50 లక్షల ఉద్యోగాలు ఆవిరి | 50 lakh people lost jobs since demonetisation | Sakshi
Sakshi News home page

50 లక్షల ఉద్యోగాలు ఆవిరి

Published Thu, Apr 18 2019 3:24 AM | Last Updated on Thu, Apr 18 2019 3:24 AM

50 lakh people lost jobs since demonetisation - Sakshi

బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016–18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే ఉద్యోగావకాశాల క్షీణతకు పెద్ద నోట్ల రద్దుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్‌ 2016 నుంచే ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం అని పేర్కొంది.

ది స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)–2019 పేరిట బెంగళూరులోని అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్‌ పిరమిడ్స్‌ సర్వే ఆఫ్‌ ది సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ది ఇండియన్‌ ఎకానమీ(సీఎమ్‌ఐఈ–సీపీడీఎక్స్‌) సంస్థ నుంచి 2016–18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు. ఈ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.

నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారితోపాటు యువకులే అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇదేకాలంలో తక్కువ విద్యార్హత గల వారు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు ఆ స్థాయిలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గాయని తెలిపింది. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అమిత్‌ బాసోల్‌ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలను సృష్టించేందుకు కొన్ని పరిష్కార మార్గాలను నివేదికలో తాము సూచించామని అన్నారు. ‘మేము సూచించిన పరిష్కార మార్గాలు ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతోపాటు దేశంలోని అందరికీ సమానమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని బలంగా నమ్ముతున్నాం’అని పేర్కొన్నారు.

పరిష్కార మార్గాలు..
► దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ స్కీమ్‌ తరహాలోనే అర్బన్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ ప్రోగ్రామ్‌ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది.  

► స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపై 6 శాతం, వైద్యంపై 3 శాతం అదనంగా ఖర్చు పెట్టగలిగితే సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించింది. అలాగే దీని ద్వారా అత్యంత నాణ్యమైన ప్రజా సేవలను అందించవచ్చని పేర్కొంది.  

► భారతీయ తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement