఆసక్తికరంగానే ఉన్నా.. వాటిలో వాస్తవికత చర్చనీయాంశమే అని చెప్పక తప్పదు. మోదీకి కేసీఆర్‌ నేరుగా జవాబు ఇవ్వలేదు. కానీ, కేటీఆర్‌ మాత్రం మరింత ఘాటుగా రిప్లై ఇచ్చారు. మోదీ అవాస్తవాలు చెప్పారని వివరిస్తే సరిపోయేది. కానీ ఆయన ఏకంగా ప్రధానిని ఛీటర్ అని అనడం సమర్ధనీయం కాకపోవచ్చు.

నిజంగానే బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల రణక్షేత్రంలో కలబడుతున్నాయా? లేక మ్యాచ్‌ ఫిక్సింగా అని కాంగ్రెస్ వారు ప్రశ్నిస్తుంటారు. దానికి ఉదాహరణగా కేసీఆర్‌ కుమార్తె కవితను డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కాకుండా బీజేపీనే కాపాడిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటుంది. దానికి బీజేపీ నేతలు మాత్రం సమాధానం ఇవ్వలేకపోతున్నారు. స్థూలంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలను మోదీ వేడెక్కించి.. బీజేపీ గ్రాఫ్ పెంచుకోవడానికి యత్నించారు. అది ఎంతవరకు పెరుగుతుందో కాని, ఆ గ్రాఫ్ పడిపోకుండా కొంత నిలబెట్టారేమోననిపిస్తోంది.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement