యాజమాన్యంతో పనిలేదన్న ఈపీఎఫ్‌ఓ
ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలను మార్చుకోవచ్చు..
ఈపీఎఫ్ ఖాతాను సైతం బదిలీ చేసుకోవచ్చు
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు కొత్త సౌకర్యం
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు శుభవార్త చెప్పింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్‌ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది.
అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్‌లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్‌ఓకు క్లెయిమ్‌ను సమర్పించవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ సేవలను శనివారం పరిచయం చేశారు.
‘2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) పొందిన సభ్యులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2017 అక్టోబర్ 1 కంటే ముందు యూఏఎన్ జారీ అయితే ఈపీఎఫ్‌ఓ ఆమోదం లేకుండా యాజమాన్యాలు ఈ వివరాలను సరిచేయవచ్చు. అటువంటి సందర్భాలలో పత్రాల ఆవశ్యకత కూడా సరళీకృతం చేశాం.
ఆధార్‌తో యూఏఎన్ అనుసంధానం కాకపోతే ఏదైనా దిద్దుబాటు కోసం పత్రాలను యజమానికి భౌతికంగా సమర్పించాలి. ధ్రువీకరణ తర్వాత యాజమాన్యాలు ఆమోదం కోసం ఈపీఎఫ్‌ఓకు పంపాల్సి ఉంటుంది’ అని వివరించారు. సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు 27 శాతం ప్రొఫైల్/కేవైసీ సమస్యలకు సంబంధించినవేనని మంత్రి తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment