టెలికం రంగంలో భారత్‌లో 5జీ కొత్త పుంతలు తొక్కుతోంది. 2030 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య మూడురెట్లు దూసుకెళ్లి 97 కోట్లకు చేరుతుందని నెట్‌వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం ఎరిక్సన్ రూపొందించిన కంజ్యూమర్‌ల్యాబ్ రిసర్చ్ నివేదిక వెల్లడించింది. ఆ సమయానికి మొత్తం మొబైల్ కస్టమర్లలో 5జీ యూజర్ల వాటా ఏకంగా 74 శాతానికి ఎగబాకుతుందని తెలిపింది.
ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2024 చివరి నాటికి భారత్‌లో 5జీ సబ్‌స్క్రిప్షన్‌లు 27 కోట్లు నమోదు కావొచ్చని అంచనా. ఇది దేశంలోని మొత్తం మొబైల్ కస్టమర్లలో 23 శాతం. ఇక అంతర్జాతీయంగా 5జీ చందాదార్ల సంఖ్య ఈ ఏడాది చివరికల్లా దాదాపు 230 కోట్లుగా ఉంటుంది. ఇది మొత్తం గ్లోబల్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్లలో 25 శాతానికి సమానం. అలాగే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల మంది 5జీ మొబైల్ సేవలను వినియోగిస్తారని నివేదిక అంచనా వేస్తోంది.
2027 నాటికి 4జీని దాటి..
5జీ వినియోగదార్ల సంఖ్య 2027లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4జీ సబ్‌స్క్రిప్షన్లను అధిగమిస్తాయని అంచనా. మొదటిసారిగా 6జీ సేవలు 2030లో ప్రారంభం కావొచ్చు. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మెరుగైన పనితీరు కోసం వీడియో కాలింగ్, స్ట్రీమింగ్, ఆన్‌లైన్ చెల్లింపులకు అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 5జీ వినియోగదార్లలో ఆరుగురిలో ఒకరు తమ ప్రస్తుత నెలవారీ మొబైల్ ఖర్చులో 20 శాతం ఎక్కువ చెల్లించడానికి రెడీగా ఉన్నారని ఎరిక్సన్ ఆగ్నేయాసియా, భారత్ నెట్‌వర్క్ సొల్యూషన్స్ హెడ్ ఉమాంగ్ జిందాల్ తెలిపారు.
జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) అప్లికేషన్లు 5జీ పనితీరును నడిపించే కీలక సాధనాలుగా ఉద్భవించాయి. జెన్ ఏఐ యాప్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో పెరుగుతుంది. భారత్‌లోని 5జీ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లలో 67 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ప్రతీ వారం జెన్ ఏఐ యాప్‌లను ఉపయోగిస్తారని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment