రెండువేల నోట్లను రద్దుచేస్తారా?
► రాజ్యసభలో విపక్షాల ప్రశ్న
► స్పందించని ఆర్థిక మంత్రి జైట్లీ
► ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.2వేల నోట్లను రద్దుచేస్తారా అని విపక్షం రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ‘ప్రభుత్వం రూ.2వేల నోట్లను రద్దుచేయాలని నిర్ణయించింది. ఈ నోట్ల ముద్రణను ఆపేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది.
దీనిపై విధానమైన నిర్ణయమేదైనా తీసుకుంటే ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోగా సభలో వెల్లడించాలి. రెండోసారి నోట్ల రద్దు చేపట్టాలన్న ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ పక్షనేత ఆజాద్ జోక్యం చేసుకుని ప్రభుత్వం వెంటనే బదులివ్వాలని డిమాండ్ చేశారు. ‘రూ.వెయ్యి నాణేలను తెచ్చే ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. అయితే దీనిపై జైట్లీ స్పందించలేదు. మౌనంగానే ఉన్నారు. దీంతో మరో సారి నోట్లరద్దు జరగొచ్చని.. జైట్లీ మౌనం దీనికి నిదర్శనమని విపక్ష సభ్యులు అన్నారు.
జైట్లీ వర్సెస్ విపక్షాలు
బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే.. బీజేపీ కావాలనే గాంధీ, నెహ్రూ, ఇందిరలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని, దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ వాయిదా తీర్మానాన్నిచ్చారు. దీన్ని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమోదించా రు. ఈ దశలో జోక్యం చేసుకున్న రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి జైట్లీ.. ‘విపక్షాలు వాయిదా తీర్మానాలను దుర్వినియోగం చేస్తున్నాయి. టీవీ చానెళ్లలో ప్రచారం కోసమే వీటిని వాడుకుంటున్నాయి’ అని విమర్శించారు.
సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసుపై చర్చించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌తోపాటుగా ఇతర సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చించాలని జైట్లీ పట్టుబట్టారు. ‘ప్రచారం’ వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు జైట్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలం టూ లోక్‌సభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇది కొనసాగుతుండగానే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) బిల్లు– 2017 ఆమోదం పొందింది.