యాచారం: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఖాదీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చేనా అని అప్పటి కార్మికులు ఎదురుచూస్తున్నారు. పరిశ్రమను మళ్లీ ప్రారంభించి జీవనోపాధి కల్పించేలా కృషి చేయాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు. భాగ్యనగర్ ఖాదీ సమితి పేరుతో 1962 నుంచి 1992 వరకు మండల పరిధిలోని గున్‌గల్‌లో ఖాదీ పరిశ్రమ వందలాది మందికి జీవనోపాధి కల్పించింది. 30 సంవత్సరాలపాటు ఈ ఖాదీ పరిశ్రమలో పనులు చేసుకుంటూ ఎంతో మంది జీవనోపాధి పొందారు. నగరంలోని సరూర్‌నగర్ ఖాదీ పరిశ్రమ కేంద్రం నుంచి గున్‌గల్ పరిశ్రమకు దూది, కాటన్ సరఫరా అయ్యేవి.
గున్‌గల్ కేంద్రంగా యాచారం మండలంలోని కొత్తపల్లి, చింతపట్ల, చౌదర్‌పల్లి, మేడిపల్లి, తక్కళ్లపల్లి, నందవనపర్తి, నానక్‌నగర్, మంచాల మండలంలోని ఆరుట్ల, జాపాల, కాగజ్‌ఘాట్, ఆగాపల్లి, ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో ఉప కేంద్రాలు ఉండేవి. సరఫరా అయ్యే దూది, కాటన్‌లను ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులు దారంగా వడికేవారు. కొంతమంది చేతులతో, మరికొంతమంది విద్యుత్ యంత్రాలతో దారాన్ని వడికేవారు. వడికిన దారాన్ని నగరానికి సరఫరా చేసే వారు.
ఆయా పనులతో మూడు మండలాల్లో ఐదు వందలమందికిపైగా కార్మికులు జీవనోపాధి పొందేవారు. వీరికి వారం వారం వేతనాలు అందించేవారు. ప్రతివారం రూ.3 లక్షల వరకు వేతనాలు చెల్లించేవారని ఆనాటి కార్మికులు పేర్కొంటున్నారు. రానురానూ ఖాదీ పరిశ్రమకు గిట్టుబాటు లేకపోవడంతో ప్రభుత్వం ఈ పరిశ్రమపై దృష్టి సారించకపోవడంతో గునుగల్ ఖాదీ పరిశ్రమ అప్పట్లో ఒక వెలుగు వెలిగి అనతి కాలంలోనే డీలా పడింది.
నిలిచిపోయిన బకాయిలు.. రక్షణ లేని భవనాలు
అప్పట్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ పరిశ్రమ శ్రేయస్సు కోసం ఏ మాత్రం కృషి చేయడానికి ఆసక్తి కనబరచకపోవడంతో డివిజన్ పరిధిలోని ఖాదీ పరిశ్రమ కేంద్రాలు మూతపడ్డాయి. దాదాపు 400 మంది కార్మికులకు లక్షల రూపాయల వేతనాలు అందాల్సి ఉంది. పలుమార్లు సరూర్‌నగర్‌లోని ఖాదీ పరిశ్రమ కేంద్రానికి వేతనాల కోసం కార్మికులు తిరిగినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక ఊరుకున్నారు. డివిజన్‌లోని కొన్ని కేంద్రాల్లో విలువైన పరికరాలు వృథాగా ఉన్నాయి.
గున్‌గల్, ఆరుట్ల, నందివనపర్తి గ్రామాల్లో లక్షలాది రూపాయల విలువ చేసే ఈ పరిశ్రమకు చెందిన సొంత భవనాలు ఉన్నాయి. యజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పరిశ్రమలోని విలువైన యంత్రాలు, పరికరాలకు ర క్షణ కూడా కరువయింది. కొంతమంది కార్మికులు కూడా మళ్లీ పరిశ్రమ తెరుస్తారేమోనని యంత్రాలను, పరికరాలను తమ వద్దే ఉంచుకుని నేటికీ భద్రంగా దాచుకుంటున్నారు. ఈ పరిశ్రమను పునఃప్రారంభించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానికులు మొరపెట్టుకున్నప్పటికీ ఎటువంటి స్పందనా లేకుండాపోయింది. అప్పట్లో వందల మందికి ఉపాధి కల్పించిన ఖాదీ పరిశ్రమను మళ్లీ ప్రారంభించేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ కొత్త ప్రభుత్వంలోనైనా మంచిరోజులు వచ్చేనా అని నాటి కార్మికులు ఆశతో చూస్తున్నారు.
ఖాయిలాపడ్డ ‘ఖాదీ’ తెరుచుకునేనా?
Published Wed, Jul 16 2014 1:50 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement