పోడుభూముల జోలికొస్తే ఖబడ్దార్
సురవరం సుధాకర్‌రెడ్డి
హైదరాబాద్: పోడు భూముల జోలికొచ్చినా, గిరిజనుల బతుకుల్లో నిప్పులు పోసినా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మెడపై కాడి పెట్టి దున్నిస్తామని సీపీఐ నేతలు హెచ్చరించారు. ‘ఉంటే భూమిపై.. లేదంటే జైలులోనే’ అనే నినాదంతో గిరిజనులు మరింత ఉధృత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, రైతులపై పీడీ యాక్ట్, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఇందిరాపార్కు వద్ద పోడు సాగుదారులు ధర్నా నిర్వహించారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ...
ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో దశాబ్దాలుగా గిరిజ నులు దాదాపు 10లక్షల ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, వాటికి పట్టాలు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం దాడులు, అరెస్టులకు పాల్పడుతోందన్నారు.భూస్వాములు, కాం ట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులను అరెస్టుచేయలేని ప్రభుత్వం.. సేద్యం చేసుకుంటున్న గిరిజనులను వెళ్లగొట్టడం దుర్మార్గమన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ నాగేంద్రనాథ్ ఓఝా మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరించే విధానాలు అవలంభిస్తున్నాయన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ మాట్లాడు తూ అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయించి పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్ పేరుతో రాక్షసంగా వ్యవహరిస్తున్నాయన్నా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ నేత గుండా మల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ పాల్గొన్నారు.