Suvarnam Sudhakar Reddy
-
‘సంఘ్’ ప్రోత్సాహంతో ముస్లింలపై దాడులు
సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపణ సాక్షి, హైదరాబాద్: సంఘ్ పరివార్ ప్రోత్సాహంతో పథకం ప్రకారం దళితులు, ముస్లింలపై దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆహార అలవాట్లను సైతం మార్చే విధంగా ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు. నారాయణగూడ వైఎంసీఏ గ్రౌండ్స్‌లో సీపీఐ నగర సమితి కార్యదర్శి ఈటీ నరసింహ నేతృత్వంలో సోమవారం ఏర్పాటు చేసిన జనసేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధను నిషేధించారని, అయినా అనేక చోట్ల గోరక్షక్‌దళ్ గూండాల దాడులు జరుగుతున్నాయని అన్నారు. గోరక్షక దళాల దాడుల నుంచి పార్టీని, ప్రజలను రక్షించాలని ప్రజాసేవాదళ్, జనసేవాదళ్ వలంటీర్లను కోరారు. అనంతరం మగ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన పార్టీ ఉపాధ్యాయుల సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని సురవరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం పాలకులు లౌకికవాదం అర్థాన్ని, నిర్వచనాన్ని క్రమంగా ధ్వంసం చేస్తున్నారన్నారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలతోపాటు సమకాలీన రాజకీయాలను అధ్యయనం చేస్తూ ప్రజలు, కార్యకర్తలను ఉపాధ్యాయులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. పార్టీ నేతలు కె.నారాయణ, పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ సిద్ధాంతాలేమిటో చెప్పాలి
⇒ ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు: సురవరం ⇒ ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే భారతీయులపై దాడులు: నారాయణ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో సిద్ధాంతాలున్న పార్టీ తమది ఒక్కటేనని చెబుతున్న టీఆర్ఎస్ నాయకులు అసలు ఆ పార్టీ సిద్ధాం తాలేంటో చెప్పాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు సన్నాసులంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. బుధవారం పార్టీ నేతలు కె.నారాయణ, అజీజ్‌పాషా, తెలంగాణ కార్యదర్శి చాడవెంకటరెడ్డి, ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణలతో కలసి విలేకరులతో మాట్లాడుతూ లౌకిక వ్యవస్థలో మతాలకు అతీతంగా ప్రభుత్వాలు నడవాల్సి ఉండగా, రాష్ట్రప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవ హరిస్తోందన్నారు. ప్రజల డబ్బుతో నగలు చేయించి తిరుపతిలో దేవుళ్లకు పెట్టడం అభ్యంతరకరమన్నారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులుండగా, దేవుళ్ల పేరుతో ఇలాంటివి చేయడం గర్హనీయమన్నారు. యూపీ ప్రచారంలో మోదీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ వర్సిటీ పరిణామాలపై న్యాయ విచారణకు డిమాండ్ ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని గుర్మిత్కౌర్ను రేప్ చేస్తామన్న బెదిరింపులతో పాటు ఇతర వర్సిటీల్లో విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు దిగడంపై విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మత విద్వేషాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజును కేబినెట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. -
కుంభకోణాలు, స్కాంల ప్రధాని మోదీ
సురవరం సుధాకర్‌రెడ్డి సాక్షి, గద్వాల: కుంభ కోణాల, స్కాంల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడులో మీడియా తో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నియంత మోదీ అన్నారు. ఆయన్ను ప్రశ్నిస్తే తమ పదవులు పోతా యని కేంద్రమంత్రులు నోరు మెదపడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజావ్యతిరేకమైందని, కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఉందని సురవరం ఆక్షేపించారు. అలాగే, మోదీ పెద్దనోట్ల రద్దు వల్ల పేద ప్రజలకు ఒరిగిం దేమీ లేదని, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను ఆయన విమర్శించడం కూడా సరికాదన్నారు. చౌకబారు జోకులతో ప్రజలను పక్కదారిపట్టించేలా మోదీ వ్యవహరించారన్నారు. ప్రజాసమస్యలను వినడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే బీజేపీకి మనుగడ ఉంటుం దన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు సరికావన్నారు. వామపక్ష పార్టీలు విభిన్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. -
మోదీపైనే అవినీతి మరకలు...
సురవరం సుధాకర్‌రెడ్డి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశం నుంచి అవినీతిని పారదోలుతానని చెబుతున్న ప్రధాని మోదీనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆయన నల్లధనాన్ని పారదోలుతానని నీతులు చెబితే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు మిత్రుడు శేఖర్‌రెడ్డికి రూ.100కోట్ల కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రపంచశాంతికి పోరాడుదాం: ‘అణుబాంబులు.. మారణా యుధాలు.. ఉగ్రవాదులు లేని నూతన శాంతి ప్రపంచం నిర్మాణం కోసం ప్రతిపౌరుడు కృషి చేయాలని, దీనికి ప్రభుత్వాల నుంచి మద్దతుకావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. వీటన్నింటికీ పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమ వుతుందన్నారు. అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభను ఆయన ప్రారంభించారు. అప్పట్లో రాజ్యాలు.. నీళ్ల కోసం యుద్ధాలు జరిగితే ప్రస్తుతం మతాల కోసం దాడులు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు ఆయుధాల కొనుగోలు కోసం కేటాయించే నిధుల్లో 10 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల ప్రగతికి ఖర్చు చేస్తే పేదరికం మాటే ఉండదన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాట్లా డుతూ ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు పోయి రాద్ధాంతాల కోసం ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారన్నారు. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నల్లధనం ఎంతొచ్చిందో చెప్పాలి
ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలి: సురవరం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రక్రియతో ఎంతమేర నల్లధనం బయటకు వచ్చిందో ప్రధాని మోదీ స్పష్టం చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత యాభై రోజులు ఓపిక పడితే మంచి రోజులు చూపిస్తానన్న మోదీ.. ఎలాంటి మార్పు తీసుకువచ్చారో తెలియజేయాల న్నారు. ‘మంచిరోజుల సంగతి అటుంచితే, సగటు జీవి బ్యాంకు ఖాతాలో వేసిన నగదు ఎన్నిరోజుల్లో బయటకు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఎన్నిరోజుల్లో ఇచ్చేస్తారు’ అని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం మక్దూం భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దుతో నెలకొన్న పరిస్థితులపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ‘డిసెంబర్ 30 నాటికి ఎన్ని కొత్త నోట్లు ముద్రించారు, బ్యాంకుల్లో జమైన నిధులెన్ని, కొత్త నోట్లు ముద్రించి ఏయే బ్యాంకులకు ఎంత ఇచ్చారనే పశ్నలకు మోదీ జవాబు చెప్పాల్సిందే. అధికారం, రాజకీయ అండ ఉన్న వారివద్దే నల్లడబ్బు ఉంటుందన్న కనీస పరిజ్ఞానం మోదీకి లేనట్లుంది. ఒక వైపు నల్లధనాన్ని ఎరవేసి ఉత్తరప్రదేశ్ బహిరంగ సభల్లో జనాన్ని పోగు చేస్తూ, మరోవైపు నల్లధనాన్ని తరిమేస్తానని ప్రసగింస్తున్నారు. ఇదీ.. మోదీ స్వరూపం’ అంటూ మండిపడ్డారు. చేసిన తప్పును అంగీకరించి దేశానికి క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ, ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద వినియోగదారులతోనే ఈ కార్యక్రమాలు చేపడతామన్నారు. -
ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి సురవరం సాక్షి, హైదరాబాద్: దేశంలోని నల్లధనాన్ని వెలికితీయాలన్నా, అవినీతిని అంతమొందించాల న్నా.. దాన్ని చేపట్టేవారు అవినీతి రహితులై ఉండాలని సీపీఐ ప్రధా నకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సహారా, బిర్లా కంపెనీ వ్యవహారాల్లో 9 పర్యాయాలు రూ.56కోట్ల ముడుపులను అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ తీసుకున్నట్లు సాక్షాత్తు ఈడీ రికార్డుల్లో లభ్యమైందన్నారు. దీనిపై విపక్షనేతలు పలుమార్లు ఆరోపణలు చేశార ని, బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు దీన్ని తేలికగా కొట్టిపారేయకుండా విచారణ జరపాలన్నారు. మోదీ అవినీతికి పాల్పడ్డా రని తాము ఆరోపించడంలేదని, వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. గురువారం మఖ్దూం భవన్ లో పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు పేదలు ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా డబ్బు లు దొరకకపోగా, మరోవైపు ఆర్బీఐ నుంచి నేరుగా వందల కోట్లు బడాబాబులు, కార్పొరేట్ శక్తులకు ఎలా తరలిపోతున్నా యని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దువల్ల ఎదురైన సమస్యలను వివరించడా నికి వచ్చేనెల 3–10 తేదీల మధ్య దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించిందన్నారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా లెఫ్ట్, డెమోక్రటిక్, సెక్యులర్ శక్తులను కలుపుకుని దేశవ్యాప్తంగా పోరాడా లని పిలుపునిచ్చారు. కేంద్ర భూసేకరణ చట్టం 2013కు తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోంద న్నారు. పార్టీ నాయకులు అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ వెనుక నల్లధనం: సురవరం
పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న మోదీ సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనుక నల్లధనం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు చేసి సాధించిందేమీ లేకపోగా.. పేదలు, మధ్యతరగతి ప్రజల్ని మరింత సమస్యల్లోకి నెట్టారని విమర్శించారు. మరో ఆరు నెలలకాలం ఈ నోట్ల సమస్య ఉంటుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అహ్మదాబాద్‌లో నోట్ల మార్పిడి జరిగిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆరోపిస్తే ప్రధానమంత్రి ఇంతవరకు జవాబు చెప్పలేదన్నారు. నోట్ల రద్దు తర్వాత కొత్తనోట్లు వచ్చాయని, ఇవి వెంటనే నల్లధనంగా ఎలా మారాయని సుప్రీంకోర్టు సర్కారును ప్రశ్నిస్తే జవాబు లేదన్నారు. విజయ్‌మాల్యా, లలిత్‌మోదీ వంటి బడాబాబులు దేశం వదిలి పారిపోతుంటే పట్టించుకోలేదన్నారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నవారు రూ.14 వేల కోట్లు ఎగవేశారన్నారు. నీతిఆయోగ్ ఒక పనికి మాలిన సంస్థ అని సురవరం అన్నారు. ఆ విరాళాలు ఎలా ఇచ్చారు సహారా, బిర్లా గ్రూపులవారు ఏ ఆర్థిక లబ్ధీ లేకుండా మోదీకి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు విరాళాలెలా ఇచ్చారని సురవరం ప్రశ్నించారు.ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధ కలిగించే అంశమన్నారు. దీనిపై తమ పార్టీ నెలక్రితమే ప్రశ్నించిందని, ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారన్నారు. ప్రభుత్వ అవినీతి, సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న విషయాలపై ప్రచార ఉద్యమాన్ని 15 పార్టీలతో కలసి చేపడుతున్నట్లు సురవరం వివరించారు. -
పోరాటాల చరిత్ర సీపీఐ సొంతం
ఫాసిస్ట్ శక్తులను ఎదిరించేందుకు వామపక్షాలు ఐక్యం కావాలి: సురవరం సుధాకర్‌రెడ్డి హైదరాబాద్: ఓట్లు, సీట్ల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎప్పు డూ తహతహలాడలేదని, పోరాటాల ద్వారా నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని దేశో ద్ధారక భవన్లో సీపీఐ హైదరా బాద్ నగర కార్యదర్శి ఇ.టి. నరసింహ అధ్యక్షతన ఆ పార్టీ 91వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సురవరం మాట్లా డుతూ.. సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ అనేక ఆటుపోట్లను అధిగమించి 91వ వసంతంలోకి అడుగిడిందన్నారు. ఏనాడూ స్వాతంత్య్ర పోరాటం, తెలం గాణ సాయుధ పోరాటాలలో పాల్గొనని ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘ్ పరివార్, బీజేపీలు సర్దార్ వల్లభాయ్‌పటేల్ సైనిక చర్య వల్లే తెలంగాణ విముక్తి పొందిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం కొంతమంది కమ్యూ నిజం అంపశయ్యపై ఉందని మాట్లాడుతున్నారని, ప్రజల పక్షాన ఉద్యమాన్ని బలోపే తం చేస్తూ నిరంతరం తమ పార్టీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటుందన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారని స్పష్టం చేశారు. దేశంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈ శక్తులను ఎదిరించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 91వ వార్షికోత్సవ స్ఫూర్తితో పార్టీ ప్రజా పోరాటాల నిర్మాణంతో పాటు ప్రజల సమస్యలపై ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు హిమాయత్‌నగర్‌లోని ఎన్. సత్యనారాయణరెడ్డి భవన్ నుంచి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యురాలు డాక్టర్ బి.వి. విజయలక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మహిళా సమాఖ్య నాయకురాలు అమృతమ్మ, రాధిక, విద్యార్థి సంఘం నాయకులు స్టాలిన్, ఆర్.ఎన్. శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘హిసాబ్ దో, జవాబ్ దో’ పేరిట నిరసనలు
పెద్ద నోట్ల రద్దుపై వచ్చే నెల 3–10 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళన: సురవరం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై సీపీఐ ఉద్యమబాట పట్టనుంది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ జాతీయ సమితి నిర్ణయించింది. ‘‘హిసాబ్ దో, జవాబ్ దో’ (లెక్క చెప్పండి, సమాధానం ఇవ్వండి) నినాదంతో వచ్చే నెల 3 నుంచి 10 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన సీపీఐ జాతీయసమితి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను శుక్రవారం ఇక్కడ పార్టీ సీనియర్ నాయ కులు గురుదాస్ దాస్‌గుప్తా, డి.రాజా, చాడ వెంకట్‌రెడ్డి తో కలసి ఆయన మీడియాకు వెల్లడించారు. నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తన తప్పిదాన్ని అంగీకరించడంలేదని, ఈ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారంటూ బీజేపీ వివిధ సాధనాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. నిపుణులు, అనుభవజ్ఞులైన ఆర్థికవేత్తలను సంప్రదించ కుండా మోదీ ప్రభుత్వం తీసుకున్న అతి ఘోరమైన ఈ నిర్ణయం వల్ల దేశం తీవ్రమైన పరిణామాలు చవిచూస్తోం దన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న 45 రోజుల్లో ఆర్బీఐ 60 నోటిఫికేషన్లు, వాటికి సవరణలను ఇవ్వడాన్ని బట్టి ప్రజలపై చూపే దుష్పరిణామాలను ప్రభుత్వం గుర్తించలేదని స్పష్టమవుతోందన్నారు. దళితులపై దాడులకు నిరసనగా ధర్నా దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, హత్యలకు నిరసనగా వచ్చేనెల 22న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించనున్నా మని, వామపక్షాల అగ్రనాయకులు, ఆర్పీఐ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ర్యాలీలో పాల్గొంటారని సురవరం తెలిపారు. వచ్చే నెల 26న రాజ్యాంగ పరిరక్షణదినం, 30న ‘డిఫెండ్ సెక్యులరిజం’ చేపడుతున్నామన్నారు. సహారా పేపర్స్, అదిత్యా బిర్లా ముడుపులపై మోదీ దేశప్రజలకు సమాధా నం చెప్పాలని, దీనిపై విచారణకు ఆదేశించి తన నిర్దోషి త్వాన్ని నిరూపించుకోవాలన్నారు. ఆదిత్యాబిర్లా, సహారా సంస్థలపై చర్యలు తీసుకోకుండా ‘గోల్డెన్ సైలెన్స్’ పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం నూతన విద్యావిధానం 2016ను ఉపసంహరించాలని, మహిళా స్వయం సహాయక బృందాల రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని, అమెరికాతో రక్షణ భాగస్వామిగా భారత్ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని పార్టీ తీర్మానించింది. -
అచ్ఛేదిన్ కాదు.. ఇవి బురే దిన్
- పెద్దనోట్ల రద్దుతో దేశంలో తీవ్ర గందరగోళం - సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో ఆ పార్టీ అగ్రనేత సురవరం సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ హయాంలో ప్రజలకు అచ్ఛేదిన్ బదులు బురే దిన్ వచ్చాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ పార్టీ జాతీయ సమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సంద ర్భంగా సురవరం మాట్లాడుతూ మోదీని, కేంద్ర ప్రభుత్వతీరును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల పై దేశ వ్యతిరేకశక్తులుగా ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలకు మంచిరోజులు తీసుకొస్తామని అధికా రంలోకి వచ్చిన మోదీ హయాంలో కనీవినీ ఎరగని రీతిలో నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. తదనంతర పరిణామాలను అంచనా వేయకుండా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల జీవనం అతలాకు తలమైందని విచారం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర గందరగోళంలోకి నెట్టివేశారని విమర్శించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైన కేంద్రం జాతీయ బ్యాంకుల పైకి నెపం నెట్టి చేతులుదులుపుకునే ప్ర యత్నం చేస్తోందని, మరోవైపు ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. కొన్ని సందర్భాల్లో న్యాయవ్యవస్థ సైతం మోదీపై వచ్చిన అవినీతి ఆరోపణలను పట్టించుకోనట్లుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న ప్పుడు ఆయనకు రూ.70 కోట్లు చెల్లించి నట్లుగా సహారా పేపర్స్, బిర్లా అకౌంట్లలో వెల్లడి అయినా దానిని ఖండించలేదని అన్నారు. దీనిపై స్పందించేందుకు కోర్టులు కూడా నిరాకరించాయని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం... వామపక్షాలు, ప్రజాస్వామ్యశక్తులు కలసి ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని సురవరం అన్నారు. వామపక్షాలు, ప్రజాస్వామ్యశక్తులు మరింత మెరుగైన అవగాహనను సాధించి మోదీ ప్రభుత్వ తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని, మతతత్వ బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కీలకమైన యూపీలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించాలని అన్నారు. గోరక్ష దళాలు, ఇతర స్వయం ప్రకటిత సంస్థల ద్వారా యూపీ, తదితర రాష్ట్రాల్లో దళితులు, మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తు న్నారని, వీటి వెనుక ఎవరున్నారనేది బహి రంగ రహస్యమేనని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని ఆర్పీఐతో కలసి ఢిల్లీలో పెద్ద ప్రదర్శనను నిర్వహించాయని, ఈ నిరసనలను దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. క్యూబా కమ్యూనిస్టు యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో, ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి, తమిళ నాడు సీఎం జయలలిత, ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు, పార్టీ సీనియర్ నాయ కులు సత్యపాల్‌రెడ్డి, సంగప్ప, వేమూరి నాగే శ్వరరావు, జీవీ కృష్ణారావుల మృతికి సీపీఐ జాతీయ సమితి నివాళులు అర్పించింది. -
లొసుగుల వల్లే ప్రధానికి లొంగుతున్నారు
చంద్రబాబు, కేసీఆర్‌పై సురవరం ఆరోపణ - రాజకీయ అభద్రతతో ఉన్నందునే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజం - రెండున్నరేళ్ల పాలనలో హామీల అమల్లో ఘోర వైఫల్యమని మండిపాటు - నేటి నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ భేటీ సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: లొసుగులు ఉన్నందు వల్లే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వా నికి లొంగిపోతున్నారని సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల అమల్లో వైఫల్యాలతో పాటు వారి ఇతర బలహీనతలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందా లేదా వారే లొంగి పోతున్నారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. బాబు, కేసీఆర్ రాజకీయ అభద్రతాభావంతో ఉన్నారని, అందువల్లే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని విపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కానీ వారి తో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారన్నారు. బుధవా రం నుంచి శుక్రవారం వరకు నగరంలో జరగ నున్న సీపీఐ జాతీయ, కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సురవరం సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... రెండున్నరేళ్ల పాలనలో ఇద్దరిదీ ఘోర వైఫల్యం.. ‘చంద్రబాబు, కేసీఆర్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీల్లో ప్రధానమైనవి అమలు కాలేదు. రైతు రుణాల రద్దు సహా ఇతర హామీ ల అమల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమవ్వ గా దళితులకు మూడెకరాల భూపంపిణీ, పేద లకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటింటికీ మంచి నీటి సరఫరా తదితర హామీల్లో ఒక్కశాతం కూడా కేసీఆర్ అమలు చేయలేదు. వైఫల్యా లను కప్పిపుచ్చుకునేందుకు పూజలు, పండు గలు, పబ్బాలు అంటూ ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి కొందరు వ్యక్తులు రాజుకు మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ ఆ కోవకు చెందినవారే. బీజేపీతో స్నేహం భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే నగదురహిత లావాదే వీలు, డిజిటలైజేషన్ అంటూ చంద్రబాబు, కేసీఆర్ హడావుడి చేస్తున్నారు. దీని సాధ్యాసా ధ్యాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తు న్నారు. చుట్టూ వందిమాగధులు చేరి పొగడ్త లతో ముంచెత్తుతుండడంతో బాబు, కేసీఆర్ లకు రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదు. నయీం కేసే కేసీఆర్ అవగాహనకు కొలబద్ధ.. నయీం కేసును సీబీఐకు ఇచ్చేందుకు నిరాకరిం చడం ద్వారా కేసీఆర్ అవగాహనను కొలబద్ధ గా అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఎవరినీ వదలం అని చెప్పినా... తప్పు చేసిన వారు తమ పార్టీలో ఉంటే వారికి రక్షణ, లేని వారికి శిక్షణ అన్నట్లుగా విచారణకు నిరాకరిస్తున్నారు. పార్లమెంటు స్తంభన వారి వ్యూహరచనే... పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుం డా కేంద్రం, బీజేపీ వ్యూహం పన్నాయి. బీజేపీ అగ్రనేత అద్వానీ అదే ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా బీజేపీ కీలకాంశా లపై ఎందుకు చర్చించలేదు?’ అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు అత్యంత తెలివితక్కువ నిర్ణయం... పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత తెలివి తక్కువది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కుండా ఈ నిర్ణయం తీసుకోవడం అర్థరహి తం. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు పక్కకుపోయి నగదు రహిత లావాదేవీలు, డిజిటలైజేషన్ అంటూ కొత్త పాట అందుకున్నారు. ఇది దేశ, కాల పరిస్థితులకు అనువైనది కాదు. ఈ నిర్ణయం వల్ల ఆశించిన మేర నల్లధనం బయటకు రాలేదు. దాచుకున్న డబ్బే బ్యాంకులకు వచ్చింది, దోచుకున్న డబ్బు మార్పిడి అయ్యిందనేది మా అంచనా. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. కొంతైనా కోలుకునేందుకు, నోట్ల కష్టాలు కొంచెమైనా తీరేందుకు కనీసం 5, 6 నెలలు పట్టొచ్చు. సురవరంతో గద్దర్ భేటీ సురవరంతో ప్రజా గాయకుడు గద్దర్ సమావేశమయ్యారు. మంగళవారం మగ్దూం భవన్‌కు వచ్చిన ఆయన సురవరం తో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు, ప్రజా సమస్య లపై ప్రభుత్వం స్పంది స్తున్న తీరు తదితర అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమా వేశంలో సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండటంతో సురవరంను అభినందిం చేందుకే వచ్చానని, తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని గద్దర్ తెలిపారు. -
బంగ్లాల తెలంగాణ వచ్చింది
• కేసీఆర్ సీఎం అయ్యాక కూడా సంస్కారం నేర్చుకోలేదు • సీపీఐ బహిరంగ సభలో సురవరం సుధాకర్‌రెడ్డి సాక్షి, వరంగల్: రెండున్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కాదుగానీ.. బంగ్లాల తెలంగాణ వచ్చిందని భారతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వదిలి రూ. కోట్లు ఖర్చు చేసి అధికారిక నివాసాలు నిర్మిం చుకుంటున్నారని అన్నారు. వాస్తు పేరిట సచివాలయ భవనాలు, పండుగల కోసం రూ. కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభల ముగింపు సందర్భంగా బుధవారం హన్మకొండలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీ మైదానంలో బహిరంగసభ జరిగింది. సభలో సురవరం ప్రసంగించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. వారికి నష్టపరిహారం ఇవ్వలేని స్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో మరో నిజాం పాలన కొనసాగుతోందని, కేసీఆర్ ప్రజాస్వామిక ఫ్యూడల్ పరిపాలనను సాగిస్తున్నారని విమర్శించారు. ‘ప్రజలకు అందుబాటులో ఉండడు. ప్రతిపక్షాలు మాట్లాడితే తిట్టిపోస్తడు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అరుున తర్వాత కూడా కేసీఆర్ సంస్కారం నేర్చుకోలేదు. 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో ముందె న్నెడూ లేని విధంగా కేసీఆర్ అధికారం చెలారుుస్తున్నాడు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు టోపీ పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నారుు’ అన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉద్యమరూపంలో మార్చడానికి, పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీని శక్తివంతంగా నిర్మాణం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ అన్నారని సురవరం గుర్తు చేశారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధ నం విషయంలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2014లో దేశంలో రైతుల అనుకూల చట్టం పేరుతో, పెట్టుబడిదారులకు పనికొచ్చే భూసేకణ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. కార్మిక వర్గాల హక్కులను కాలరాసే విధంగా చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
పార్లమెంటు అంటే ప్రధానికి భయమా?
• సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్న • పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం • 28 నుంచి 30 దాకా సీపీఐ మహాసభలు సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో గురువారం జరిగింది. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషాలతో కలసి సురవరం విలేకరు లతో మాట్లాడారు. దేశంలోని 92 శాతం మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ప్రధానమంత్రి యాప్ సర్వేలో 93 శాతం ప్రజలు నోట్ల రద్దుపై మోదీకి మద్దతు తెలిపినట్టు అసత్య ప్రచారం చేస్తు న్నారని మండి పడ్డారు. చిన్న వ్యాపారులు, వృత్తి దారులు, పేదలు, కూలీలు కష్టాలు పడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుని ఛిన్నాభిన్నై మైందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిపు ణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో జీడీపీ వృద్ధి 3.5 శాతానికి తగ్గిపోతుందని సురవరం పేర్కొన్నారు. పాత కరెన్సీని కొంతకాలం చెలామణిలో పెడితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. నల్లధనం 6.5 శాతమే కరెన్సీ రూపంలో ఉందని, మిగిలిన దంతా బంగారం, భూమి రూపంలోకి మారి పోరుునట్టుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తు న్నారన్నారు. ఇది నల్లకుబేరులపై సర్జికల్ దాడి కాదని, దేశంపై కార్పొరేట్ దాడి అన్నారు. రెండు పార్టీల నల్లధనాన్ని నాశనం చేసేందుకే ఉత్తరప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు సమకూర్చుకున్న నల్లధనాన్ని నాశనం చేయడానికే పెద్ద నోట్లను రద్దు చేశారని సురవరం ఆరోపించారు. ఎన్నికల్లో ఆదానీ, అంబానీల ఖర్చుతోనే మోదీ ప్రచారం చేశారని, ప్రతిఫలంగా వారికి రూ.70 వేల కోట్ల లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో షైనింగ్ ఇండియా అంటూ తప్పుడు ప్రచారాలతో ఎన్డీయేను ముంచిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు కూడా మరోసారి దెబ్బతీయడానికి తప్పుదోవ పట్టిస్తున్నాడని హెచ్చరించారు. నోట్లరద్దుపై ఈ నెల 28న దేశంలోని అన్ని వామపక్షపార్టీలతో కలసి ఆందోళనలకు పిలుపు ఇచ్చినట్టుగా వెల్లడించారు. ఈ నెల 24 నుంచి 30 వరకు ఆందోళనలకు దిగుతామన్నారు. సీఎం కేసీఆర్ కొత్త ఇంటిలో చేరిన తర్వాతనైనా వైఖరిలో మార్పురావాలని ఆకాంక్షించారు. -
మోదీది లోకవంచన: సురవరం
- డిసెంబర్ 31 వరకు బిల్లుల చెల్లింపులకు పాతనోట్లను అనుమతించాలి - విదేశాల్లోని నల్ల ధనాన్ని తీసుకురావడంలో కేంద్రం విఫలం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ ప్రధాని మోదీ ఆత్మవంచనతో కూడిన లోకవంచనకు పాల్పడుతున్నారంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్వేగభరితుడై మోదీ కార్చిన కన్నీళ్లు కోట్లాది దేశ ప్రజల కన్నీళ్లను తూడ్చలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల దేశంలో ప్రజలు తీవ్రస్థారుులో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారన్నారు. డిసెంబర్ 31 వరకు ప్రజోపయోగ బిల్లుల చెల్లింపులు, ఖర్చుల కోసం రూ. వెరుు్య, 500 పాత నోట్లను చెల్లించేందుకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో మామూలు పరిస్థితులు ఏర్పడడానికి 50 రోజులు పడుతుందని మోదీయే చెబుతున్నందున, ఆ మేరకు ప్రజలకు కూడా ఆ అవకాశాన్ని కల్పించాలన్నారు. మంగళవారం పార్టీ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నల్లధన కుబేరులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, పనామా లీక్స్‌లో బయటపడిన వారందరి పేర్లపై చట్టపరంగా చర్య చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో బంగారం కొనుగోళ్లు జరిగి నట్లు, వేలకోట్లతో బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ అరుునట్లు తెలుస్తోందన్నారు. నల్లధనం దాచిన కుబేరులు ఈ చర్య నుంచి తప్పించుకున్నారనే వార్తలు రాగా, సామాన్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 31 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పాతనోట్లను కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం అనుమతిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం, ఏవో పైపై చర్యలతో ప్రజల దృష్టిని మళ్లించేం దుకు ప్రయత్నిస్తోందన్నారు. స్విస్‌బ్యాంకు ల్లో నల్లధనాన్ని దాచుకున్న వారి జాబితా ను సాధించి, వారిపై పెద్ద మొత్తంలో టాక్స్ వేసేలా అమెరికా చేయగా లేనిది భారత్ ఎందుకు చేయలేక పోతున్నదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కోర్టు, ఇతర అంతర్జాతీయ వేదికలపై కేంద్రం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. -
కార్పొరేట్ తొత్తులుగా సర్కార్లు
ధ్వజమెత్తిన వామపక్షాలు - ‘బషీర్‌బాగ్’ విద్యుత్ అమరులకు నివాళులు సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల అణచివేతకు పూనుకుంటున్నాయని పలువురు వామపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని స్తూపం వద్ద విద్యుత్ అమరవీరులకు 10 వామపక్ష పార్టీల నేతలు నివాళులర్పించారు. విద్యుత్ ఉద్యమంలో విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ అసువులుబాసి 15 సంవత్సరాలు పూర్తై సందర్భంగా వామపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా స్తూపం వద్దకు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యుత్ అమరవీరుల పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తామంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రజా ఉద్యమాలు- ప్రభుత్వాల అణచివేత’ అంశంపై నిర్వహించిన సదస్సులో సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ప్రయోజనాల కోసం 2000 ఆగస్టులో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని, అందుకు నిరసనగా వామపక్ష పార్టీలు చేసిన ఉద్యమంపై బాబు దమనకాండ కు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఉద్యమకారులను గుర్రాలతో తొక్కించి, తుపాకులతో కాల్చి హత్యలకు కూడా పూనుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు కూడా దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులు తమ చేతుల్లోకి తీసుకునే విధంగా ఉన్నాయని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులు, వరల్డ్ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయని, నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లిందని విమర్శించారు. దేశంలో అమలవుతున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ మోదీ తిరంగా యాత్ర పేరుతో దేశాన్ని తిరోగమనం పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయాలని చూస్తే, చివరికి ఆ ఉద్యమాలే ప్రభుత్వాలకు ఉరితాళ్లు అవుతాయని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విద్యుత్‌చార్జీలు పెంచి ప్రజలపై రూ.1600 కోట్లు భారం మోపిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే చార్జీలను అధికంగా పెంచి చంద్రబాబుకు తానేమీ తీసిపోనట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తీవ్రమైన నిర్బంధం: సీపీఎం విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా చేస్తున్న ఉద్యమంలో నాడు చంద్రబాబు ప్రభుత్వం ముగ్గురిని పొట్టనబెట్టుకున్నదని, అప్పటి ఉద్యమంలో కలసి వచ్చిన కేసీఆర్ నేడు అవే కార్పొరేట్‌శక్తులకు వంత పాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తెలంగాణలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్బంధం అమలవుతోందని, దీనికి మల్లన్నసాగర్ ఉదాహరణ అని, 144 సెక్షన్‌ను విధించి గ్రామాల చుట్టూ ముళ్లకంచెలను వేసి ప్రజలకు ఇబ్బం దులు కలగ చేశారని అన్నారు. అమరులకు నివాళులర్పించినవారిలో సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ నాయకులు రమ, గోవర్ధన్ , విజయ్‌కుమార్, ఎంసీపీఐ నేత తాండ్ర కుమార్, ఎస్‌యూసీఐ (మురారి), జానకిరాములు (ఆర్ఎస్పీ), సంధ్య(పీవోడబ్ల్యూ), సీపీఐ (ఎంఎల్) నాయకుడు భూతం వీరన్న తదితరులున్నారు. -
మోదీ, కేసీఆర్ పరస్పర డబ్బా: సురవరం
* కేంద్ర కేబినెట్లో చేరికపై సీఎం ఆశలు * దళితులపై ప్రధానిది ఎన్నికల ప్రేమ సాక్షి, హైదరాబాద్: ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పరస్పర డబ్బా కొట్టుకున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ‘గాడిద గాత్రాన్ని కాకి మెచ్చుకున్నట్లు, కాకి సంగీ తాన్ని గాడిద ప్రశంసించినట్లు’ ఒకరినొకరు పొగుడుకుని ప్రజలను ‘ఫూల్స్’ను చేయలేరని ఘాటుగా స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గజ్వేల్ సభలో తెలంగాణలో అభివృద్ధి అంటూ మోదీ ఊదరగొడితే, సాయంత్రం సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అభివృద్ధి బోగస్ అంటూ విమర్శించారని, ఈ రెండింట్లో ఏది కరెక్టో వారే చెప్పాలన్నారు. కేంద్రంలో అవి నీతిరహిత ప్రభుత్వం ఉందని కేసీఆర్ పొగడటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిద్వారా కేంద్ర కేబినెట్లో తన కుటుంబసభ్యులను చేర్చాలనే ఆశను కేసీఆర్ వదులుకున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్లో లలిత్‌మోదీ అవినీతి, అదానీ గ్రూపుపై గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.200 కోట్ల జరిమానాను కేంద్రం మాఫీ చేయడం కేసీఆర్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. దళితులపై దాడుల విషయంలో మోదీ ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. తనపై దాడి చేశాక దళితుల జోలికి వెళ్లాలంటూ ప్రధాని స్పందించిన తీరులో నాటకీయత ఎక్కువగా ఉందన్నారు. గుజరాత్, యూపీ ఎన్నికల నేపథ్యంలో దళితుల ఓట్ల కోసం ఎత్తుగడగానే ఈ స్పందన ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వ విద్య కాషాయీకరణ ప్రయత్నాలు ఏమాత్రం తగ్గలేదని, ఏబీవీపీ, ఆరెస్సెస్ వర్సిటీల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించాలన్నారు. ఏపీకి హోదా అంశం పై సాంకేతిక కారణంతో పార్లమెంట్లో ఓటింగ్‌ను తప్పించుకున్నారన్నారు. హోదాపై 14వ ఆర్థిక సంఘం నిషేధం విధించడం వల్లే దానిని ఇవ్వలేకపోయామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎందుకు అబద్ధం చెప్పా రో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఏ నిషేధం విధించలేదని ఆర్థిక సంఘం అభిజిత్‌సేన్ స్పష్టం చేసిన విషయాన్ని సురవరం గుర్తు చేశారు. -
పోడుభూముల జోలికొస్తే ఖబడ్దార్
సురవరం సుధాకర్‌రెడ్డి హైదరాబాద్: పోడు భూముల జోలికొచ్చినా, గిరిజనుల బతుకుల్లో నిప్పులు పోసినా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మెడపై కాడి పెట్టి దున్నిస్తామని సీపీఐ నేతలు హెచ్చరించారు. ‘ఉంటే భూమిపై.. లేదంటే జైలులోనే’ అనే నినాదంతో గిరిజనులు మరింత ఉధృత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, రైతులపై పీడీ యాక్ట్, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఇందిరాపార్కు వద్ద పోడు సాగుదారులు ధర్నా నిర్వహించారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో దశాబ్దాలుగా గిరిజ నులు దాదాపు 10లక్షల ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, వాటికి పట్టాలు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం దాడులు, అరెస్టులకు పాల్పడుతోందన్నారు.భూస్వాములు, కాం ట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులను అరెస్టుచేయలేని ప్రభుత్వం.. సేద్యం చేసుకుంటున్న గిరిజనులను వెళ్లగొట్టడం దుర్మార్గమన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ నాగేంద్రనాథ్ ఓఝా మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరించే విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ మాట్లాడు తూ అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయించి పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్ పేరుతో రాక్షసంగా వ్యవహరిస్తున్నాయన్నా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ నేత గుండా మల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ పాల్గొన్నారు. -
వర్గీకరణతోనే దళితుల ఐక్యత సాధ్యం
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, దళితులు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దళితుల ఐక్యత కేవలం వర్గీకరణతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ దేశంలో అగ్రకులాల పెత్తందారులు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారని, వారి వాదనలో హేతుబద్దత లేదని విమర్శించారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సురవరం లేఖ రాశారు. ఆందోళనలో మాదిగ జర్నలిస్టులు ‘కలం కవాతు’ చేశారు. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల ఫోరం జాతీయ సలహాదారు దయాసాగర్ మాట్లాడుతూ వర్గీకరణ సాధించుకొనే వరకు మందకృష్ణ వెనకే ఉంటామని చెప్పారు. -
సంఘ్ పరివార్ ఫాసిస్టు ధోరణులపై పోరాడాలి
- ఇందుకు బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలి - రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో సురవరం పిలుపు సాక్షి, హైదరాబాద్ : దేశంలో సంఘ్ పరివార్ శక్తుల ఫాసిస్టు ధోరణులు, విధానాలపై పోరాడేందుకు శక్తిమంతమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు యత్నిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను విద్యార్థిలోకం తిప్పి కొట్టాలన్నారు. శనివారం మఖ్దూం భవన్లో అఖిల భారత రాజకీయ పాఠశాల (సెంట్రల్ పార్టీ స్కూల్) తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతున్నారని విమర్శించారు. ప్రజలు ఏం తినాలి, ఎటువంటి బట్టలను ధరించాలి, ఏం చదవాలి, టీచర్లు ఏం చెప్పాలి వంటి వాటిని ఆరెస్సెస్ నిర్ణయిస్తోందన్నారు. దేశంలోని వివిధ రంగాల్లోకి కాలం చెల్లిన పాత పద్ధతులు, హిందూ మతతత్వ, ఫాసిస్టు ధోరణులను అమలు చేయడం ప్రారంభించారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత రెండేళ్ల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలను, అశాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల 14 గ్రామాల్లోని 16 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుండగా ఎకరానికి రూ.8 లక్షల చొప్పున పరిహారమిచ్చి చేతులు దులుపుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర భూసేకరణచ ట్టం, 2013 ప్రకారం పేదలు, ఇతరవర్గాల వారికి పరిహార ప్యాకేజీ ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. అందరూ ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలని, విద్యార్థులు విద్యతో పాటు సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చాడ వెంకటరెడ్డి స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు 1 వ తేదీ వరకు కొనసాగే ఈ రాజకీయ తరగతులకు సెంట్రల్ పార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ రాజన్‌వాలా అధ్యక్షత వహించగా.. సీఆర్ భక్షి, కృష్ణఝా తదితరులు పాల్గొన్నారు. -
మా ఓట్లు కాంగ్రెస్ కు మేలు చేశాయి!
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలు కుదేలయ్యాయని సీపీఐ కేంద్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. రెండురోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. సామాన్యులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో కోత వేసి పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని పేర్కొంది. ఈ తీరును నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది. కులం, మతం పేరిట సమాజాన్ని విడగొట్టేందుకు కేంద్రం విశ్వప్రయత్నం చేస్తోందని, దేశవ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలపై దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. కేరళలో వామపక్ష కూటమి విజయంపై హర్షం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఓటమిపై విస్మయం వ్యక్తం చేసింది. అస్సాం, తమిళనాడులో కనీస ప్రాతినిధ్యం కూడా లేకపోవడాన్ని చర్చించింది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి ఓట్లు కాంగ్రెస్‌కు మేలు చేశాయని, కాంగ్రెస్ ఓట్లు మాత్రం వామపక్షాలకు పడలేదని విశ్లేషించింది. 2017లో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పరిస్థితిని చర్చించేందుకు జూలై 15,16,17 తేదీల్లో జాతీయ సమితీ సమావేశాలను ఢిల్లీలో నిర్వహించనున్నట్లు సురవరం తెలిపారు. -
భారత్ మాతాకీ జై అని ఎందుకనాలి..?
'భారత్ మాతాకి జై అని ఎందుకనాలి..?'అంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇష్టం ఉన్నవాళ్లు అంటారు లేదంటే లేదు.. అని స్పష్టం చేశారు. దేశభక్తికి కొలబద్ద పెట్టడానికి బీజేపీ నేతలు ఎవరని ప్రశ్నించారు. కార్పోరేట్ శక్తులకు అంటకాగి.. గాంధీని చంపిన హంతకులను పొగిడే వారు దేశభక్తులా అంటూ ఎద్దేవా చేశారు. భగత్ సింగ్ చివరి నినాధం 'ఇంక్విలాబ్ జిందాబాద్' అని తెలిపారు. ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలను ప్రధాని ఎందుకు ఖండింటం లేదని ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్ననల్ల ధనాన్ని తీసుకు వస్తాం అంటూ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాంబ్ చేశారు. -
వామపక్ష ఉద్దండులు ప్రేక్షకులైన వేళ..
హైదరాబాద్: వారు వామపక్ష ఉద్దండులు, ప్రముఖులు... ప్రేక్షకుల్లా కూర్చుని కన్హయ్యకుమార్ ప్రసంగం విన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్గవర్గ సభ్యులు అజీజ్‌పాషా, కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు చెరుపల్లి సీతారామయ్య, నంద్యాల నర్సింహారెడ్డిలతో పాటు విద్యావేత్త చుక్కా రామయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తదితరుల సాధారణ కార్యకర్తల్లాగా ప్రేక్షకుల్లో కూర్చుని కన్హయ్య ప్రసంగాన్ని విన్నారు. వేదికపై మల్లేపల్లి లక్ష్మయ్య మినహా వామపక్ష విద్యార్థి సంఘాల జాతీయ, రాష్ట్ర నేతలకే అవకాశం కల్పించారు. -
అమెరికా విధానాలతోనే ఇస్లామిక్ తీవ్రవాదం
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ♦ అగ్రరాజ్యంతో మోదీ సర్కారు చెలిమి సరికాదు.. ♦ పాక్‌తో చర్చల దిశగా కేంద్రం ప్రయత్నించాలి సాక్షి, హైదరాబాద్: అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్లే పలు దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. దశాబ్దాలుగా అంతర్యుద్ధాలు సాగుతున్న అఫ్ఘానిస్తాన్, ఇరాక్, సిరియా వంటి దేశాల్లో అమెరికా జోక్యంతోనే ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలు పాగావేసి విధ్వంసం సృష్టించే స్థితికి చేరుకున్నాయన్నారు. శుక్రవారం మఖ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి సురవరం మీడియాతో మాట్లాడుతూ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణచివేసే పేరుతో పాశ్చాత్య దేశాలు చేస్తున్న దాడులు సామాన్యులను బలితీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించకుండా అమెరికాతో అంటకాగేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. పాకిస్తాన్ బేషరతుగా భారత్‌తో చర్చలకు ముందుకు వస్తున్నందున ఆ దిశగా ప్రయత్నించాలని సూచించారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇప్పటికీ సాగుతున్నాయని, దీనిపై పోరాడేందుకు వామపక్ష పార్టీలన్నీ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు సురవరం తెలిపారు. సొంత ఖర్చుతో చండీయాగం చేసుకోవాలని చెప్పినందుకు సీఎం కేసీఆర్ బాధపడటం ఎందుకో తనకు అర్థం కాలేదని...ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ ఒక మతానికి సంబంధించిన పండుగలు, యాగాలు నిర్వహించడం లౌకిక విధానాలకు వ్యతిరేకమన్నారు. వామపక్ష పార్టీల మద్దతుతో ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి సీపీఐ తరఫున పువ్వాడ నాగేశ్వర్రావు పోటీ చేస్తున్నారని, నల్లగొండలో సీపీఎంకు తాము మద్దతిస్తున్నట్లు చాడ చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు పల్లా వెంకటరెడ్డి, అజీజ్ పాషా, రవీంద్ర కుమార్, నర్సింహ, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. -
మిలిటెంట్ పోరాటాలకు సిద్ధంకండి
పార్టీ శ్రేణులకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం ఉద్బోధ రాష్ట్రంలో పార్టీని బలమైన ప్రజాశక్తిగా తీర్చిదిద్దాలని పిలుపు హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలమైన ప్రజాశక్తిగా ఆవిర్భవించేందుకు మిలిటెంట్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పోరాటాల ద్వారా పార్టీ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, పువ్వాడ నాగేశ్వరరావు తదితరులతో కలసి సీపీఐ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల సావనీర్‌ను సురవరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైన తెలంగాణలో బద్దం ఎల్లారెడ్డి నాయకత్వంలో పార్టీ తొలి మహాసభలు జరుపుకోగా తాజాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పార్టీ తొలి మహాసభలు జరుపుకుందన్నారు. ఈ నెల 25 నుంచి భూపోరాటాలు: చాడ ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూపోరాటాలు చేపట్టనున్నట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాగించిన అవినీతి, కుంభకోణాలపై ఈ నెల 20న పది వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని శనివారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆగస్టు తొలి వారంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి లోటుపాట్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఇటీవల చేపట్టిన ప్రాజెక్టుల సందర్శనలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదనంగా రూ.10 వేల కోట్లు చెల్లించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. -
మీ గొంతు కాకుంటే విచారణకు సిద్ధపడండి
‘ఓటుకు కోట్లు’ కేసులో మాట్లాడారా? లేదా? చంద్రబాబుపై సురవరం ధ్వజం హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అసలు విషయం చెప్పి తన నిజాయతీ చాటుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా సంబంధం లేని వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు తగదన్నారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో వినిపించిన గొంతు ఆయనది(చంద్రబాబు) అనే ఆరోపణలు వచ్చాయి. అది తనదో కాదో నిజం చెప్పాలి. లేదంటే విచారణకు సిద్ధపడాలి. అంతేతప్ప లేనిపోని మాటలు మాట్లాడితే ఎలా? ప్రజల్ని మూర్ఖులనుకుంటున్నారా? సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడొచ్చా? మీరు మాట్లాడారో లేదో చెప్పండి. దాని గురించి అడిగితే ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారు. అంటే దానర్థం దొంగతనం చేశారనుకోవాలా..’’ అని నిలదీశారు. సురవరం గురువారం పార్టీ సీనియర్ నేత అజీజ్‌పాషాతో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే సెక్షన్-8 అంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతానికి సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పెద్దమనిషి తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరో కొనుగోలు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు రాష్ట్రానికో నీతి ఉండదని పేర్కొన్నారు. స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకుండా సాగదీయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణ ంపై విచారణను సీబీఐకి అప్పగించడాన్ని సురవరం స్వాగతించారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన చావులన్నీ హత్యలేనని అభిప్రాయపడ్డారు.