కాళేశ్వరంపై కుట్ర | Harish Rao Comments On Revanth Reddy Over Medigadda Barrage | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై కుట్ర

Published Sat, Mar 2 2024 2:55 AM | Last Updated on Sat, Mar 2 2024 10:58 AM

Harish Rao Comments On Revanth Reddy Over Medigadda Barrage - Sakshi

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న కేటీఆర్‌ తదితరులు. అన్నారంలో మాట్లాడుతున్న హరీశ్‌ 

ప్రాజెక్టును విధ్వంసం చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు కపట నాటకం: హరీశ్‌

రేవంత్‌.. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసి ద్రోహిగా నిలవొద్దు 

కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా రేవంత్‌ చేస్తానన్నారు.. బాంబులు పెట్టి ప్రగతిభవన్‌ను పడగొడతామన్నారు 

ఆ మాటలు మా అనుమానాన్ని బలపరుస్తున్నాయి 

మమ్మల్ని ఎంతైనా హింసించండి.. ప్రాజెక్టును, రైతులను కాపాడండి 

మేడిగడ్డకు మరింత నష్టం వాటిల్లితే బాధ్యత రేవంత్, కాంగ్రెస్‌ సర్కారుదే.. 

కాంగ్రెస్‌ కుట్రలను ఎండగట్టడానికే ‘చలో మేడిగడ్డ’ చేపట్టాం: కేటీఆర్‌ 

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు  

అన్నారం వద్ద ‘కాళేశ్వరం’పై కడియం శ్రీహరి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ 

అన్నారం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి/ సాక్షిప్రతినిధి, వరంగల్‌/ సాక్షి, హైదరాబాద్‌/ దామెర/ జనగామ: రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ ప్రభు త్వం మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని సాకుగా చూపించి మొత్తం కాళేశ్వరాన్ని విధ్వంసం చేసే కుట్రకు పాల్పడుతోందనే అనుమానాలు కలుగుతున్నా యని బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌ చేసిన ప్రకటన, గతంలో రేవంత్‌ బాంబులు పెట్టి ప్రగతిభవన్‌ పడగొడతానన్న మాటలు తమ అనుమానాన్ని బలపరుస్తున్నాయని చెప్పారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ దుష్ట పన్నాగాన్ని బయటపెట్టేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ మేడిగడ్డ వద్దకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలతో కూడిన రెండు వందల మంది బృందం     మిగతా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించింది. ‘చలో మేడిగడ్డ’పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి కడియం శ్రీహరి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వగా.. కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీశ్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణ రైతుల విషాదగాధలు తెలిసిన కేసీఆర్‌.. వృథాగా సముద్రంలో కలిసే గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకు కాళేశ్వరానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ద్వారా 98వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని సీఎం రేవంత్‌ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ రోజుకో సంఖ్య చెప్తున్నారు. రేవంత్‌ సాంగత్యంతో ఉత్తమ్‌ కూడా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. 

ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే కుట్ర 
తెలంగాణ ఉద్యమ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలి. రేవంత్‌.. మీరు తెలంగాణ ఉద్యమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేశారు. ఇప్పుడు సీఎంగానైనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోకండి. మేడిగడ్డ బ్యారేజీని ధ్వంసం చేయకండి. కావాలంటే ఎన్ని కేసులైనా పెట్టుకోండి. మమ్మల్ని ఎంతైనా హింసించండి. కానీ ప్రాజెక్టును, రైతులను కాపాడండి. ఇది బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సమస్యనో.. ఎన్నికలు, ఓట్ల సమస్యనో కాదు. ఇది లక్షలాది తెలంగాణ రైతుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ల స్థాయిలో ఉన్న సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేసి మిగతా పిల్లర్లకు విస్తరించేలా చేయకండి. అలాంటిదేమన్నా జరిగి మేడిగడ్డకు మరింత నష్టం వాటిల్లితే.. దానికి పూర్తి బాధ్యత రేవంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ సర్కారుదే. 

వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం.. 
కాంగ్రెస్‌ నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలు సమస్యలను లేవనెత్తితే పరిష్కారం చూపకుండా.. పోటీసభలు, పర్యటనలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దంటూ బీఆర్‌ఎస్‌ నల్లగొండ సభ పెడితే.. కాంగ్రెస్‌ నాయకులు మేడిగడ్డకు వెళ్లి హడావుడి చేశారు. కుంగిన రెండు, మూడు పిల్లర్లను భూతద్దంలో చూపి కాళేశ్వరం పట్ల అపోహలు కల్పించే ప్రయత్నం చేశారు. నేడు కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ ‘చలో మేడిగడ్డ’కు పిలుపునిస్తే.. ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకు పాలమూరు–రంగారెడ్డి పర్యటనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించడంలో నిమగ్నమైంది. 

ఇప్పటికైనా పనులు చేపట్టాలి.. 
2022లో వచ్చిన భారీ వరదలతో కన్నెపల్లి, అన్నారం పంపుహౌజులు మునిగితే.. యుద్ధప్రాతిపాదికన ఏజెన్సీ ఖర్చులతో మరమ్మతులు చేయించి పునరుద్ధరించాం. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికే ఇక్కడిదాకా వచ్చాం. అన్నారం బ్యారేజీకి ఎలాంటి ఢోకా లేదు. చిన్న సమస్యలుంటే వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు. దానిలోకి 34 స్ట్రీమ్‌లతోపాటు మానేరు నీళ్లు కూడా వస్తాయి. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేస్తూనే.. అన్నారం నుంచి కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లు అందించవచ్చు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే ఈ పనులు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 

మేడిగడ్డ ఒక కాంపోనెట్‌ మాత్రమే..: కడియం శ్రీహరి 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలు, పంపుసెట్లు, రిజర్వాయర్లలో (కాంపోనెట్ల)లో మేడిగడ్డ ఒకటి మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లో వివరించారు. ‘‘మొత్తం 15 రిజర్వాయర్లు, 21 పంపుహౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువలు.. 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం.. 240 టీఎంసీల వినియోగం.. వీటన్నింటి సమగ్ర స్వరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్రంలో ఎప్పుడూ ఏ ప్రాజెక్టు కూడా ప్రతిపాదిత అంచనాలతో పూర్తి కాలేదు. నాగార్జునసాగర్‌ 30 ఏళ్లు, ఎస్సారెస్పీ స్టేజ్‌ –1, స్టేజ్‌–2లు 40 ఏళ్లు దాటితే గానీ పూర్తి కాలేదు.

వాటి అంచనా వ్యయం 10–20రెట్లు పెరిగింది. ఇప్పటివరకు కాళేశ్వరం నీటితో నేరుగా 98,570 ఎకరాలు, ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన మైనర్‌ ఇరిగేషన్‌ వ్యవస్థల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు సమకూరింది. ఎస్సారెస్పీ స్టేజ్‌ 1, 2, నిజాంసాగర్ల నీటితో నింపిన 2,143 ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది. 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టు, 17,08,230 ఎకరాల స్థిరీకరణ కలిపి మొత్తం 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందుతాయి. తుమ్మిడిహట్టి బ్యారేజీ కడితే చాప్రాల్‌ వైల్డ్‌ లైఫ్‌ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం, మహారాష్ట్రలో 3,786 ఎకరాల భూమి ముంపు ఉండంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది..’’అని వివరించారు. 

ఉద్రిక్తంగా.. ఉద్విగ్నంగా.. 
బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’పర్యటన ఆద్యంతం ఉద్విగ్నంగా, ఉద్రిక్తంగా సాగింది. ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన నేతలకు పర్యటన పొడవునా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మధ్యలో కాన్వాయ్‌లో చేరుతూ ముందుకు సాగారు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట సమీపంలో బీఆర్‌ఎస్‌ కాన్వాయ్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పోలీసులు వారిని నిలువరించారు. తర్వాత ఇదే జిల్లా దామెర మండలంలో ఆగిన కేటీఆర్‌.. స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పరామర్శించారు.

‘‘జై తెలంగాణ అంటే పోలీసులతో దాడులు చేయిస్తారా? ఇది దారుణం బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి..’’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలు భూపాలపల్లిలోని కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసి.. మేడారం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం కొందరినే అనుమతించడంతో.. బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా.. మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ బృందం కాన్వాయ్‌లోని ఓ బస్సు టైరు జనగామ పరిధి నెల్లుట్ల–యశ్వంతాపూర్‌ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో పేలింది. డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును నిలిపేయడం ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
కాంగ్రెస్‌ కుట్రలు ఎండగట్టడానికే ‘చలో మేడిగడ్డ’  ప్రభుత్వ బాధ్యత మరిచి ప్రాజెక్టులపై రాజకీయాలు చేస్తోంది: కేటీఆర్‌ 
పదేళ్లలో పచ్చబడ్డ తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చేలా కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకే ‘చలో మేడిగడ్డ’కార్యక్రమం చేపట్టామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు స్పష్టం చేశారు. శుక్రవారం పర్యటనకు బయలుదేరే ముందు తెలంగాణభవన్‌లో, తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద ఆయన మాట్లాడారు. ‘‘కాళేశ్వరంపై అసలు నిజాలను ప్రజలకు చెప్పే క్రమంలో ఈరోజు పర్యటన మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులోని ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సొరంగాలు, కాలువల వద్ద పర్యటిస్తాం.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమైన ఒక మేడిగడ్డ బ్యారేజీలోని మూడు పిల్లర్లలో వచ్చిన సమస్యను పట్టుకొని లక్ష కోట్ల రూపాయలు వృధా అన్న తీరుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్మార్గ ప్రచారం చేస్తోంది. బ్యారేజీకి మరమ్మతు చేసి సాగునీరు ఇవ్వాలనే బాధ్యతను మరచి రాజకీయాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో రైతన్నల పంటలు ఎండకుండా ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే దిక్కు..’’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

ప్రాజెక్టులు కూలిపోవాలనే కుతంత్రం 
ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులను పరిరక్షించడానికి బదులు అవి కూలిపోవాలని కాంగ్రెస్‌ కుతంత్రాలు పన్నుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘పంజాబ్‌నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్‌ నీచ సంస్కృతికి సమాధి కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మరమ్మతులు కూడా చేతకాని గుంపుమేస్త్రిని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే. దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించబోం. మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌కు నూకలు చెల్లడం ఖాయం’’అని కేటీఆర్‌ హెచ్చరించారు. కాగా.. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు తలెత్తితే సరిదిద్దుకోవాలే తప్ప రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement