Ministry of Labour
-
పేరు మార్పు, ఖాతా బదిలీ చందాదారులే చేయొచ్చు
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు శుభవార్త చెప్పింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్‌లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్ఓకు క్లెయిమ్‌ను సమర్పించవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సేవలను శనివారం పరిచయం చేశారు. ‘2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) పొందిన సభ్యులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2017 అక్టోబర్ 1 కంటే ముందు యూఏఎన్ జారీ అయితే ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా యాజమాన్యాలు ఈ వివరాలను సరిచేయవచ్చు. అటువంటి సందర్భాలలో పత్రాల ఆవశ్యకత కూడా సరళీకృతం చేశాం. ఆధార్‌తో యూఏఎన్ అనుసంధానం కాకపోతే ఏదైనా దిద్దుబాటు కోసం పత్రాలను యజమానికి భౌతికంగా సమర్పించాలి. ధ్రువీకరణ తర్వాత యాజమాన్యాలు ఆమోదం కోసం ఈపీఎఫ్ఓకు పంపాల్సి ఉంటుంది’ అని వివరించారు. సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు 27 శాతం ప్రొఫైల్/కేవైసీ సమస్యలకు సంబంధించినవేనని మంత్రి తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. -
ఫిబ్రవరిలో భారీ ఉపాధి కల్పన!
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ– ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) 2023 ఫిబ్రవరి 13.96 లక్షల మంది నికర చందాదారులను నమోదు చేసుకుంది. వీరిలో దాదాపు 7.38 లక్షల మంది మొట్టమొదటిసారి కొత్తగా ఈపీఎఫ్ఓ పరిధిలోనికి వచ్చినవారని కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. ప్రకటనలో ముఖ్యాంశాలు.. ► కొత్తగా చేరిన సభ్యుల్లో అత్యధికంగా 2.17 లక్షల మంది సభ్యులు 18–21 ఏళ్ల మధ్య వయస్సు గలవారు. 1.91 లక్షల మంది సభ్యులు 22–25 ఏళ్ల మధ్య వయస్సు గలవారు. ► మొత్తం కొత్త సభ్యులలో 18–25 సంవత్సరాల మధ్య వయస్కులు 55.37 శాతం మంది. దేశంలోని సంఘటిత రంగంలో భారీగా ఉపాధి అవ కాశాలు కలిగినట్లు ఈ సంఖ్య తెలియజేస్తోంది. ► నికర మహిళా సభ్యుల నమోదు 2.78 లక్షలు. ఈ నెలలో నికర సభ్యుల చేరికలో ఇది దాదాపు 19.93%. నికర మహిళా సభ్యుల సంఖ్యలో 1. 89 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. ► నికర సభ్యుల చేరికలో నెలవారీగా పెరుగుతున్న ధోరణిని చూస్తే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాలు తొలి వరుసలో ఉన్నాయి. ► పరిశ్రమల వారీగా చూస్తే.. నిపుణుల సేవల విభాగం (మానవ వనురుల సరఫరాదారులు, సాధారణ కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సర్వీసెస్, ఇతర కార్యకలాపాలు మొదలైనవి) మొత్తం సభ్యుల చేరికలో 41.17 శాతంగా ఉంది. ► తోలు ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, కొరియర్ సేవలను అందించడంలో నిమగ్నమైన సంస్థలు, చేపల ప్రాసెసింగ్, నాన్–వెజ్ ఫుడ్ ప్రిజర్వేషన్ మొదలైన పరిశ్రమలకు సంబంధించి ఈపీఎఫ్ఓలో అధిక నమోదులు ఉన్నాయి. నిరంతర ప్రక్రియ... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్ర తా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యు డు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 7 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
జనవరిలో భారీగా ఉపాధి కల్పన
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)లో ఈ ఏడాది జనవరిలో 14.86 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. ► జనవరి నెలలో 3.54 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ పరిధి నుంచి బయటకు వెళ్లారు. ఈపీఎఫ్ఓ చట్రం నుంచి బయటకు వెళ్లడానికి సంబంధించి గడచిన నాలుగు నెలల్లో ఇది కనిష్ట సంఖ్య. ► జనవరిలో నమోదయిన 14.86 లక్షల మందిలో 7.77 మంది కొత్తవారు. మొదటిసారి వీరు ఈపీఎఫ్ఓలో చందాదారులయ్యారు. ► జనవరి 2023లో నికర మహిళా సభ్యుల నమోదు 2.87 లక్షలు. ఇందులో దాదాపు 1.97 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. దీంతో నికర మహిళా సభ్యుల్లో 68.61 శాతం మంది తొలిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చినట్లయ్యింది. ► రాష్ట్రాల వారీగా చూస్తే, అత్యధిక సంఖ్యలో ఈపీఎఫ్ఓలో చేరిన వారిలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్. ఢిల్లీలకు చెందిన వారు ఉన్నారు. ► ఈపీఎఫ్ఓలో ప్రస్తుతం దాదాపు 8 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. -
ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త..! భారీగా పెరగనున్న పెన్షన్..! ఎంతంటే..?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు భారీ ప్రయోజనాలను కల్పించే ప్రణాళికతో ముందుకు వస్తోంది. రానున్న రోజుల్లో ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనుంది. రూ. 9000 వరకు పెంపు..! ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో భాగంగా అసంఘటిత రంగ ఉద్యోగుల నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.9,000 పెంచేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సమాయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. పెన్షన్ పెంపుపై ఇప్పటికే పలు సార్లు చర్చలు జరిగాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్‌పై నిర్ణయం తీసుకొనుంది. అంతకుముందు ఈ కమిటీ మినిమం పెన్షన్‌ను రూ.1000 నుండి రూ.3000కు పెంచాలని మార్చి 2021లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రికమండ్ చేసింది. అయితే కనీస పెన్షన్ రూ.9000కు పెంచితేనే ఈపీఎస్-95 పెన్షనర్లకు నిజమైన బెనిఫిట్ లభిస్తుందని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే సమవేశంలో కొత్త వేతన నియమావళి అమలు, (ఈపీఎస్) ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ వంటి రెండు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగి చివరి నెల జీతంపై..! ఉద్యోగి లేదా కార్మికుడి చివరి నెల వేతనం ఆధారంగా పెన్షన్‌ను ఖరారు చేయాలనే సూచన కూడా వచ్చింది. ఈ సూచనతో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం కింద కొత్త వేతన కోడ్ అమలు తదితర ముఖ్య అంశాలపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈపీఎఫ్ఓ బోర్డు భేటీలో చర్చకు రావొచ్చునని తెలుస్తోంది. చదవండి: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు..! -
ఉత్తరాది వారిలో నైపుణ్యం లేదు
లక్నో: దేశంలో తగిన ఉపాధి అవకాశాలు ఉన్నాయని.. వాటికి కావాల్సిన నైపుణ్యాలు ఉత్తరాది ప్రజల్లో ఉండటం లేదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించే రిక్రూటర్లు ఇదే విషయంపై తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రాయ్‌బరేలీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో నిరుద్యోగం గురించి వార్తలు వస్తున్నాయి. వీటిని విశ్లేషణ చేశాను. దేశంలో ఉద్యోగాలకు కొరత లేదు. కానీ కావాల్సిన అర్హులే ఉండటం లేదు. ఇదే విషయంపై పలువురు రిక్రూటర్లు నాకు ఫిర్యాదు చేశారు’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆర్థిక మందగమనం వల్ల జాబుల సంఖ్య తగ్గిపోతుందనే విషయం నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కేంద్ర మంత్రి నిరుద్యోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. -
కనీస వేతనం రూ.10 వేలు
♦ కాంట్రాక్టు కార్మికులకు దేశమంతా అమలయ్యేలా ఆర్డినెన్స్ తెస్తాం ♦ నిపుణులైన కార్మికులకు రూ.18 వేలు: కేంద్రమంత్రి దత్తాత్రేయ ♦ న్యాయశాఖకు ఫైలు పంపాం.. త్వరలోనే గెజిట్ ♦ పార్లమెంట్లో చట్టానికి కాంగ్రెస్, లెఫ్ట్ అడ్డుపడుతున్నాయని విమర్శ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. నిపుణులైన (స్కిల్డ్) కార్మికులకు కనీసం రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సమాన వేతనం అందించేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రికి సంబంధిత ఫైలు పంపామని, త్వరలో గెజిట్ విడుదల చేస్తామని వివరించారు. కనీస వేతన చట్టానికి పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకురావడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయని దుయ్యబట్టారు. వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కనీస వేతన చట్టానికి పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్మికులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్, వామపక్ష పార్టీలే తమపై దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ఇది వరకే కనీస పెన్షన్‌ను రూ.వెయ్యి చేసిందని, బోనస్‌ను రూ.3,500 నుంచి రూ.7 వేలకు పెంచిందని గుర్తుచేశారు. అన్ని కంపెనీలు పాటించాల్సిందే.. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులకు రోజుకు రూ.160 మాత్రమే అందుతోందని, ఇకపై రూ.333 అందేలా చర్యలు తీసుకుంటున్నామని దత్తాత్రేయ చెప్పారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలు, పరిశ్రమలు విధిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే కార్మిక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తమ నిర్ణయం వల్ల ముఖ్యంగా పారిశుధ్య కార్మికుల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తెలంగాణలో వేతనాలు పెంచాలంటూ పారిశుధ్య కార్మికులు చేసిన సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కేంద్రం తీసుకురానున్న ఆర్డినెన్స్ ద్వారా వారికి ఇక నుంచి కనీసం రూ.10 వేలు అందుతుందన్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికులను వేధించకుండా, ఇష్టానుసారం బదిలీలు చేయకుండా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్నిచోట్ల కార్మికులకు నెలవారీ వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కనీస వేతన చట్టం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే కార్మికులకు సొంత ఇళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇది వరకు ఇంటి నిర్మాణం కోసం కేంద్రం రూ.40 వేలు మాత్రమే ఇచ్చేదని, ప్రస్తుతం దాన్ని రూ.1.50 లక్షలకు పెంచినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి స్థలాలు కేటాయిస్తే తామే ఇళ్లు నిర్మిస్తామన్నారు. -
ఏటా 10 వేల గల్ఫ్ ఉద్యోగాలు
♦ టామ్‌కామ్ బలోపేతం దిశగా కార్మికశాఖ అడుగులు ♦ మూడు దుబాయ్ కంపెనీలతో 1,050 ఉద్యోగాలకు ఒప్పందం ♦ గల్ఫ్ కంపెనీలతో మరిన్ని ఒప్పందాలు చేసుకునే యోచన ♦ అవకతవకలు లేకుండా ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఏటా పదివేల మంది రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదికూడా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రభుత్వ ఆధీనంలోనే జరిగేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీస్ (టామ్ కామ్)’ను బలోపేతం చేసేందుకు కార్మికశాఖ కృషి చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశం కల్పించే అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది. అభ్యర్థులు నేరుగా టామ్‌కామ్ వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లోని మూడు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 1,050 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టింది. అల్‌జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ 250 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ విధంగానే గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని టామ్‌కామ్ యోచిస్తోంది. డేటాబేస్ ఏర్పాటు చేసే యోచన గల్ఫ్ దేశాల్లో పనిచేయాలనుకుంటున్న వారి వివరాలన్నింటినీ ఒక డేటాబేస్ రూపంలో ఏర్పాటు చేయాలని టామ్‌కామ్ భావిస్తోంది. గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్లు, భవన నిర్మాణం తదితర రంగాల్లో భారీగా అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి కంపెనీలకు అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉంచాలనే యోచనతో ఒక డాటాబేస్ తయారు చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా త్వరలోనే టామ్‌కామ్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దర ఖాస్తులు ఆహ్వానించనున్నారు. విద్యార్హత, అనుభవం తది తర వివరాలను విడిగా రూపొం దించి కంపెనీలకు అందజేస్తారు. అలాగే దరఖాస్తుదారులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని... ముఖ్యంగా గల్ఫ్ చట్టాలు, అక్కడి విధానాలపై అవగాహన కల్పించాలని యోచిస్తున్నారు. దళారీ వ్యవస్థకు చెక్ తెలంగాణ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాల కోసం భారీ సంఖ్యలో వెళుతుంటారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన వారు దాదాపు ఆరు లక్షల మంది ఉంటారని ప్రభుత్వ వర్గాల అంచనా. ఒక్క 2015లోనే 50 వేల మంది రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వెళ్లినట్లు భావిస్తున్నారు. ఇలా గల్ఫ్‌కు డిమాండ్ ఉండడంతో మధ్య దళారులు, నకిలీ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. దళారుల మాయమాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా, దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా టామ్‌కామ్ డెరైక్టర్ కె.వై.నాయక్ ప్రణాళికలు రూపొందించారు. టామ్‌కామ్ ద్వారా గల్ఫ్‌లో ఉద్యోగాలు పొందిన వారికి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక సమన్వయకర్తను కూడా ఏర్పాటు చేశారు. -
ఐటీఐల బలోపేతంపై దృష్టి
♦ కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని కార్మికశాఖ నిర్ణయం ♦ సింగపూర్ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను మరింత బలోపేతం చేసే దిశగా కార్మికశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను తయారు చేసి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాల కల్పనకు మంచి స్పందన లభించడంతో ఐటీఐ కాలేజీలను బలోపేతం చేయాలని కార్మికశాఖ నిర్ణయించింది. కార్మిక, హోంశాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో దుబాయ్‌లో జరిపిన పర్యటన ద్వారా టామ్‌కామ్ దాదాపు 1150 మందికి ఉద్యోగ అవకాశాల కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో పదివేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పనకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మార్చాలని కార్మికశాఖ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా శిక్షణ విధానంలో మార్పులు తీసుకురావడంతోపాటు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇప్పుడు అందిస్తున్న కోర్సులకు అదనంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇంటీరియర్ డిజైన్, బ్యూటీషియన్ వంటి కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ, నూతన యంత్ర సామాగ్రి కొనుగోలు చేయాలని కార్మికశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింగపూర్‌లో కొనసాగుతున్న పారిశ్రామిక శిక్షణ సంస్థల తరహాలో రాష్ట్రంలోని ఐటీఐలను తీర్చిదిద్దాలని యోచిస్తోంది. అందుకోసం ఈ ఏడాది మొదటి ప్రయత్నంలో భాగంగా రూ.350 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
ఇక ఆన్లైన్లో పీఎఫ్ చెల్లించొచ్చు
న్యూఢిల్లీ: వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలు తమ ఉద్యోగుల ఫీఎఫ్ చందాల డబ్బును ఇకపై ఏ బ్యాంకు ద్వారానైనా ఆన్లైన్లోనే భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)కు చెల్లించేందుకు వీలు కానుంది. ప్రస్తుతం ఎస్బీఐలో ఉద్యోగుల ఖాతాలున్న కంపెనీల నుంచి మాత్రమే పీఎఫ్ డబ్బులను ఆన్లైన్లో ఈపీఎఫ్‌వో స్వీకరిస్తోంది. మరో ఆరు నెలల్లో ఎస్బీఐ యేతర బ్యాంకుల్లో ఖాతాలున్న ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు కూడా ఆన్లైన్లో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖకు ఈపీఎఫ్‌వో ఓ లేఖలో తెలిపింది.