Khadi industry
-
ఎంఎస్ఎంఈలకు కేంద్రం భరోసా
న్యూఢిల్లీ: రుణ ఒత్తిళ్లలో ఉన్న సూక్ష్మ, లఘు, చిన్న మధ్య(ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు మద్దతుగా రుణ హామీ పథకాన్ని(సీజీఎస్ఎస్డీ) 2022 మార్చి 31వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. 2020 జూన్ 1వ తేదీన ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. అదే ఏడాది జూన్ 24న అమల్లోకి తీసుకువచ్చింది. కాగా ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రముఖ ఖాదీ ఇండియా షోరూమ్ అమ్మకాలు గాంధీ జయంతి సందర్బంగా రూ.1.02 కోట్లుగా నమోదయినట్లు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ మరో ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫేస్‌బుక్‌కు మరో షాక్..! ఈ సారి రష్యా రూపంలో..!) ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న పలు విజ్ఞప్తుల నేపథ్యంలో ఇటీవల ఖాదీ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా పేర్కొన్నారు. ఈ పథకం కింద రుణాల పంపిణీ గడువును కూడా 2022 జూన్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. 2021 సెప్టెంబరు 24 వరకు ఈ పథకం కింద రూ.2.86 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఇందులో ఇచ్చిన రుణ హమీల్లో 85 శాతం వరకు ఎంఎస్‌ఎమ్‌ఈలకే మంజూరు చేశారు. -
ఐదేళ్లలో గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ 2లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల వ్యాపార ఆదాయాన్ని ప్రస్తుతమున్న రూ.75,000 కోట్ల నుంచి వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లకు పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో తన వాటాను 10 శాతానికి పెంచుకోవాలని ఈ పరిశ్రమకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యంలో 17% వాటా కలిగిన చైనా.. పెరిగిన వ్యయాలతో సతమతం అవుతుండడంతో, ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విస్తరించాలని సూచించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో గడ్కరీ పాల్గొని మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు సుమారు) స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యాలు మౌలిక రంగం, ఎంఎస్ఎంఈలకు ఉందన్నారు. ‘‘అంతర్జాతీయ ఎగుమతుల్లో చైనా వాటా 17%. మన వాటా 2.6 శాతమే. దీన్ని 8–10 శాతానికి తీసుకెళ్లగల అవకాశం మన ముందున్నది. ముఖ్యంగా చైనా పెరిగిన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో మన వాటా పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి’’ అని మంత్రి సూచించారు. దేశంలో అపార వనరులు ఉండి, స్వీయ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నా కానీ.. బొగ్గు, పేపర్‌ను దిగుమతి చేసుకోవడం బాధాకరమన్నారు. -
ఏడు లక్షల ఉద్యోగాలు గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ : ఖాదీ, చేనేత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగాలు వదిలివేస్తున్నారా..? ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. చిన్న,మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం ఖాదీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2015-16, 2016-17 మధ్య 11.6 లక్షల నుంచి 4.6 లక్షలకు పడిపోయింది. ఆధునీకరణ ఫలితంగానే ఖాదీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఖాదీ ఉత్పత్తి 31.6 శాతం, అమ్మకాలు 33 శాతం పెరగడం గమనార్హం. నూతన తరహా చరఖాల ప్రవేశంతో కూడా ఖాదీ, చేనేత రంగంలో ఉద్యోగాలు గల్లంతయ్యాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పేర్కొంది. గతంలో నేతన్నలు వాడే సంప్రదాయ చరఖాలపై ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉండేదని, ఆధునిక చరఖాలతో పాతతరం నేత కళాకారులు ఈ వృత్తిని నిష్క్రమిస్తున్నారని సంస్థ వార్షిక నివేదిక పేర్కొంది. అయితే నూతన చరఖాల ఫలితంగా ఎన్ని ఉద్యోగాలు దెబ్బతిన్నాయనే దానిపై మంత్రిత్వ శాఖ, కమిషన్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఖాదీ, చేనేత రంగంలో కోల్పోయిన 6.8 లక్షల ఉద్యోగాల్లో 3.2 లక్షల ఉద్యోగాలు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్గర్, మధ్యప్రదేశ్‌లకు చెందినవి కాగా, బిహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయి. -
ఖాయిలాపడ్డ ‘ఖాదీ’ తెరుచుకునేనా?
యాచారం: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖాదీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చేనా అని అప్పటి కార్మికులు ఎదురుచూస్తున్నారు. పరిశ్రమను మళ్లీ ప్రారంభించి జీవనోపాధి కల్పించేలా కృషి చేయాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు. భాగ్యనగర్ ఖాదీ సమితి పేరుతో 1962 నుంచి 1992 వరకు మండల పరిధిలోని గున్‌గల్‌లో ఖాదీ పరిశ్రమ వందలాది మందికి జీవనోపాధి కల్పించింది. 30 సంవత్సరాలపాటు ఈ ఖాదీ పరిశ్రమలో పనులు చేసుకుంటూ ఎంతో మంది జీవనోపాధి పొందారు. నగరంలోని సరూర్‌నగర్ ఖాదీ పరిశ్రమ కేంద్రం నుంచి గున్గల్ పరిశ్రమకు దూది, కాటన్ సరఫరా అయ్యేవి. గున్గల్ కేంద్రంగా యాచారం మండలంలోని కొత్తపల్లి, చింతపట్ల, చౌదర్పల్లి, మేడిపల్లి, తక్కళ్లపల్లి, నందవనపర్తి, నానక్‌నగర్, మంచాల మండలంలోని ఆరుట్ల, జాపాల, కాగజ్‌ఘాట్, ఆగాపల్లి, ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో ఉప కేంద్రాలు ఉండేవి. సరఫరా అయ్యే దూది, కాటన్లను ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులు దారంగా వడికేవారు. కొంతమంది చేతులతో, మరికొంతమంది విద్యుత్ యంత్రాలతో దారాన్ని వడికేవారు. వడికిన దారాన్ని నగరానికి సరఫరా చేసే వారు. ఆయా పనులతో మూడు మండలాల్లో ఐదు వందలమందికిపైగా కార్మికులు జీవనోపాధి పొందేవారు. వీరికి వారం వారం వేతనాలు అందించేవారు. ప్రతివారం రూ.3 లక్షల వరకు వేతనాలు చెల్లించేవారని ఆనాటి కార్మికులు పేర్కొంటున్నారు. రానురానూ ఖాదీ పరిశ్రమకు గిట్టుబాటు లేకపోవడంతో ప్రభుత్వం ఈ పరిశ్రమపై దృష్టి సారించకపోవడంతో గునుగల్ ఖాదీ పరిశ్రమ అప్పట్లో ఒక వెలుగు వెలిగి అనతి కాలంలోనే డీలా పడింది. నిలిచిపోయిన బకాయిలు.. రక్షణ లేని భవనాలు అప్పట్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ పరిశ్రమ శ్రేయస్సు కోసం ఏ మాత్రం కృషి చేయడానికి ఆసక్తి కనబరచకపోవడంతో డివిజన్ పరిధిలోని ఖాదీ పరిశ్రమ కేంద్రాలు మూతపడ్డాయి. దాదాపు 400 మంది కార్మికులకు లక్షల రూపాయల వేతనాలు అందాల్సి ఉంది. పలుమార్లు సరూర్‌నగర్‌లోని ఖాదీ పరిశ్రమ కేంద్రానికి వేతనాల కోసం కార్మికులు తిరిగినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక ఊరుకున్నారు. డివిజన్లోని కొన్ని కేంద్రాల్లో విలువైన పరికరాలు వృథాగా ఉన్నాయి. గున్గల్, ఆరుట్ల, నందివనపర్తి గ్రామాల్లో లక్షలాది రూపాయల విలువ చేసే ఈ పరిశ్రమకు చెందిన సొంత భవనాలు ఉన్నాయి. యజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పరిశ్రమలోని విలువైన యంత్రాలు, పరికరాలకు ర క్షణ కూడా కరువయింది. కొంతమంది కార్మికులు కూడా మళ్లీ పరిశ్రమ తెరుస్తారేమోనని యంత్రాలను, పరికరాలను తమ వద్దే ఉంచుకుని నేటికీ భద్రంగా దాచుకుంటున్నారు. ఈ పరిశ్రమను పునఃప్రారంభించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానికులు మొరపెట్టుకున్నప్పటికీ ఎటువంటి స్పందనా లేకుండాపోయింది. అప్పట్లో వందల మందికి ఉపాధి కల్పించిన ఖాదీ పరిశ్రమను మళ్లీ ప్రారంభించేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ కొత్త ప్రభుత్వంలోనైనా మంచిరోజులు వచ్చేనా అని నాటి కార్మికులు ఆశతో చూస్తున్నారు.