
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేక ఉసూరుమంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సంగంవిహార్ ప్రాంతంలో లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు తిరిగి వాటిల్లో కుదురుకుంటామనే ఆశలు ఆవిరవడంతో చిరు వ్యాపారాల బాటపట్టారు. లాక్‌డౌన్ ప్రకటించకముందు తమ కుమారుడు ఓ షాపులో పనిచేస్తుండగా షాపు యజమాని తాము వేతనాలు చెల్లించలేమని చేతులెత్తేయడంతో కూరగాయలు విక్రయిస్తున్నాడని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన మరో కుమారుడు కూడా కూరగాయలు అమ్ముతున్నాడని, ఈ వ్యాపారంలో లాభాలు అంతంతమాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే ప్రాంతానికి చెందిన మరో మహిళ సైతం ఇలాంటి కష్టాలనే ఏకరువు పెట్టారు.
లాక్‌డౌన్ ప్రకటించకముందు తమ భర్త కుటుంబాన్ని పోషించేందుకు డ్రైవర్‌గా పనిచేసేవాడని, లాక్‌డౌన్‌తో ఆ ఉద్యోగమూ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భర్త గుర్‌గావ్‌లో మాస్క్ తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు లాక్‌డౌన్‌తో తన రాబడి గణనీయంగా పడిపోయిందని, ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో అత్యవసరమైతేనే పనులకు పిలుస్తున్నారని చిన్నపాటి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే మరో స్థానికుడు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు కేవలం నిత్యావసరాల కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తుండటంతో తమ భర్త నిర్వహించే ఫుట్‌వేర్ షాప్ నష్టాల్లో సాగుతోందని మరో మహిళ తెలిపారు. దేశ రాజధాని సహా అన్ని ప్రాంతాల్లోనూ కరోనా ప్రభావంతో చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి నియంత్రణలోకి వచ్చి సాధారణ పరిస్థితి ఎప్పుడు నెలకొంటుందా అని వేచిచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment