సాక్షి, జనగామ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తండ్రి మీద మీడియా ముందు విపరీతమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది తుల్జా భవానీ. అయితే ఈ తండ్రీకూతుళ్ల కోల్డ్‌వార్ కొత్త మలుపు తిరిగింది. భవానీ అడ్డగోలుగా తన మీద ఆరోపణలు చేయకుండా నిలువరించేలా.. కోర్టు ద్వారా భవానీకి నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.
తన పరువుకి భంగం కలిగించేలా కూతురు తుల్జా భవానీరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని.. అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిశీలించింది. ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు. YouTube, ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతో సహా మౌఖిక లేదంటే వ్రాత రూపంలో నేరుగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడవద్దని తుల్జా భవానీరెడ్డికి మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది కోర్టు. తద్వారా ముత్తిరెడ్డికి భారీ ఉపశమనం లభించినట్లయ్యింది.
భూవ్యవహారంతో మొదలైన ఈ తండ్రీకూతుళ్ల మాటల యుద్ధం రోజురోజుకీ ముదురిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూబ్ సహా అన్ని మీడియా ఛానెల్స్ ముందు తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారామె. అంతేకాదు.. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే.. తన తండ్రి దుర్మార్గుడని, సీటు ఇవ్వొద్దంటూ బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిందామె. ముత్తిరెడ్డి మాత్రం తమ కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని, తన కూతురిని తప్పు దోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు . మరోవైపు తన కూతురు, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ దాఖలైన కేసులో విచారణ కొనసాగుతోంది కూడా.
Comments
Please login to add a commentAdd a comment