యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేసుకోవడానికి జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటించింది . "యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ కోసం గడువును 2025 ఫిబ్రవరి 15 వరకు పొడిగించాం" అని ఫిబ్రవరి 2 నాటి సర్క్యులర్‌లో ఈపీఎఫ్‌వో పేర్కొంది.
యూఏఎన్ అంటే..?
యూఏఎన్ లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఈపీఎఫ్‌వో ద్వారా సభ్యులకు కేటాయించే ఒక విశిష్టమైన 12-అంకెల సంఖ్య. ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహరణకు కీలకం. ఇది వివిధ కంపెనీల నుండి అన్ని ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది. ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేసుకోవడంలో సహాయపడుతుంది.
యూఏఎన్ సురక్షిత ప్రామాణీకరణ ద్వారా ఖాతా సమాచారం, లావాదేవీలు రెండింటినీ రక్షిస్తూ భద్రతను పెంచుతుంది. అంతేకాకుండా వివిధ కంపెనీల కింద సృష్టించిన ఎక్కువ పీఎఫ్ ఖాతాలను ఏకీకృతం చేసే ఇబ్బందిని తొలగిస్తూ, ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. యూఏఎన్ జనరేట్ చేయడానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గుర్తింపు రుజువు (పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి), చిరునామా రుజువు, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి ఉన్నాయి.
ఈఎల్‌ఐ పథకం
సంఘటిత రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా 2024 బడ్జెట్‌లో ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి అటు యాజమాన్యాలతోపాటు ఇటు మొదటిసారి ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్రయోజనాలను పొందడానికి ప్రతిఒక్కరూ ఈపీఎఫ్‌వోలో నమోదు చేసుకోవాలి.
ప్రస్తుతం మూడు ఈఎల్‌ఐ పథకాలు ఉన్నాయి. వాటిలో స్కీమ్-ఎ అనేది మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది. స్కీమ్-బి తయారీ రంగంలోని కార్మికులకు, , స్కీమ్-సి యాజమాన్యాలకు మద్దతు అందిస్తుంది. ఈపీఎఫ్‌వోకి సంబంధించిన ఈఎల్‌ఐ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యాఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment