North Indians
-
నీడనిచ్చే చెట్టుకే తిట్లు
బొమ్మనహళ్లి: బెంగళూరులో కొంతమంది చిల్లర ప్రవర్తన ఆ వర్గాలకు చెందిన అందరికీ చెడ్డ పేరు తెచ్చేలా ఉంటోంది. పైగా వారు చదువుకుని ఉన్నత వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. ఇక్కడ ఉపాధి, ఉద్యోగాలు పొంది జీవితంలో ముందుకు సాగుతూ, పైగా రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి వల్ల సమాజంలో కలతలు వస్తున్నాయి. మేం వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అని.. ఉత్తర భారత ప్రాంతాలకు చెందిన తాము బెంగళూరుకు రాకపోతే బెంగళూరు మొత్తం ఖాళీ గా ఉంటుంది. ఇక్కడి నుంచి తాము వెళ్లిపోవాలని అంటూ ఉంటారు. మేం వెళ్లిపోతే ఇక్కడ ఏమీ ఉండదు. మీకు ఆదాయం రాదు. పీజీ హాస్టళ్లు, పబ్‌లు వెలవెలబోతాయి అని సుగంధ శర్మ అనే మహిళ రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది. బెంగళూరుకు వలస వచ్చిన సుగంధ శర్మ.. బెంగళూరు గురించి, ఇక్కడి ప్రజల గురించి ఇన్‌స్టాలో చులకనగా వీడియోలు, రీల్స్ చేసింది, దానిని చూసిన కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్తలు, రచయితలు వంటివారు ఆమె చేష్టలను ఖండించారు. మొదట మీరు మా బెంగళూరును వదిలి వెళ్ళండి, నగరం ఎలా ఖాళీ అవుతుందో చూస్తాము అని అనేకమంది ఆమెకు ఘాటుగా సమాధానాలిచ్చారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం కన్నడ పోరాట సంఘం నాయకుడు రూపేష్ రాజన్న, ఆప్ నాయకులు ఆమె ప్రవర్తనపై మండిపడ్డారు. ఆమె పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొడుతోందని కోరమంగళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వేలాది మంది నుంచి తీవ్ర నిరసనలు రావడంతో సుగంధ శర్మ దిగివచ్చింది. ఐ లవ్ బెంగళూరు అని మరో వీడియో పోస్టు పెట్టి ప్రజల కోపాన్ని చల్లబరిచే యత్నం చేశారు. కంపెనీ, పోలీసులు ఆమెపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. -
మూగజీవాలకు పెళ్లి విందు, రూ.65వేలతో ఏర్పాటు
నెల్లూరు:మనదేశంలో పెళ్లిళ్లు భారీ ఎత్తున, హంగు ఆర్భాటాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.కానీ కరోనా కారణంగా కాబోయే నూతన వధువరులు పెళ్లి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో బాధితులకు, మూగ జీవాలకు అండగా నిలుస్తున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మానవాళి మనుగడ ప్రశ్నర్థకంగా మార్చింది. ఈ సమయంలో పలువురు దాతలు... పేదలు, కార్మికులు, నిర్వాసితులకు పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నారు.ఈ క్లిష్ట సమయంలో మూగ జీవాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఆహారం కోసం అల్లాడిపోతున్నాయి. సరైన తిండి, తాగునీరు దొరక్క అలమటించిపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నూతన వధువరులు తమ పెళ్లి సందర్భంగా మూగ జీవాలకు పెళ్లి విందును ఏర్పాటు చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ ఇండియాకు చెందిన ఓ కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటుంది. అయితే కుటుంబంలో నిఖిల్ - రక్షల వివాహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధువరులు జిల్లాకు చెందిన జంతు సంరక్షణ శాలలో మూగ జీవాలకు రూ.60వేలతో పెళ్లి విందును ఏర్పాటు చేశారు. జంతు సంరక్షణశాలలో ఉన్న గోవులు, వానరం, కోళ్లు, కుందేళ్లు ఇలా అన్నీ మూగ జీవాలకు ఆహారాన్ని అందించారు. మూగజీవాలపై ప్రేమను చాటుకున్నారు. A marriage held at a GOSHALA in Nellore, Andhra by a North Indian fmly at a total cost of just Rs. 65,000 feeding only animals n inmates pic.twitter.com/O2B7cYhzoN — S K Raman 🇮🇳 (@S_K_Raman) June 5, 2021 -
‘మా వల్లే సంపన్నులై.. మాకే ఓటు వేయరా?’: మంత్రి
చెన్నె: తమిళనాడులో ఇటీవల ఎన్నికలు ముగిసి రాజకీయంగా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో ఉత్తర భారతీయులపై తమిళనాడు కొత్త మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. డీఎంకే పార్టీ వలనే ఉత్తర భారతీయులు సంపన్నులు అయ్యారని.. అయితే వారు మాత్రం తమకు మోసం చేశారని తెలిపారు. చెన్నెలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి పీఎస్ శేఖర్‌బాబు మాట్లాడుతూ.. ‘తమిళనాడులో నివసిస్తున్న ఉత్తర భారతీయులు డీఎంకే చేసిన కార్యక్రమాలు, పనులతో సంపాదించుకుని ధనవంతులు అయ్యారు. అయితే వారు మాత్రం ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు. ఈవీఎంలలో ఓటు వేసినా ఎవరికి వేశారో తెలుసుకోవచ్చు. వారు ఇప్పుడే కాదు 2011 నుంచి ఇప్పటివరకు పార్టీకి ఓటు వేయడం లేదు. మనకు ఓటేయకున్నా వారికి సహాయం చేయండి. వారు అపరాధభావంతో సిగ్గుపడేలా చేయండి. వారు ఎప్పటికైనా తమ తప్పులను గ్రహించి సిగ్గుపడతారు’ అని పేర్కొన్నారు. డీఎంకే జిల్లా కార్యదర్శిగా ఉన్న పీఎస్ శేఖర్ బాబు హర్బర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాడు. శేఖర్ బాబు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సన్నిహితుడు. చెన్నెలోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తర భారతీయులు స్థిరపడడంతో వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. -
ఉత్తరాది శూద్రులలో వినూత్న మార్పు
ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన జాట్లు హరిత విప్లవ ప్రధాన ఏజెంట్లుగా అవతరించారు కానీ పారిశ్రామికవేత్తలు కాలేకపోయారు. ఉత్తరాది శూద్రకులాలు చాలావరకు భారీగా వృద్ధిచెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనుంచి ప్రయోజనాలు పొందలేకపోయాయి. సంఘటితమైన, ఆధునిక విద్యా కృషి లోపించిన కారణంగానే ఢిల్లీలోని అత్యున్నత స్థానాల్లో తమకు ఎలాంటి వాటా లేదని, ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ ఆధికార వ్యవస్థలను నిర్వహిస్తున్న జాట్లు, గుజ్జర్లు అర్థం చేసుకున్నారు. భారీస్థాయి ప్రయివేటీకరణ ఎజెండా ముఖ్య ఉద్దేశం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు కేటాయిస్తూ వస్తున్న ఉద్యోగాలను తీసివేయడమేనని రైతునేత టికాయత్ స్పష్టంగా గుర్తించినట్లుంది. ఇది ఉత్తరాది శూద్రుల్లో వినూత్న మార్పునకు చిహ్నం. ‘ది శూద్రాస్–విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకాన్ని ఉత్తర భారతీయ రైతునేత రాకేష్ టికాయిత్ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుని కనిపించిన దృశ్యం భారతీయ, ప్రత్యేకించి ఉత్తర భారత వ్యవసాయ కుల సామాజిక, రాజకీయ చైతన్యంలో ఒక కొత్త మార్పును సూచిస్తోంది. మండల్ రాజ కీయ మేధోమథనం అనంతరం ఉత్తర భారతీయ శూద్రులు.. ప్రత్యేకించి జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు మితవాద మానవ శక్తికి, ఓటు శక్తికి వెన్నెముకగా మారారు. జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మరాఠాలు తదితర శూద్రులందరినీ ఇతర వెనుకబడిన వర్గాలుగా మండల్ కమిషన్ నివేదిక నిర్వచించింది. తద్వారా శూద్ర అనే చారిత్రక వర్గీకరణను రాజ్యాంగ వర్గీకరణగా మార్చివేసింది. ఆధునిక విద్యకు దూరమవడం ఓ శాపం కానీ ఇతర ఆధిపత్య వ్యవసాయ కులాలు ప్రత్యేకించి ఢిల్లీ చుట్టుపట్ల ఉంటున్న జాట్లు, గుజ్జర్లు ఓబీసీ కేటగిరీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కారణం ఓబీసీలు సామాజిక ఉన్నతి వైపు కాకుండా అధోగతి వైపు పయనిస్తున్నట్లు వీరు భావించారు. 1990ల ప్రారంభంలో వ్యవసాయ కమ్యూనిటీలకు చెందిన గ్రామీణ మేధావులు తమకు క్షత్రియ ప్రతిపత్తిని కోరుకున్నారు.. ఎందుకంటే క్షత్రియులు చారిత్రకంగా పాలకులుగా ఉండేవారు. అయితే ఒక్కో శూద్ర కులం నుంచి మేధో వర్గాన్ని ఉత్పత్తి చేస్తున్న రిజర్వేషన్ల పాత్రను వీరు అర్థం చేసుకోలేకపోయారు. యూనివర్సిటీ, కాలేజీ విద్య అందులోనూ ఇంగ్లిష్ మాధ్యమంలో కొనసాగే విద్య, ఉన్నతాధికార బలం కలిసిన ఫలితం గణనీయమైన సంఖ్యలో గుజ్జర్లు, జాట్ల హస్తగతం అవుతూ వచ్చింది. ఒక్కో కులంలోని నూతన ఇంగ్లిష్ విద్యాధిక వర్గం ఢిల్లీ అధికార వ్యవస్థను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను పోషించడమే కాకుండా, దళితులు, ఇతర మైనారిటీల పట్ల వారి వైఖరిని కూడా మార్చేసింది. తమకున్న బలమైన వ్యవసాయ పునాది అధికారాన్ని, జ్ఞానాన్ని తమకు కట్టబెడుతుందని, ఆవిధంగా క్షత్రియ ప్రతిపత్తిని తాము సాధించవచ్చని జాట్లు భావించారు. ఆవిధంగా తమ పునాది తనంతటతానుగా జాతీయ స్థాయిలో రాజకీయాధికారాన్ని తమకు కట్టబెడుతుందని వారు తలిచారు. కానీ వారి అంచనా పూర్తిగా తప్పని రుజువైపోయింది. ఉన్నత విద్యాలయాల్లోనూ స్థానం కరువే జాట్లు, గుజ్జర్లు వంటి రిజర్వేషన్ పరిధిలో లేని శూద్రకులాలు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో కీలక పాత్ర పోషించగలిగే స్థాయి మేధావులను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ కులాలు జాతీయ, అంతర్జాతీయ దార్శనికతతో కూడిన రాజకీయ నేతలను ఉత్పత్తి చేయలేకపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం ఉంది. ద్విజులలాగా జాట్లు, గుజ్జర్లు ఇంగ్లిష్ విద్యాధిక మేధావులను రూపొందించలేకపోయారు. ఇప్పుడు, అధికార చట్రాల్లో జాట్, గుజ్జర్ లేక ఇతర శూద్ర వ్యవసాయ కులాల పాత్ర పెద్దగా లేకుండానే ఢిల్లీ పాలనా యంత్రాంగాలను మితవాద శక్తులు నిర్వహిస్తూండటంతో ఒక సరికొత్త జాగరూకత ఏర్పడింది. విషాదకరమైన విషయం ఏమిటంటే ఆలిగర్, జామియా మిలియా ఇస్లామియా వంటి ముస్లిం మైనారిటీలు నిర్వహిస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సైతం శూద్ర ఫ్యాకల్టీ సభ్యులు చాలా పరిమితంగా ఉండటమే. శూద్రుల్లో పారిశ్రామికవేత్తలు శూన్యం మైనారిటీ వ్యతిరేక ఎజెండా కోసం శూద్రులను ఉపయోగించుకుంటూ వచ్చారు తప్పితే జాతీయ స్థాయి వ్యవస్థల్లో అధికారాన్ని పంచుకోవడానికి కొద్దిపాటి శూద్ర మేధావులను కూడా అనుమతించకుండా వచ్చారు. ద్విజులు అధికారంలోకి వచ్చాక శూద్రులను మరింతగా వెనక్కి నెట్టేస్తూ వచ్చారు. ఈ రచయిత సంపాదకత్వంలో వచ్చిన ‘ది శూద్రాస్ –విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ పుస్తకం.. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రిలు, క్షత్రియులను ద్విజులుగా నిర్వచించింది. ఈ కులాల్లో ఎవరికీ ఆహారధాన్యాలు లేక ఇతర వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో ఎలాంటి పాత్రా లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన జాట్లు హరిత విప్లవ ప్రధాన ఏజెం ట్లుగా అవతరించారు. కానీ వీరు పారిశ్రామికవేత్తలు కాలేకపోయారు. ఈ పుస్తకంలోని క్యాస్ట్ అండ్ పొలిటికల్ ఎకానమీ అనే అధ్యాయంలో, శూద్ర టీమ్ అధ్యయనం అత్యంత స్పష్టంగా చిత్రించినట్లుగా, దేశంలోని శూద్రకులాలు చాలావరకు భారీగా వృద్ధిచెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనుంచి ప్రయోజనాలు పొందలేకపోయారు. సంఘటితమైన, ఆధునిక విద్యా కృషి లోపించిన కారణంగానే ఢిల్లీలోని అత్యున్నత స్థానాల్లో తమకు ఎలాంటి వాటా లేదని, ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ ఆధికార వ్యవస్థలను నిర్వహిస్తున్న జాట్లు, గుజ్జర్లు అర్థం చేసుకున్నారు. చివరకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా జాట్లకు తగినంత ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ద్విజుల ఆధిపత్యంపై పోరాడేందుకు వీరికి శూద్ర అస్తిత్వం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది. ఇక్కడే ఈ పుస్తకం ప్రాధాన్యతను రైతు నేత రాకేష్ టికాయత్ గుర్తించినట్లు కనబడుతోంది. రిజర్వేషన్ అనుకూల వైఖరి సరికొత్త మార్పు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం చివరలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో జాట్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. భారీస్థాయి ప్రయివేటీకరణ ఎజెండా ముఖ్య ఉద్దేశం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు కేటాయిస్తూ వస్తున్న ఉద్యోగాలను తీసివేయడమే (డీ–రిజర్వ్)నని రైతునేత టికాయత్ స్పష్టంగా గుర్తించినట్లుంది. అందుకే జాట్ ప్రజలు తమ కులాన్ని కూడా రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని ఇప్పుడు బలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఆధిపత్యస్థానంలో ఉన్న మితవాద శక్తులు రిజర్వేషన్ వ్యవస్థనే తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. గుండెకు హత్తుకున్న శూద్ర చైతన్యం ఈ పుస్తకం దేశంలోని శూద్రులందరిలో తీవ్రమైన చర్చను ప్రేరేపిస్తోంది. వీరందరూ తమ శూద్రమూలాలను ఇకనుంచీ హుందాతో, గౌరవంతో స్వీకరించక తప్పదు. ‘ది శూద్రాస్–విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకాన్ని రైతు నేత రాకేష్ టికాయిత్ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుని కనిపిస్తున్న దృశ్యం ఉత్తర భారతీయ శూద్రులలో ఒక నూతన మానసికస్థితిని సూచిస్తోంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఉత్తరాది వారిలో నైపుణ్యం లేదు
లక్నో: దేశంలో తగిన ఉపాధి అవకాశాలు ఉన్నాయని.. వాటికి కావాల్సిన నైపుణ్యాలు ఉత్తరాది ప్రజల్లో ఉండటం లేదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించే రిక్రూటర్లు ఇదే విషయంపై తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రాయ్‌బరేలీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో నిరుద్యోగం గురించి వార్తలు వస్తున్నాయి. వీటిని విశ్లేషణ చేశాను. దేశంలో ఉద్యోగాలకు కొరత లేదు. కానీ కావాల్సిన అర్హులే ఉండటం లేదు. ఇదే విషయంపై పలువురు రిక్రూటర్లు నాకు ఫిర్యాదు చేశారు’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆర్థిక మందగమనం వల్ల జాబుల సంఖ్య తగ్గిపోతుందనే విషయం నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కేంద్ర మంత్రి నిరుద్యోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. -
ముంబైకి వచ్చే రైళ్లన్నీ ఖాళీగా వెళ్తాయి!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో నివసిస్తున్న ఉత్తర భారతీయులను ఉద్దేశించి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇతర రాష్ట్రాలకు వలస వచ్చి మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీకు ఆత్మగౌరవం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలోని ఉత్తర భారతీయ మహాపంచాయత్ ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి రాజ్ ఠాక్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... ‘భారతదేశానికి అత్యధిక మంది ప్రధానులను అందించిన ఘనత ఉత్తరప్రదేశ్‌కు ఉంది. ప్రస్తుత ప్రధాని కూడా అక్కడి(వారణాసి) నుంచి ఎన్నికైన వారే. కానీ ఆ రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఉద్యోగాలు, ఉపాధి లేక మీరంతా ముంబైకి వస్తున్నారు. యూపీతో పాటు బిహార్, జార్ఖండ్, బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఉపాధి కోసం ఇక్కడికే వస్తారు. మీకు, మీ నాయకులకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే ముఖ్యమంత్రి, ప్రధానులను నిలదీస్తారు. మీకు చెందాల్సినవి దక్కించుకుంటారు. కానీ అలా జరగడం లేదు. ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి.. మీరు ఎక్కడికైతే వలస వెళ్లి బతుకుతున్నారో అక్కడి స్థానిక భాషలను, సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలి’ అని రాజ్ ఠాక్రే సభికులకు సూచించారు. ముంబైకి వచ్చే రైళ్లన్నీ ఖాళీగా వెళ్తాయి! ‘ముంబైకి రోజూ సుమారు 48 రైళ్లు నిండుగా వస్తాయి. కానీ తిరిగి వెళ్లేప్పుడు మాత్రం ఖాళీగా వెళ్తాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిటీ కెపాసిటీ ఎంత.. ఇక్కడ నివసిస్తున్న జనాభా ఎంత. ఈ స్థాయిలో వలసలు కొనసాగితే మహారాష్ట్ర పరిస్థితి ఏం కావాలి. నిజమే మీరు బతుకుదెరువు కోసమే వస్తున్నారు. కానీ మహారాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా’ అంటూ రాజ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిపై తనకు వ్యక్తిగతంగా కక్ష లేదని, కాకపోతే తమ రాష్ట్ర ప్రజల బాగుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎక్కువ మంది ప్రజలకు ఈ విషయం చేరాలనే ఉద్దేశంతోనే తాను హిందీలో మాట్లాడుతున్నానని తెలిపారు. -
అనుమానించి.. హతమార్చి
‘వారు ఉత్తరాది వ్యక్తులా.. అయితే కొట్టి చంపేయి. అనుమానంగావ్యవహరిస్తున్నారా.. హతమార్చేయి’. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ధోరణినడుస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ప్రజలు నిర్ధాక్షిణ్యంగా నలుగురి ప్రాణాలు తీశారు. మరోఆరుగురిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలుజేశారు. చిన్నారులనుఅపహరించే ఉత్తరాది ముఠా రాష్ట్రంలో తిరుగుతోందనే ప్రచారమే ఈదురాగతాలకు కారణమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: వీధుల్లో సంచరిస్తూ చిన్నారులను ఎత్తుకెళ్లే ఉత్తరాది ముఠా రాష్ట్రంలో తిష్టవేసి ఉందనే వార్త ఇటీవల వాట్సాప్‌లో వైరలైంది. మొదట్లో ఇది కేవలం పుకార్లని ప్రజలు కొట్టిపారేశారు. అయితే సామాజిక మాధ్యమాల్లో పదేపదే ఈ సమాచారం ప్రచారం కావడంతో ప్రజలు భీతిల్లడం ప్రారంభించారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు కనపడితే మరింత అనుమానంగా చూడడం మొదలెట్టారు. వేసవి సెలవులు కావడంతో పలు ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులకు ఇళ్లకు వచ్చిన పిల్లలు వీధుల్లో ఆడుకోవడంతో ఇదే అవకాశంగా తమ పిల్లలను ఎక్కడ ఎత్తుకెళతారోననే భయం రానురానూ ప్రజల్లో పెరిగిపోయింది. గ్రామాల్లోకి కొత్త మనుషులు వస్తే వారిని వెంబడించి దారుణమైన తీరులో దాడులకు పాల్పడడంతో సుమారు పదిమందికి పైగా ఉత్తరాది వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు మృత్యువాతపడ్డారు. గుడియాత్తంలో వారం క్రితం జరిగిన వివాహ వేడుకలో వంటపని నిమిత్తం ఉత్తరాది యువకుడు ఒకరు వచ్చాడు. రోడ్డుపై నడిచి వెళుతుండగా అతడిని దొంగగా అనుమానించి ప్రజలు రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 30వ తేదీన ఎంవీకుప్పంలో ముగ్గురు ఉత్తరాది మహిళలను కిడ్నాప్ ముఠాగా అనుమానించి తీవ్రంగా కొట్టారు. వేలూరు, ఆరణి సేదరంపట్టు గ్రామాల్లో ఉత్తరాది యువకులను కొట్టి తరిమేశారు. వేలూరు జిల్లా వానియంబాడి, రాణీపేట, భాగ్యం, చెన్నై, షోళింగనల్లూరుల్లో యువకులను విద్యుత్ స్తంభానికి కట్టివేసి దాడికి పాల్ప డ్డారు. తమిళనాడు వాసులకు తప్పని తిప్పలు ఇదిలా ఉండగా, ప్రజల్లో నెలకొన్న కిడ్నాప్ ముఠా భయానికి తమిళనాడుకు చెందిన వారు సైతం బాధితులుగా మారిపోతున్నారు. చెన్నై పల్లవరానికి చెందిన రుక్మిణి అమ్మాల్ (51) తన బంధువులతో కలసి తిరువన్నామలై పోరూర్ సమీపంలోని ఆలయంలో కులదైవాన్ని కొలుచుకుని తిరుగు ప్రయాణంలో చిన్నారులకు చాకెట్లు పంచడంతో ఆమెను కిడ్నాప్ ముఠాగా అనుమానించారు. ప్రజలంతా చుట్టూచేరి విచక్షణారహితంగా దాడులు చేయడంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమెతో ఉన్న వారిని దారుణంగా కొట్టారు. ఈ సంఘటనకు బాధ్యులైన 62 మందిపై హత్య, హత్యాయత్నం కేసులు పెట్టి 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో39 మంది కోసం గాలిస్తున్నారు. పళవేర్కాడులో మరో వ్యక్తి బలి రుక్మిణీ అమ్మాల్ సంఘటన నుంచి రాష్ట్రం తేరుకోకముందే తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులో బుధవారం జరిగిన ఇదేరకమైన సంఘటనలో గుర్తుతెలియని వ్యక్తి ప్రజల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వ్యక్తి పళవేర్కాడుకు వచ్చి అనేక వీ«ధుల్లో తిరగడం ప్రారంభించాడు. అతడిని గమనించిన స్థానికులు నిలదీయడంతో స్పష్టమైన సమాధానం చెప్పలేదు. దీంతో అతడు పిల్లలను ఎత్తుకుపోయేవాడని నిర్ధారించుకుని రోడ్డునపడేసి కాళ్లూ, చేతులతో చితక్కొట్టారు. బలహీనంగా ఉన్న అతను ప్రజలకొట్టిన దెబ్బలకు స్పృహతప్పి కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. ఆ మృతదేహన్ని ఒక తాడుకు కట్టి పళవేర్కాడు చెరువుకు సమీపంలోని ఫ్లై్లవోవర్ బ్రిడ్జికి వేలాడదీశారు. ఇంతలో ఈ సమాచారం పోలీసులకు చేరడంతో శవాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. మానసిక వైకల్యం కలిగిన ఆ యువకుడు కొన్ని రోజుల్లో పళవేర్కాడులో సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. తిరుమలైవనం పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు పాల్పడినవారి కోసం గాలింపు చేపట్టారు. ఈలోగా పొన్నేరిలో కిడ్నాప్ ముఠా రహస్యంగా దాక్కుని ఉన్నట్లు కలకలం రేగింది. పొన్నేరి పోలీస్‌స్టేషన్ సమీపంలోని చెట్ల పొదల్లో ముఠా ఉన్నట్లు అనుమానించిన సుమారు 500 మంది యువకులు గుమికూడి బుధవారం రాత్రి టార్చ్లైట్ల వెలుగులో వెతికారు. ఎవరూ కనపడకపోవడంతో లోన ఎవరైనా ఉంటే బయటకు రప్పిచేందుకు చెట్లపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనుమానితులపై ప్రజలే దాడులు చేయడం, కొట్టి చంపడం వంటి సంఘటనలతో పోలీస్‌శాఖ బెంబేలెత్తిపోతోంది. భయం భయంగా ఉత్తరాది యువకులు తమ ఊర్లలో ఉద్యోగాలు లేక ఉపాధి నిమిత్తం వందల సంఖ్యలో ఉత్తరాది యువకులు తమిళనాడులో బతుకుతున్నారు. ఉత్తరాదికి చెందిన బిక్షమెత్తుకునేవారు, వీధుల్లో తిరుగుతూ వస్తువులను అమ్మే చిన్నపాటì వ్యాపారం, మానసిక రోగులు, హిజ్రాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దీంతో పొట్టకూటి కోసం తమిళనాడులో పనిచేసుకుంటున్న ఉత్తరాది వారు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఉత్తరాది వారిని ఉద్యోగాలకు పెట్టుకున్న సంస్థలు వారికి గుర్తింపుకార్డును జారీ చేస్తే దాడుల నుంచి వారికి రక్షణ లభిస్తుందని పోలీసులు సూచించారు. ఉత్తరాది వ్యక్తులు కనపడితే పట్టుకుని అప్పగించండి, దాడులు చేయవద్దని ప్రజల్లో ప్రచారం చేస్తోంది. -
బార్బర్లుగా మారిన నార్త్ ఇండియా ముస్లింలు
-
దక్కన్ ఉత్తర్
భాగ్యనగరంలో ఉత్తరాది పరిమళం గుబాళించింది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు, నగరంలోని ఇతర చెరువులు పుష్కరఘాట్లను తలపించాయి. ఉత్తర భారతీయులు భక్తి శ్రద్ధలతో చేసుకునే ఛఠ్ పూజ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఏటా కార్తీక శుద్ధ షష్టి రోజు జరిగే ఈ వేడుకులో నగరంలో స్థిరపడిన ఉత్తరాదివాసులు ఉత్సాహంగా పాల్గొంటారు. సూర్యాస్తమయ సమయంలో ప్రత్యక్ష నారాయణుడికి ప్రత్యేక పూజలు చేసి మహిళలు ఉపవాస దీక్ష చేపడతారు. ఈ రోజు సూర్యోదయం తర్వాత ఆదిత్యుడికి మళ్లీ పూజలు చేసి దీక్షను విరమిస్తారు. -
సంప్రదాయ వేడుక ‘ఛట్’
గాజులరామారం: నగరంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు వారి సంప్రదాయ వేడుక ‘ఛట్’ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, అస్సాం, బెంగాలీలతో పాటు నేపాల్‌లో కూడా ఈ వేడుక జరుపుకుంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వాసులు తమ పండుగల్లో ప్రధాన పండుగగా కుటుంబ సంక్షేమంతో పాటు భగవంతుడికి కృతజ్ఞతగా ఈ వేడుక జరుపుకుంటారు. బుధవారం నుంచి ఈ వేడుక జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. సూర్య భగవానుడికి ప్రసాదం కార్తీక మాసంలో ఆరో రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రకృతికి సంబంధించిన పూజ. సూర్య భగవానుడిని పూజిస్తారు. మోకాలి లోతు నీటిలో నిలబడి సూర్యుడికి ప్రసాదాలను సమర్పించడం ఈ వేడుక విశిష్టత. వెదురు చాటలో పూలు, పళ్లు ఉంచి నదిలో వదిలిపెట్టి ప్రకృతికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజా విధానం... ఛట్ పూజలు ప్రధానంగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఇష్టమైన వారు ఈ పూజ చేసుకోవచ్చు. వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాస దీక్షతో పాటు తీసుకునే ఆహారంలో నియమాలు పాటిస్తారు. మొదటి రోజును సహాయ్ కాయ్, రెండో రోజును ఖర్న, మూడోరోజును పేహలా ఆర్గ్య్, నాల్గో రోజును పార్నాగా వ్యవహరిస్తారు. మూడు, నాలుగో రోజు నది వద్ద పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రసాదం పంచుతారు. పూజతో లాభాలు... హిందూ పురాణాలు, ఆచారాల ప్రకారం ఛట్ పూజలతో భగవంతుని ఆశీస్సులు లభిస్తాయనేది నమ్మకం. వ్రతంలో ఆచరించే పద్ధతులతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, సూర్యోదయం, సంధ్యా సమయంలో నదిలో స్నానం ఆచరించడం వల్ల చర్మ సంబంధిత బాధలు తొలగిపోతాయి. చారిత్రక కథనం వ్రతానికి సంబంధించి పురాణాల్లో అనేక కథనాలున్నాయి. పూర్వం ప్రియాబ్రత్ అనే రాజుకు సంతానం లేకపోతే కశ్యప మహర్షి ఆశీస్సులతో యజ్ఞం చేయగా రాజు భార్య మాలినికి మృత శిశువు జన్మించడంతో ఆత్మహత్యకు సిద్ధమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై ఛట్ వ్రతం ఆచరించమంటాడు. రాజు వ్రతాన్ని ఆచరించి తిరిగి సంతానం పొందాడు అనేది కథనం. ద్వాపర యుగంలో పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కురుక్షేత్రంలో గెలుపొందారనేది మరో కథనం. -
తూర్పులో విజయం సాధిస్తా: బీజేపీ అభ్యర్థి
భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలోని 137-తూర్పు నియోజక వర్గంలో తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి సంతోష్ ఎం. శెట్టి ధీమా వ్యక్తం చేశారు. అత్యధికంగా తెలుగు ప్రజలు స్థిరపడిన కామత్‌ఘర్, భాగ్యనగర్, గణేష్‌నగర్, రాజీవ్‌గాంధీ నగర్, ఆశ్వీద్‌నగర్, పేవా గావ్, మాన్సరోవర్ ప్రాంతాలల్లో బుధవారం మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే అన్ని ప్రాంతాలల్లో బీజేపీని గెలిపించి ప్రధాన మంత్రికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. తనకు తెలుగు ప్రజల మద్దత్తో పాటు కొందరు మరాఠీ, ముస్లింలు, గుజరాతీ, ఉత్తర భారతీయులు కూడా మద్దతు ఇస్తున్నారని అన్నారు. భివండీలో బీజేపీ విజయం సాధిస్తేనే పట్టణ అభివృద్ధి సుసాధ్యమని అన్నారు. ఈ ర్యాలీలో అత్యధికంగా తెలుగు ప్రజలతో పాటు ఆర్.పి.ఐ. పట్టణ అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్, బీజేపీ కార్పొరేటర్లు నిలేష్ చౌదరి, హనుమాన్ చౌదరి, లక్ష్మీ పాటిల్‌తో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
అంతా మనోళ్లే!
ముంబై: ఈసారి ఎన్నికల్లో భారీ ఓట్లతో సత్తా చూపాలనే పట్టుదలతో ఉన్న మహరాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) రాష్ట్రంలోని ఉత్తరాది ఓట్లపై దృష్టి పెట్టింది. ఉత్తరాది వారి వ్యతిరేక పార్టీ అనే ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘ఎమ్మెన్నెస్ ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. రాజ్‌ఠాక్రే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించడం వల్ల అక్కడి వాళ్లు మా పార్టీపై దురభిప్రాయం ఏర్పరుచుకున్నారు. అందుకే ముంబైలోని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలతో మాట్లాడి వారిలోని దురాభిప్రాయాలను తొలగించాలని ఆయన నన్ను కోరారు. మహారాష్ట్ర అభివృద్ధే రాజ్ ధ్యేయమన్న విషయాన్ని వారికి నేను స్పష్టం చేస్తాను’ అని ఎమ్మెన్నెస్ అధిపతి సన్నిహితుడు, వాగీశ్ సారస్వత్ అన్నారు. సినీ కళాకారుల సంక్షేమం కోసం గత నెల ఎమ్మెన్నెస్ నిర్వహించిన కార్యక్రమానికి కూడా అమితాబ్ బచ్చన్ ఆహ్వానించడాన్ని గమనిస్తే ఈ పార్టీ ఉత్తరాది వారికి దగ్గర కావడానికి యత్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దీనిపై వాగీశ్ స్పందిస్తూ ఉత్తరాది వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నంగా దీనిని చూడకూడదని, మహారాష్ట్ర తన కర్మభూమి అని అమితాబ్ ప్రకటించడమేగాక, ఆ కార్యక్రమంలో మరాఠీలోనే మాట్లాడారని వివరణ ఇచ్చారు. బచ్చన్‌కు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ‘ఆయన ముంబైలో ఉంటూ ఇతర రాష్ట్రాల ప్రచారకర్తగా వ్యవహరించడాన్నే మేం తప్పుపట్టాం. అయితే ఆయన ముంబైతోపాటు మహారాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. మేం ఉత్తరాది వారిని ఎప్పుడూ హింసించలేదు. అయితే మరాఠీల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం ఊరుకోం’ అని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. వాళ్లు మహారాష్ట్ర, మరాఠీని గౌరవిస్తే తామూ అభిమానిస్తామన్నారు. అయితే మరాఠీలను ‘కామధేను’గా భావించి దోపిడీ చేసే విధానాన్ని ఉత్తరాది ప్రజలు వదులుకోవాలని ఎమ్మెన్నెస్ ఉపాధ్యక్షుడు కూడా అయిన వాగీశ్ కోరారు. ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడి మరాఠీల మద్దతు సంపాదించడానికి రాజ్ ప్రయత్నించారని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన దగ్గర అజెండా ఏదీ లేదన్న ఆరోపణలను ఖండించారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే ఉత్తరాది వాసులకు ఎర్రతివాచీ పరుస్తామని, సంఘవ్యతిరేక శక్తులతో పోరాడుతామని ఆయన అన్నారు. తమ పార్టీ రాజకీయ కార్యకలాపాలకు ప్రచారం తేవడానికి గిమ్మిక్కులకు పాల్పడబోమన్నారు. ‘కరువు పీడిత ప్రాంతాల్లో తొలిసారిగా పర్యటించిన రాజకీయ నాయకుడే రాజ్‌ఠాక్రేనే. అక్కడ పశుదాణా శిబిరాలు, రైతుల కోసం సంక్షేమనిధిని ఏర్పాటు చేశారు. రాజ్ ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక సంబంధాల సైట్లలో అందుబాటులో ఉండరు. ఆయన సామాజిక సంబంధాల ద్వారానే ప్రజలకు దగ్గరవుతారు. గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెన్నెస్ ప్రాబల్యం ఇప్పుడు బాగా పెరిగింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరిన్ని సీట్లలో పోటీ చేస్తాం. అయితే వేరే పార్టీలతో పొత్తులపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీనిపై రాజ్‌ఠాక్రేనే తుది నిర్ణయం తీసుకుంటారు’ అని వాగేశ్ సారస్వత్ వివరించారు. బీజేపీ, శివసేన నేతృత్వంలోని మహాకూటమిలో ఎమ్మెన్నెస్‌ను చేర్చుకునేందుకు ఆ రెండు పార్టీలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం తెలిసిందే. రాజ్ వ్యాఖ్యలపై ‘ఆప్’ అసంతృప్తి ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కొత్త పార్టీఅని, అది ఢిల్లీలో విజయం సాధించడం యాదృచ్ఛికం అంటూ రాజ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఆప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన అమర్యాదకరంగా మాట్లాడారని, అటువంటి వ్యాఖ్యలపై తాము స్పందించబోమని తెలిపింది. రాజ్ స్థాయికి తాము దిగజారబోమని ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ ముంబైలో శుక్రవారం అన్నారు. మహారాష్ట్రలో తమదే అత్యంత ప్రాబల్యమున్న పార్టీ అని, ఆప్‌కు ఇక్కడ అవకాశమే లేదని మూడు రోజుల క్రితం మీడియా సమావేశంలో రాజ్ అన్నారు. శివసేన నాయకుడు మనోహర్ జోషి కుమారుడు ఉన్మేశ్ జోషితో రాజ్‌కు ఉన్న వ్యాపార సంబంధాలపై గాంధీ స్పందిస్తూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందని ఆరోపించారు. ఇదిలా ఉంటే ముంబైకర్లకు చేరువకావడానికి ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 26 వరకు 10 లక్షల సభ్యత్వాల సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు మయాంక్ గాంధీ తెలిపారు. -
కొల్హాపూర్‌లో ఉద్రిక్తత
సాక్షి, ముంబై: కొల్హాపూర్‌లో రెండున్నరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఆఘాయిత్యానికి పాల్పడింది జార్ఖండ్ వాసి కావడంతో రెచ్చిపోయిన శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ కార్యకర్తలు నగరంలోని మరాఠేతరులపై సోమవారం రాత్రి దాడికి దిగారు. వారు నిర్వహిస్తున్న దుకాణాలు, తోపుడు బండ్లను ధ్వంసం చేశారు. కర్రలతో ఎవరు కనబడితే వారిని చితకబాదారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని తెలిసింది. వివిధ వాహనాలు, తోపుడు బండ్లు, ఇళ్లలోని వస్తువులతోపాటు ఆస్తినష్టం వాటిల్లింది. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ (కేఎంటీ) బస్సులపై మంగళవారం కూడా దాడులు జరిగాయి. పలు ప్రాంతాల్లో బంద్ నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న సమయంలో ఈ కొల్హాపూర్ ఘటనతో మరోసారి మరాఠీ, మరాఠేతరుల అంశం వేడేక్కె అవకాశాలు ఏర్పడ్డాయి. కాగా, కొల్హాపూర్ లక్ష్మితీర్థ్ పరిసరాల్లో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రెండేళ్ల నాలుగు నెలల బాలికపై ఓ కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగువారు రాజేష్‌సింగ్ బబుల్‌సింగ్ (30)ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే ఈ విషయం ఒక్కసారిగా నగరవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. అత్యాచారానికి పాల్పడిన కామాందుడు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా తెలిసింది. నిందితుడు మరాఠేతరుడని తెలిసిన వెంటనే మరాఠేతరులపై శివసేన, ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడులకు దిగారు. సోమవారం అర్ధరాత్రి వరకు దాడులు జరిగాయి. మరాఠేతరుల వాహనాలు, తోపుడు బండ్లను ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా పలువురిని చితకబాదారు. ఇళ్లల్లో చొరబడి మరి దాడులు చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారందరూ చిన్నచితక కూలి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్న మరాఠేతర కార్మికులే. దీంతో ఒక్కసారిగా మరాఠేతరులందరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కొందరు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అత్యాచారం సంఘటన తో తమకు ఎలాంటి సంబంధంలేకున్నా తమపై దాడులు జరపడంపై ఎంతవరకు సమంజసమని కొందరు మరాఠేతరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.