Layoffs in 2024: లక్షలాది తొలగింపులతో ఈ ఏడాదంతా అష్టకష్టాలు పడిన ఉద్యోగులు కొత్త సంవత్సరంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నూతన ఏడాదిలో పరిస్థితులన్నీ చక్కబడతాయని భావిస్తున్న తరుణంలో ఉద్యోగులను కలపెట్టేలా ఓ లేటెస్ట్ సర్వే వెలువడింది. దీని ప్రకారం.. 2024లో భారీ తొలగింపులు ఉండనున్నాయి.
ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’ ఈ సర్వే నిర్వహించింది. ఈ నెలలో 900 కంటే ఎక్కువ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిస్పందనల ఆధారంగా ఈ తాజా సమాచారాన్ని ప్రకటించించింది. ఈ సర్వేలో పాల్గొన్న 10 కంపెనీలలో దాదాపు నాలుగు కంపెనీలు 2024లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని చెప్పాయి. అలాగే సగానికి పైగా కంపెనీలు 2024లో హైరింగ్ ఫ్రీజ్‌ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపాయి.
కారణాలివే..
ఎందుకు లేఆఫ్‌లు చేపడుతున్నారని అడిగినప్పుడు, సగం కంపెనీలు మాంద్యం అంచనా ఒక కారణమని చెప్పాయి. కొంచెం తక్కువగా అంటే 10 కంపెనీల్లో నాలుగు తాము ఉద్యోగులను తొలగించి ఆ స్థానాలను కృత్రిమ మేధస్సు (AI)తో భర్తీ చేయనున్నట్లు తెలిపాయి. ఏఐ యాడ్ టెక్‌కి అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలోని 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2023లో ఇప్పటికే తమ కంపెనీలు 30 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్లు చెప్పిన మెజారిటీ బిజినెస్ లీడర్లు 2024లోనూ 30 శాతం మందికిపైగానే తొలగించనున్నట్లు పేర్కొన్నారు.
కంపెనీల వారీగా..
కొత్త సంవత్సరంలో అధిక సంఖ్యలో కంపెనీలు తొలగింపులు చేపడతాయని చెబుతున్నప్పటికీ అన్ని కంపెనీల్లో లేఆఫ్‌లు ఉంటాయని కాదు. చిన్న కంపెనీలతో పోలిస్తే మధ్యతరహా, పెద్ద కంపెనీలలో తేడాలున్నాయి. మధ్యతరహా కంపెనీల్లో 42 శాతం, పెద్ద కంపెనీల్లో 39 శాతం తొలగింపులు ఉంటాయని సూచించగా, చిన్న కంపెనీల్లో 28 శాతం మాత్రమే లేఆఫ్‌లు ఉంటాయని ఆ కంపెనీల లీడర్లు వెల్లడించారు.
ఈ కంపెనీల్లోనే అత్యధికం
పరిశ్రమల వారీగా నిర్మాణ, సాఫ్ట్‌వేర్ కంపెనీలు వరసగా 66 శాతం, 65 శాతం సిబ్బందిని వచ్చే సంవత్సరంలో తొలగించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్, రిటైల్, ఫైనాన్స్, బీమా కంపెనీల్లోనూ కొంత మేర లేఆఫ్‌ల గందరగోళం నెలకొంది. ఇన్ఫర్మేషన్, రిటైల్ కంపెనీలు 44 శాతం, ఫైనాన్స్ కంపెనీలు 38 శాతం లేఆఫ్‌లను చేపట్టనున్నట్లు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment