అనుమానించి.. హతమార్చి | People Attack On South Indians In Tamil Nadu | Sakshi
Sakshi News home page

అనుమానించి.. హతమార్చి

Published Fri, May 11 2018 8:09 AM | Last Updated on Fri, Jul 27 2018 1:25 PM

People Attack On South Indians In Tamil Nadu - Sakshi

ధ్వంసమైన కారు , గ్రామస్తుల దాడిలో మృతి చెందిన వృద్ధురాలు రుక్మణి (ఫైల్‌)

‘వారు ఉత్తరాది వ్యక్తులా.. అయితే కొట్టి చంపేయి. అనుమానంగావ్యవహరిస్తున్నారా.. హతమార్చేయి’. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ధోరణినడుస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ప్రజలు నిర్ధాక్షిణ్యంగా నలుగురి ప్రాణాలు తీశారు. మరోఆరుగురిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలుజేశారు. చిన్నారులనుఅపహరించే ఉత్తరాది ముఠా రాష్ట్రంలో తిరుగుతోందనే ప్రచారమే ఈదురాగతాలకు కారణమైంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: వీధుల్లో సంచరిస్తూ చిన్నారులను ఎత్తుకెళ్లే ఉత్తరాది ముఠా రాష్ట్రంలో తిష్టవేసి ఉందనే వార్త ఇటీవల వాట్సాప్‌లో వైరలైంది. మొదట్లో ఇది కేవలం పుకార్లని ప్రజలు కొట్టిపారేశారు. అయితే సామాజిక మాధ్యమాల్లో పదేపదే ఈ సమాచారం ప్రచారం కావడంతో ప్రజలు భీతిల్లడం ప్రారంభించారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు కనపడితే మరింత అనుమానంగా చూడడం మొదలెట్టారు. వేసవి సెలవులు కావడంతో పలు ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులకు ఇళ్లకు వచ్చిన పిల్లలు వీధుల్లో ఆడుకోవడంతో ఇదే అవకాశంగా తమ పిల్లలను ఎక్కడ ఎత్తుకెళతారోననే భయం రానురానూ ప్రజల్లో పెరిగిపోయింది. గ్రామాల్లోకి కొత్త మనుషులు వస్తే వారిని వెంబడించి దారుణమైన తీరులో దాడులకు పాల్పడడంతో సుమారు పదిమందికి పైగా ఉత్తరాది వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు మృత్యువాతపడ్డారు. గుడియాత్తంలో వారం క్రితం జరిగిన వివాహ వేడుకలో వంటపని నిమిత్తం ఉత్తరాది యువకుడు ఒకరు వచ్చాడు. రోడ్డుపై నడిచి వెళుతుండగా అతడిని  దొంగగా అనుమానించి ప్రజలు రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత నెల 30వ తేదీన ఎంవీకుప్పంలో ముగ్గురు ఉత్తరాది మహిళలను కిడ్నాప్‌ ముఠాగా అనుమానించి తీవ్రంగా కొట్టారు. వేలూరు, ఆరణి సేదరంపట్టు గ్రామాల్లో ఉత్తరాది యువకులను కొట్టి తరిమేశారు. వేలూరు జిల్లా వానియంబాడి, రాణీపేట, భాగ్యం, చెన్నై, షోళింగనల్లూరుల్లో యువకులను విద్యుత్‌ స్తంభానికి కట్టివేసి దాడికి పాల్ప డ్డారు.

తమిళనాడు వాసులకు తప్పని తిప్పలు
ఇదిలా ఉండగా, ప్రజల్లో నెలకొన్న కిడ్నాప్‌ ముఠా భయానికి తమిళనాడుకు చెందిన వారు సైతం బాధితులుగా మారిపోతున్నారు. చెన్నై పల్లవరానికి చెందిన రుక్మిణి అమ్మాల్‌ (51) తన బంధువులతో కలసి తిరువన్నామలై పోరూర్‌ సమీపంలోని ఆలయంలో కులదైవాన్ని కొలుచుకుని తిరుగు ప్రయాణంలో చిన్నారులకు చాకెట్లు పంచడంతో ఆమెను కిడ్నాప్‌ ముఠాగా అనుమానించారు. ప్రజలంతా చుట్టూచేరి విచక్షణారహితంగా దాడులు చేయడంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమెతో ఉన్న వారిని దారుణంగా కొట్టారు. ఈ సంఘటనకు బాధ్యులైన 62 మందిపై హత్య, హత్యాయత్నం కేసులు పెట్టి 23 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో39 మంది కోసం గాలిస్తున్నారు.

పళవేర్కాడులో మరో వ్యక్తి బలి
రుక్మిణీ అమ్మాల్‌ సంఘటన నుంచి రాష్ట్రం తేరుకోకముందే తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులో బుధవారం జరిగిన ఇదేరకమైన సంఘటనలో గుర్తుతెలియని వ్యక్తి ప్రజల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వ్యక్తి పళవేర్కాడుకు వచ్చి అనేక వీ«ధుల్లో తిరగడం ప్రారంభించాడు. అతడిని గమనించిన స్థానికులు నిలదీయడంతో స్పష్టమైన సమాధానం చెప్పలేదు. దీంతో అతడు పిల్లలను ఎత్తుకుపోయేవాడని నిర్ధారించుకుని రోడ్డునపడేసి కాళ్లూ, చేతులతో చితక్కొట్టారు. బలహీనంగా ఉన్న అతను ప్రజలకొట్టిన దెబ్బలకు స్పృహతప్పి కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు.  ఆ మృతదేహన్ని ఒక తాడుకు కట్టి పళవేర్కాడు చెరువుకు సమీపంలోని ఫ్లై్లవోవర్‌ బ్రిడ్జికి వేలాడదీశారు. ఇంతలో ఈ సమాచారం పోలీసులకు చేరడంతో శవాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. మానసిక వైకల్యం కలిగిన ఆ యువకుడు కొన్ని రోజుల్లో పళవేర్కాడులో సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. తిరుమలైవనం పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు పాల్పడినవారి కోసం గాలింపు చేపట్టారు.
ఈలోగా పొన్నేరిలో కిడ్నాప్‌ ముఠా రహస్యంగా దాక్కుని ఉన్నట్లు కలకలం రేగింది. పొన్నేరి పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని చెట్ల పొదల్లో ముఠా ఉన్నట్లు అనుమానించిన సుమారు 500 మంది యువకులు గుమికూడి బుధవారం రాత్రి టార్చ్‌లైట్ల వెలుగులో వెతికారు. ఎవరూ కనపడకపోవడంతో లోన ఎవరైనా ఉంటే బయటకు రప్పిచేందుకు చెట్లపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనుమానితులపై ప్రజలే దాడులు చేయడం, కొట్టి చంపడం వంటి సంఘటనలతో పోలీస్‌శాఖ బెంబేలెత్తిపోతోంది.

భయం భయంగా ఉత్తరాది యువకులు
తమ ఊర్లలో ఉద్యోగాలు లేక ఉపాధి నిమిత్తం వందల సంఖ్యలో ఉత్తరాది యువకులు తమిళనాడులో బతుకుతున్నారు. ఉత్తరాదికి చెందిన బిక్షమెత్తుకునేవారు, వీధుల్లో తిరుగుతూ వస్తువులను అమ్మే చిన్నపాటì వ్యాపారం, మానసిక రోగులు, హిజ్రాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దీంతో పొట్టకూటి కోసం తమిళనాడులో పనిచేసుకుంటున్న ఉత్తరాది వారు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఉత్తరాది వారిని ఉద్యోగాలకు పెట్టుకున్న సంస్థలు వారికి గుర్తింపుకార్డును జారీ చేస్తే దాడుల నుంచి వారికి రక్షణ లభిస్తుందని పోలీసులు సూచించారు. ఉత్తరాది వ్యక్తులు కనపడితే పట్టుకుని అప్పగించండి, దాడులు చేయవద్దని ప్రజల్లో ప్రచారం చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement