మోదీని ఆపే దమ్ము కేసీఆర్‌కే ఉంది | Sakshi
Sakshi News home page

మోదీని ఆపే దమ్ము కేసీఆర్‌కే ఉంది

Published Tue, May 7 2024 2:56 AM

BRS KTR Shocking Comments on PM Modi

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు 

10 నుంచి 12 ఎంపీ సీట్లు ఇస్తే కేసీఆర్‌ చక్రం తిప్పడం ఖాయం

తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా రేవంత్‌ ఇయ్యడు

‘న.మో’ అంటే నమ్మించి మోసం చేసేవాడు అని అర్థం

ఇప్పుడైనా, ఎప్పుడైనా తెలంగాణకు కేసీఆరే రక్ష అని స్పష్టీకరణ

హైదరాబాద్, సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం

గచ్చిబౌలి, శంషాబాద్‌ (హైదరాబాద్‌)/ సిరిసిల్ల:  దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించ గలిగే శక్తి, కేంద్రంలో రానున్న సర్కారుతో పోరాడే దమ్ము కేవలం మాజీ సీఎం కేసీఆర్‌కు, అలాగే కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వారికే ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. కేసీఆర్‌ను మరింత బలోపేతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు బీఆర్‌ఎస్‌కు ఇస్తే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పడం ఖాయమని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి అని, రాజీవ్‌గాంధీ లైన్‌లో కాకుండా మోదీ లైన్‌లో నడుస్తున్నాడని విమర్శించారు. బీజేపీ వాళ్లు ఇంటింటికీ పంపే రాముడి ఫొటోకు, అంక్షితలకు మోసపోవద్దని కోరారు. అవి అయోధ్య నుంచి రాలేదని ఇక్కడి రేషన్‌ బియ్యానికే పసుపు పూసి పంపుతున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌ లోని కొండాపూర్, శంషాబాద్‌లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్‌ షోల్లో ఆయన మాట్లాడారు. 

ఆయనేమన్నా బోటి కొట్టేటోడా?
‘కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపి, అలవికాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ ఐదు నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెడితేనే పిచ్చి వాగుడు వాగుతున్న రేవంత్‌రెడ్డికి బుద్ధి వస్తుంది. ఆయన తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా ఇయ్యడు. రూ.2,500 నగదు, రూ.4 వేల పింఛను, స్కూటీలు ఇప్పటివరకు ఇయ్యలేదు.

రూ.4 వేలు కాదు కదా రూ.400 కూడా ఇయ్యడు. రూ.2,500 కాదు ఉన్న రూ.500 ఇస్తే అదే గొప్ప. రేవంత్‌ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ అడ్రస్‌ లేకుండా పోయింది. ఫార్మాసిటీ లేకుండా పోయింది.. ఒప్పందం చేసుకున్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి.. కొత్తవి రావడం లేదు. పేగులు మెడకు వేసుకుంటా అంటున్నాడు.. ఆయనేమన్నా బోటి కొట్టేటోడా? కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. సిరిసిల్ల రోడ్డుపై రాజేందర్‌రావు నిల్చుంటే.. బస్సు కోసం చూస్తుండని భావిస్తారే కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి అని గుర్తుపట్టరు..’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  

మోదీకి ఎందుకు ఓటెయ్యాలి?
‘మోదీ పచ్చి మోసగాడు. న.మో అంటే న మ్మించి మోసం చేసేవాడని అర్థం. ఐటీఐ ఆర్, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకర ణకు నిధులు అడిగితే ఇప్పటివరకు ఇయ్యని మోదీకి ఎందుకు ఓటు వేయాలి? జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి ధనాధన్‌ 15 లక్షలు వేస్తా, బుల్లెట్‌ రైళ్ళు..ఇలా పదేళ్ళ కాలంలో ఎన్నో చెప్పారు. కానీ బడే భాయ్‌ మోదీ మ నకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. గు డి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణ మైతే కేసీఆర్‌ యాదాద్రి కట్టలేదా? హైదరా బాద్‌ నగరంలో అన్ని మతాలు, కులాల వారూ ఉంటారు. ముస్లింలను తిట్టడమే లక్ష్యంగా మోదీ పెట్టుకున్నారు. పదేళ్ళు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి చేయాల్సిన పని ఇదా?. దేవుడిని మొక్కండి.. బీజేపీని తొక్కండి..’ అంటూ మాజీమంత్రి ధ్వజమెత్తారు.

గ్రేటర్‌ ప్రజలు కేసీఆర్‌నే కోరుకున్నారు
‘హైదరాబాద్‌ నగరంలో అత్యధికంగా 36 ఫ్లైఓవర్లు నిర్మించాం. అత్యధిక ఐటీ కంపెనీలు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే గాంధీ కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయనకు జోడేదార్‌గా ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపిస్తే వారిద్దరికీ నేను పూర్తి అండగా ఉంటా. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 16 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించారు. బీజేపీకి ఒక్క సీటు ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా ఇవ్వలేదు. గ్రేటర్‌ ప్రజలు కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా తెలంగాణకు కేసీఆరే రక్ష..’ అని కేటీఆర్‌ చెప్పారు. రోడ్‌ షోల్లో జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాశ్‌గౌడ్, పార్టీ సీనియర్‌ నేత గణేష్‌గుప్తా పలువురు స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement