శనివారం మహారాష్ట్రలోని రాజురాలో సీఎం రేవంత్ రోడ్‌షో
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ప్రశ్న
10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు తెచ్చాం
మీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఏమైనా చేశారా?
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం
సాక్షి ముంబై: తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. బీజేపీ అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఇలా ఇవ్వగలిగారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు తన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విదర్భ ప్రాంతంలోని చంద్రపూర్, రాజురా, దిగ్రాస్, వార్దా, నాగ్‌పూర్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి అభ్యర్థుల తరపున రేవంత్ ప్రచారం చేశారు.
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఇప్పటివరకు 1.10 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని వివరించారు. రూ.500 కే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 25 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని విశ్వసించి అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే తాము రూ.18 వేల కోట్లు ఖర్చుచేసి ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు.
బందిపోటు ముఠాను తరిమికొట్టండి
ముంబైని దోచుకోవాలని చూస్తున్న బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని మహారాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. వెన్నుపోటు రాజకీయాలను పాతిపెట్టాలని కోరారు. ముంబైని కొల్లగొట్టేందుకే ప్రధాని మోదీ, అదానీ కలిసి వస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌లు గుజరాత్‌కు గులాంలుగా మారిపోయారని మండిపడ్డారు.
ఎంవీఏ కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో జరుగుతున్నవి ఎన్నికలు కాదని.. అది ఒక పోరాటమని అభివర్ణించారు. ఈ పోరాటంలో ఎంవీఏను గెలిపించాలని కోరారు. కాగా, ప్రచార సభలు, నాగ్‌పూర్ రోడ్‌షో సందర్భంగా రేవంత్‌రెడ్డికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. రేవంత్ వేదికపైకి రాగానే పెద్దపెట్టున నినదించారు.
Comments
Please login to add a commentAdd a comment