సాక్షి, న్యూఢిల్లీ : వరుస నష్టాలు లేదా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగులను తొలగించగా, ఫార్మ దిగ్గజం సన్‌ఫార్మ కూడా బాటలో ఇదే పయనిస్తోంది. రెండు యూనిట్లను మూసి వేయడంతో ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులను పెద్ద సంఖ్యలో తొలగించింది. క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలో పనిచేస్తున్న 85 మందికి ఉద్వాసన పలికింది. వడోదర ఆర్ అండ్ డి యూనిట్లలో పనిచేస్తున్న వీరిని ముందస్తు సమాచారం లేకుండానే వేటు వేసింది. ఇది ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది.
వడోదరలోని తాండల్జా, అకోటాలోని తమ రెండు కేంద్రాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాటిని బయో-ఈక్వెలెన్స్ స్టడీస్‌కు ఉపయోగించినట్టు చెప్పింది. అయితే, ఈ యూనిట్లలో తమ కార్యకలాపాలను నిలిపివేసి, ఇతర సౌకర్యాలకు మార్చామని సన్ ఫార్మాస్యూటికల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఆర్ అండ్ డి కార్యకలాపాలలో పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొంది. బయో-ఈక్వెలెన్స్ స్టడీస్ నిర్వహించే క్లినికల్ ఫార్మకాలజీ యూనిట్ల (సీపీయూ) సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి వడోదరలోని తాండల్జా, అకోటాలోని రెండు కేంద్రాలలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సన్‌ఫార్మ ప్రతినిధి చెప్పారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల జీతం ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఉద్యోగులను నియంత్రించేందుకు బౌన్సర్లను వినియోగించారన్న వార్తలు సోషల్ మీడియాలోగుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను సన్‌ఫార్మ ఖండించింది. బాధిత ఉద్యోగులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. అవుట్‌ప్లేస్‌మెంట్ కోసం సహాయం చేస్తున్నామని ప్రకటించింది. నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తున్నామనీ రెగ్యులేటరీ అధికారులకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామనికూడా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment