పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ డిమాండ్
సాక్షి, సూర్యాపేట: పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో బ్లాక్‌మనీ వెలికితీత, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, నకిలీ నోట్ల చలామణి అరికడతామని చెప్పిన ప్రధాని.. ఇప్పటి వరకు ఎంత మంది వద్ద ఉన్న బ్లాక్ మనీని బయట పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు హాజరైన ఉత్తమ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు.
ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల దేశ ప్రజలు రోడ్డున పడ్డారని అన్నారు. ప్రజలకు బాసటగా నిలవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మోదీకి వంత పాడ టం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంక్షేమ రుణాలు, మధ్యాహ్న భోజనం బిల్లులు అందించేం దుకు డబ్బులు లేవని చెబుతున్న ముఖ్య మంత్రి.. మిషన్ భగీరథ, ఇరిగేషన్ కాంట్రా క్టర్లకు రూ.20 వేల కోట్లు చెల్లించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
వారికి బుద్ధి చెప్పాలి: జానా
సీఎల్పీ నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దుతో పేదలకు, కూలీలకు పని దొరక డంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కొత్త హామీలు కురి పించి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తు న్నారని, వచ్చే ఎన్నికల్లో వీరిద్దరికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
మోదీ కక్కుర్తి: కుంతియా
ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రన్ కుంతియా మాట్లాడుతూ డెబిట్, క్రెడిట్ కార్డుల చెలామణి పేరుతో అంతర్జాతీయ సంస్థలకు లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి మోదీ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిం దన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ చార్లెస్ పాల్గొన్నారు.