job loss
-
మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు!
2024 ప్రారంభం నుంచి లే ఆప్స్ సాగుతూనే ఉన్నాయి. గత నెలలో (జనవరి) మాత్రమే 32వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు.. లేఆఫ్-ట్రాకింగ్ వెబ్సైట్ Layoffs.fyi డేటా ఆధారంగా తెలిసింది. అయితే ఈ నెలలో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా 'నైక్' (Nike) కంపెనీ ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. కంపెనీ లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, ఖర్చులు ఆదా చేయడంలో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది (1600 కంటే ఎక్కువ) సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలగింపులు ప్రక్రియ కూడా రెండు దశల్లో ఉంటుందని సమాచారం. 2023 మే 31 నాటికి నైక్ కంపెనీలో దాదాపు 83,700 మంది ఉద్యోగులు ఉన్నట్లు, ఇందులో 12000 మంది కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీ తొలగించనున్న ఉద్యోగులలో స్టోర్ ఉద్యోగులు, స్టోర్ మేనేజర్లు లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు.. మూడవ త్రైమాసికంలో ఉద్యోగుల ఖర్చుల ఖర్చులు 400 మిలియన్ డాలర్ల నుంచి 450 మిలియన్ డాలర్ల వరకు పెరిగింది. నైక్ కంపెనీ ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల ఉద్యోగుల తొలగింపుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంస్థ రానున్న రోజుల్లో లాభాలు ఆర్జించడానికి కావాల్సిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?
గతంలో ఫేస్బుక్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులలో ఒకరు ఇప్పుడు ఓ సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఏడాదికి ఏకంగా రూ.27 కోట్లు సంపాదిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ కంపెనీ స్టార్ట్ చేసాడనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 2005లో ఫేస్బుక్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసిన 'నోహ్ కాగన్'.. టెక్ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరాలని కలలు కన్నారు. అయితే కంపెనీ సమాచారం మీడియాకు లీక్ చేశారనే ఆరోపణల కారణంగా ఫేస్బుక్ సంస్థ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత బాగా అలోచించి సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఫేస్బుక్, ఇంటెల్, మింట్.కామ్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్న నోహ్ కాగన్ 2010లో సొంత డిస్కౌంట్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ 'యాప్‌సుమో' (AppSumo) ప్రారంభించారు. ప్రారంభంలో ఆశించిన లాభాలు రాకపోయినప్పటికీ పట్టు వదలకుండా కృషి చేసారు. అంకిత భావంతో పనిచేయడంతో కంపెనీ లాభాల వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. గత సంవత్సరం యాప్‌సుమో 80 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇందులో లాభమే 7 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. అంటే ఇతనికి వచ్చిన లాభం భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 27 కోట్లు. ఇదీ చదవండి: సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం ఇజ్రాయల్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన కగన్ టెక్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నారు. తాను ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయాలన్నట్లు 'నోహ్ కాగన్' వెల్లడించారు. అప్పట్లో బిల్ గేట్స్ ఐకానిక్ పర్సన్ అని.. ఆయనకు ప్రభావితమై ఆయన బాటలోనే నడవాలని అనుకోవడం వల్లనే టెక్ ప్రపంచంలో అడుగులు వేసినట్లు తెలిపారు. -
కొత్త ఏడాదిలోనూ భారీ లేఆఫ్‌లు! కలవరపెడుతున్న లేటెస్ట్ సర్వే
Layoffs in 2024: లక్షలాది తొలగింపులతో ఈ ఏడాదంతా అష్టకష్టాలు పడిన ఉద్యోగులు కొత్త సంవత్సరంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నూతన ఏడాదిలో పరిస్థితులన్నీ చక్కబడతాయని భావిస్తున్న తరుణంలో ఉద్యోగులను కలపెట్టేలా ఓ లేటెస్ట్ సర్వే వెలువడింది. దీని ప్రకారం.. 2024లో భారీ తొలగింపులు ఉండనున్నాయి. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’ ఈ సర్వే నిర్వహించింది. ఈ నెలలో 900 కంటే ఎక్కువ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిస్పందనల ఆధారంగా ఈ తాజా సమాచారాన్ని ప్రకటించించింది. ఈ సర్వేలో పాల్గొన్న 10 కంపెనీలలో దాదాపు నాలుగు కంపెనీలు 2024లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని చెప్పాయి. అలాగే సగానికి పైగా కంపెనీలు 2024లో హైరింగ్ ఫ్రీజ్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. కారణాలివే.. ఎందుకు లేఆఫ్‌లు చేపడుతున్నారని అడిగినప్పుడు, సగం కంపెనీలు మాంద్యం అంచనా ఒక కారణమని చెప్పాయి. కొంచెం తక్కువగా అంటే 10 కంపెనీల్లో నాలుగు తాము ఉద్యోగులను తొలగించి ఆ స్థానాలను కృత్రిమ మేధస్సు (AI)తో భర్తీ చేయనున్నట్లు తెలిపాయి. ఏఐ యాడ్ టెక్కి అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలోని 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2023లో ఇప్పటికే తమ కంపెనీలు 30 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్లు చెప్పిన మెజారిటీ బిజినెస్ లీడర్లు 2024లోనూ 30 శాతం మందికిపైగానే తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీల వారీగా.. కొత్త సంవత్సరంలో అధిక సంఖ్యలో కంపెనీలు తొలగింపులు చేపడతాయని చెబుతున్నప్పటికీ అన్ని కంపెనీల్లో లేఆఫ్‌లు ఉంటాయని కాదు. చిన్న కంపెనీలతో పోలిస్తే మధ్యతరహా, పెద్ద కంపెనీలలో తేడాలున్నాయి. మధ్యతరహా కంపెనీల్లో 42 శాతం, పెద్ద కంపెనీల్లో 39 శాతం తొలగింపులు ఉంటాయని సూచించగా, చిన్న కంపెనీల్లో 28 శాతం మాత్రమే లేఆఫ్‌లు ఉంటాయని ఆ కంపెనీల లీడర్లు వెల్లడించారు. ఈ కంపెనీల్లోనే అత్యధికం పరిశ్రమల వారీగా నిర్మాణ, సాఫ్ట్వేర్ కంపెనీలు వరసగా 66 శాతం, 65 శాతం సిబ్బందిని వచ్చే సంవత్సరంలో తొలగించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్, రిటైల్, ఫైనాన్స్, బీమా కంపెనీల్లోనూ కొంత మేర లేఆఫ్‌ల గందరగోళం నెలకొంది. ఇన్ఫర్మేషన్, రిటైల్ కంపెనీలు 44 శాతం, ఫైనాన్స్ కంపెనీలు 38 శాతం లేఆఫ్‌లను చేపట్టనున్నట్లు చెబుతున్నాయి. -
అమెరికాలో లక్షల ఉద్యోగాల కోత..! సీబీఓ సంచలన రిపోర్ట్
అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది నిరుద్యోగిత రేటు పెరుగుతుందని 'కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్' (CBO) రిపోర్ట్ విడుదల చేసింది. 2024లో యూఎస్ఏలో ఎంత శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది? దీనికి ప్రధాన కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) డిసెంబర్ 15న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఉన్న 3.9 శాతం నిరుద్యోగిత రేటు 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని అంచనా. అంటే వచ్చే ఏడాదికి మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి వస్తుందని సీబీఓ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎగుమతులు తగ్గే అవకాశం ఉందని, పెట్టుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయని, NRIల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయని సీబీఓ అంచనా వేసింది. ఈ కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 18.70 లక్షల మంది నిరుద్యోగ ప్రయోజనాలను పొందుతున్నట్లు, రానున్న రోజుల్లో 2.02 లక్షల మంది అదనంగా ఇలాంటి ప్రయోజనాలను పొందటానికి అప్లై చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం 2024లో అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు సుమారు 2.1 శాతానికి తగ్గుతుందని యూఎస్ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఫెడ్ లక్ష్యం కూడా 2 శాతానికి చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగానే 2024లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే.. ఆర్ధిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినే అవకాశం లేదని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజా నిజాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. -
ఉద్యోగాలు పోతాయన్న భయం భారతీయుల్లోనే ఎక్కువ..ఎందుకంటే..
అమెరికా, యూకే , జర్మనీలోని ఉద్యోగుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల తమ కొలువులు కోల్పోవడం పట్ల భారతీయ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. రాండ్‌స్టాడ్ వర్క్ మానిటర్ క్వాటర్లీ పల్స్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం..అభివృద్ధి చెందిన దేశాల్లోని ముగ్గురిలో ఒకరికి ఏఐ వల్ల తమ ఉద్యోగం పోతుందనే భయం ఉంది. కానీ భారతీయ ఉద్యోగుల్లో ఆ ఆందోళన ఇద్దరిలో ఒకరికి ఎక్కువగా ఉంది. భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన పెరగడానికి గల కారణాల్లో బీపీఓ, కేపీఓ రంగాల్లో పెద్ద సంఖ్యలో వర్క్‌ఫోర్స్ ఉండటం, ప్రత్యేకించి ఆ పనులన్నీ ఏఐతో ఆటోమేషన్ చేయడమేనని రాండ్‌స్టాడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ విశ్వనాథ్ తెలిపారు. ‘ఇండియా ప్రధానంగా సర్వీస్ ఆధారిత సేవలు అందిస్తుంది. అందులో భాగంగా దేశంలో చాలా కేపీఓ, బీపీఓలు నెలకొల్పారు. అయితే భారత్‌లో ఉద్యోగులు ఏఐని సమర్థవంతంగా ఆచరణలో పెట్టే సత్తా కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఏఐని స్వీకరించేది మన దేశంలోనే’ అని విశ్వనాథ్ అన్నారు. ఏఐ వల్ల కొన్ని రకాల కొలువులపై ప్రభావం ఉన్నా నిరంతరం తమ నిపుణ్యాలు పెంచుకునే ఉద్యోగులకు అపారఅవకాశాలు ఉంటాయన్నారు. (ఇదీ చదవండి: ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్..కారణం అదేనా..) రాండ్‌స్టాడ్ వర్క్ మానిటర్ ఎడిషన్ ద్వారా కార్మికుల నైపుణ్యాలు, సంస్థ డిమాండ్లు, ఏఐ ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశంలోని 1606 ఉద్యోగులపై సర్వే చేశారు. వీరిలో 55% మంది పురుషులు, 45% మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో ఏడుగురు ఏఐ వారి పరిశ్రమలు, ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని విశ్వసించారు. ఇదే సంఖ్యలో వారు నైపుణ్యాభివృద్ధి ఔచిత్యాన్ని గుర్తించారు. రాబోయే ఐదేళ్లలో తమ స్థానాల్లో కొనసాగాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడం చాలా అవసరం అని వారు నమ్ముతున్నారు. మెజారిటీ ఇప్పటికే తమ ప్రస్తుత ఉద్యోగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. అయితే కొన్ని సంస్థల యాజమాన్యాలు మాత్రం వచ్చే 12 నెలల్లో తమ నైపుణ్యాలు పెంచుకునేలా ఎలాంటి అభివృద్ధి అవకాశాలను అందించకపోతే ఉద్యోగాలను వదిలివేస్తామని చెప్పినట్లు సర్వేలో వెల్లడైంది. కృత్రిమ మేధతో ఉద్యోగాల ప్రభావం అనేది ఆయా రంగాల్లో వేర్వేరుగా ఉండనుంది. అత్యధికంగా ఐటీ, సాంకేతిక అక్షరాస్యత, మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ సంబంధించిన ఉద్యోగాలు, ఆటోమోటివ్/ ఏరోస్పేస్ పరిశ్రమ, ఆహార ఉత్పత్తుల తయారీ, ఆర్థిక సేవలను అందించే సంస్థలపై దీని ప్రభావం పడనుందని సర్వే తెలిపింది. -
4 నెలల్లో 11.2 కోట్ల ఉద్యోగాలు ఊడాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల పునరుద్ధరణకు వివిధ రకాలైన ప్రపంచ సంక్షోభాలు పెనుముప్పుగా మారాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘వరల్డ్ ఆఫ్ వర్క్ ’’ అనే అంశంపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ప్రపంచ దేశాల్లో పని గంటలు కరోనా సంక్షోభానికి ముందుతో (2019 నాలుగో క్వార్టర్) పోల్చి చూస్తే 3.8శాతం తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే 11.2 కోట్ల మధ్య ఉద్యోగాలు కోల్పోయి ఉండవచ్చునని అంచనా వేసింది. పని గంటల్లో జెండర్ గ్యాప్ పని గంటల్లో స్త్రీ, పురుష అంతరాలు బాగా పెరిగిపోతున్నాయని అభివృద్ధి చెందిన దేశాల కంటే అల్పాదాయ దేశాల్లో ఈ అంతరాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎల్ఒ నివేదిక వెల్లడించింది. భారత్‌లో మహిళలు చేసే పనిగంటలు బాగా తగ్గిపోయాయని పేర్కొంది. కరోనా సంక్షోభానికి ముందు పని చేసే ప్రతి 100 మంది మహిళల్లో సగటున 12.3 మంది మహిళలు కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు. అదే విధంగా ప్రతీ 100 మంది పురుషుల్లో 7.5 మందికి ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. దీనిని బట్టే భారత్‌లో స్త్రీ, పురుష అంతరాలు ఎంతలా ఉన్నాయో తెలుస్తోందని ఆ అధికారి వివరించారు. ధనిక దేశాల్లో గతంతో పోల్చి చూస్తే పని గంటలు పెరిగితే అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో తగ్గిపోతున్నాయంటూ ఐఎల్ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో స్త్రీ, పురుషుల మద్య అంతరాలు తొలగిపోవడానికి మరో 30 ఏళ్లు పడుతుందని ఐఎల్ఒ తెలిపింది. ఇక భారత్‌లో మహిళలకు గౌరవప్రదమైన ఉద్యోగాలు, సరైన జీతాలు లేకపోవడంతో ఈ అంతరాలు పెరిగిపోతున్నాయని దేశంలోని ట్రేడ్ యూనియన్లు విశ్లేషించాయి. ఉద్యోగాల కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మహిళలకు సామాజిక భద్రత లేకపోవడం వల్ల కూడా ఈ అంతరాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నాయి. పని గంటలు తగ్గిపోవడానికి కారణాలివే..! పని గంటలు తగ్గిపోవడానికి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎన్నో కారణాలను ఈ నివేదిక ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం, ముఖ్య ంగా చమురు, ఆహార ధాన్యాల ధరల పెరుగు దల, ఆర్థికసంక్షోభాలు, రుణ భారం, అంతర్జా తీయ సప్లయ్ చైన్‌లో అవరోధాలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ప్రభావం వంటివెన్నో పని గంటల్లో తగ్గించేశాయని ఐఎల్ఓ నివేదిక స్పష్టం చేసింది. చైనాలో ఈ ఏడాది కరోనా విజృంభణతో విధించిన లాక్డౌన్ల కారణంగానే 86% పని గంటల్లో ప్రభావం కనిపించిందని ఆ నివేదిక వెల్లడించింది. -
Private School Teachers: ప్రైవేట్ టీచర్లకు గురుదక్షిణ
సాక్షి, హైదరాబాద్: కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఎంతోమంది బతుకు చిత్రం ఛిద్రమైంది. మహమ్మారి శాంతించిందనే తరుణంలోనే సెకండ్ వేవ్ రూపేణా విరుచుకుపడింది. విద్యారంగాన్ని కకావికలం చేసింది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మళ్లీ మూతపడటంతో టీచర్లు, లెక్చరర్ల ఉపాధి అటకెక్కింది. వీరికి ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ అది అందరికీ చేరట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నగరవాసి సుధీర్ బికుమాండ్ల ‘గురుదక్షిణ’ పేరుతో ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నిత్యావసర సరుకులను అందిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కలచివేసిన కష్టాలు.. ► అందరి భవిష్యత్‌కు మార్గదర్శకులు గురువులే. అలాంటి వారి జీవితాలు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారాయి. ఉన్నపళంగా ఉద్యోగాలు పోవడం, మళ్లీ చేర్చుకునే అవకాశాలు కనిపించకపోవడంతో దిక్కులేని పక్షులే అయ్యారు. ఈ తరుణంలో ఉగాది రోజున ‘గురుదక్షిణ’ కార్యక్రమం మళ్లీ మొదలుపెట్టారు సుధీర్ బికుమాండ్ల. ► ఇప్పటికే 800 మందికిపైగా ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్లకు నిత్యావసర వస్తువులను అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సేవలను గతేడాది లాక్డౌన్లో ప్రారంభించి 2 వేల మందికిపైగా అందించినట్లు చెప్పారు. సెకండ్ వేవ్‌లో ఎందరో గురువులు కిరాణా షాపుల్లో పనిచేయడం, ఇంటింటికీ తిరిగి దినపత్రికలు వేయడం తనని కలచి వేసిందని, అందుకే తన అవసరాల కోసం దాచుకున్న లక్ష రూపాయలతో గురుదక్షిణ కార్యక్రమాన్ని పునఃప్రారంభించానన్నారు. ► తను అందించే కిట్‌లో 20 కేజీల బియ్యం, పప్పులు, నూనె, రవ్వ, చక్కెర, చింతపండుతో పాటు 14 రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయి. కర్మన్‌ఘాట్‌లోని ఇందిరా నాగేంద్ర థియేటర్ సమీపంలో ‘గురుదక్షిణ’ కేంద్రం ఉందని, అక్కడికి ప్రైవేట్ బోధనా సిబ్బంది ఎవరైనా సరే వచ్చి సరుకులు తీసుకోవచ్చని ఆయన సూచించారు. ► గురుదక్షిణ కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో తెలుసుకుని సుదూర ప్రాంతాల నుంచి టీచర్లు వస్తున్నారని వివరించారు. ముందుగానే ఉస్మానియా వర్సిటీ సహా పలు కాలేజీల్లో తిరిగి తన కార్యక్రమం గురించి వివరించినట్లు సుధీర్ బికుమాండ్ల చెప్పారు. (చదవండి: ఉద్యోగుల ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన కరోనా మహమ్మారి ) -
కొలువు పోయిందా... సగం జీతం తీసుకో!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారా..? ఇలాంటి వారికి కొత్తగా మరో ఉద్యోగం దొరికేవరకు తాత్కా లిక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఏబీవీకేవై) పథకం కింద 3 నెలల పాటు సగం జీతం ఇచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ పథకం కనీసం రెండేళ్ల సీనియర్ ఈఎస్ఐ చందాదారులైన వారికి మాత్రమే వర్తిస్తుంది. కోవిడ్–19 వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 24 నుంచి లాక్డౌన్ విధించింది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ లాక్డౌన్... ఆ తర్వాత దశలవారీగా అన్‌లాక్ నిబంధనలతో పలు వ్యాపారాలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు ఏకంగా 50శాతం ఉద్యోగాలను కోతపెట్టాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పలువురు నిరుద్యోగులుగా మారారు. వారికి కుటుంబపోషణ భారమైంది. ఈ పరిస్థితిని సమీక్షించిన కేంద్ర కార్మిక శాఖ ఇలాంటి వారికి నిరుద్యోగ పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. నెల తర్వాత దరఖాస్తు... ఏదేని కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కోవిడ్–19 కారణంగా జాబ్ కోల్పోతే నెలరోజుల తర్వాత ఈ పథకానికి అర్హత సాధిస్తాడు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, ఈఎస్ఐసీ వివరాలతో ఆన్లైన్లో ఈఎస్ఐసీ పోర్టల్‌లో దర ఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మాన్యువల్ పద్ధతిలో ఈఎస్ఐసీ కార్యాలయంలో కూడా ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులో యాజమాన్యం నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. దరఖాస్తు పరిశీలించిన అనంతరం లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో ఈ నగదును జమ చేస్తారు. నిర్దేశించిన గరిష్ట గడువులోగా ఉద్యోగం వెతుక్కునేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది. సాయంగా సగం జీతం... ఏబీవీకేవై పథక కింద లబ్ధిదారులకు నెలలో సగం జీతాన్ని సాయంగా ఇస్తారు. ఈ పథ కం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి వరుసగా రెండేళ్ల పాటు ఈఎస్ఐ చందా చెల్లిస్తూ ఉం డాలి. ఆ వ్యక్తి రెండేళ్ల వేతనాన్ని రోజువారీ వేతన రూపంలో లెక్కించిన తర్వాత... నెల లో పదిహేను రోజుల భత్యాన్ని లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈఎస్ఐసీ నిబంధనల్లో ఈ వెసులుబాటు ఒక ఉద్యోగి తన జీవిత కాలంలో ఒకేసారి వినియోగించుకునే వీలుంది. సగం జీతం ఇచ్చే నిబంధన ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో వచ్చిన దరఖాస్తులకు మా త్రమే వర్తిస్తుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చే దర ఖాస్తులకు 25 శాతం వేతనాన్ని ఇస్తారు. -
మహమ్మారితో భారమైన బతుకుబండి..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేక ఉసూరుమంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సంగంవిహార్ ప్రాంతంలో లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు తిరిగి వాటిల్లో కుదురుకుంటామనే ఆశలు ఆవిరవడంతో చిరు వ్యాపారాల బాటపట్టారు. లాక్డౌన్ ప్రకటించకముందు తమ కుమారుడు ఓ షాపులో పనిచేస్తుండగా షాపు యజమాని తాము వేతనాలు చెల్లించలేమని చేతులెత్తేయడంతో కూరగాయలు విక్రయిస్తున్నాడని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన మరో కుమారుడు కూడా కూరగాయలు అమ్ముతున్నాడని, ఈ వ్యాపారంలో లాభాలు అంతంతమాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే ప్రాంతానికి చెందిన మరో మహిళ సైతం ఇలాంటి కష్టాలనే ఏకరువు పెట్టారు. లాక్డౌన్ ప్రకటించకముందు తమ భర్త కుటుంబాన్ని పోషించేందుకు డ్రైవర్‌గా పనిచేసేవాడని, లాక్‌డౌన్‌తో ఆ ఉద్యోగమూ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భర్త గుర్గావ్లో మాస్క్ తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు లాక్‌డౌన్‌తో తన రాబడి గణనీయంగా పడిపోయిందని, ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో అత్యవసరమైతేనే పనులకు పిలుస్తున్నారని చిన్నపాటి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే మరో స్థానికుడు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు కేవలం నిత్యావసరాల కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తుండటంతో తమ భర్త నిర్వహించే ఫుట్‌వేర్ షాప్ నష్టాల్లో సాగుతోందని మరో మహిళ తెలిపారు. దేశ రాజధాని సహా అన్ని ప్రాంతాల్లోనూ కరోనా ప్రభావంతో చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి నియంత్రణలోకి వచ్చి సాధారణ పరిస్థితి ఎప్పుడు నెలకొంటుందా అని వేచిచూస్తున్నారు. చదవండి: మూడురెట్లు పెరిగిన టెస్టింగ్ సామర్థ్యం -
ఉద్యోగం ఊడేలా ఉందా? ఇలా చేయండి..!
కరోనా కత్తి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులపై వేలాడుతోంది. మందగమన ప్రభావం వేగంగా వ్యాపించడంతో అన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత కరువైంది. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగాల కోతకు దిగాయి. దీంతో మధ్యతరగతి బతుకు ఇబ్బందుల్లో పడుతోంది. ఈ సంక్షోభం ఎంతవరకు ఉంటుందో? తర్వాతైన వెంటనే ఉపాధి దొరుకుంతుందో? లేదో?నని ప్రతి వేతన జీవి మధనపడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి ఉపాధి కోల్పోతే ఏం చేయాలనే విషయమై ఆలోచించిఉంచుకోవాలని, ఒక్కమారుగా రోడ్డునపడి అయోమయానికి గురికాకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉపాధి కోల్పోయే అవకాశం ఉందనుకొని ప్రతి ఉద్యోగి కొన్ని ప్లాన్స్ సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని భావించేవాళ్లు ఈ కింద చర్యలను పాటించి జాగ్రత్త వహించవచ్చని చెబుతున్నారు. 1. వ్యయాల వర్గీకరణ: రెండు నెలలుగా కుటుంబ వ్యయాలు కొంతమేర తగ్గి ఉంటాయి. దీంతో ప్రతినెలా మనం పెడుతున్న అనవసర వ్యయాలను గుర్తించే ఉంటారు. అందువల్ల ఇకపై నెలవారీ వ్యయాలను కేటగిరీలుగా వర్గీకరించుకోవాలి. ఉదాహరణకు స్థిర వ్యయాలు(అద్దె, స్కూలు ఫీజులు, ఇంటి నిర్వహణ తదితరాలు), తప్పని వ్యయాలు(ఆహారం, అవసరాలు, మందులు, పెట్రోల్లాంటివి), అదనపు వ్యయాలు(ఎంటర్టైన్మెంట్, షాపింగ్ తదితరాలు)గా విభజించుకొని వీటిలో అదనపు వ్యయాల్లాంటివాటిని నిర్ధాక్షణ్యంగా కట్ చేయాలి. 2. ఆపత్కాల నిధి ఏర్పాటు: ఇప్పటినుంచైనా ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆపత్కాల నిర్వహణకు పక్కనపెట్టాలి. ఎలాంటి అవసరానికైనా ఈ మొత్తం ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. నిధి పరిణామాన్ని మన ఆదాయాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక్కరే ఉద్యోగం చేసే ఇంట్లో ఆరు నెలల ఖర్చులకు సరిపడ మొత్తాన్ని, ఇద్దరు ఉద్యోగులుంటే 9 నెలలకు సరిపడ మొత్తాన్ని ఆపత్కాల నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు వీలైతే మెడికల్ ఫండ్ విడిగా ఏర్పరుచుకోవాలి. మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉన్నా, విడిగా మరో మొత్తం వైద్యావసరాలకు పక్కన పెట్టడం మంచిది. 3. అప్పుల కుప్ప కరిగించడం: ముందుగా కుటుంబానికి ఉన్న మొత్తం అప్పులు లెక్కించి వీటిలో అధిక వడ్డీలు కడుతున్నవాటిని వీలయినంత త్వరగా వదిలించుకోవాలి. దీంతోపాటు పర్సనల్ లోన్లు, క్రెడిట్‌కార్డు రుణాలను తీర్చేయడం మంచిది. దీర్ఘకాలిక ఈఎంఐలు ఉండే హౌస్‌లోన్ లాంటివి కొనసాగించవచ్చు. అప్పులు తీర్చేందుకు వీలుంటే ఏదో ఒక స్థిరాస్తి విక్రయించైనా బయటపడడం ఉత్తమం. ఆర్బీఐ అనుమతిచ్చిందని అనవసరంగా మారిటోరియం ఆప్షన్ ఎంచుకోవద్దు. తప్పని పరిస్థితుల్లోనే ఈ ఆప్షన్‌ను పరిశీలించాలి. 4. బీమా- ధీమా: ఆపదలో ఆదుకునే ఇన్స్యూరెన్స్ పథకాలను కొనసాగించాలి. ముఖ్యంగా లైఫ్, హెల్త్ బీమాలను ఆపకపోవడం చాలా అవసరం. వాహన ఇన్య్సూరెన్స్లను కూడా డిఫాల్ట్కాకుండా చెల్లించడం ఉపయుక్తంగా ఉంటుంది. 5. నమోషీ వద్దు: అనుకోకుండా ఉద్యోగం కోల్పోవడం మీ తప్పు కాదని గ్రహించండి. ఇందుకు నామోషీగా ఫీల్కానక్కర్లేదు. అలాంటిది జరిగితే కుటుంబ సభ్యులకు పరిస్థితి కూలంకషంగా వివరించండి. ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు మీరు చేపట్టిన ప్రణాళికలు చెప్పి, వారి నుంచి అవసర సలహాలు స్వీకరించండి. 6. అదనపు నైపుణ్యాలు: పరిస్థితుల కారణంగా ఉద్యోగం పోతే దిగులుపడుతూ కూర్చునే బదులు కొత్త ఉద్యోగం దొరికేవరకు అదనపు నైపుణ్యాలు సంపాదించుకోవడం మంచిది. ఇలాంటి సమయాల్లో కొత్త కోర్సులు లేదా కొత్త భాష నేర్చుకోవడం, కొత్త వ్యాపార రహస్యాలు(ఉదాహరణకు స్టాక్‌మార్కెట్) అధ్యయనం చేయడం, శారీరక ఆరోగ్యాన్ని సముపార్జించడం(దుర్వ్యసనాలు మానుకోవడం, ఫిట్నెస్ సాధించడం) ద్వారా డిప్రెషన్‌కు గురికాకుండా ఉండొచ్చు. అనుకోని అవాతరం ఎదురైనప్పుడు మనం ఎంత తొందరగా పాజిటివ్‌గా స్పందిస్తామనేదాన్ని బట్టి మన భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అందువల్ల గతం తలచి వగచే కన్నా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే యత్నాలు చేయడం శ్రేయస్కరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సంక్షోభాన్ని సరికొత్త అవకాశంగా భావించేవాడే విజేతగా నిలుస్తాడు. ‘‘ సరైన సంక్షోభాన్ని చేజారనీయకండి’’- విన్స్టన్ చర్చిల్. -
షాకింగ్ : కూలనున్న ఐదు లక్షల కొలువులు..
సాక్షి, న్యూఢిల్లీ : నిర్మాణ రంగం కుదేలైన క్రమంలో రానున్న రెండేళ్లలో రియల్ఎస్టేట్ ఇతర అనుబంధ రంగాల్లో భారీగా కొలువుల కోత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మాణ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో ఆయా కంపెనీలు లేవని, తీవ్ర నగదు కొరత బ్యాంకింగ్, నిర్మాణ రంగాలకు సమస్యగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకులు నిర్మాణ రంగానికి తాజా రుణాలను నిలిపివేసే పరిస్థితి నెలకొనడం రియల్ఎస్టేట్ రంగంలో సమస్యలు పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయిన గృహాలు, వెంచర్లలో పలు యూనిట్లు విక్రయానికి నోచుకోకుండా ఉన్నాయని, భారీగా డిస్కౌంట్లను ఆఫర్ చేసినా ఇన్వెంటరీలు పేరుకుపోయాయని నిర్మాణ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా రూ 1.8 లక్షల కోట్ల విలువైన నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. నిర్మాణ రంగంలో స్ధబ్ధత కారణంగా దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంచనా వేసింది. ఇక సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ పరిశ్రమలోనూ పెద్దసంఖ్యలో పరోక్ష ఉద్యోగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. గృహాలు, అపార్ట్మెంట్ల కొనుగోలుకు వినియోగదారులు దూరంగా ఉండటంతో తక్కువ అద్దెలు, పెట్టుబడి పెరుగుదల ప్రతికూలంగా ఉంటుందనే అంచనాతో ఇన్వెస్టర్లు సైతం ఆస్తుల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న డెవలపర్లు వడ్డీ, ఈఎంఐల చెల్లింపులో డిఫాల్ట్ అవుతున్నారని పారాడిగ్మ్ రియల్టీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ మెహతా చెప్పారు. -
రెండు యూనిట్లు మూత: సైంటిస్టులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వరుస నష్టాలు లేదా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగులను తొలగించగా, ఫార్మ దిగ్గజం సన్‌ఫార్మ కూడా బాటలో ఇదే పయనిస్తోంది. రెండు యూనిట్లను మూసి వేయడంతో ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులను పెద్ద సంఖ్యలో తొలగించింది. క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలో పనిచేస్తున్న 85 మందికి ఉద్వాసన పలికింది. వడోదర ఆర్ అండ్ డి యూనిట్లలో పనిచేస్తున్న వీరిని ముందస్తు సమాచారం లేకుండానే వేటు వేసింది. ఇది ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. వడోదరలోని తాండల్జా, అకోటాలోని తమ రెండు కేంద్రాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాటిని బయో-ఈక్వెలెన్స్ స్టడీస్‌కు ఉపయోగించినట్టు చెప్పింది. అయితే, ఈ యూనిట్లలో తమ కార్యకలాపాలను నిలిపివేసి, ఇతర సౌకర్యాలకు మార్చామని సన్ ఫార్మాస్యూటికల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఆర్ అండ్ డి కార్యకలాపాలలో పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొంది. బయో-ఈక్వెలెన్స్ స్టడీస్ నిర్వహించే క్లినికల్ ఫార్మకాలజీ యూనిట్ల (సీపీయూ) సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి వడోదరలోని తాండల్జా, అకోటాలోని రెండు కేంద్రాలలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సన్‌ఫార్మ ప్రతినిధి చెప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల జీతం ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఉద్యోగులను నియంత్రించేందుకు బౌన్సర్లను వినియోగించారన్న వార్తలు సోషల్ మీడియాలోగుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను సన్‌ఫార్మ ఖండించింది. బాధిత ఉద్యోగులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. అవుట్‌ప్లేస్‌మెంట్ కోసం సహాయం చేస్తున్నామని ప్రకటించింది. నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తున్నామనీ రెగ్యులేటరీ అధికారులకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామనికూడా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. -
50 లక్షల ఉద్యోగాలు ఆవిరి
బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016–18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే ఉద్యోగావకాశాల క్షీణతకు పెద్ద నోట్ల రద్దుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్ 2016 నుంచే ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం అని పేర్కొంది. ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)–2019 పేరిట బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ–సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016–18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు. ఈ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారితోపాటు యువకులే అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇదేకాలంలో తక్కువ విద్యార్హత గల వారు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు ఆ స్థాయిలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గాయని తెలిపింది. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలను సృష్టించేందుకు కొన్ని పరిష్కార మార్గాలను నివేదికలో తాము సూచించామని అన్నారు. ‘మేము సూచించిన పరిష్కార మార్గాలు ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతోపాటు దేశంలోని అందరికీ సమానమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని బలంగా నమ్ముతున్నాం’అని పేర్కొన్నారు. పరిష్కార మార్గాలు.. ► దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. ► స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపై 6 శాతం, వైద్యంపై 3 శాతం అదనంగా ఖర్చు పెట్టగలిగితే సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించింది. అలాగే దీని ద్వారా అత్యంత నాణ్యమైన ప్రజా సేవలను అందించవచ్చని పేర్కొంది. ► భారతీయ తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
‘బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల కోత ఉండదు’
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంకు, విజయా బ్యాంక్‌లను.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జైట్లీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అతిపెద్ద సంస్థ ఏర్పడుతుందని.. ఫలితంగా రుణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయని ప్రకటించారు. కానీ బ్యాంకుల వద్ద ఉన్న ఎన్పీఏలు ఫలితంగా నష్టాలు వస్తున్నాయని తెలిపారు. దివాల చట్టం సాయంతో రూ. 3లక్షల కోట్లను తిరిగి వ్యవస్థలోకి తెవడమే కాక ఎన్పీఏలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కింద డిసెంబరు 31 నాటికి రూ. 51,533కోట్లను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు. దీని గురించి జైట్లీ ‘2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రూ. 65వేల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల రికాపిటలైజేషన్ కోసం కేటాయించాం. ఇందులో డిసెంబరు 31 నాటికి రూ. 51,533 కోట్లను బ్యాంకులకు ఇచ్చాం. ఎన్పీఏలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలను చవి చూస్తున్నాయి’ అని జైట్లీ తెలిపారు. -
ఆ నిర్ణయంతో 3 లక్షల ఉద్యోగాలు ఫట్!
సాక్షి, ముంబై : ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ప్లాస్టిక్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాత్రికి రాత్రి 3 లక్షల మంది ఉద్యోగులు వీధినపడ్డారని, రూ 15,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్పత్తిదారులు తమ యూనిట్లను మూసివేశారని ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారీదారుల సంఘం ప్రధాన కార్యదర్శి నీమిత్ పునామియా చెప్పారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో ఈ రంగంపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ బ్యాగులు, స్పూన్లు, ప్లేట్లు, పెట్ బాటిల్స్, థర్మాకోల్ ఐటెమ్స్ సహా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, వాడకం, అమ్మకం, సరఫఱా, నిల్వ చేయడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 23న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ ఉన్న నిల్వలను విక్రయించేందుకు ఇచ్చిన మూడు నెలల గడువు ఈనెల 23తో ముగిసింది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలు తగ్గిపోవడం రాష్ట్ర జీడీపీపై ప్రభావం చూపుతుందని, ప్లాస్టిక్ రంగం నుంచి బ్యాంకులకు రుణ బకాయిలు పేరుకుపోతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
ఏడు లక్షల ఉద్యోగాలు గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ : ఖాదీ, చేనేత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగాలు వదిలివేస్తున్నారా..? ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. చిన్న,మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం ఖాదీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2015-16, 2016-17 మధ్య 11.6 లక్షల నుంచి 4.6 లక్షలకు పడిపోయింది. ఆధునీకరణ ఫలితంగానే ఖాదీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఖాదీ ఉత్పత్తి 31.6 శాతం, అమ్మకాలు 33 శాతం పెరగడం గమనార్హం. నూతన తరహా చరఖాల ప్రవేశంతో కూడా ఖాదీ, చేనేత రంగంలో ఉద్యోగాలు గల్లంతయ్యాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పేర్కొంది. గతంలో నేతన్నలు వాడే సంప్రదాయ చరఖాలపై ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉండేదని, ఆధునిక చరఖాలతో పాతతరం నేత కళాకారులు ఈ వృత్తిని నిష్క్రమిస్తున్నారని సంస్థ వార్షిక నివేదిక పేర్కొంది. అయితే నూతన చరఖాల ఫలితంగా ఎన్ని ఉద్యోగాలు దెబ్బతిన్నాయనే దానిపై మంత్రిత్వ శాఖ, కమిషన్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఖాదీ, చేనేత రంగంలో కోల్పోయిన 6.8 లక్షల ఉద్యోగాల్లో 3.2 లక్షల ఉద్యోగాలు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్గర్, మధ్యప్రదేశ్‌లకు చెందినవి కాగా, బిహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయి. -
ఆటోమేషన్తో ఊడే ఉద్యోగాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్ రాకతో లక్షలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళనల నేపథ్యంలో రానున్న రెండు దశాబ్ధాల్లో ఏయే రంగాల్లో, ఏయే దేశాల్లో ఎక్కువగా కొలువులు కోల్పోతాయనే వివరాలను పీడబ్ల్యూసీ అథ్యయనం వెల్లడించింది. ఆటోమేషన్ ప్రభావాన్ని భిన్న కోణాల్లో ఈ అథ్యయనం విశ్లేషించింది. 2030 నాటికి ఆటోమేషన్ కారణంగా డ్రైవర్ రహిత వాహనాలు ముంచెత్తే క్రమంలో రవాణా, తయారీ రంగాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని, పెద్దసంఖ్యలో ఉద్యోగాలు దెబ్బతింటాయని లెక్కగట్టింది. ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో మానవవనరులకు డిమాండ్ తగ్గుతుందని పేర్కొంది. డేటా అనాలిసిస్, అలాగరిథమ్స్ కారణంగా కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందని పసిగట్టింది. ఐటీ, నిర్మాణ రంగాల్లోనూ ఆటోమేషన్ రిస్క్ అధికంగా ఉందని పేర్కొంది. అయితే విద్య, వైద్య రంగాల్లో ఆటోమేషన్ ప్రభావం పెద్దగా ఉండబోదని తెలిసింది. ఆటోమేషన్ ముప్పు తప్పించుకోవాలంటే అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవాలని స్పష్టం చేసింది. సరైన విద్యార్హతలు లేనివారు దీర్ఘకాలంలో రిస్క్ ఎదుర్కొంటారని హెచ్చరించింది. క్లరికల్ ఉద్యోగాలు చేపట్టే మహిళల ఉద్యోగాలు ఆటోమేషన్ కారణంగా ముప్పును ఎదుర్కొంటాయని తెలిపింది. -
నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్!
-
నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్!
పెద్దనోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వృద్ధి 1 శాతం తగ్గిపోతుందని, దాంతో వచ్చే సంవత్సరం దాదాపు 4 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ-కామర్స్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు పోవచ్చని, రాబోయే సంవత్సర కాలంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు పోవచ్చని అంటున్నారు. ఈ కామర్స్ రంగంలో దాదాపు 70 శాతం వరకు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలోనే జరుగుతాయని, కానీ ఇప్పుడు ప్రజల వద్ద నగదు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో చాలావరకు లావాదేవీలు మానుకుంటారని, అసలు వ్యాపారమే జరగనప్పుడు ఈ కామర్స్ రంగంలో అంతమంది ఉద్యోగులు అక్కర్లేదు కాబట్టి ప్రధానంగా డెలివరీ రంగంలోని వాళ్లకు చాలావరకు ఉద్యోగాలు పోతాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కసహ వ్యవస్థాపకురాలు రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ కామర్స్ రంగంలో మొత్తం 10 లోల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, లగ్జరీ వస్తువులను తయారుచేసి, అమ్మే కంపెనీలపై కూడా తక్షణ ప్రభావం కనిపిస్తుందని, ఇప్పటికప్పుడు అవసరం లేని లగ్జరీల మీద పెట్టే ఖర్చును ప్రజలు వెంటనే మానుకుంటారని రితుపర్ణ విశ్లేషించారు. ఇక రియల్ ఎస్టేట్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలపై కూడా పెద్దనోట్ల ప్రభావం గట్టిగానే పడేలా ఉంది. ఈ రంగాల్లో రాబోయే ఏడాది కాలంలో దాదాపు లక్ష ఉద్యోగాలు పోతాయని కన్సల్టింగ్, నియామక సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఉద్యోగాలు పోవడం, నియామకాలు తగ్గడం లాంటివి చూస్తామంటున్నారు. చేనేత వస్త్ర రంగాలలో చాలామంది దినసరి వేతనాల మీద పనిచేస్తారని, వాటి మీద కూడా నోట్ల రద్దు ప్రభావం గట్టిగానే పడుతుందని అంటున్నారు. ఈ పరిశ్రమలో మొత్తం 3.2 కోట్ల మంది పనిచేస్తుండగా, వాళ్లలో ఐదోవంతు దినసరి వేతన కార్మికులేనని, వస్త్రాల అమ్మకాలు తగ్గడంతో ఉత్పత్తులు తిరిగి రావడం, దానివల్ల దినసరి వేతన కార్మికులకు ఉద్యోగాలు పోవడం లాంటివి సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. తోలు పరిశ్రమలోని మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులలో 20 శాతం మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. -
ఉద్యోగం పోతే ఎలా?
ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగం పోతే ఎలా? నెల నెలా కట్టాల్సిన ఈఎంఐలు ఎలా కట్టాలి.. పిల్లల చదువుల మాటేంటి.. అసలు నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లే దారేంటి? ఇలాంటి ప్రశ్నలు భారతీయుల్లో చాలామందిని వేధిస్తున్నాయట. దాదాపు 17 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఇదే తరహా ఆలోచనలతో ఆందోళన చెందుతున్నారని ఓ సర్వేలో తేలింది. రాండ్‌స్టాడ్ అనే కన్సల్టింగ్ సంస్థ ఈ సర్వే చేసింది. అయితే.. సెప్టెంబర్ నాటికంటే ఇప్పుడు మాత్రం ఈ భయం కొంత తగ్గింది. అప్పట్లో 23 శాతం మంది ఉద్యోగాలు పోతాయని భయపడితే డిసెంబర్లో వాళ్ల సంఖ్య 17 శాతానికి తగ్గింది. 2016 సంవత్సరంలో దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా బాగుపడుతుందని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వాణిజ్య సంస్కరణలు, పెరుగుతున్న పెట్టుబడులు, ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు లాంటి నిర్ణయాలతో వాణిజ్యం బాగా పెరుగుతోందని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ మూర్తి కె ఉప్పులూరి అంటున్నారు. మొత్తమ్మీద చూసుకున్న మార్కెట్ పరిస్థితి బాగుందని, అంటే కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని.. 2016 ప్రారంభంలోనే దీని సంకేతాలు కనిపించి భారతీయ జాబ్ మార్కెట్ బాగా మారిందని ఆయన చెప్పారు. ఇక ఇటీవలి కాలంలో భారతీయులు ఉద్యోగాలు మారడం కూడా బాగా కనిపిస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో చేసిన సర్వేలో.. దాదాపు 45 శాతం మంది తాము గత ఆరు నెలల్లో ఉద్యోగం మారినట్లు చెప్పారు. అలా మారితేనే సరైన జీతభత్యాలు, ప్రమోషన్లు వస్తున్నాయని, ఒకేచోట ఉంటే ఇంక్రిమెంట్లు కూడా సరిగా ఇవ్వట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.