న్యూఢిల్లీ: దేశ సహకార రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. 2030 నాటికి నేరుగా 5.5 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది. అదే విధంగా మరో 5.6 కోట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. ఈ వివరాలను మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘ప్రైమస్ పార్ట్‌నర్స్’ వెల్లడించింది. ‘భారత సహకార విప్లవం’ పేరుతో సహకార రంగంపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.
భారత కోపరేటివ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దదంటూ.. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సహకార సొసైటీల్లో 30 శాతం మనదగ్గరే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘భారత్ 2030 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అలా చూస్తే సహకార రంగం ఆశావాదానికి, సామర్థ్యానికి ఆధారంగా కనిపిస్తోంది’’అని ఈ నివేదిక పేర్కొంది. సహకార రంగానికి ఉన్న అపార సామర్థ్యాలను ఆర్థిక వృద్ధికి, సామాజిక సమానత్వానికి, సమ్మిళితాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కేవలం ఒక విభాగం కాదంటూ, సమాజ పురోగతికి, శ్రేయస్సుకు శక్తిమంతమైన చోదకంగా నిలుస్తుందని పేర్కొంది.
ఉపాధికి చిరునామా: ‘‘ఉపాధి కల్పనలో సహకార రంగం వాటా 2016–17 నాటికి 13.3 శాతానికి చేరింది. 2007–08 నాటికి ఈ రంగంలో 12 లక్షలుగా ఉన్న ఉపాధి అవకాశాలు, 2016–17 నాటికి 58 లక్షలకు చేరాయి. 18.9 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. 2030 నాటికి కోపరేటివ్‌లు 5.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనున్నాయి. 5.6 కోట్ల మందికి స్వయం ఉపాధి లభించనుంది’’అని ప్రైమస్ పార్ట్‌నర్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈ రంగం కల్పించే స్వయం ఉపాధి అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించింది.
‘‘2006–07 నాటికి సహకార రంగం 1.54 కోట్ల మందికి స్వయం ఉపాధి కల్పించగా, 2018 నాటికి ఇది 3 కోట్లకు విస్తరించింది. స్వయం ఉపాధికి కోపరేటివ్‌లు మూలస్తంభాలు. ఏటా 5–6 శాతం చొప్పున పెరిగినా 2030 నాటికి 5.6 కోట్ల మేర స్వయం ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఏర్పడనున్నాయి’’అని వివరించింది. 2030 నాటికి జీడీపీకి 3–5 శాతం వాటాను సమకూరుస్తుందని అంచనా వేసింది.
ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కూడా కలిపి చూస్తే జీడీపీలో 10 శాతంగా ఉంటుందని తెలిపింది. సహకార రంగాన్ని ఆధునికీకరించడంతోపాటు విధానాల క్రమబద్ధీకరణ, సహకార ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు దిశగా 2021లోనే కేంద్ర సహకార శాఖ పలు చర్యలు ప్రకటించడం గమనార్హం. 29 కోట్ల సభ్యులతో 8.5 లక్షల కోపరేటివ్‌లు స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్యయుతంగా నడిచేందుకు వీలుగా వాటికి నిధుల సా యంఅందించి, సొం తంగా నిల దొక్కుకునేలా చూడాలని నివేదిక సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment