లక్నో: దేశంలో తగిన ఉపాధి అవకాశాలు ఉన్నాయని.. వాటికి కావాల్సిన నైపుణ్యాలు ఉత్తరాది ప్రజల్లో ఉండటం లేదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించే రిక్రూటర్లు ఇదే విషయంపై తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రాయ్‌బరేలీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో నిరుద్యోగం గురించి వార్తలు వస్తున్నాయి. వీటిని విశ్లేషణ చేశాను. దేశంలో ఉద్యోగాలకు కొరత లేదు. కానీ కావాల్సిన అర్హులే ఉండటం లేదు. ఇదే విషయంపై పలువురు రిక్రూటర్లు నాకు ఫిర్యాదు చేశారు’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆర్థిక మందగమనం వల్ల జాబుల సంఖ్య తగ్గిపోతుందనే విషయం నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కేంద్ర మంత్రి నిరుద్యోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment