CM KCR Comments On PM Narendra Modi At Maharashtra Nagpur Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

CM KCR Nagpur Meeting: మోదీ మంచి మిత్రుడు

Published Fri, Jun 16 2023 5:50 AM | Last Updated on Fri, Jun 16 2023 9:53 AM

CM KCR Comments On PM Narendra Modi At Nagpur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, నీతి ఆయోగ్‌ వంటి సమావేశాల్లో తాము ఆలోచనలు పంచుకోవడంలో వింతేమీ లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కేంద్రం మీ పథకాలు కాపీ కొడుతోందని నాగ్‌పూర్‌లో కొందరు మీడియా ప్రతినిధులు అనడంతో కేసీఆర్‌ పై విధంగా స్పందించారు.

మా ఎజెండాతో కలిసి వచ్చే వారితో కలిసి పనిచేస్తామని, విపక్షాల ఐక్యతపై సందర్భాన్ని బట్టి ఆలోచిస్తామని తెలిపారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. 

గతంలో ఫ్రంట్‌లతో ఫలితం సాధించలేక పోయాం..
‘గతంలో యునైటెడ్‌ ఫ్రంట్, నేషనల్‌ ఫ్రంట్‌ లాంటివి అనేకం చూసినా ఫలితం సాధించలేకపోయాం. మాది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీగా మారాం. ఓట్ల చీలిక బీజేపీకి అనుకూలిస్తుందనే వాదనతో మాకు సంబంధం లేదు. ఎవరికో బీ టీమ్, సీ టీమ్‌ అనే విమర్శలు మాకు అక్కరలేదు. దేశ ప్రజల కోసమే మా పార్టీ పనిచేస్తుంది.

మహారాష్ట్రలోనూ పొత్తుల గురించి మేము ఆలోచించడం లేదు. అవసరమవుతుందని అనుకోవడం లేదు. మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. గెలుపోటములతో సంబంధం లేకుండా సంపూర్ణ లక్ష్యం చేరుకునే వరకు మా ప్రయాణం సాగుతుంది’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 
నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో బాల్కసుమన్, తోట చంద్రశేఖర్, కేకే, బీబీ పాటిల్, జీవన్‌రెడ్డి 

విపక్ష నేతలపై ఐటీ దాడులు సరికాదు
‘దేశంలో అనేక చోట్ల ప్రత్యేక రాష్ట్రాల కోరిక ఉంది. మిథిలాంచల్‌ ఏర్పాటుకు ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల ఏర్పాటులో శాస్త్రీయ విధానం కావాలి. దేశంలో మరో పది పన్నెండు రాష్ట్రాలు ఏర్పడితే ఏమవుతుంది? కొత్త రాష్ట్రాలు ఏర్పడితే విదర్భ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుంది. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే మా పార్టీ కార్యకలాపాలు మహారాష్ట్ర నుంచి ప్రారంభించాం.

గతంలో తెలంగాణ రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు 14 రాష్ట్రాల వారు తెలంగాణలో పనిచేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ తరహాలో మహారాష్ట్రలోనూ అభివృద్ధి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో విపక్ష నేతలపై ఐటీ దాడులు సరికాదు. పార్టీలు బ్రతికి ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. అప్పుడే మోదీ సహా పార్టీలకు అవకాశాలు లభిస్తాయి. పార్టీలను వేధించకుండా బ్రతకనివ్వాలి. ఐటీ దాడులను ఖండిస్తున్నాం..’ అని అన్నారు.

విమానాలు అందరికీ అందుబాటులోకి రావాలి..
‘మహిళల భాగస్వామ్యంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదిలోపే పార్లమెంటుతోపాటు అసెంబ్లీల్లోనూ స్త్రీలకు 33 శాతం సీట్లు రిజర్వ్‌ చేస్తాం. రైతులను అసెంబ్లీ, పార్లమెంటుకు పంపిస్తాం. పార్టీలో చేర్చుకునేందుకు మహారాష్ట్రకు ప్రైవేటు విమానం పంపడం తప్పేమీ లేదు. అది మా పార్టీ విమానం. నేను అందులోనే వెళ్తున్నా. అమెరికాలో రైతుల వద్ద కూడా విమానాలు ఉన్నాయి. ఇక్కడా అందరికీ విమానాలు అందుబాటులోకి రావాలి. 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు (బండి సంజయ్‌) చెప్పడం పెద్ద బక్వాస్‌’ అని సీఎం అన్నారు. 

బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరగాలి...
‘మనకంటే అభివృద్ధి చెందిన యూరోపియన్‌ దేశాలు, అమెరికా గతంలో ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినా తిరిగి బ్యాలెట్‌ విధానం పాటిస్తున్నాయి. ఇక్కడా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నందున బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరగాలి. భారత్‌ పనితీరులో మార్పు కోసం రాజ్యాంగంతో పాటు ఆర్థిక, న్యాయ, పాలన, ఎన్నికల రంగాల్లో వ్యవస్థాగత మార్పులు రావాలి. మూస విధానాల నుంచి బయట పడకుంటే ప్రపంచంతో పోటీ పడలేం. దేశ జల, విద్యుత్‌ విధానాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరముంది.

ఎయిర్‌ పోర్టులు, పోర్టులు, రోడ్లు, రైల్వే వ్యవస్థల్లో మౌలిక వసతులు పెరుగుదల.. దేశంలో గుణాత్మక మార్పుతోనే సాధ్యం. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఈ రంగాలను మెరుగు పరుస్తాం. త్వరలో ఢిల్లీలో మా మేనిఫెస్టోను ప్రకటిస్తాం. దేశంలో దళితుల అభ్యున్నతి, ఉచిత విద్య వంటివి ఇందులో ఉంటాయి. విద్యుత్‌ రంగంలో ప్రైవేటీకరణ సరికాదు, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వ రంగంలోనే కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నాం.

లోపాలు సరిదిద్దితే ఆర్థిక రంగం మెరుగవుతుందనే భావనతో మేము తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో ఆర్థిక వృద్ధికి దోహదం చేశాయి. దేశంలో మార్పులకు గడువేమీ పెట్టుకోలేదు, మా లక్ష్యం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది..’ అని కేసీఆర్‌ వెల్లడించారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేయనందు వల్లే ధరలు పెరుగుతున్నాయని, చట్ట సభల్లో చర్చ లేకుండా బిల్లులు ఆమోదం జరగడం వంటి అంశాల్లో మార్పులు రావాలని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement