ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న కొండపోడు భూములపై హక్కులు లేక గిరిజనులు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఆ భూములపై వారికి హక్కులు లేవంటూ అటవీ అధికారులు వేధించేవారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆ భూముల్లో సాగు చేసిన పంటలను అటవీశాఖ సిబ్బంది నాశనం చేసేవారు. పోడు భూములను ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ అక్కడ గిరిజనులు ఏర్పాటు చేసుకున్న మకాంలు తగులబెట్టి బెంబేలెత్తించేవారు. ఏమీ చేయలేని నిస్సహాయతతో గిరిజనులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొనే వారు. వీరికి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలివ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారి బతుకులకు భరోసా ఏర్పడింది.
రంపచోడవరం: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రంపచోడవరం నియోజకవర్గంలో 17,661 మంది గిరిజనులకు 45,871. 23 ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పించారు. పోడు పట్టాలు అందజేసి వరి కళ్లల్లో ఆనందం నింపారు. దీంతో పాటు స్థానిక గిరిజనులకు కమ్యూనిటీ పట్టాలు అందజేశారు. తద్వారా ఆ భూముల్లో లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇలా రంపచోడవరం డివిజన్‌లో 12,334 మంది గిరిజనులకు 49,508 ఎకరాలపై కమ్యూనిటీ హక్కులు కల్పించారు. దీంతో తమ కల నెరవేరిందంటూ ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజనులకు అండగా..
గిరిజనులకు అండగా వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు అండగా నిలిచారు. వారి సమస్యలను వైఎస్సార్ సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. హక్కు పట్టాలు మంజూరులో వారు కీలకపాత్ర పోషించారు.
పోడు భూమి ఖాళీ చేయమన్నారు
నా భర్తకు అనారోగ్యం. ముగ్గురు పిల్లలతో బొల్లికొండలో పోడు చేసుకుంటూ అక్కడే జీవిస్తున్నాం. పోడు వదిలి వెళ్లిపోవాలని అటవీ సిబ్బంది బెదిరించారు. అలా ఇబ్బంది పడుతూనే పోడు పట్టాల కోసం ఎదురు చూశా. సీఎం జగనన్న వచ్చిన తరువాత 3 ఎకరాల 85 సెంట్ల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. అందులో కందులు, కొర్రలు వేశాను. జీడిమామిడి మొక్కలు పెంచుకుంటున్నాను.
–మర్రిక సీత, దాకరాయి, రాజవొమ్మంగి మండలం
నిబంధనల మేరకు పట్టాలు
అటవీ హక్కుల చట్టం ద్వారా అర్హత ఉన్న ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలు మంజూరు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించిన తరువాత పట్టాలు మంజూరు చేస్తాం. అటవీ హక్కుల చట్టం నిబంధనల ప్రకారం దరఖాస్తులు పరిశీలన జరుగుతుంది. ఏజెన్సీలో ఇప్పటికే పోడు భూములు సాగు చేసుకుంటున్న అనేక మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చాం.
–కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్, రంపచోడవరం
స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నా
గత 25 ఏళ్ల నుంచి దాకరాయి దగ్గర బొల్లికొండలో నివాసం ఉంటూ అక్కడే కొండపోడు సాగు చేసుకుంటున్నాను. బుడములు, చోళ్లు , సామలు జీడిమామిడి మొక్కలు పెంచుకుంటుండగా అటవీ అధికారులు అనేక ఇబ్బందులు పెట్టారు. జగనన్న సీఎం అయిన తరువాత 8 ఎకరాల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. రెండు సార్లు రైతు భరోసా పొందాను. ప్రభుత్వ సాయం ఎన్నటికీ మరువలేను.
–మర్రి లక్ష్మయ్య, దాకరాయి, రాజవొమ్మంగి మండలం
Comments
Please login to add a commentAdd a comment