సాక్షి, న్యూఢిల్లీ : ఖాదీ, చేనేత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగాలు వదిలివేస్తున్నారా..? ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. చిన్న,మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం ఖాదీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2015-16, 2016-17 మధ్య 11.6 లక్షల నుంచి 4.6 లక్షలకు పడిపోయింది. ఆధునీకరణ ఫలితంగానే ఖాదీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఖాదీ ఉత్పత్తి 31.6 శాతం, అమ్మకాలు 33 శాతం పెరగడం గమనార్హం. నూతన తరహా చరఖాల ప్రవేశంతో కూడా ఖాదీ, చేనేత రంగంలో ఉద్యోగాలు గల్లంతయ్యాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పేర్కొంది. గతంలో నేతన్నలు వాడే సంప్రదాయ చరఖాలపై ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉండేదని, ఆధునిక చరఖాలతో పాతతరం నేత కళాకారులు ఈ వృత్తిని నిష్క్రమిస్తున్నారని సంస్థ వార్షిక నివేదిక పేర్కొంది.
అయితే నూతన చరఖాల ఫలితంగా ఎన్ని ఉద్యోగాలు దెబ్బతిన్నాయనే దానిపై మంత్రిత్వ శాఖ, కమిషన్‌లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఖాదీ, చేనేత రంగంలో కోల్పోయిన 6.8 లక్షల ఉద్యోగాల్లో 3.2 లక్షల ఉద్యోగాలు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్‌గర్, మధ్యప్రదేశ్‌లకు చెందినవి కాగా, బిహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment