నల్లధనం ఎంతొచ్చిందో చెప్పాలి
ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలి: సురవరం
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రక్రియతో ఎంతమేర నల్లధనం బయటకు వచ్చిందో ప్రధాని మోదీ స్పష్టం చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత యాభై రోజులు ఓపిక పడితే మంచి రోజులు చూపిస్తానన్న మోదీ.. ఎలాంటి మార్పు తీసుకువచ్చారో తెలియజేయాల న్నారు. ‘మంచిరోజుల సంగతి అటుంచితే, సగటు జీవి బ్యాంకు ఖాతాలో వేసిన నగదు ఎన్నిరోజుల్లో బయటకు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఎన్నిరోజుల్లో ఇచ్చేస్తారు’ అని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం మక్దూం భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దుతో నెలకొన్న పరిస్థితులపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
‘డిసెంబర్ 30 నాటికి ఎన్ని కొత్త నోట్లు ముద్రించారు, బ్యాంకుల్లో జమైన నిధులెన్ని, కొత్త నోట్లు ముద్రించి ఏయే బ్యాంకులకు ఎంత ఇచ్చారనే పశ్నలకు మోదీ జవాబు చెప్పాల్సిందే. అధికారం, రాజకీయ అండ ఉన్న వారివద్దే నల్లడబ్బు ఉంటుందన్న కనీస పరిజ్ఞానం మోదీకి లేనట్లుంది. ఒక వైపు నల్లధనాన్ని ఎరవేసి ఉత్తరప్రదేశ్ బహిరంగ సభల్లో జనాన్ని పోగు చేస్తూ, మరోవైపు నల్లధనాన్ని తరిమేస్తానని ప్రసగింస్తున్నారు. ఇదీ.. మోదీ స్వరూపం’ అంటూ మండిపడ్డారు. చేసిన తప్పును అంగీకరించి దేశానికి క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ, ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద వినియోగదారులతోనే ఈ కార్యక్రమాలు చేపడతామన్నారు.