స్వీపర్ ఉద్యోగాల కోసం బీటెక్‌లు, ఎంబీయేలు!
స్వీపర్ ఉద్యోగాల కోసం బీటెక్‌లు, ఎంబీయేలు!
Published Fri, Dec 9 2016 9:23 AM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM
ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అలహాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ)లో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే.. ఏకంగా 1.10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అంతేకాదు, కేవలం హిందీలో చదవడం, రాయడం వస్తే సరిపోతుందని అర్హతలలో పేర్కొంటే.. చాలామంది బీటెక్‌లు, ఎంబీయేలు, ఇతర పీజీలు చేసిన వాళ్లు కూడా క్యూకడుతున్నారు. కాంట్రాక్టు స్వీపర్లు (సఫాయీ కర్మచారీలు) ఉద్యోగాల కోసం వీళ్లంతా ఇంత పెద్ద సంఖ్యలో రావడంతో రిక్రూట్‌మెంట్‌కు ఎంతలేదన్నా కనీసం 408 రోజుల పాటు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.
ఈలోపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి, ప్రభుత్వం మారితే మరింత ఆలస్యం తప్పదట. అలహాబాద్ మునిసిపాలిటీలో 119 పోస్టులతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక్కో జిల్లాకు 100 చొప్పున స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికోసం పెద్దపెద్ద చదువులు చదివినవాళ్లు కూడా రావడంతో రోజుకు 250 మంది చొప్పున అభ్యర్థులను అహ్మదాబాద్ మునిసిపాలిటీ పిలుస్తోంది. పెద్దపెద్ద విద్యార్హతలు ఉన్నవాళ్లు, యువకులు దీనికి దరఖాస్తు చేశారని అదనపు మునిసిపల్ కమిపషనర్ ఓపీ శ్రీవాస్తవ తెలిపారు. వీళ్లందరినీ ఇంటర్వ్యూ చేయాలంటే 408 పనిదినాలు.. అంటే సుమారు రెండు సంవత్సరాల సమయం పడుతుందని, వీళ్లంతా ప్రాక్టికల్ పరీక్షలు కూడా పాసవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Advertisement