ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన జాట్లు హరిత విప్లవ ప్రధాన ఏజెంట్లుగా అవతరించారు కానీ పారిశ్రామికవేత్తలు కాలేకపోయారు. ఉత్తరాది శూద్రకులాలు చాలావరకు భారీగా వృద్ధిచెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనుంచి ప్రయోజనాలు పొందలేకపోయాయి. సంఘటితమైన, ఆధునిక విద్యా కృషి లోపించిన కారణంగానే ఢిల్లీలోని అత్యున్నత స్థానాల్లో తమకు ఎలాంటి వాటా లేదని, ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ ఆధికార వ్యవస్థలను నిర్వహిస్తున్న జాట్లు, గుజ్జర్లు అర్థం చేసుకున్నారు. భారీస్థాయి ప్రయివేటీకరణ ఎజెండా ముఖ్య ఉద్దేశం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు కేటాయిస్తూ వస్తున్న ఉద్యోగాలను తీసివేయడమేనని రైతునేత టికాయత్ స్పష్టంగా గుర్తించినట్లుంది. ఇది ఉత్తరాది శూద్రుల్లో వినూత్న మార్పునకు చిహ్నం.
‘ది శూద్రాస్–విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకాన్ని ఉత్తర భారతీయ రైతునేత రాకేష్ టికాయిత్ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుని కనిపించిన దృశ్యం భారతీయ, ప్రత్యేకించి ఉత్తర భారత వ్యవసాయ కుల సామాజిక, రాజకీయ చైతన్యంలో ఒక కొత్త మార్పును సూచిస్తోంది. మండల్ రాజ కీయ మేధోమథనం అనంతరం ఉత్తర భారతీయ శూద్రులు.. ప్రత్యేకించి జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు మితవాద మానవ శక్తికి, ఓటు శక్తికి వెన్నెముకగా మారారు. జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మరాఠాలు తదితర శూద్రులందరినీ ఇతర వెనుకబడిన వర్గాలుగా మండల్ కమిషన్ నివేదిక నిర్వచించింది. తద్వారా శూద్ర అనే చారిత్రక వర్గీకరణను రాజ్యాంగ వర్గీకరణగా మార్చివేసింది.
ఆధునిక విద్యకు దూరమవడం ఓ శాపం
కానీ ఇతర ఆధిపత్య వ్యవసాయ కులాలు ప్రత్యేకించి ఢిల్లీ చుట్టుపట్ల ఉంటున్న జాట్లు, గుజ్జర్లు ఓబీసీ కేటగిరీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కారణం ఓబీసీలు సామాజిక ఉన్నతి వైపు కాకుండా అధోగతి వైపు పయనిస్తున్నట్లు వీరు భావించారు. 1990ల ప్రారంభంలో వ్యవసాయ కమ్యూనిటీలకు చెందిన గ్రామీణ మేధావులు తమకు క్షత్రియ ప్రతిపత్తిని కోరుకున్నారు.. ఎందుకంటే క్షత్రియులు చారిత్రకంగా పాలకులుగా ఉండేవారు.
అయితే ఒక్కో శూద్ర కులం నుంచి మేధో వర్గాన్ని ఉత్పత్తి చేస్తున్న రిజర్వేషన్ల పాత్రను వీరు అర్థం చేసుకోలేకపోయారు. యూనివర్సిటీ, కాలేజీ విద్య అందులోనూ ఇంగ్లిష్ మాధ్యమంలో కొనసాగే విద్య, ఉన్నతాధికార బలం కలిసిన ఫలితం గణనీయమైన సంఖ్యలో గుజ్జర్లు, జాట్ల హస్తగతం అవుతూ వచ్చింది. ఒక్కో కులంలోని నూతన ఇంగ్లిష్ విద్యాధిక వర్గం ఢిల్లీ అధికార వ్యవస్థను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను పోషించడమే కాకుండా, దళితులు, ఇతర మైనారిటీల పట్ల వారి వైఖరిని కూడా మార్చేసింది.
తమకున్న బలమైన వ్యవసాయ పునాది అధికారాన్ని, జ్ఞానాన్ని తమకు కట్టబెడుతుందని, ఆవిధంగా క్షత్రియ ప్రతిపత్తిని తాము సాధించవచ్చని జాట్లు భావించారు. ఆవిధంగా తమ పునాది తనంతటతానుగా జాతీయ స్థాయిలో రాజకీయాధికారాన్ని తమకు కట్టబెడుతుందని వారు తలిచారు. కానీ వారి అంచనా పూర్తిగా తప్పని రుజువైపోయింది.
ఉన్నత విద్యాలయాల్లోనూ స్థానం కరువే
జాట్లు, గుజ్జర్లు వంటి రిజర్వేషన్ పరిధిలో లేని శూద్రకులాలు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో కీలక పాత్ర పోషించగలిగే స్థాయి మేధావులను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ కులాలు జాతీయ, అంతర్జాతీయ దార్శనికతతో కూడిన రాజకీయ నేతలను ఉత్పత్తి చేయలేకపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం ఉంది. ద్విజులలాగా జాట్లు, గుజ్జర్లు ఇంగ్లిష్ విద్యాధిక మేధావులను రూపొందించలేకపోయారు.
ఇప్పుడు, అధికార చట్రాల్లో జాట్, గుజ్జర్ లేక ఇతర శూద్ర వ్యవసాయ కులాల పాత్ర పెద్దగా లేకుండానే ఢిల్లీ పాలనా యంత్రాంగాలను మితవాద శక్తులు నిర్వహిస్తూండటంతో ఒక సరికొత్త జాగరూకత ఏర్పడింది. విషాదకరమైన విషయం ఏమిటంటే ఆలిగర్, జామియా మిలియా ఇస్లామియా వంటి ముస్లిం మైనారిటీలు నిర్వహిస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సైతం శూద్ర ఫ్యాకల్టీ సభ్యులు చాలా పరిమితంగా ఉండటమే.
శూద్రుల్లో పారిశ్రామికవేత్తలు శూన్యం
మైనారిటీ వ్యతిరేక ఎజెండా కోసం శూద్రులను ఉపయోగించుకుంటూ వచ్చారు తప్పితే జాతీయ స్థాయి వ్యవస్థల్లో అధికారాన్ని పంచుకోవడానికి కొద్దిపాటి శూద్ర మేధావులను కూడా అనుమతించకుండా వచ్చారు. ద్విజులు అధికారంలోకి వచ్చాక శూద్రులను మరింతగా వెనక్కి నెట్టేస్తూ వచ్చారు. ఈ రచయిత సంపాదకత్వంలో వచ్చిన ‘ది శూద్రాస్ –విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ పుస్తకం.. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రిలు, క్షత్రియులను ద్విజులుగా నిర్వచించింది. ఈ కులాల్లో ఎవరికీ ఆహారధాన్యాలు లేక ఇతర వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో ఎలాంటి పాత్రా లేదు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన జాట్లు హరిత విప్లవ ప్రధాన ఏజెం ట్లుగా అవతరించారు. కానీ వీరు పారిశ్రామికవేత్తలు కాలేకపోయారు. ఈ పుస్తకంలోని క్యాస్ట్ అండ్ పొలిటికల్ ఎకానమీ అనే అధ్యాయంలో, శూద్ర టీమ్ అధ్యయనం అత్యంత స్పష్టంగా చిత్రించినట్లుగా, దేశంలోని శూద్రకులాలు చాలావరకు భారీగా వృద్ధిచెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనుంచి ప్రయోజనాలు పొందలేకపోయారు. సంఘటితమైన, ఆధునిక విద్యా కృషి లోపించిన కారణంగానే ఢిల్లీలోని అత్యున్నత స్థానాల్లో తమకు ఎలాంటి వాటా లేదని, ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ ఆధికార వ్యవస్థలను నిర్వహిస్తున్న జాట్లు, గుజ్జర్లు అర్థం చేసుకున్నారు.
చివరకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా జాట్లకు తగినంత ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ద్విజుల ఆధిపత్యంపై పోరాడేందుకు వీరికి శూద్ర అస్తిత్వం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది. ఇక్కడే ఈ పుస్తకం ప్రాధాన్యతను రైతు నేత రాకేష్ టికాయత్ గుర్తించినట్లు కనబడుతోంది.
రిజర్వేషన్ అనుకూల వైఖరి సరికొత్త మార్పు
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం చివరలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో జాట్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. భారీస్థాయి ప్రయివేటీకరణ ఎజెండా ముఖ్య ఉద్దేశం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు కేటాయిస్తూ వస్తున్న ఉద్యోగాలను తీసివేయడమే (డీ–రిజర్వ్)నని రైతునేత టికాయత్ స్పష్టంగా గుర్తించినట్లుంది. అందుకే జాట్ ప్రజలు తమ కులాన్ని కూడా రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని ఇప్పుడు బలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఆధిపత్యస్థానంలో ఉన్న మితవాద శక్తులు రిజర్వేషన్ వ్యవస్థనే తొలగించే ప్రయత్నంలో ఉన్నారు.
గుండెకు హత్తుకున్న శూద్ర చైతన్యం
ఈ పుస్తకం దేశంలోని శూద్రులందరిలో తీవ్రమైన చర్చను ప్రేరేపిస్తోంది. వీరందరూ తమ శూద్రమూలాలను ఇకనుంచీ హుందాతో, గౌరవంతో స్వీకరించక తప్పదు. ‘ది శూద్రాస్–విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకాన్ని రైతు నేత రాకేష్ టికాయిత్ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుని కనిపిస్తున్న దృశ్యం ఉత్తర భారతీయ శూద్రులలో ఒక నూతన మానసికస్థితిని సూచిస్తోంది.
వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్
ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
ఉత్తరాది శూద్రులలో వినూత్న మార్పు
Published Thu, Apr 29 2021 12:47 AM | Last Updated on Thu, Apr 29 2021 12:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment