unemployment in up
-
ఉత్తరాది వారిలో నైపుణ్యం లేదు
లక్నో: దేశంలో తగిన ఉపాధి అవకాశాలు ఉన్నాయని.. వాటికి కావాల్సిన నైపుణ్యాలు ఉత్తరాది ప్రజల్లో ఉండటం లేదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించే రిక్రూటర్లు ఇదే విషయంపై తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రాయ్‌బరేలీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో నిరుద్యోగం గురించి వార్తలు వస్తున్నాయి. వీటిని విశ్లేషణ చేశాను. దేశంలో ఉద్యోగాలకు కొరత లేదు. కానీ కావాల్సిన అర్హులే ఉండటం లేదు. ఇదే విషయంపై పలువురు రిక్రూటర్లు నాకు ఫిర్యాదు చేశారు’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆర్థిక మందగమనం వల్ల జాబుల సంఖ్య తగ్గిపోతుందనే విషయం నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కేంద్ర మంత్రి నిరుద్యోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. -
50 లక్షల ఉద్యోగాలు ఆవిరి
బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016–18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే ఉద్యోగావకాశాల క్షీణతకు పెద్ద నోట్ల రద్దుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్ 2016 నుంచే ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం అని పేర్కొంది. ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)–2019 పేరిట బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ–సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016–18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు. ఈ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారితోపాటు యువకులే అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇదేకాలంలో తక్కువ విద్యార్హత గల వారు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు ఆ స్థాయిలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గాయని తెలిపింది. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలను సృష్టించేందుకు కొన్ని పరిష్కార మార్గాలను నివేదికలో తాము సూచించామని అన్నారు. ‘మేము సూచించిన పరిష్కార మార్గాలు ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతోపాటు దేశంలోని అందరికీ సమానమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని బలంగా నమ్ముతున్నాం’అని పేర్కొన్నారు. పరిష్కార మార్గాలు.. ► దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. ► స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపై 6 శాతం, వైద్యంపై 3 శాతం అదనంగా ఖర్చు పెట్టగలిగితే సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించింది. అలాగే దీని ద్వారా అత్యంత నాణ్యమైన ప్రజా సేవలను అందించవచ్చని పేర్కొంది. ► భారతీయ తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
స్వీపర్ ఉద్యోగాల కోసం బీటెక్‌లు, ఎంబీయేలు!
ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అలహాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ)లో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే.. ఏకంగా 1.10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అంతేకాదు, కేవలం హిందీలో చదవడం, రాయడం వస్తే సరిపోతుందని అర్హతలలో పేర్కొంటే.. చాలామంది బీటెక్‌లు, ఎంబీయేలు, ఇతర పీజీలు చేసిన వాళ్లు కూడా క్యూకడుతున్నారు. కాంట్రాక్టు స్వీపర్లు (సఫాయీ కర్మచారీలు) ఉద్యోగాల కోసం వీళ్లంతా ఇంత పెద్ద సంఖ్యలో రావడంతో రిక్రూట్మెంట్కు ఎంతలేదన్నా కనీసం 408 రోజుల పాటు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ఈలోపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి, ప్రభుత్వం మారితే మరింత ఆలస్యం తప్పదట. అలహాబాద్ మునిసిపాలిటీలో 119 పోస్టులతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక్కో జిల్లాకు 100 చొప్పున స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికోసం పెద్దపెద్ద చదువులు చదివినవాళ్లు కూడా రావడంతో రోజుకు 250 మంది చొప్పున అభ్యర్థులను అహ్మదాబాద్ మునిసిపాలిటీ పిలుస్తోంది. పెద్దపెద్ద విద్యార్హతలు ఉన్నవాళ్లు, యువకులు దీనికి దరఖాస్తు చేశారని అదనపు మునిసిపల్ కమిపషనర్ ఓపీ శ్రీవాస్తవ తెలిపారు. వీళ్లందరినీ ఇంటర్వ్యూ చేయాలంటే 408 పనిదినాలు.. అంటే సుమారు రెండు సంవత్సరాల సమయం పడుతుందని, వీళ్లంతా ప్రాక్టికల్ పరీక్షలు కూడా పాసవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.