rampachodavaram
-
గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి,అల్లూరి సీతారామరాజు జిల్లా : రంపచోడవరం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాల కర్కశత్వానికి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి పాలయ్యారు. వివిధ కారణాలతో విద్యార్థినులకు పనిష్మెంట్ ఇచ్చారు ఆ ప్రిన్సిపల్.రెండు రోజుల పాటు కళాశాల విద్యార్థినులతో ఒక్కసారిగా 200 గుంజీలు తీయడం, వారితో పరుగులు తీయించడం చేయించారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థునులను నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థుల్ని అత్యవసర చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు కళాశాల సిబ్బంది.ప్రిన్సిపల్ కఠిన శిక్షకు నడవలేని విద్యార్థునులు నడవలేని స్థితిలో రంపచోడవం ఆస్పత్రికి వెళ్లారు. కొంతమంది విద్యార్థునులను ఆస్పత్రి లోపలికి ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు. కళాశాల ప్రినిపల్ తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, నిర్దాక్షణ్యంగా శిక్షలు విధిస్తున్నారని, అన్నం తిన్న వెంటనే పరుగులు పెట్టిస్తున్నారని విద్యార్థునులు వాపోతున్నారు. -
చెట్టు నుంచి నీళ్లు రావడం చూశారా?
ప్రకృతి ఎప్పటికప్పుడూ తన వైవిధ్యంతో మనుషులను మంత్రముగ్దులయ్యేలా చేస్తూనే ఉంటుంది. కొన్నింటిని చూస్తే ప్రకృతిలో ఇంగ గొప్ప శక్తి ఉందా అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఓ విచిత్రమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వేసవి వచ్చిందంటే ఎందురయ్యే నీటి సమస్యకు ఆ అద్భుతం ఓ గొప్ప మార్గాన్ని అందించే ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా అద్భుతం అంటే.. ఈ ఘటన మన ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి జిల్లాలోని రంపచోడవరం -కింటుకూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది . ఏం జరిగిందంటే..భూమి మూడోంతుల నీరు ఉంటుందని విన్నాం. కానీ కొన్ని చోట్ల భూమ్మీద నీరు కనిపించకపోయినా..తవ్వగానే ఉబికి రావడం జరగుతుంది. మరొకొన్ని చోట్ల కొండల్లోంచి పుట్టుకురావడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం అత్యంత విభిన్నంగా చెట్టులోంచి నీరు వస్తోంది. అంది కూడా పంపు నుంచి లీకైనట్లుగా ధారాపాతంగా వస్తోంది. ఈ చెట్టుకి పూలు, కాయల తోపాటు నీళ్లు కూడా వస్తాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఆ చెట్టు పేరు నల్ల మద్ది చెల్లు. దీన్నుంచి నిరంతరాయంగా పంపు మాదిరిగా నీళ్లు ఫోర్స్‌గా వస్తాయి. అక్కడే ఇలాంటి చెట్లు వేలాదిగా ఉన్నాయి. ఈ చెట్టుకి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుందట. ఆ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అందుకు సంబంధించిన వీడియోని తీసి నెట్టింట షేర్ చేయండతో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వింతైన దృశ్యాన్ని చూసేయండి. అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an — Telugu Scribe (@TeluguScribe) March 30, 2024 (చదవండి: పాము కాటు వేయగానే ఏం జరుగుతుందో లైవ్‌లో చూసేయండి!) -
చంద్రబాబు ఝలక్‌తో తలో దారి!
అల్లూరి సీతారామరాజు: అరకు పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. క్షుద్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన చంద్రబాబు నిర్ణయాలను పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అరకు పార్లమెంట్ టికెట్ బీజేపీకి కేటాయింపు.. టీడీపీలో సీనియర్లను పక్కనబెట్టి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం వంటి పరిణామాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల పరిస్థితి తలోదారి అన్నట్టుగా ఉంది. అరకు పార్లమెంట్ టికెట్‌ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం వారికి మింగుడు పడటం లేదు. ఏమాత్రం ఉనికి లేని బీజేపీకి టికెట్ ఎలా కేటాయిస్తారని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కూటమి (బీజేపీ) అభ్యర్థి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు మద్దతుగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ తరఫున అరకు ఎంపీగా గెలుపొందిన ఆమె పార్టీకి దూరంగా ఉంటూ స్వప్రయోజనాలకోసం ఐదేళ్ల పదవిని వాడుకున్నారని, నియోజకవర్గంలో ఎన్నడూ కనిపించని ఆమె తరఫున ఎలా ప్రచారం చేయాలని వారు మదనపడుతున్నారు. ఆమైపె ఆర్థికపరమైన అంశాలతోపాటు ఎస్టీ కాదని కేసులు ఉన్నాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె కోసం ప్రచారం చేయలేమని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు బహిరంగంగానే చెబుతున్నారు. మొదటి నుంచి ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీకి పట్టు ఎక్కువ. పార్టీ ఫిరాయించిన నాటి నుంచి కొత్తపల్లి గీతపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించిన వంతల రాజేశ్వరి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పారు. ఇదే పరిస్థితి కొత్తపల్లి గీతకు కూడా తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ శ్రేణులు మొరపెట్టుకున్నా.. రంపచోడవరం అసెంబ్లీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నాయకత్వంలో ఆందోళన చేసినప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేదు. పార్టీలో సీనియర్లను కాదని మిరియాల శిరీష దేవికి ఎలా టికెట్ ఇస్తారని, దీనివల్ల నష్టం జరుగుతుందని పార్టీ శ్రేణులు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. నెలరోజుల క్రితం పార్టీలోకి వచ్చిన ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు అనుచరులు బహిరంగంగా విమర్శించారు. టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషదేవి భర్త భాస్కర్‌కు సంబంధించిన కేసుల వివరాలను టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు స్వయంగా చంద్రబాబుకు అందజేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసగించినట్టుగా ఆయనకు వివరించారు. ఈ పరిస్థితుల్లో శిరీషదేవిని అభ్యర్థిగా కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్పదని తెలియజేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. రెబల్‌గా బరిలోకి? చంద్రబాబు ఇచ్చిన ఝలక్‌తో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఇంటికే పరిమితమయ్యారు. టీడీపీ తనకు రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చినప్పటికీ వైఎస్సార్సీపీని విడిచి వెళ్లేది లేదని అప్పటిలో ప్రకటించిన వంతల రాజేశ్వరి ఆ తరువాత పార్టీ ఫిరాయించడంపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే ఆమె ఓటమికి కారణమైంది. అప్పటిలో పార్టీ మారేదిలేదని ఆమె ప్రకటించిన దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలావుండగా ఎన్నికల్లో టీడీపీ రెబల్‌గా పోటీచేయాలా లేదా అనే దానిపై వంతల రాజేశ్వరి అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇవి చదవండి: కాలవ మోసం.. ఇదే సాక్ష్యం! -
గతంలో షాపులో పనిచేసే నేను ఈరోజు ఒక షాపుకు యజమానురాలు అయ్యానంటే కారణం జగనన్న అందించిన తోడ్పాటే..!
-
కొలువుల చదువు.. భవితకు నెలవు
గిరి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. బోధనకు అవసరమైన నైపుణ్యం, విజ్ఞానం అందిస్తూ శిక్షణ ఇస్తోంది. వారు కొలువులు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోనే గిరిజన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఏకైక కళాశాల ఇదే. ఏటా 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. రంపచోడవరం: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల (డైట్ కళాశాల) గిరి విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా కొలువులు సాధించడంలో ఎంతో దోహదపడుతోంది. నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 15 ఏళ్లుగా గురువులుగా తీర్చిదిద్దుతూ... రంపచోడవరంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను 2008లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డైట్ ద్వారా 50 మంది గిరి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కళాశాలలో 520 మంది విద్యార్థులు శిక్షణ పొంది బయటకు వెళ్లారు. ► 2008 –2101 విద్యా సంవత్సరానికి సంబంధించి 82 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2009 నుంచి 2014 వరకు 96శాతం ఉత్తీర్ణత సాధించింది. 2013 నుంచి 2020 వరకు ఆరు బ్యాచ్‌లు నూరుశాతం ఫలితాలు సాధించాయి. అలాగే 2021 బ్యాచ్ నూరు శాతం ఫలితాలు సాధించాయి. చక్కని వసతి సదుపాయం ► రాష్ట్రంలోని రంపచోడవరం, చింతూరు, పాడేరు, పార్వతీపురం, కన్నపురం ఐటీడీఏల పరిధిలోని విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలకు రావాల్సిందే. రంపచోడవరం డైట్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి కల్పించారు. బాలురకు కళాశాల ఆవరణలోనే హాస్టల్ వసతి ఉంది. బాలికలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని వసతి గృహంలో కల్పించారు. మెరుగైన శిక్షణ రంపచోడరంలోని డైట్ కళాశాలలో మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తరువాత ఉద్యోగం సాధిస్తామనే భరోసా ఉంది. ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా కళాశాల ఏర్పాటుతో ఎంతో మేలు కలుగుతుంది. –కల్యాణ్, విద్యార్థి డైట్ కళాశాల, రంపచోడవరం మెరిట్ విద్యార్థులకే ప్రవేశం రంపచోడవరం డైట్ కళాశాలలో ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల పాటు చదువుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమకూరుస్తున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది విద్యారంగంలో స్థిరపడ్డారు. –కోసు ఠాగూర్దొర, డైట్ కళాశాల విద్యార్ధి. నూరుశాతం ఫలితాలు తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నాం. వారు బాగా చదివేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నాం. కళాశాల నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ముందంజలో ఉంది. –సీహెచ్ చిన్నబాబు, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రంపచోడవరం -
400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయరహదారి
రాజమహేంద్రవరం– విజయనగరం వరకు మూడు జిల్లాలను కలుపుతూ చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 400 కిలోమీటర్ల పొడవునా చేపట్టే ఈ నిర్మాణానికి రూ.568 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. సాక్షి, అల్లూరి సీతారామరాజు(రంపచోడవరం): మూడు జిల్లాలను కలుపుతూ చేపట్టిన రాజమహేంద్రవరం– విజయనగరం హైవే రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 400 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.568 కోట్లు వెచ్చించింది. దశల వారీగా నేషనల్ హైవే ఆథారిటీ అధికారులు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే గోకవరం నుంచి ఐ.పోలవరం జంక్షన్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. నాలుగు మండలాల పరిధిలో.. రంపచోడవరం మండలం ఐ.పోలవరం నుంచి కాకరపాడు వరకు జాతీయ రహదారి 516 రోడ్డు పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి నాలుగు మండలాలను కలుపుతూ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పది కిలోమీటర్లు మేర రోడ్డును విస్తరిస్తున్నాయి. ఈ నాలుగు మండలాల్లో హైవే రోడ్డు నిర్మాణానికి 725 ఎకరాలు అవసరం. 585 ఎకరాలు అప్పగింత ఇప్పటివరకు 585 ఎకరాల ప్రభుత్వ భూమిని రోడ్డు నిర్మాణ పనులకు ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించారు. మరో 140 ఎకరాలు ప్రైవేట్ భూమి ఉంది. ఈ భూమిని అప్పగించేందుకు అవార్డు ఎంక్వైయిరీ ప్రకటించిన తరువాత, భూ యాజమానులకు నష్టపరిహారం చెల్లించి భూమిని అప్పగిస్తారు. అయితే అప్పటి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారవర్గాలు తెలిపాయి. సుమారు 70 కిలోమీటర్లు మేర నిర్మిస్తున్న రోడ్డు మార్గంలో 120 చోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మాణం చేపడతారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు.. హైవే రోడ్డు నిర్మాణం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నుంచి గోకవరం, పోక్సుపేట, ఐ. పోలవరం జంక్షన్, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కాకరపాడు జంక్షన్, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మినిస్ట్రీస్ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు అండ్ నేషనల్ హైవే ఆథారిటీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చురుగ్గా పనులు సుమారు 70 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాత రోడ్డును వెడల్పు చేసే పనులు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం పనులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైవేట్ భూములను అప్పగించే ప్రక్రియ పూర్తయితే రోడ్డు నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. – చక్రవర్తి, జేఈ, ఆర్అండ్బీ, కాకినాడ -
పాపికొండలకు పోటెత్తారు
రంపచోడవరం/దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు ఆదివారం తొలిరోజే పర్యాటకులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నా ఎక్కువమంది టికెట్లు బుక్ చేసుకున్నారు. రెండు బోట్లలో 112 మంది పర్యాటకులు బయలుదేరారు. మూడునెలల విరామం తరువాత పర్యాటక, పోలీసు, రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారుల పర్యవేక్షణ, సూచనల మధ్య పాపికొండల పర్యాటకం ప్రారంభమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి రెండు బోట్లు ఉదయం 11 గంటలకు బయలుదేరాయి. మొదటి బోటుగా గోదావరి గ్రాండ్లో 82 మంది ఉన్నారు. వీరిలో బోటు పైభాగంలో 46 మంది, లోపల 36 మంది కూర్చునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండోబోటు భగీరథిలో 30 మంది పర్యాటకులు ఉన్నారు. వీరందరిని టికెట్ ఆధారంగా అనుమతించారు. తొలిరోజు కావడంతో బోట్లు బయలుదేరేందుకు కొంత ఆలస్యం అయింది. రోజూ ఉదయం 9 గంటలకే పర్యాటకులతో బోట్లు బయలుదేరతాయని అధికారులు చెప్పారు. బెంగళూరు నుంచి కూడా కొందరు పర్యాటకులు పాపికొండల విహారానికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది గోదావరిలో ప్రయాణించి పాపికొండల అందాలు చూడాలని కోరిక ఉంది. అయితే పాపికొండల రైడ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. తిరిగి పాపికొండలకు బోట్లు తిరుగుతాయని చెప్పారు. దీంతో 8 రోజులు టూర్ ప్లాన్ చేసుకుని వచ్చాం. పాపికొండల టూర్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. – సుష్మ, పర్యాటకురాలు, బెంగళూరు జాగ్రత్తలు పాటించాలి.. పాపికొండల విహారయాత్రను విజయవంతంగా ముగించేందుకు పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి. బోట్లో ప్రయాణించేటప్పుడు, తిరిగి బోట్ పాయింట్‌కు వచ్చేవరకు లైఫ్ జాకెట్లు తీయవద్దు. రోడ్డు ప్రయాణానికి, నీటిపై బోటులో ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. గోదావరిలో బోటు వెళ్తున్నప్పుడు అటూ ఇటూ తిరగడం, అందరూ ఒకవైపు రావడం, తొంగిచూడడం చేయకూడదు. ఇలాచేస్తే బోటు ఒరిగిపోతుంది. సంతోషకరమైన ప్రయాణానికి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా అవసరం. – సురేష్‌బాబు, సీఐ రంపచోడవరం -
తాటి.. పోషకాల్లో మేటి
రంపచోడవరంలో డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ‘తాటి’పై జరుగుతున్న పరిశోధనలు సత్పలితాలనిస్తున్నాయి. అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా 1993 నుంచి చేపట్టిన పరిశోధనల ద్వారా తాటి నీరా(అప్పుడే తీసిన తాటి కల్లు)తో అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించారు. సాధారణంగా తాటికి సంబంధించి అందరికీ తెలిసింది తాటి బెల్లం మాత్రమే. అయితే హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ సీవీ వెంగయ్య తన ప్రయోగాలతో తాటి ద్వారా అనేక పదార్థాలు తయారు చేయవచ్చని నిరూపించారు. ఈ మేరకు ఐసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్)కు తన ప్రయోగ ఫలితాలను సమర్పించారు. ఏజెన్సీలో గిరిజనులకు తాటి చెట్ల ద్వారా ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో ఈ పరిశోధనలు చేసినట్లు వెంగయ్య తెలిపారు. తాటి తాండ్ర తయారీ ఇలా.. 1993 నుంచి తాటిపై పరిశోధనలు భారతదేశంలో తాటిపై పరిశోధనలు సాగిస్తున్న రీసెర్చ్ స్టేషన్ పందిరిమామిడిలోనే ఉంది. 1993 నుంచి ఇప్పటి వరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 270 రకాల తాటి చెట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల తాటి చెట్లు ఉంటాయని ఒక అంచనా. 2019 సంవత్సరంలో తాటి కల్లు నుంచి నీరా(హెల్త్ డ్రింక్) తయారు చేసే యూనిట్‌ను నెలకొల్పారు. దీని ద్వారా తాటి నుంచి కల్లు సేకరించి నీరా తయారు చేస్తారు. జనవరి నుంచి నీరా తయారీ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం తాటి పండ్లు నుంచి గుజ్జును సేకరించి తాటి తాండ్రను తయారు చేసి విక్రయిస్తున్నారు. తాటి గుజ్జును సేకరించేందుకు ఒక యంత్రాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేశారు. తాటి పండ్లు, తాటి తేగలు, తాటి కల్లు ద్వారా తాటి బెల్లం, జెల్లీ, నూక, పిండి, సిరప్లు, తాండ్ర తయారు చేస్తున్నారు. తాటికి సంబంధించి తెలంగాణ, బిహార్, తమిళనాడుకు చెందిన అనేక మంది రైతులు హెచ్ఆర్సీ వచ్చి శిక్షణ పొందుతున్నారు. తాటి తాండ్ర డీఎస్టీకి ప్రతిపాదనలు గ్రామస్థాయిలో తాటి ఉత్పత్తులు తయారీపై శిక్షణ ఇచ్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రతిపాదనలు పంపించాం. టీఎస్పీ నిధులు రూ.కోటి కేటాయించాలని కోరాం. గ్రామస్థాయిలో శిక్షణ ఇస్తే తాటిపండ్ల వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం మనకు లభిస్తున్న తాటి చెట్లు నుంచి 2 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నాం. :::సీవీ వెంగయ్య, శాస్త్రవేత్త, ఫుడ్ అండ్ టెక్నాలజీ, హెచ్ఆర్ఎస్, పందిరిమామిడి తాటి బెల్లం తాటి సిరా -
ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’
మారేడుమిల్లి: వన్యప్రాణులకోసం విద్యుత్ తీగలతో ఏర్పాటుచేసిన ఉచ్చు ఒకరిని బలిగొంది. మరొకరిని తీవ్ర గాయాల పాల్జేసింది. ఎస్ రాము, బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని చట్లవాడ పంచాయతీ పరిధిలోని బొజ్జలగండి గ్రామానికి చెందిన కొండ్ల శ్యాముల్ రెడ్డి (26), పల్లాల రమేష్ రెడ్డితో కలిసి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కర్రల నిమిత్తం శనివారం రాత్రి వెళ్లారు. వాటిని నరికి అటవీ ప్రాంతం నుంచి రహదారి వద్దకు తీసుకువస్తున్నారు. అదేమార్గంలో కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఉచ్చు ఏర్పాటుచేశారు. దానికి విద్యుత్ తీగలు అమర్చారు. శ్యాములరెడ్డి, సురేష్ రెడ్డి తెస్తున్న కర్రల చివర్లు విద్యుత్ తీగలకు తగలడంతో ఇరువురు షాక్‌కు గురయ్యారు. దీంతో శ్యాముల్రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతని వెనుక వస్తున్న రమేష్ రెడ్డి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమేష్‌రెడ్డిని అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు బోదులూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీసులకు బంధువులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాము సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
లోయలోకి దూసుకుపోయిన కారు
రంపచోడవరం: రంపచోడవరానికి సుమారు 15 కిలోమీట ర్ల దూరంలోని బర్డ్స్ నెట్ రిసార్ట్స్ సమీపంలో సోమవారం సాయంత్రం బొలేరో వాహనం బోల్తా కొట్టి లోయలో పడింది. కాకినాడ నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట వెళ్తున్న ఈ వాహనంలో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కారులో ప్రయాణికుల వివరాలు తెలియరాలేదు. -
రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెల్లవారు జాము.. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్ వైపు నల్లరంగు స్కార్పియో వచ్చింది.. తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు.. స్కార్పియో డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని పెంచి రంపచోడవరం వైపు పోనిచ్చాడు.. కంగుతిన్న పోలీస్‌లు రెండు కార్లతో ఆ వాహనాన్ని వెంబడించారు.. వెనుక వైపు పోలీస్ వాహనం వస్తుంటే ముందుగా వెళుతున్న స్కార్పియో రోడ్డు మలుపులు దాటుకుంటూ వెళుతోంది.. అచ్చు సినిమాల్లోలా. అలా రంపచోడవరం భూపతిపాలెం ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లాక అక్కడ మలుపులో సిమెంట్ గోడను స్కార్పియో ఢీకొట్టి జలాశయంలోకి దూసుకుపోయింది. కారులో ఉన్న గంజాయి మూటలు ఒక్కసారిగా చెల్లాచెదురుగా బయట పడిపోయాయి. ప్రాజెక్టులో పడిపోయిన వాహనం నుంచి ఓ వ్యక్తి ఒడ్డుకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 300 కేజీల వరకూ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టులో పడిపోయిన వాహనాన్ని బయటకు తీసి మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒడిశా ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఆదివారం రాత్రే మారేడుమిల్లి ప్రాంతానికి తెచ్చి, తరలిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో కారును వెంబడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా. వాహనంలో గంజాయి తరలిస్తున్న సమాచారం రావడంతో నిఘా వేసి పట్టుకున్నట్టు రంపచోడవరం అడిషనల్ ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ చెప్పారు. -
ప్రోత్సహిస్తే సిరులే!
ఏజెన్సీలో రబ్బరు సాగుకు ప్రోత్సాహం కరువైంది. గతంలో ఈ పంటను పరిచయం చేసిన రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డుల నుంచి గత కొన్నేళ్లుగా సహకారం అందడం లేదని గిరి రైతులు వాపోతున్నారు. అనుకూలమైన వాతావరణం, అందుబాటులో మార్కెటింగ్ ఉన్నందున సాగు చేపట్టేందుకు చాలా మంది గిరి రైతులు ముందుకు వస్తున్నారు. సాగుకు సహకారం అందిస్తే నిలకడగా ఆదాయం పొందే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. రంపచోడవరం: రబ్బరు సాగుపై ఏజెన్సీ ప్రాంత గిరి రైతులు ఆసక్తి చూపుతున్నారు. రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డు సంయుక్తంగా ఇప్పటికే మన్యంలో రబ్బరు సాగు చేపట్టాయి. రబ్బరు సాగుకు మారేడుమిల్లి, వై.రామవరం మండలాల వాతావరణం అనుకూలం. గతంలో రబ్బరు సాగును ఐటీడీఏ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. తరువాత కాలంలో రబ్బరు సాగుకు ఐటీడీఏ నుంచి సహకారం అందడం లేదని గిరి రైతులు వాపోతున్నారు. మొట్టమొదటిగా దేవరపల్లిలో.. మారేడుమిల్లి మండలంలోని దేవరపల్లి గ్రామం రబ్బరు సాగుకు అనుకూలమని గుర్తించిన రబ్బరు బోర్డు 1994లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో రబ్బరు మొక్కలు నాటించింది. ఆ గ్రామంలో 35 గిరిజన కుటుంబాలను భాగస్వామ్యులను చేసి మొక్కలను పెంచింది. రెండో దశలో 1998లో మారేడుమిల్లి మండలంలోని పూజారిపాకలు, వేటుకూరు గ్రామాల్లో 45 హెక్టార్లలో రబ్బరు సాగు చేపట్టింది. గిరిజన రైతులు తమ భూముల్లో రబ్బరు మొక్కలను సంరక్షణ చేసుకునేందుకు రబ్బరు బోర్డు రోజు వారి కూలి చెల్లించి ప్రోత్సహించేది. మూడో దశలో పందిరిమామిడికోట గ్రామంలో 2009–2015 మధ్య 75 కుటుంబాలకు చెందిన100 హెక్టార్ల భూమిలో రబ్బరు మొక్కలు నాటింది. మంచి ఫలితాలు రావడంతో రంపచోడవరం ఐటీడీఏ రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. 2009 నుంచి 2010 వరకు దఫదఫాలుగా 10 వేల ఎకరాల విస్తీర్ణంలో రబ్బరు మొక్కలు నాటించింది. సాంకేతిక సలహాలు అందక.. భారీ విస్తీర్ణంలో రబ్బరు సాగు చేపట్టడం, వీటి మొక్కల పెంపకంలో గిరిజనులకు సరైన సాంకేతిక సలహాలు అందకపోవడంతో అనేక చోట్ల నాటిన రబ్బరు మొక్కలు చనిపోయాయి. చివరకు 2500 ఎకరాల్లో మాత్రమే రబ్బరు తోటలు ఉన్నాయి. రబ్బరు సాగు ద్వారా ఆర్థికంగా బలపడిన గిరిజన రైతులు రబ్బరు మొక్కలు పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. గత పదేళ్ల కాలం నుంచి గిరిజన రైతులు సొంతంగా రబ్బరు షీట్లు తయారు చేసి మార్కెట్ చేసుకుంటున్నారు. మారేడుమిల్లి రబ్బరు మంచి గిరాకీ.. మారేడుమిల్లి ప్రాంతంలో తయారు చేస్తున్న రబ్బరుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రబ్బరు షీట్ల అమ్మకంలో గిరిజన రైతులు మోసపోయే పరిస్థితి లేదు. రబ్బరు షీట్ల మార్కెట్ రేటును రబ్బరు బోర్డు అధికారులు రోజు ఆన్లైన్లో తెలియజేస్తారు. అదే రేటుకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. రబ్బరు సాగుకు చల్లని వాతారణం అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం ఎగువ ప్రాంతాలు సముద్రమట్టానికి ఎత్తుగా ఉండడంతో ఇక్కడ వాతావరణం అన్ని పంటలకు అనుకూలం. ఎకరాలో 200 వరకు రబ్బరు మొక్కలు నాటుకోవచ్చు. ఏటా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు రబ్బరు ట్యాపింగ్ (రబ్బరు పాలు సేకరణ)అనుకూలం. ఉదయం రెండు గంటల పాటు ఒకరు కష్టపడితే ఎకరా విస్తీర్ణంలో ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. రబ్బరు బోర్డు ఎత్తివేసే దిశగా..? ఏజెన్సీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నాటిన రబ్బరు మొక్కలు ప్రస్తుతం పాల సేకరణకు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రంపచోడవరంలోని రబ్బరు బోర్డు కార్యాలయాన్ని ఎత్తివేసే దిశగా కేంద్ర రబ్బరు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ పనిచేసే ఏడీ, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసింది. రంపచోడవరం రబ్బరు కార్యాలయంలో ప్రస్తుతం ఒక్క రికార్డ్ అసిస్టెంట్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఐటీడీఏ సహకారం అందించాలి పొలంలో రబ్బరు మొక్కలను నాటుకోవాలని ఉంది. అనేక సార్లు ఐటీడీఏ అధికారులను మొక్కలు అడిగాం. ఐటీడీఏ మొక్క లు సరఫరా చేస్తే రబ్బరు తోట వేసుకుంటాం. గ్రామంలో అనేక మంది రబ్బరు మొక్కలు పెంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఐటీడీఏ సహకారం అందించాలి. గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసుకుంటాం. అందుకు సహకారం అందించాలి. – కత్తుల సోమిరెడ్డి, పందిరిమామిడికోట రబ్బరు సాగును ప్రోత్సహించాలి ఏజెన్సీలో రబ్బరు సాగుకు అనుకూలమైన మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో రబ్బరు సాగుకు అధికారులు చర్యలు చేపట్టాలి. గిరిజనులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎంతో అవకాశం ఉన్న రబ్బరు సాగుపై మారేడుమిల్లి ప్రాంత గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. – దూడ స్మిత్ , మారేడుమిల్లి 40 ఏళ్లపాటు ఆదాయం రబ్బరుమొక్క నాటిన ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో పాల సేకరణ చేసుకోవచ్చు. రబ్బరు మొక్క 40 ఏళ్ల పాటు ఆదాయం ఇస్తుంది. మొక్కలను జాగ్రత్తగా పెంచుకుంటే ఎకరానికి రూ. లక్ష వరకు పొందవచ్చు. మణిపూర్ లాంటి చల్లని ప్రాంతంలో కొండల్లో కూడా రబ్బరు సాగు చేస్తున్నారు. పాడేరు , అరకులో వాతావరణ పరిస్థితులు రబ్బరు సాగుకు అనుకూలం. రంపచోడవరం ఐటీడీఏ నాటిన రబ్బరు మొక్కలు పాల సేకరణకు వచ్చాయి. ఇలాంటి సమయంలో రైతులకు రబ్బరు బోర్డు టెక్నీషియన్ల సహకారం అవసరం ఉంది. – సరిపల్లి సాల్మన్‌రాజు, ఫాం ఆఫీసర్, మణిపూర్ -
పోడు భూములకు పట్టాలతో ఆనందం
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న కొండపోడు భూములపై హక్కులు లేక గిరిజనులు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఆ భూములపై వారికి హక్కులు లేవంటూ అటవీ అధికారులు వేధించేవారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆ భూముల్లో సాగు చేసిన పంటలను అటవీశాఖ సిబ్బంది నాశనం చేసేవారు. పోడు భూములను ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ అక్కడ గిరిజనులు ఏర్పాటు చేసుకున్న మకాంలు తగులబెట్టి బెంబేలెత్తించేవారు. ఏమీ చేయలేని నిస్సహాయతతో గిరిజనులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొనే వారు. వీరికి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలివ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారి బతుకులకు భరోసా ఏర్పడింది. రంపచోడవరం: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రంపచోడవరం నియోజకవర్గంలో 17,661 మంది గిరిజనులకు 45,871. 23 ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పించారు. పోడు పట్టాలు అందజేసి వరి కళ్లల్లో ఆనందం నింపారు. దీంతో పాటు స్థానిక గిరిజనులకు కమ్యూనిటీ పట్టాలు అందజేశారు. తద్వారా ఆ భూముల్లో లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇలా రంపచోడవరం డివిజన్లో 12,334 మంది గిరిజనులకు 49,508 ఎకరాలపై కమ్యూనిటీ హక్కులు కల్పించారు. దీంతో తమ కల నెరవేరిందంటూ ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు అండగా.. గిరిజనులకు అండగా వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు అండగా నిలిచారు. వారి సమస్యలను వైఎస్సార్ సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. హక్కు పట్టాలు మంజూరులో వారు కీలకపాత్ర పోషించారు. పోడు భూమి ఖాళీ చేయమన్నారు నా భర్తకు అనారోగ్యం. ముగ్గురు పిల్లలతో బొల్లికొండలో పోడు చేసుకుంటూ అక్కడే జీవిస్తున్నాం. పోడు వదిలి వెళ్లిపోవాలని అటవీ సిబ్బంది బెదిరించారు. అలా ఇబ్బంది పడుతూనే పోడు పట్టాల కోసం ఎదురు చూశా. సీఎం జగనన్న వచ్చిన తరువాత 3 ఎకరాల 85 సెంట్ల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. అందులో కందులు, కొర్రలు వేశాను. జీడిమామిడి మొక్కలు పెంచుకుంటున్నాను. –మర్రిక సీత, దాకరాయి, రాజవొమ్మంగి మండలం నిబంధనల మేరకు పట్టాలు అటవీ హక్కుల చట్టం ద్వారా అర్హత ఉన్న ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలు మంజూరు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించిన తరువాత పట్టాలు మంజూరు చేస్తాం. అటవీ హక్కుల చట్టం నిబంధనల ప్రకారం దరఖాస్తులు పరిశీలన జరుగుతుంది. ఏజెన్సీలో ఇప్పటికే పోడు భూములు సాగు చేసుకుంటున్న అనేక మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చాం. –కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్, రంపచోడవరం స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నా గత 25 ఏళ్ల నుంచి దాకరాయి దగ్గర బొల్లికొండలో నివాసం ఉంటూ అక్కడే కొండపోడు సాగు చేసుకుంటున్నాను. బుడములు, చోళ్లు , సామలు జీడిమామిడి మొక్కలు పెంచుకుంటుండగా అటవీ అధికారులు అనేక ఇబ్బందులు పెట్టారు. జగనన్న సీఎం అయిన తరువాత 8 ఎకరాల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. రెండు సార్లు రైతు భరోసా పొందాను. ప్రభుత్వ సాయం ఎన్నటికీ మరువలేను. –మర్రి లక్ష్మయ్య, దాకరాయి, రాజవొమ్మంగి మండలం -
మదిని దోచే .. మన్యం సొగసు
మనసుదోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే గోదావరి సోయగాలు.. ఎటు చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరు గాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్‌కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నదీ తీరంలో దృశ్యాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసిన తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. – రంపచోడవరం మరుపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్‌పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్‌పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్‌పై ప్రయాణం చేసి పాపికొండలు చేరుకుంటారు. పాపికొండలు మధ్య బోట్లో పర్యాటకుల ప్రయాణం ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్‌ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్‌పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్‌హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి ప్రకృతి గుడి.. సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తయిన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని క్యాంపెన్ టెంటుల్లో బస చేస్తారు. ఎత్తయిన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మారేడుమిల్లి చింతూరు ఘాట్‌రోడ్ గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాదిగా తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటకశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజమ్ ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్‌రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. -
ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా!
-
గుడిసె.. అందాలు మెరిసె..
రంపచోడవరం: తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో(గ్రాస్‌ల్యాండ్) ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరిసే ప్రాంతం గుడిసె.. ఎత్తయిన కొండలపై క్యాంపెయిన్ టెంట్లలో రాత్రంతా ఉండి తెల్లవారుజామున సూర్యోదయం, తాకుతూ వెళ్లే మబ్బులు ఇక్కడ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఈ గుడిసె అందాలు తనివితీరా చూసేందుకు రాష్ట్రాలు దాటి మరి తరలివస్తున్నారు. మారేడుమిల్లికి 40 కిలోమీటర్లు దూరం మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీలో గుడిసె గ్రామం ఉంది. గుడిసె గ్రామం చేరుకోవాలంటే మారేడుమిల్లి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏడు కొండలు ఎక్కిన తరువాత విశాలమైన మైదానం పచ్చని గడ్డి ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఈ కొండలు ఉంటాయి. అక్కడి నుంచి మరో నాలుగైదు కొండలు దిగితే గుడిసె గ్రామం వస్తుంది. పర్యాటకులు పచ్చని కొండలపైన రాత్రి బస చేస్తున్నారు. సాయంత్రానికి గుడిసె కొండలపైకి చేరుకుంటున్నారు. రాత్రంతా ఉండేందుకు కావల్సిన ఆహారం కూడా వెంట తెచ్చుకుంటున్నారు. గుడిసెలో పర్యాటకులు గడిపేందుకు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు అనుకూలంగా ఉంటుంది. మారేడుమిల్లి నుంచి గుర్తేడు రోడ్డులో ఆకుమామిడి వరకు ప్రయాణించి అక్కడి నుంచి పుల్లంగి మీదుగా గుడిసె వెళ్లే మార్గం వస్తుంది. క్యాంపెయిన్ టెంట్లకు పెరిగిన గిరాకీ గుడిసె వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగిన తరువాత క్యాంపెయిన్ టెంట్లు అద్దెకు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. రంపచోడవరం, మారేడుమిల్లిలో టెంట్లను అద్దెకు ఇస్తున్నారు. టెంట్ సైజును బట్టి రూ.500 నుంచి 750 వరకు వసూలు చేస్తున్నారు. దీనిలో వాటర్ ఫ్రూప్ టెంట్ ఇద్దరు పట్టేది రూ.500, ముగ్గురు ఉండేందుకు రూ.750 చార్జ్ చేస్తున్నారు. సాధారణ టెంట్లకు రూ.300 నుంచి రూ.450 వరకు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ వర్షం, చలి నుంచి పర్యాటకులకు పూర్తిగా రక్షణ కల్పిస్తాయి. రోజుకు సుమారుగా 2000 మంది పర్యాటకులు గుడిసె వెళుతున్నారు. వీరిలో కొంత మంది మారేడుమిల్లిలోని రిసార్ట్స్‌లో బస చేసి తెల్లవారు జామునే గుడిసె వెళుతున్నారు. మారేడుమిల్లి నుంచి పర్యాటకులను తరలించేందుకు ఆరుగురు పట్టే వాహనం రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేలు వసూలు చేస్తున్నారు. గుడిసె అందాలు మైమరిపిస్తున్నాయి ఎత్తయిన కొండలతో పచ్చని గడ్డి పరుపులుగా ఉన్న గుడిసె అందాలు మైమరిపిస్తున్నాయి. వణికించే చలిలో రాత్రంతా గడపడం ఎంతో సంతోషంగా ఉంది. ఉదయం కొండల మధ్య నుంచి సూర్యోదయం ఎంతో ఆనందం కలిగించింది. మబ్బులు తాకుతూ వెళుతుంటే ఆ ఆనందం ఎక్కడికి వెళ్లినా దొరకదు. – యూసఫ్ ఖాన్, పర్యాటకుడు, రాజమహేంద్రవరం పర్యాటకుల రాకతో ఉపాధి దొరకుతుంది ఏజెన్సీకి పర్యాటకుల రాకతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. క్యాంపెయిన్ టెంట్లు ఎక్కువ మంది అద్దెకు తీసుకుంటున్నారు. కళ్యాణ్ క్యాంయిన్ టెంట్స్ అండ్ టూరిజం పేరుతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కావాల్సిన రీతిలో భోజనం, వసతి ఏర్పాటు చేస్తున్నాం. – కళ్యాణ్, రంపచోడవరం -
సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి
సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసిన నాయకులకు వైఎస్సార్ సీపీలో సముచిత స్థానం లభిస్తుందనేది మరోసారి రుజువైంది. పార్టీకి అనంతబాబు చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత స్థానం కల్పిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సందర్భాల్లో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సీఎం ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ అధిష్టానం రంపచోడవరం నేత అనంత సత్య ఉదయభాస్కర్(అనంత బాబు)ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఆయన గెలుపు లాంఛనమే కానుంది. మున్సిపల్, జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఇటీవల వైఎస్సార్ సీపీ తిరుగులేని ఆధిక్యం చాటుకుంది. ఈ క్రమంలో అనంతబాబు గెలుపు నల్లేరుపై నడకే కానుంది. ‘ఓదార్పు’ నుంచీ జగన్ వెంటే.. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడు అనంతబాబు. ఓదార్పు యాత్ర నుంచి ఇప్పటి వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి నిలిచారు. అధికారంలో ఉండగా తమ పార్టీలో చేరాలని టీడీపీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయి. అక్రమ కేసులు పెట్టి వేధించినా తల వంచలేదు. తొమ్మిది రోజులు విశాఖ సెంట్రల్ జైలులో ఉంచినా పార్టీకే కట్టుబడి ఉన్నారు. ఆయన చెమటోడ్చి 2014లో వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యేగా గెలిపించినా ప్రలోభాలకు లొంగిన ఆమె పార్టీ ఫిరాయించారు. స్వయానా మేనమామలైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు సైతం వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించినా అనంతబాబు నమ్మిన జెండా వీడలేదు. రంపచోడవరం నియోజకవర్గంలో జగన్ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేశారు. అప్పటి నుండి జగన్ వెంట నడుస్తూ పార్టీని ఒంటి చేత్తో విజయపథాన నడిపిస్తూ మంచి గుర్తింపు పొందారు. చదవండి: (అన్నిటా అగ్రతాంబూలం.. రెండు ఎమ్మెల్సీ పదవులూ వారికే..) రాజకీయ కుటుంబ నేపథ్యం అనంత బాబు తాత వీర్రాజు, ముత్తాత పడాల వీర్రాజు పలు పర్యాయాలు అడ్డతీగల సమితి అధ్యక్షులుగా పని చేశారు. తండ్రి అనంత చక్రరావు 1982లో అడ్డతీగల సమితి ప్రెసిడెంట్, 1987లో అడ్డతీగల ఎంపీపీగా పని చేశారు. వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అనంత బాబు ఏజెన్సీలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఏజెన్సీలో తనదైన రాజకీయ వ్యూహంతో వైఎస్సార్ సీపీకి బలమైన బాటలు వేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పక్షాన నాగులపల్లి ధనలక్ష్మి సాధించిన 38 వేల ఓట్ల భారీ మెజారి అప్పట్లో ఒక రికార్డు. 2014, 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవశం చేసుకోవడంలో అనంతబాబు విశేష కృషి చేశారు. 2001లో అడ్డతీగల జెడ్పీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2019లో డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. టీడీపీ హయాంలో డీసీసీబీ పరిధిలోని పలు ప్రాథమిక సహకార సంఘాలు, బ్రాంచిల్లో జరిగిన అవినీతి బాగోతాలపై ఉక్కు పాదం మోపారు. -
రంపచోడవరంలో బన్నీ.. జంక్షన్ జామ్
సాక్షి, తూర్పుగోదావరి: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులోనే కాక టోటల్ దక్షిణాదిలో బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక స్టైలీష్ స్టార్ వచ్చాడని తెలిస్తే.. చాలు అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోతుంది. తాజాగా ఇలాంటి సీన్ తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరంలో రిపీట్ అయ్యింది. మంగళవారం రాత్రి బన్నీని చూడటానికి వచ్చిన అభిమానులతో రంపచోడవరం జంక్షన్ నిండిపోయింది. తమ అభిమాన హీరో వచ్చాడని తెలిసి వేలాదిగా బన్నీ అభిమానులు రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు. సెల్‌ఫోన్ వెలుగుల్లో బన్నీని చూసుకుని ఆనందపడ్డారు. కారు రూఫ్ టాప్‌లో నుంచి బయటికి వచ్చిన బన్నీ.. తనకోసం వేచి చూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫొటోను బన్నీ ట్వీట్ చేశారు. ‘థాంక్ యూ రంపచోడవరం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Thank you Rampachodavaram pic.twitter.com/4LXaIQA44t — Allu Arjun (@alluarjun) February 2, 2021 ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ గత నెల రోజులుగా రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి ఆటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మంగళవారం పూర్తయినట్టు సమాచారం. షూటింగ్ జరుగుతున్న సమయంలో అభిమానులు మారేడుమిల్లి వచ్చినా బన్నీ కలవడానికి వీలు పడలేదట. అందుకే రెండు రోజుల క్రితం మోతుగూడెం సమీపంలో కొంత మంది అభిమానులను కలిశారు. ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చేస్తుండగా దారిలో రంపచోడవరం వద్ద వేలలో పోగైన అభిమానులను కలిసి అభివాదం చేశారు. చదవండి: పుష్ప రిలీజ్ డేట్‌పై సుకుమార్ అసంతృప్తి! -
మునుపెన్నడూ చూడలేదు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/దేవీపట్నం/కుక్కునూరు: ఉభయ గోదావరి జిల్లాలకు వరద వస్తే అక్కడి ప్రజలకు తట్టాబుట్టా చేత పట్టుకుని పిల్లాపాపలతో ఎక్కడికి వెళ్లాలా అనే రోజులు పోయాయి. ఇప్పుడు ముందస్తుగానే సమాచారం ఉండటం, ప్రభుత్వం అన్ని సదుపాయాలతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వారికి ముంపు చింత తప్పింది. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారాయని తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం ప్రాంత వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఆశ్రమ కళాశాల పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసింది. వరద ముంపులో ఉన్న దేవీపట్నం, మూలపాడు, అగ్రహారం, పశ్చిమగోదావరి కుక్కునూరు మండలంలోని గ్రామాల్లో బాధితులను శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రం ► దేవీపట్నం, మూలపాడు, అగ్రహారం ముంపులో ఉన్నాయి. ► కొండపై ఉన్న శివాలయం, తొయ్యేరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో కొంతమంది తలదాచుకున్నారు. ► ఈ గ్రామాల్లో బాధితుల కోసం ప్రభుత్వం రంపచోడవరంలో అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, మంచాలు ఏర్పాటు చేశారు. ► వరదలు వచ్చే రెండు రోజులు ముందుగానే ఆ గ్రామాల్లోని 14 మంది గర్భిణులు, బాలింతలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఆగస్టు 16న వరద ముంచెత్తడంతో సుమారు 80 మందిని ఈ కేంద్రానికి తీసుకువచ్చారు. గతంలో బిక్కుబిక్కుమంటూ.. గతంలో వరద వచ్చినప్పుడు కొండపై పునరావాసం కల్పించినా కనీస వసతులు లేక బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చేదని పునరావాస కేంద్రంలో ఉన్న వెంకన్న చెప్పాడు. ఈసారి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి అన్ని సౌకర్యాలు కల్పించిందని తెలిపాడు. అధికారులు కంటికి రెప్పలా చూసుకున్నారని ఆ కేంద్రంలో ఉన్న వారు ముక్తకంఠంతో తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు మూడు రకాల వంటకాలతో రుచికరమైన భోజనం, 3 గంటలకు టీ, రాత్రి ఏడయ్యేసరికి వేడివేడి భోజనం పెడుతున్నారని అక్కడి వారు చెప్పారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ► పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు మండలంలో 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ► ప్రతి పునరావాస కేంద్రానికి స్పెషల్ ఆఫీçసర్‌ను కేటాయించి అన్ని సౌకర్యాలు అందేలా చూస్తున్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, నీటికి ఇబ్బంది లేకుండా ట్యాంకర్లు అందుబాటులో ఉంచారు. ► మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలపై అక్కడ తలదాచుకుంటున్న వారు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో దారుణమైన పరిస్థితులుండేవి గతంలో పునరావాస కేంద్రంలో చాలా దారుణమైన పరిస్థితులుండేవి. చాలా అవస్థలు పడాల్సి వచ్చేది. తేళ్లు, పాములతో సావాసం చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమయానికి అన్నీ అందుతున్నాయి. వైద్యులు నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. – బుర్రే ఆనందరావు, వరద బాధితుడు, దేవీపట్నం ఇక్కడే మెడికల్ క్యాంప్ పునరావాస కేంద్రం చాలా శుభ్రంగా ఉంది. రోజుకు రెండుసార్లు గదులను శుభ్రం చేస్తున్నారు. ఇక్కడే మెడికల్ క్యాంపు నిర్వహిస్తుండటంతో ఎటువంటి ఇబ్బందీ లేదు. వరద సమయంలో ఇక్కడ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. – కెచ్చెల భూలక్ష్మి, వరద బాధితురాలు, అగ్రహారం -
రంపచోడవరంలో కుండపోత
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల కుండపోత వర్షం పడింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రికార్డు స్థాయిలో 10.37 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ, మండపేటలో భారీ వర్షం కురవగా.. అమలాపురం, రాజమహేంద్రవరాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ప్రొద్దుటూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ► గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, గుంటూరు, నరసరావుపేట, తెనాలితో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం రైతులకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ► అనంతపురం జిల్లాలోని 44 మండలాల్లో 13.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ► వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ► ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు, చీమకుర్తిలో భారీ వర్షం పడింది. మూడు రోజుల పాటు వర్షసూచన నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉత్తర–దక్షిణ ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రలో మంగళవారం కూడా విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. -
అంతరిక్ష ప్రయాణం చేస్తా.. సహకరించండి
చింతూరు(రంపచోడవరం): ఎంతో సాహసోపేతమైన అంతరిక్ష యాత్రకు వెళ్లేందుకు మన్యానికి చెందిన ఓ అడవిబిడ్డ ఆరాట పడుతున్నాడు. తద్వారా దేశ, రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠ ఇనుమడింపజేస్తానన్నాడు. తను ఆర్థికంగా ఆదుకుని యాత్రకు అవకాశంతో పాటు అనుమితినివ్వాలని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. చింతూరు మండలం కొత్తపల్లికి చెందిన గిరిబిడ్డ దూబి భద్రయ్య 2016లో రాష్ట్రం తరఫున ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి విజేతగా నిలిచాడు. అనంతరం అరకు స్పోర్ట్స్ పాఠశాలలో కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అధికారుల విన్నపం మేరకు ఎవరెస్ట్ కోచ్‌గా అవతారమెత్తి గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లోని విద్యార్థులకు ఎవరెస్ట్ అధిరోహణలో శిక్షణ ఇస్తున్నాడు. భద్రయ్య శిక్షణలో రాటుదేలిన గురుకుల విద్యార్థులు 2017లో 14 మంది, 2018లో 10 మంది ఎవరెస్టును అధిరోహించారు. అంతరిక్షంపై ఆశ గతంలో నాసా ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లిన భారత్‌కు చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్ స్ఫూర్తితో తాను అంతరిక్ష యాత్ర చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు భద్రయ్య ‘సాక్షి’కి తెలిపాడు. గిరిజన ప్రతిభను ఆకాశానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి అవకాశం కల్పించాలన్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో అభిషిక్త్ కిశోర్‌ను కలిసి తనకు ప్రభుత్వ ద్వారా సాయం చేయాలని కోరాడు. స్పందించిన ఆయన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు. గిరిబిడ్డల సత్తా చాటుతా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సమయంలోనే అంతరిక్ష యాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. కానీ ఆర్థికంగా అది ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడుకున్నది కావడంతో వేచి చూస్తున్నాను. ప్రభుత్వం సాయం చేస్తే గిరిబిడ్డల సత్తా చాటుతాను. – దూబి భద్రయ్య -
రేపు బోటు ప్రమాద ప్రాంతానికి సీఎం జగన్
సాక్షి, రంపచోడవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో బోటు మునక దుర్ఘటనలో 8మంది మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదం నుంచి 27మంది సురక్షితంగా బయటపడగా, సుమారు 25మంది ఆచూకీ లభించాల్సి ఉందని తెలిపింది. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆరు అగ్నిమాపక సిబ్బంది, నేవీ గజ ఈతగాళ్ల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రెండు హెలికాఫ్టర్లు, 8 బోట్లు, ఆస్కా లైట్లు, ఇతర రెస్క్యూ పరికరాలతో రాత్రికి కూడా గాలింపు చర్యలు కొనసాగనున్నాయి. సోమవారం ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందాలు సైడ్ స్కాన్ సోనార్‌తో మృతదేహాల గాలింపులో పాల్గొంటాయని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఘటనా స్థలానికి రేపు సీఎం జగన్ దేవిపట్నం బోటు ప్రమాద ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పర్యటిస్తారని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, కురసాల కన్నబాబు తెలిపారు. ప్రమాద బాధితులను సీఎం పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు. కాగా బోటు ప్రమాదంలో గాయపడి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ...’ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ప్రమాదం నుంచి ఇప్పటివరకూ 20మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలు లభించాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి తరలించేందుకు ఏర్పాటు చేశాం. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోటులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత లేదు. ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌తో గాలింపు చర్యలు కొనసాగాయి. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.’ అని మంత్రులు పేర్కొన్నారు. చదవండి: శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు... క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి బోటులో ఎక్కువమంది తెలంగాణవారే! పాపికొండలు విహార యాత్రలో విషాదం! రాయల్ వశిష్టకు అనుమతి లేదు... బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్ -
శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు...
సాక్షి, రంపచోడవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ జానకి రామారావు ప్రాణాలతో బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ‘బ్రేక్‌ఫాస్ట్ చేసి అందరం కూర్చున్నాం. మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయని బోటు సిబ్బంది చెప్పారు. ప్రమాదంకు ముందే ఇది డేంజర్ జోన్... బోటు అటు, ఇటు ఊగుతుంది. మీరు భయపడాల్సిన పని లేదని చెప్పారు. అయితే ఇంతలోనే బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో పాస్టిక్ కుర్చీల్లో కుర్చున్నవారంతా ఓ వైపుకు వచ్చేశారు. బరువు ఎక్కువ కావడంతో బోటు యథాస్థానంలోకి రాలేకపోయింది. అదే సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారంతా ఒక్కసారిగా రెండో అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది డ్రైవర్ తప్పిదమా లేకుంటే బోటు ఒరిగిపోవడమా అనేది స్పష్టంగా తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే నేను శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డాను.’ అని జనకీ రామరావు వివరించారు. కాగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చెందిన జానకి రామారావు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన తన భార్య జ్యోతితోకలిసి రెండు రోజుల క్రితం విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రమాదంలో భార్యతో పాటు బావమరిది, బావమరిది భార్య, వారి కుమారుడు గల్లంతు కాగా, జానకి రామారావు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఈ ప్రమాద వార్తతో శ్రీనివాస కాలనీలో విషాదం నెలకొంది. మరోవైపు హయత్ నగర్‌కు చెందిన విశాల్, ధరణీకుమార్, అర్జున్, లడ్డు గల్లంతు అయ్యారు. చదవండి: క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి బోటులో ఎక్కువమంది తెలంగాణవారే! పాపికొండలు విహార యాత్రలో విషాదం! రాయల్ వశిష్టకు అనుమతి లేదు... బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్ -
మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయనగా బోటు ప్రమాదం
-
క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ
సాక్షి, రంపచోడవరం: గోదావరి బోటు ప్రమాద బాధితులను మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అందుబాటులో వైద్య సేవలు లేకుంటే తక్షణమే మెరుగైన వైద్యం కోసం విశాఖ, రాజమండ్రికి తరలించారని ఆదేశాలు ఇచ్చారు. బాధితు కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు తమ వారు గోదావరిలో ప్రమాదానికి గురైయ్యారన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరువుతున్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు బోటు ప్రమాద ఘటనపై సమాచారం కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తమ వారి వివరాలు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-233-1077కు ఫోన్ కాల్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. చదవండి: సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి బోటులో ఎక్కువమంది తెలంగాణవారే! పాపికొండలు విహార యాత్రలో విషాదం! రాయల్ వశిష్టకు అనుమతి లేదు... బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్ -
క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ
-
ప్రళయ గోదావరి!
జలప్రళయమొచ్చినట్టుగా గోదావరి ఉప్పొంగి పోతోంది. ఇరుతీరాలనూ ఏకం చేస్తూ.. ఒడ్డున ఉన్న గ్రామాల్లోకి ఉరకలెత్తి ముంచెత్తుతోంది. ఉపనదులైన సీలేరు, శబరి, ఇంద్రావతి పొంగి ప్రవహిస్తూండడంతో.. వాటి నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి గంటగంటకూ తీవ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద 51 అడుగులకు నది నీటిమట్టం చేరింది. పోలవరం కాఫర్ డ్యామ్ పాపంతో దేవీపట్నాన్ని వరద ముంచెత్తింది. అక్కడి నుంచి దిగువకు ఉరుకుతూ ధవళేశ్వరం బ్యారేజీని దాటుకొని వడివడిగా కడలి దరికి పరుగు తీస్తోంది. ఆ మార్గంలో ఉన్న కోనసీమ లంకల్నీ ముంచెత్తుతోంది. దీంతో నదీ తీర గ్రామాల ప్రజలు ప్రచండ మారుతంలో గడ్డిపోచల్లా గజగజా వణికిపోతున్నారు. మరోసారి భారీ వరద ముప్పు తలెత్తడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం టౌన్) : ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు వచ్చిన వరదలు మిగిల్చిన నష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే.. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద నీటితో జిల్లాలో జలప్రళయం సృష్టిస్తోంది. ఫలితంగా జిల్లాలోని మొత్తం 86 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువన ఉన్న ఏజెన్సీ, విలీన మండలాలతో పాటు దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరింది. సోమవారానికి ఇది 55 నుంచి 58 అడుగులకు చేరవచ్చని భావిస్తున్నారు. భద్రాచలం వద్ద అర్ధరాత్రికల్లా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవీపట్నం.. అతలాకుతలం నెల రోజుల వ్యవధిలో గోదావరికి మూడుసార్లు వచ్చిన వరద దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు గ్రామాలను అతలాకుతలం చేసింది. గురువారం నుంచి పెరుగుతూ వచ్చిన గోదావరి ఆదివారం ఉదయానికి దేవీపట్నం గ్రామాన్ని ముంచేసింది. ఇప్పటివరకూ దేవీపట్నం చుట్టూ పంటపొలాల్లోకి మాత్రమే చేరిన వరద నీరు ఆదివారం గ్రామంలోకి చొరబడింది. సాయంత్రానికి సుమారు నాలుగు అడుగులు పెరిగి గ్రామం మొత్తం జలమయమైంది. దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, ఏనుగులగూడెం, గానుగులగొంది, అగ్రహారం, మూలపాడు, పోశమ్మ గండి గ్రామాలకు చెందిన వరద బాధితులు పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నాలుగు రోజులుగా మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మూడు రోజుల నుంచి 18 పడవలతో 85 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి ఎక్కువవడంతో బాధితులు ఆందోళనతో పడవల కోసం నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయానికి దండంగి వాగు పోటు గ్రామాన్ని తాకింది. గ్రామంలో ఎస్సీ కాలనీలో పలు ఇళ్లు నీట మునిగాయి. పోశమ్మ గండి వద్ద అమ్మవారి ఆలయంలోకి వరద నీరు చొచ్చుకు పోయింది. అమ్మవారి విగ్రహం సగభాగం వరకూ వరద నీరు ప్రవహిస్తోంది. పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద ఆదివారం సాయంత్రానికి 27.4 అడుగులకు నీటిమట్టం చేరింది. కాఫర్ డ్యామ్‌కు ఇరువైపుల నుంచీ వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పై నుంచి భారీ స్థాయిలో వరదనీరు పోతున్నప్పటకీ ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో బ్యాక్ వాటర్ కారణంగా వరద పోటు ఎక్కువైంది. గత నెలలో వచ్చిన వరదల కంటే ఎక్కువ స్థాయిలో వరద నీరు గోదావరికి చేరనుండడంతో వచ్చే మూడు రోజుల పాటు దేవీపట్నం వద్ద వరద ఉధృతి మరింత ప్రమాదకర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆదివారం దేవీపట్నం గ్రామం మొత్తాన్ని ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దేవీపట్నం జాలరిపేట పరిసర ప్రజలు ఉమాచోడేశ్వరస్వామి ఆలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వీరవరం మండల కార్యాలయం వద్దకు తరలివెళ్లారు. దేవీపట్నం ఎగువన మంటూరు, తున్నూరు, కొండమొదలు, కచ్చులూరు, గొందూరు తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆయా గ్రామాలకు నియమించిన సెక్టోరియల్ అధికారులు సహాయ చర్యలు అందించేందుకు తరలి వెళ్లారు. ఆదివారం వరద పోటు ఎక్కువై చినరమణయ్యపేట నుంచి వీరవరం వరకూ రహదారి పైకి వరద నీరు చేరింది. రంపచోడవరం ఆర్డీవో శ్రీనివాసరావు ఆదివారం దేవీపట్నం, వీరవరం, తొయ్యేరుల్లో పర్యటించి, వరద పరిస్థితిని సమీక్షించారు. శివాలయం వద్ద తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. బోర్నగూడెం వసతి గృహానికి తరలిరావాలని కోరినప్పటికీ అక్కడ సురక్షితంగానే ఉన్నామని బాధితులు తెలిపారు. కోనసీమ లంకలకు వరద పోటు గోదావరికి వరద పోటెత్తడంతో కోనసీమలోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీపాయలు, లంక గ్రామాలతో ఉండే కోనసీమ ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద ప్రభావిత మండలాలుగా ఉన్న సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సాధారణంగా ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక సమయానికే దాదాపు 50 వరకూ కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధానికి చేరువలో ఉంటాయి. ఇక రెండో ప్రమాద హెచ్చరిక రాగానే ఆ 50 లంక గ్రామాల పరిస్థితులు మరీ దయనీయంగా మారుతాయి. ఆదివారం సాయంత్రానికే అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లోని అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, జి.పెదపూడి లంక, బూరుగులంక, అరిగెలవారి లంక, ఊడిమూడిలంక, లంక ఆఫ్ ఠానేలంక, కమినిలంక, గురజాపులంక, సలాదివారిపాలెం తదితర 16 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద కాజ్వే ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఆ మండలంలోని అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాలకు, బయటి ప్రపంచానికి రాకపోకలు తెగిపోతాయి. రాజోలు దీవిలోని అప్పనరామునిలంక, సఖినేటిపల్లి లంక, రామరాజులంక, మధ్యలంక తదితర గ్రామాల్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. పి.గన్నవరం మండలంలో ఇప్పటికే బూరుగలంకను వరద చుట్టిముట్టింది. వరద ఉధృతి పెరుగుతూండడంతో జి.పెదపూడిలంక రేవులో రాకపోకలను ఆదివారం సాయంత్రం నుంచే నిలిపివేశారు. అయినవిల్లి మండలం శానపల్లిలంక – కె.గంగవరం మండలం కోటిపల్లి మధ్య గౌతమి నదిలో వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ నదీపాయపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులను నిలిపివేశారు. రాత్రి సమయంలో అమాంతం వరద నీరు చుట్టిముట్టినా తమ పశువులకు ఎలాంటి ప్ర మాదం లేకుండా కొన్ని లంక గ్రామాల ప్రజలు ముందు జాగ్రత్తగా వాటిని సురక్షిత ప్రాంతాల కు తరలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కోనసీమలోని అన్ని మండలాల అధికారులనూ ఇప్పటికే అప్రమత్తం చేశామని అమలాపురం ఆర్డీవో బి.వెంకటరమణ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండి రాత్రంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి తక్షణ సమాచారం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు కూడా మండలాల్లో ఉండి వరద రక్షణ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తెల్లారేసరికి ధవళేశ్వరం వద్ద కూడా అదే హెచ్చరిక జారీ చేసే అవకాశాలుంటాయన్న ఉద్దేశంతో మరింత అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెంకటరమణ తెలిపారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు 11.75 అడుగులకు నీటిమట్టం చేరడంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటగంటకూ పెరుగుతూ రాత్రి 9 గంటలకు 12.90 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుంచి 11,43,206 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8,700 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం సోమవారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరే అవకాశం ఉందని ఫ్లడ్ కన్జర్వేటర్, హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు తెలిపారు. వరదలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా.. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు భారీగా పెరుగుతూండడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 9 గంటలకు 50.90 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూండటంతో గోదావరి నీటిమట్టాలు భారీగా పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.77 మీటర్లు, పేరూరులో 14.86 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.38 మీటర్లు, కూనవరంలో 18.83 మీటర్లు, కుంటలో 10.97 మీటర్లు, కొయిదాలో 22.24 మీటర్లు, పోలవరంలో 13.28 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.62 మీటర్ల మేర నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
మేఘాలే తాకాయి.. ‘హిల్’ హైలెస్సా..
ఎత్తయిన పచ్చని కొండలు.. వాటి మధ్య దవళవర్ణ శోభితమైన మేఘాలు తాకుతూ వెళితే ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూసేందుకు ఎంతో హాయిగా ఉంటుంది. అటువంటి ఆకర్షణీయమైన దృశ్యాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు వేదికయ్యాయి. ఏజెన్సీలోని ఘాట్ రోడ్లు, రంపచోడవరం సమీపంలోని భూపతిపాలెం ప్రాజెక్టు, సున్నంపాడు, మారేడుమిల్లి వద్ద కొండకొండకూ మధ్య తేలియాడుతూ వెళుతున్న మేఘమాలికలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. -
విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం
తమ కుమారుడు బాగా చదువుతున్నాడు. ఇంకా బాగా చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని ఆ తల్లిదండ్రులు భావించారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఆ విద్యార్థి కూడా చదువులో రాణిస్తున్నాడు. ఐటీడీఏ ప్రోత్సాహంతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలోనూ అతడికి చోటు లభించింది. దీంతో రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో చేరాడు. అయితే విధి వక్రించింది. అతడి ఆశలను చిదిమేస్తూ అనారోగ్యం, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఆ బాలుడు మృతి చెందాడు. కన్నవారిని, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాడు. సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ గిరిజన విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి మృతదేహంతో ఆ గ్రామ గిరిజనులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. మండలంలోని బి.రామన్నపాలెం గ్రామానికి చెందిన కంగల సాయిబాబాదొర(16) బుధవారం రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో మృతి చెందాడు. వారం రోజుల నుంచి విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి జోగిదొర పాఠశాలకు వెళ్లి కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏటా ఐటీడీఏ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన కార్పొరేట్ పాఠశాలకు ఐటీడీఏ ఏటా ఫీజులు చెల్లిస్తోంది. దీనిలో భాగంగానే సాయిబాబాదొర హోలీ ఎంజెల్సీలో పదో తరగతి చదువుతున్నాడు. ఐటీడీఏ ఎదుట ఆందోళన హోలీ ఏంజెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి ఐటీడీఏ ఎదుట విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేశారు. వారం రోజుల నుంచి విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోలేదని, కనీసం ఇంటికి ఫోన్ చేసుకునేందుకు కూడా ఫోన్ ఇవ్వలేదని ఆరోపించారు. సకాలంలో వైద్యం చేయించి ఉంటే విద్యార్థి మృతి చెందేవాడు కాదని గ్రామస్తులు వాపోయారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని మృతదేహంతో బైఠాయించారు. దీంతో ఐటీడీఏ ఏపీఓ నాయుడు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహం తరలింపు రాజమహేంద్రవరం క్రైం: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలన గిరిజన విద్యార్థి మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. మరోవైపు పాఠశాల యాజమాన్యం చర్యలు కూడా ఆ ఆరోపణలు వాస్తవమన్నట్టుగానే వ్యవహరించారు. బాలుడు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా తమ వద్ద ఉన్న మాత్రలు వేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నేపథ్యంలో సాయిబాబు దొర పరిస్థితి విషమించడంతో హుటాహుటిన మంగళవారం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బాలుడు స్వగ్రామం తరలించారు. పాఠశాలపై అనేక ఆరోపణలు గతంలో హోలీ ఏంజల్స్ పాఠశాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. మూడేళ్ల క్రితం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉన్న సమయంలో గిరిజన విద్యార్థులపై దాడులకు పాల్పడడం, వారిని కొట్టడం, మంచి భోజనం పెట్టకుండా హింసించడం, వంటివి చేయడంతో అప్పట్లో పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. అప్పటి సబ్ కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరిపారు. అప్పటి ప్రభుత్వం పాఠశాల యాజమాన్యంపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా, పాఠశాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాఠశాల యాజమాన్యం మరలా పాత ధోరణి అవలంభించడం, విద్యార్థులకు సరైన వసతి భోజనం పెట్టకపోవడంతో వారు పౌష్టికాహార లోపంతో ఉంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ పాఠశాల పై దృష్టి సారించి, విద్యార్థులను విచారణ చేసి పాఠశాలలో ఏవిధంగా జరుగుతున్నది సమగ్ర విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పర్యవేక్షణ కరువు ఐటీడీఏ జిల్లాలోని ఏడు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఏటా ప్రవేశం కల్పిస్తోంది. ఏటా మూడు, ఐదు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. వీరు పదో తరగతి పూర్తయిన తరువాత బయటకు వస్తారు. ఇదే తరహాలో హోలీ ఎంజెల్స్ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ రెండేళ్ల క్రితం గిరిజన విద్యార్థులు తమకు ఆహారం సరిగా పెట్టడం లేదని ఆరోపిస్తూ ఐటీడీఏ పీవోను కలిసి ఆందోళన చేశారు. గిరిజన సంక్షేమ విద్యా విభాగం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తరువాత వారి బాగోగులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడ విద్యార్థులు ఏం తింటున్నారో, ఎలా చదువుతున్నారో, అసలు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది? అనేది తెలుసుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం పరిపాటిగా మారింది. -
టీడీపీ ప్రభుత్వం నిండా ముంచింది..
సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి): గత టీడీపీ ప్రభుత్వం తమను నిండా ముంచిందని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీఎంఆర్సీలో సోమవారం ఆదివాసీ డెవలప్మెంట్ రైట్స్ ఫోరం (ఏడీఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో పది గ్రామాలకు చెందిన నిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారం గ్రామానికి చెందిన కె.వెంకట రమణ మాట్లాడుతూ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణ విషయంలో టీడీపీ ప్రభుత్వ పాలకులు, అధికారులు మోసం చేశారని ఆరోపించారు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మూడు రకాల ఇళ్ల నమూనాలను కాగితాలపై చూపించారు. అయితే ఇళ్లను మాత్రం ఆ నమూనాల్లో నిర్మించడం లేదన్నారు. అధికారులకు నచ్చిన విధంగా కాంట్రాక్టర్ ఇళ్లు కట్టుకుంటూ వెళ్లారని, స్థల సేకరణ, ఇళ్ల నిర్మాణంలో నిర్వాసితుల ప్రమేయం లేకుండా చేయడం దారుణమని ఆయన విమర్శించారు. గ్రామసభల్లో అధికారులు చెప్పిన మాటలకు.. క్షేత్ర స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలకు పొంతన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (ఎఫ్ఆర్ఎల్) ముంపునకు గురికాని భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని సరుగుడు గ్రామంలో ముంపునకు గురికాని భూములకూ నష్టపరిహారం చెల్లించారని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎఫ్ఆర్ఎల్ పైభాగంలో ఉన్న ఐదు మండలాల్లో ముంపునకు గురికాని భూమి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆ భూముల్లోకి వెళ్లి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదన్నారు. జీవనోపాధి కోల్పోయే రైతులను అదుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్‌అంఆర్ ప్యాకేజీ వర్తింప జేయాలన్నారు. పశ్చిమ గోదావరిలో కట్ ఆఫ్ డేట్‌కు సంబంధం లేకుండా ఖాళీ చేసిన గ్రామాల్లో ఒప్పంద పత్రాలు ఇచ్చారని తెలిపారు. ఇక్కడ కూడా అదే విధంగా ఒప్పంద పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రహారానికి చెందిన అబ్బాయిరెడ్డి మాట్లాడుతూ నచ్చిన చోట ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన అధికారులు.. అందరికీ ఒక్క చోటే ఇళ్ల నిర్మాణం చేశారన్నారు. దీంతో అందరికీ ఉపాధి ఉండే పరిస్ధితి లేదు. ఏనుగులగూడెం గ్రామానికి చెందిన కుంజం భద్రం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యంతోనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గోదావరిలో వరద నీరు ఆందోళన కలిగిస్తుందని ఇంటి వద్ద ఫొటోలు తీసుకునేందుకు రావాలని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్‌కు నష్టం జరగకుండా, బిల్లుల చెల్లింపు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కొమరం పోశమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కర్రి అబ్బాయిరెడ్డి, మాజీ సర్పంచి కొమరం కన్నయ్యమ్మ, ఏడీఆర్‌ఎఫ్ సభ్యుడు జి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
గురుస్సాక్షాత్ అపర కీచక!
సాక్షి, రంపచోడవరం(తూర్పుగోదావరి) : మంచి చదువు లభిస్తుందనే కొండంత ఆశతో ఆదివాసీ బాలికలు ఆశ్రమ పాఠశాలల్లో చేరుతున్నారు. అయితే వారికి విద్య నేర్పాల్సిన గురువులే అత్యాచారాలకు పాల్పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో 50 సంవత్సరాల లోపు ఉపాధ్యాయులను నియమించరాదనే నిబంధన ఉంది. అయితే అది రంపచోడవరం ఐటీడీఏలో అమలుకు నోచుకోవడం లేదు. దాంతో 40 ఏళ్ల లోపు వయసుగలవారు ఉపాధ్యాయులుగా, వార్డెన్లుగా ఉంటున్నారు. వారిలో చాలామంది విద్యార్థినులను లొంగదీసుకోవడం, అబార్షన్లు చేయించడం పరిపాటిగా మారింది. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ నిందితులను సస్పెండ్ చేయడం వంటి స్వల్ప శిక్షలు వేసి తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారు. దీంతో ఇలాంటి నేరాలు చేసేందుకు వారు వెనుకాడడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 93 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 34 గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలు. ఆశ్రమ కళాశాలల్లో బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోవడం లేదు. తాజాగా వై రామవరం మండలం దాలిపాడు గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై వార్డెన్ అత్యాచారాలు చేసి, పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తీవ్రంగా స్పందించారు. వార్డెన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్ చేయడమే కాకుండా జైలుకు పంపించారు. గతంలో బోదులూరు, యార్లగడ్డ, టేకులవీధి, చింతూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని పెండింగ్ విచారణ పేరుతో తిరిగి విధుల్లో తీసుకున్నారు. ఆ వ్యవహారాల్లో ‘డబ్బులు’ కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు సంఘటనల్లో బాలికలపై లైంగిక వేధింపులు నాలుగు గోడలకే పరిమితమవుతున్నాయి. అడపాదడపా మాత్రమే బయటకు వస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమం పట్టని ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైది. లోతట్టు ప్రాంతంలో కొంత మంది వార్డెన్లు గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. పనిదినాల్లో నిరంతరం ఆశ్రమ పాఠశాలలో ఉండాల్సిన వార్డెన్లు రాత్రి పూట కొన్ని చోట్ల ఉండడం లేదు. అక్కడే ఉండే ఏఎన్ఎంలు, నాల్గో తరగతి సిబ్బందికి అప్పగించి వెళ్లిపోతున్నారు. ప్రక్షాళన చేయాలి ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కొంత మంది అధికారుల తీరుతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది. ఆశ్రమ పాఠశాలలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాలిపాడు ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న సంఘటనను తీవ్రంగా పరిగణించాలి. గిరిజన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించాలి. –నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే -
విద్యార్థినితో టీచర్ సహజీవనం.. పెళ్లి!
వై.రామవరం (రంపచోడవరం): పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి చదివే బాలికను మోసం చేసి సహజీవనం చేశాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. తనకు తొలుత వివాహం జరిగినట్టు, ఇద్దర్నీ బాగా చూసుకుంటానని ఉపాధ్యాయుడు చిన్నబ్బాయి లిఖితపూర్వకంగా గ్రామ పెద్దలకు రాసిచ్చిన లేఖ, పెళ్లి ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తుండటంతో కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని దాలిపాడు గ్రామ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణను వివరణ కోరగా.. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు వారం రోజుల కిందట వచ్చి, తమ బిడ్డకు టీసీ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి తీసుకుపోయారన్నారు. అంతకుమించి తమకు ఏమీ తెలియదని చెప్పారు. ఉపాధ్యాయుడి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
నేడు అల్లూరి జయంతి : జ్ఞాపకాలు అక్కడ పదిలం
సాక్షి, రంపచోడవరం(రాజమండ్రి) : తూర్పు మన్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం ఇప్పటికీ గిరిజనాల్లో స్ఫూర్తిని రగిలిస్తోంది. అల్లూరి సీతారామరాజును ఏజెన్సీ గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఆదివాసీల తరఫున బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యం చేసి అల్లూరి పోరాడారు. అల్లూరి రంపచోడవరం, అడ్డతీగల, దేవీపట్నం, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తికెళ్లిన భవనాలు నేటికీ పదిలంగా ఉంచారు. అల్లూరి జరిపిన పోరాటాలకు జ్ఞాపకాలుగా ఉంచారు. రంప గిరిజనుల తరఫున అల్లూరి చేసిన రంప పితూరి చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అప్పట్లో అల్లూరి అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టలో రెండేళ్లు వ్యవసాయం చేశారు. ఏజెన్సీలో ఏటా గిరిజనులు అల్లూరి జయంతి, వర్ధంతి ఘనంగా నిర్వహిస్తారు. పైడిపుట్టలో వ్యవసాయం అడ్డతీగల మండలం పైడిపుట్ట గ్రామంలో అల్లూరి సీతారామరాజు కొంతకాలం వ్యవసాయం చేశారు. విప్లవ భావాలతో ఉన్న ఆయన దృష్టిని మార్చాలని అల్లూరి తండ్రి స్నేహితుడు, పోలవరం డిప్యూటీ కలెక్టర్ ఫజుల్లాఖాన్ సీతారామరాజును పైడిపుట్ట పంపించి 30 ఎకరాల భూమి ఇచ్చారు. తల్లి సూర్యనారాయణమ్మ, తమ్ముడు సత్యనారాయణరాజులో కలిసి వ్యవసాయం చేశారు. మూలికా వైద్యం చేసే అల్లూరి వద్దకు గిరిజనులు ఎక్కువగా వచ్చే వారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండాలని, ఉద్యమాలపై వెళ్లవద్దని చెప్పారు. ఫజుల్లాఖాన్ చనిపోయాక అల్లూరి విప్లవోద్యమ బాట పట్టారు. పైడిపుట్ట గ్రామం తల్లిని, తమ్ముడిని ఎడ్లబండిపై భీమవరం పంపించి తాను మాత్రం అడవుల్లోకి వెళ్లిపోయారు. పైడిపుట్టలో నివాసం ఉన్న సీతారామరాజు రోజూ అడ్డతీగల సైకిల్‌పై వెళ్లి పత్రికలు చదివేవారు. సీతారామరాజుపై నిఘా ఉంచి బ్రిటిష్ వారు రామరాజు దినచర్య రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆయన ఉద్యమంలోకి వెళ్లే ముందు పైడిపుట్టలో భూమి ఇచ్చిన దుశ్చర్తి ముఠాదారు చెక్కా లింగన్నదొరకు తిరిగి భూమిని ఇచ్చి రాసిన లేఖ నేటికీ పదిలంగా ఉంది. రంప రాజ్యాన్ని మునసబుదారు భూపతి పాలనలో ఉండేది. తరువాత అతడి వారసులు పాలించారు. వారు పంట, తాటిచెట్లపై పన్నుల భారం మోపారు. అది తట్టుకోలేక గిరిజనులు తిరగబడ్డారు. గిరిజనులు జరిపిన రంప పితూరీకి అల్లూరి అండగా నిలిచారు. ఏజెన్సీలో పోలీస్స్టేషన్లపై అల్లూరి దాడి బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు సాయుధ పోరాటమే మార్గమని భావించిన అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు.1922లో విశాఖ జిల్లా చింతపల్లి, 23న కేడీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌పై దాడులు చేసి ఆయుధాలు కొల్లాగొట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనికులను రంగంలో దింపింది. కొంత కాలం వ్యవధి తరువాత 1922 అక్టోబర్ 15న అడ్డతీగల, 19న రంపచోడవరం పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై తన అనుచరులతో దాడి చేసిన అల్లూరి సీతారామరాజు తాను గతంలో నివాసం ఉన్న పైడిపుట్ట వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది. అక్కడ కొంత సమయం గిరిజనులతో అల్లూరి మాట్లాడారు. అక్కడి నుంచి గంగవరం మండలం మోహనాపురం మీదుగా రంప గ్రామానికి వచ్చారు. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి అల్లూరి నడయాడిన మన్యం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి అల్లూరి దాడి చేసిన పోలీస్స్టేషన్లు, ఆయన నివాసం, వ్యవసాయం చేసిన పైడిపుట్ట, బ్రిటిష్ వారి చేతిలో చనిపోయిన కొయ్యూరు, అల్లూరి సమాధి ఉన్న కేడీ పేట వరకు పర్యాటకులు తిలకించేలా అభివృద్ది చేయాల్సి ఉంది. కృత్తివెంటి స్కూల్లో అల్లూరి విద్యాభ్యాసం రామచంద్రపురం : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగిన అల్లూరి సీతారామరాజు ప్రాథమిక విద్యాభ్యాసం ఏడాది పాటు రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు స్కూల్లో సాగింది. ప్రముఖ న్యాయవాది కృత్తివెంటి పేర్రాజు పంతులు వంద ఎకరాల భూమిని దానం చేసి పట్టణంలో 1905లో జాతీయ పాఠశాల అనే నామకరణం చేసి మిడిల్ స్కూల్‌ను స్థాపించారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఈ పాఠశాలను మొదట్లో స్థాపించారు. సమర వీరుడు అల్లూరి సీతారామరాజు రామచంద్రపురం కృత్తివెంటి మిడిల్ స్కూల్లో 6వ తరగతి విద్యను అభ్యసించినట్టు చెబుతున్నారు. నాలుగో తరగతిని తుని రాజావారి పాఠశాలలో 1913 జూలై 25న (అడ్మిషన్ నంబర్797) చేరినట్టు అప్పట్లో వార్తాపత్రికల ద్వారా తెలిసింది. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నడయాడిన కృత్తివెంటి స్కూల్ 1915–16లో సీకే గోవిందరాజు ప్రధానోపాధ్యాయుడిగా ఉండగా కృత్తివెంటి మిడిల్ స్కూల్లో అల్లూరి సీతారామరాజు ఆరో తరగతి చదివినట్టు స్పష్టమవుతోంది. అనంతరం ఆయన కాకినాడ పీఆర్ హైస్కూల్లో, నర్సాపురంలో చదివినట్టు తెలుస్తోంది. అల్లూరి నడయాడిన పాఠశాలగా నేటికీ పలు సందర్భాల్లో పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో వక్తలు చెబుతుంటారు. 2006 జనవరి 9న పాఠశాల శత జయంతి ఉత్సవాల్లో కూడా అల్లూరిని పూర్వవిద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కొనియాడారు. -
విహార యాత్రలో విషాదం..
సాక్షి, రాజమండ్రి : ఆహ్లాదకరమైన చల్లని వాతావారణంలో సేదతీరడానికి ఏజెన్సీ ప్రాంతానికి విహార యాత్రకు వచ్చిన ఇద్దరు స్నేహితులను మృత్యువు కాటేసింది. ఆ యువకుల కుటుంబంలో పెనువిషాదాన్ని మిగిల్చింది. మారేడుమల్లి మండలం పాములేరు గ్రామం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోకవరం మండలానికి చెందిన ముగ్గురు స్నేహితులు ద్విచక్ర వాహనంపై పాములేరు గ్రామానికి వచ్చారు. అప్పటి వరకు ప్రకృతిలో అనందంగా గడిపిన వారు మధ్యాహ్నం భోజనాలు చేసి ముగ్గురు యువకుల్లో జుత్తుక నరేష్(24), గేదెల సీతారామ్(22) అనే ఇద్దరు యువకులు వాగులోకి స్నానానికి దిగారు. ఆ ప్రదేశం లోతు ఎక్కువగా ఉండడంతో ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. ఆ సమయంలో ఒడ్డుపైన ఉన్న మరో యువకుడు బంటిమిల్లి నాగబాబు తన స్నేహితులు ఇంకా వాగులోంచి పైకి రాకపోవడంతో ప్రమాదాన్ని గమనించి మారేడుమిల్లి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రాజు, గొర్లె సతీష్ తన సిబ్బందితో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు గ్రామస్తుల సహాయంతో వాగులో మునిగిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. వారి బంధువులకు సమాచారం అందించారు. మృతులు జుత్తుక నరేష్‌ది గోకవరం గ్రామం. ఇతడు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గేదెల సీతారామ్‌ది గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామం ఇతడు ఇంటర్ పూర్తిచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రంపచోడవరం ఏఎప్పీ రాహుల్ దేవ్ సింగ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గతంలో వాగులో మునిగి పలువురు మృతి పాములేరు వాగులో స్నానానికి దిగి అనేక మంది మృతి చెందారు. చాలా వరకు ఇక్కడి వచ్చే వారిలో ఎక్కవగా మద్యం సేవించేవారే. అక్కడ ఉండే గ్రామస్తులు, సిబ్బంది వాగులో స్నానాలకు దిగవద్దని చెప్పినా మద్యం మత్తులో లెక్క చేయకుండా వాగులోకి దిగి ప్రాణలు కోల్పోయే వారే అధికం. మరోవైపు అటవీశాఖ అధికారులు వాగులో స్నానాలు చేయడం, దిగడం నిషేధమని ప్రమాదాల ఫొటోలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. -
అమ్మ ఒడిలోనే.. ఆఖరి ఊపిరి
సాక్షి, తూర్పు గోదావరి : ఈ చిత్రంలో ఆమెను చూస్తే ఏమనిపిస్తోంది? దూర ప్రయాణంలో భాగంగా బస్టాండులో బస్సు కోసం ఒడిలో చిన్నారితో మండుటెండలో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది కదా! కానీ గుండెలు పిండేసే నిజం ఏమిటంటే...ఆ పసిబిడ్డకు అనారోగ్యంగా ఉండడంతో దగ్గర్లోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు... పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కానీ రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఆ శిశువు తల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఎతైన కొండలు... ఆ కొండలతో పోటీ పడుతున్నట్టుగా పొడవాటి చెట్లు ... ఈ రెంటింటి మధ్య గలగలా పారే సెల ఏళ్లు పక్షుల కిలకిలారావాలు, ఎటు చూసినా పచ్చదనమే ... అప్పుడప్పుడు వెళ్లే పర్యాటకులకు కనువిందే..మానసిక ఆనందమే...ఆహ్లాదమే...కానీ.. ఆ గూడెంలో ఉండే గిరిజనుల గుండెల నిండా ఉండే వ్యధ... కన్నతల్లుల కన్నీటి వెత ఎందరికి తెలుసు? వైద్యం అందక కన్నుమూస్తున్న మాతా, శిశు దేహాలను తీసుకువెళ్లేందుకు నానా చావు చావాలి. ఎత్తైన కొండలు, రవాణా సదుపాయాల లేని కుగ్రామాలు, వైద్యం కోసం రోగులను తీసుకుని కాలినడకన ఆస్పత్రులకు వెళ్లడం గిరిజనులకు సర్వసాధారణ అయింది. రెండు నెలల చిన్నారికి అస్వస్థతగా ఉండడంతో తల్లిదండ్రులు పరుగుపరుగున ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. విషమంగా ఉన్న శిశువు ప్రాణాలు దక్కలేదు. పుట్టేడు దుఃఖంతో శిశువు మృతదేహంతో కన్నీరుమున్నీరుగా వారు విలపించారు. అచేతన స్థితిలో ఉన్న వారిద్దరూ.. శిశువు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ అంబులెన్స్ కోసంస్థానిక ఏరియా ఆస్పత్రిలో విలపిస్తూ కూర్చుండిపోయారు. వారి వేదన అందరినీ కంటతడిని పెట్టించింది. వై.రామవరం మండలం పలకజీడి గ్రామానికి చెందిన సాదల అమ్మాజీ, రాంబాబు రెండు నెలల శిశువు అనారోగ్యంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందాడు. జ్వరం, న్యూమోనియాతో బాధపడుతోన్న శిశువును పలకజీడి నుంచి వై.రామవరం ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్య సిబ్బంది శిశువును రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అతడి పరిస్థితి అలాగే ఉండడంతో రంపచోడవరం ఆస్పత్రి వైద్యులు అత్యవసర వైద్యం రాజమహేంద్రవరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతలోనే శిశువు మృతి చెందాడు. అంబులెన్స్ లేక నిరీక్షణ రంపచోడవరం ఏరియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ లేక సాయంత్రం ఆరు గంటల వరకు తల్లిదండ్రులు నిరీక్షించారు. ఆస్పత్రి అంబులెన్స్ మోతుగూడెంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి వెళ్లింది. ఐటీడీఏకు చెందిన రెండు అంబులెన్స్‌లు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులతో రాజమహేంద్రవరం వెళ్లాయి. రక్తదాన శిబిరానికి వెళ్లిన వాహనం తిరిగి రావడంతో సాయంత్రం ఆరు గంటలకు శిశువు మృతదేహాన్ని తరలించారు. -
వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా కుటుంబీకులు!
సాక్షి, తూర్పు గోదావరి : రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా ఆమె కుటుంబసభ్యులే ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా రాజేశ్వరిని ఓడించాలంటూ అత్తింటి తరఫు కుటుంబసభ్యులు ప్రాధేయపడుతున్నారు. ఈ సందర్భంగా వంతల రాజేశ్వరిపై అత్తింటివారు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేశ్వరిని కిషోర్ అనే గిరిజనేతరుడు తన చెప్పుచేతల్లో ఉంచుకుంటూ తమ కుటుంబానికి దూరం చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఆమెని మభ్యపెట్టి భర్తను దూరం చేయడంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో ఓడించి తమ కుటుంబం రోడ్డున పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ వంతల రాజేశ్వరి అత్తింటివారు ఆందోళన వ్యక్తం చేశారు. -
పొల్లూరు జలవిద్యుత్‌కు విఘాతం
సాక్షి, మోతుగూడెం (రంపచోడవరం): లోయర్ సీలేరు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్ (115 మెగావాట్లు) సాంకేతిక లోపంతో గురువారం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బోటమ్ లేబరెంట్ సీల్ ఊడిపోవడం వల్ల సరఫరా నిలిచిపోయిందని డీఈ (ఓఈఎం) సత్యనారాయణ తెలిపారు. ఈ గేట్ సీల్ ఊడిపోవడం వల్ల వికెట్ గేట్ వద్ద రాళ్లు, చెక్కలు అడ్డుపడి ఉండవచ్చునని ఆయన తెలిపారు. దీనివల్ల నీరు యూనిట్లలోకి వచ్చి మునిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవలే వికెట్ గేట్ సీల్ ఊడిపోయి సుమారు ఐదు రోజులు 4వ యూనిట్ నిలిచిపోయింది. దీంతో హుటహుటిన కాంట్రాక్టర్‌ను పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. మళ్లీ బోటమ్ లేబరెంట్ ఊడిపోవడం వల్ల మళ్లీ నాలుగో యూనిట్ సుమారు 25 రోజులపైనే 115 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనున్నది. దీంతో అభిరామ్ ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగిస్తున్నట్లు డీఈ తెలిపారు. తరచూ మొరాయిస్తున్న యూనిట్లు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి తరచూ 3, 4 యూనిట్లు మొరాయిస్తున్నా జెన్కో యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలవిద్యుత్ కేంద్రం నిర్మించి సుమారు 45 ఏళ్లు అవుతున్నా యంత్ర సామగ్రి మార్చకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇక్కడ యూనిట్లకు ఏమైనా సాంకేతిక లోపం తలెత్తితే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదు. ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో మార్పు ఉండడం లేదు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తితే 25 ఏళ్ల నుంచీ ఒకే సంస్థకు పనులు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆమెకు మరోసారి టికెట్ ఇస్తే ఓడిస్తాం
-
రిసార్ట్‌లో రేవ్ పార్టీ..పోలీసుల ఆకస్మిక దాడులు
-
రంపచోడవరంలో రేవ్ పార్టీ
సాక్షి, రంపచోడవరం: రేవ్ పార్టీల సంస్కృతి నగరాల నుంచి పల్లెలకు విస్తరిస్తోంది. మద్యం మత్తులో విశృంఖల కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి వరకు తాగితందనాలాడుతూ అనైతిక చర్యలకు దిగుతున్నారు. పోలీసులకు కళ్లుగప్పి గుట్టుగా సాగిస్తున్న రేవ్ పార్టీల వల్ల సామాజికంగా, శాంతిభద్రతల పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం దేవరాతిగూడెం వద్ద ఏవన్ రిసార్ట్‌లో శుక్రవారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ముందస్తు సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏడుగురు మహిళలు, 20 మంది పురుషులు, నిర్వాహకుడు రమణ మహర్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలం నుంచి ఐదు కార్లతో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై కూపీ లాగుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న పురుషులు -
శుభలేఖలు పంచుతూ కానరాని లోకాలకు
నెల్లిపాక/చింతూరు (రంపచోడవరం): మరో నాలుగు రోజుల్లో బందువు వివాహం..ఎంతో ఆనందంగా పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు కానరానిలోకాలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఎటపాక మండలంలోని లింగాలపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం విదితమే. వారి మృతదేహాలకు శనివారం భద్రాచలం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. మృతులు కలముల బాబూరావు, కట్టం కన్నయ్య, తెల్లం రాము సొంతూరు.. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి సమీప గ్రామం బలిమెలలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. తెల్లం రాము మేనమామ సుందరయ్య వివాహానికి ఈ నెల 19న ముహూర్తం పెట్టుకున్నారు. వివాహ శుభలేఖలు పంచేందుకు వెళ్లిన బంధువులకు ప్రమాదానికి గురవడంతో ఆ పెళ్లింట కళ తప్పింది. ప్రమాదానికి కారణమైన లారీని చింతూరు మండలం చట్టి సమీపంలో పోలీసులు అ దుపులోకి తీసుకున్నారు. లారీ ఒడిశాకు చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో రాము అవివాహితుడు. బాబూరావు, కన్నయ్యలకు వివాహాలయ్యాయి. వీరిద్దరికీ ఇద్దరేసి చొప్పున చంటిపిల్లలు ఉన్నారు. -
ఉద్యోగం వదిలి... జననేత వెంట...
కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా జననేత జగన్ చేస్తున్న నిరంతర పోరాటానికి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నాగులాపల్లి ధనలక్ష్మి ఆకర్షితురాలయ్యారు. తన ఉద్యోగాన్ని వదిలి తాను కూడా వైఎస్సార్ సీపీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆమె అభిష్టానికి అనుగుణగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రంపచోడవరం మండలం యర్రంపాలెం ఆశ్రమపాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నాగులాపల్లి ధనలక్ష్మిని రంపచోడవరం నియోజకవర్గ పార్టీ కో–ఆర్డినేటర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఏ, బీఈడీ చేసిన ధనలక్ష్మి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె తల్లి రాఘవ 2001 నుంచి 2006 వరకు అడ్డతీగల మండలం గొండోలు సర్పంచిగా పనిచేశారు. తిరిగి 2013లో వైఎస్సార్ సీపీ మద్దతుతో మరోసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలంపాటు తల్లి ప్రజాసేవలో కొనసాగుతున్న నేపథ్యంలో... కుమార్తె ధనలక్ష్మి వైఎస్సార్ సీపీలో చేరి జననేత జగన్‌తో పాటు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్(బాబు) ప్రోద్భలంతో ఆమెకు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ధనలక్ష్మి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతిని కలిసి శనివారం తన రాజీనామా లేఖను అందజేశారు. గిరిజనులకు అండగా ఉంటా... గిరిజనుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ రంపచోడవరం కో–ఆర్డినేటర్‌గా నియమితులైన నాగులాపల్లి ధనలక్ష్మి తెలిపారు. గిరిజనులతో పాటు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, వీటి పరిష్కారమే తన ప్ర«ధాన కర్తవ్యమని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జగన్ సీఎం కావడమే లక్ష్యంగా పార్టీ పట్ల నిబద్దతతో పని చేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టత కోసం కష్టపడి పని చేస్తానన్నారు. తనను కో–ఆర్డినేటర్‌గా నియమించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, పార్టీ ప్రాంతీయ పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కో–ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
సర్కారీ చదువుకు సెలవు?
రంపచోడవరం : ఏజెన్సీలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ యాజమాన్యంలోని పాఠశాలలకు మంగళం పాడేందుకు రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్న పది జెడ్పీ ఉన్నత పాఠశాలలను మూసివేస్తున్నారు. వీటిలో మారేడుమిల్లిలోని మండల పరిషత్ యాజమాన్యంలో ఉన్న మోడల్ పాఠశాలను కూడా కాలగర్భంలో కలిపేస్తున్నారు. దాదాపు అర్ధశతాబ్దం పైగా ఏజెన్సీలో విద్యార్థులకు అందుబాటులో విద్యాబోధన అందించిన పాఠశాలలను ఐటీడీఏ యాజమాన్యానికి అప్పజెప్పడంపై తల్లిదంద్రుడలు స్థానిక సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ పరిపాలన కేంద్రం రంపచోడవరంలో ఉన్న ఏజెన్సీలోని ఏకైక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సైతం ఐటీడీఏకి అప్పగించి చేతులు దులుపుకొనేందుకు విద్యాశాఖ సమాయత్తం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. విలీనమయ్యే పాఠశాలలు ఇవే వై.రామవరం మండలంలోని వై.రామవరం, డొంకరాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలు, అడ్డతీగల మండలం రాయపల్లి, రాజవొమ్మంగి మండలం జడ్డంగి, గంగవరం మండలం గంగవరం జెడ్పీ పాఠశాల, రంపచోడవరం మండలంలోని రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గెద్దాడ జెడ్పీ పాఠశాల, మారేడుమిల్లి మండలంలోని మారేడుమిల్లి జెడ్పీ పాఠశాల, చింతూరు మండలంలో మోతుగూడెం జెడ్పీ పాఠశాల, దేవీపట్నం మండలం దేవీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఐటీడీఏకు అప్పగించేందుకు క్షేత్రస్థాయిలో పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాఠశాలలు అన్నీ ఈ వేసవి సెలవుల అనంతరం ఐటీడీఏ యాజమాన్యంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలుగా నామాంతరం చెందుతాయని గిరిజన సంక్షేమ శాఖ డీడీ సరస్వతి తెలిపారు. ఈ పది జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సొంత యాజమాన్యానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలుగా మారిన తరువాత గిరిజన సంక్షేమ యాజమాన్యానికి చెందిన ఉపాధ్యాయులను నియమిస్తామని డీడీ తెలిపారు. గిరిజనేతర విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకం ఏజెన్సీలో ఎక్కువ మంది గిరిజనేతరులు చదువుల కోసం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయా విద్యార్థులకు తిప్పలు తప్పవు. ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునేందుకు గిరిజనేతర విద్యార్థులను చేర్పించుకున్నా ఇప్పటి వరకు జెడ్పీ పాఠశాలల ద్వారా అందే సౌకర్యాలు విద్యార్థులు కోల్పోతారు. గిరిజన సంక్షేమ శాఖ కేవలం గిరిజన విద్యార్థుల ప్రయోజనాలు కోసం మాత్రమే నిధులు ఖర్చు చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో గిరిజనేతర విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి వాటికి దూరం కావాల్సిందే. ప్రస్తుతం పది పాఠశాలలను విలీన చేస్తున్నా, వచ్చే విద్యా సంవత్సరానికి మిగతా జెడ్పీ పాఠశాలలను కూడా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలుగా మార్చనున్నట్టు సమాచారం. -
గిరిజన వృద్ధురాలి కాళ్లు కడిగిన కలెక్టర్
వైరామవరం (రంపచోడవరం) : వై.రామవరం మండలం శేషరాయి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. మండలంలోని యార్లగడ్డ పంచాయతీ పరిధిలోని మరుమూల ప్రాంతమైన శేషరాయిని గురువారం ఆయన సందర్శించారు. ఆ గ్రామస్తులు ఆయనకు గిరిజన సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి, పూలమాల వేసి స్వాగతం పలికారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్ అధ్యక్షతన ఆ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ కులధ్రువీకరణ పత్రాలు అందించాలనే లక్ష్యంతో ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. శేషరాయి గ్రామంలో రచ్చబండ, అంగన్వాడీ కేంద్రం, అందరికీ పక్కాగృహాలు నిర్మిస్తామన్నారు. వీధివీధికీ సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. వై.రామవరం నుంచి శేషరాయికి, వై.రామవరం నుంచి మఠం భీమవరం మీదుగా గుర్తేడు రోడ్డుకు అటవీశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను తొలగించి, త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం సుమారు 40 మందికి కుల ధ్రువీకరణ పత్రాలు అందించారు. మహిళా సంఘాలకు ట్యాబ్‌లు అందించారు. రైతులకు పురుగుమందుల స్ప్రేయర్స్, బరకాలు అందించారు. చవిటిదిబ్బలు పీహెచ్సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అందిస్తున్న దోమతెరలను పరిశీలించారు. ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణం ప్రారంభం కాగానే గ్రామంలోని ఇద్దరు యువకులకు జీపులు కొనిస్తామని చెప్పారు. ఆ గ్రామంలోని పిల్లలను యార్లగడ్డ గ్రామంలోని పాఠశాలకు తరలించడానికి వాహనాన్ని సమకూరుస్తామన్నారు. అనంతరం అక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో, దారలోవ గ్రామ సమీపంలో ఉన్న దుమ్ముకొండ జలపాతాన్ని సందర్శించారు. 10 కిలోమీటర్ల దూరం నిటారుగా ఉన్న పెద్దకొండపైకి కాలినడకన వెళ్లారు. ఆ జలపాతంతోపాటు, అటవీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను తిలకించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా జలపాతం వద్దకు రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రం వల్ల శేషరాయి గ్రామానికి ఆదాయం చేకూరుతుందన్నారు. అనంతరం మార్గమధ్యలోని గురమంద విశ్వనాథుని దర్శించుకున్నారు. వృద్ధురాలి కాళ్లు కడిగిన కలెక్టర్ శేషరాయిలోని పల్లాల లక్ష్మమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలికి కలెక్టర్ కార్తికేయమిశ్రా పసుపునీళ్ళతో కాళ్ళు కడిగారు. ఆమెను తనను దీవించమని కోరారు. నూరేళ్లూ సుఖసంతోషాలతో జీవించాలని ఆ వృద్ధురాలు కలెక్టర్‌ను దీవించింది. కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, వెలుగు ఏపీడీ సత్యంనాయుడు, మండల ప్రత్యేకాధికారి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ పీకే నాగేశ్వరరావు, అడ్డతీగల సీఐ ఎ.మురళీకృష్ణ, తహసీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ, ఎంపీడీఓ కె.బాపన్నదొర, ఎం ఈఓ కె.ప్రసాదబాబు, సర్పంచ్‌లు దాగేరి పొట్టమ, గుడ్ల సత్యవతి, మాజీ సర్పంచ్ పల్లాల కాశీ విశ్వనాథరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లాల వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్, గ్రామపెద్దలు దాగేరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల్లో టీడీపీ విశ్వాసం కోల్పోయింది
అడ్డతీగల (రంపచోడవరం) : టీడీపీ ప్రభుత్వం నయవంచక పాలన వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతఉదయభాస్కర్ అన్నారు. గురువారం ఎల్లవరంలో అనంత ఉదయభాస్కర్ సమక్షంలో రంపచోడవరం మండలానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ,సర్పంచ్ మరికొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఉదయభాస్కర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల్లోనూ విశ్వాసం సన్నగిల్లిందన్నారు. అందుకే టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు పెరిగాయన్నారు. భవిష్యత్తులో టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి చేరడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రజల పక్షాన పోరాడే పార్టీగా వైఎస్సార్ సీపీ నిలబడడాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రంపచోడవరం మండలం బందపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు కారం బాపన్నదొర, తామరపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ శారపు బాపిరాజుదొర, గోపవరం టీడీపీ నాయకుడు శారపురామకృష్ణ, ఇతర ముఖ్య కార్యకర్తలు కారం చెల్లన్న దొర, కారం సత్తిబాబు, కారం బాపన్నదొర, కారం శ్రీనివాసరావుతో పాటు మరి కొంతమంది గురువారం ఎల్లవరంలో అనంతఉదయభాస్కర్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. బందపల్లి ఎంపీటీసీ సభ్యుడు కారం బాపన్నదొర మాట్లాడుతూ టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచిన తాను తన ఎంపీటీసీ స్థానంలో ఏవిధమైన అభివృద్ధి చేయలేకపోయానన్నారు. ప్రభుత్వం నుంచి గానీ, పెద్ద పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి గాని ఎటువంటి సహాయసహకారాలు లేవన్నారు. నాలుగేళ్లుగా ఇటువంటి పరిస్థితే ఉందన్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. అభివృద్ధి పనులు ఇస్తామని నమ్మబలికి పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు ఏవిధంగానూ మా గ్రామాల్లో అభివృద్ధికి సహకరించలేదని తామరపల్లి సర్పంచ్ శారపు బాపిరాజుదొర అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ళ రామాంజనేయులు, రంపచోడవరం డివిజన్ సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు పండారామకృష్ణదొర, రంపచోడవరం మండల పార్టీ కన్వినర్ జల్లేపల్లిరామన్నదొర, యువజన విభాగం అధ్యక్షుడు రాపాక సుధీరాజు, మండల ప్రచారకమిటీ అధ్యక్షుడు వియ్యంకన్నబాబు, గంగవరం మండల పార్టీ కన్వీనర్ అమృతఅప్పలరాజు, బోలగొండ ఎంపీటీసీ సభ్యుడు వలల ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీ ఫిరాయించడంపై ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆమె తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రంపచోడవరం: ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అప్పుడు రూ.20 కోట్లు ఇస్తామని టీడీపీ వాళ్లు ఆఫర్ ఇచ్చినా పార్టీ వదిలివెళ్లలేదని చెప్పి ఇప్పుడు ఎంత మొత్తంలో డబ్బులు తీసుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, డివిజన్ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు పండా రామకృష్ణదొర డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ కార్యాలయం ఆవరణలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాజేశ్వరి పార్టీ మారినంత మాత్రాన ఏజెన్సీలో పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజలు వంతల రాజేశ్వరిని చూసి ఓట్లు వేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అ«ధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ ఎంతో కష్టపడి ఏజెన్సీలో పార్టీని అభివృద్ధి చేసి, ఆమె గెలుపునకు కృషి చేశారని చెప్పారు. ఎమ్మెల్యే కాక ముందు ఆమె తల్లికి ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతలచి రూ.5 లక్షలు ఖర్చు చేసి కేర్ ఆస్పత్రిలో వైద్యం చేయించిన విషయం ఆమెకు గుర్తు లేదాని ప్రశ్నించారు. నేడు డబ్బుకు ఆశ పడి పార్టీ మారి విలువలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు పార్టీకి అండగా నిలుస్తారన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాంజనేయులు, ఎంపీటీసీలు కారుకోడి పూజ, పొలోజు కాంతం, మహిళ అధ్యక్షురాలు కాపారపు రూతు, నాయకులు పాల ప్రసాద్, నేరం రమేష్, పండా నాగన్నదొర, మంగ పాల్గొన్నారు. స్వప్రయోజనాల కోసమే పార్టీ ఫిరాయింపు రంపచోడవరం: ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి స్వప్రయోజనాల కోసమే వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలోకి వెళ్లారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ విమర్శించారు. ఆమె ఎప్పుడూ పార్టీకి ఏ విధమైన సేవలు చేయలేదన్నారు. ఆమె పార్టీ వీడినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు కొదవలేదన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి తొలగించిన చోటా నాయకులతో కలసి ఆమె టీడీపీలో చేరారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ నుంచి వెళ్లిపోయేందుకే ఆమె గ్రూపు రాజకీయాలకు పాల్పడి పార్టీని బలహీన పరిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వంతలపై వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహం రంపచోడవరం: ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆమె నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, పండా చెల్లన్నదొర, ఆవుల మరియదాస్, మాచర్ల గంగులు, రాజవొమ్మంగి, ఎటపాక, వీఆర్‌పురం మండలాల కన్వీనర్లు సింగిరెడ్డి రాజకృష్ణ, తానికొండ వాసు, పొడియం గోపాల్, జిల్లా కార్యదర్శి కొవ్వూరి రాం బాబు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జెర్రి ఉమామహేశ్వరి తదితరులు తప్పుబట్టారు. తెలుగుదేశం పార్టీకి ఎంత డబ్బుకు అమ్ముడుపోయారని ప్రశ్నించారు. రాజేశ్వరి పార్టీని వీడినంత మాత్రాన వైఎస్సార్ సీపీకి వచ్చిన నష్టమేమీ లేదని పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు పేర్కొన్నారు. పార్టీ మారినా నష్టం లేదు దేవీపట్నం: రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొంది, పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రాన నియోజకవర్గంలో పార్టీకి వచ్చిన నష్టమేమి లేదని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుంజం చెల్లన్నదొర, ఎంపీపీ పండా జయలక్ష్మి, సర్పంచి సోదే వెంకన్నదొర, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు తుర్రం జగదీష్ శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎక్కడో మారుమూల గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్న సాధారణ మహిళను తీసుకువచ్చి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చిన జగన్మోహనరెడ్డిని, వెన్నంటి ఉండి ఆమె గెలుపునకు శాయశక్తులా కృషిచేసిన అనంత ఉదయభాస్కర్‌ను, కార్యకర్తలను మోసం ఆమె పార్టీ మారారని విమర్శించారు. ఎన్నికల డిపాజిట్ సైతం కట్టలేని స్థితిలో ఉన్న ఆమెతో అనంత బాబు, కార్యకర్తలు సొమ్ము చెల్లించి నామినేషన్ వేయించారని తెలిపారు. ఆమె ఉన్నతి కారణమైన పార్టీని కాదని నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారారని విమర్శించారు. నియోజకవర్గంలో ఎన్నికల ముందు నుంచి ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ సీపీ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ఆమె తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే వంతలపై ఏజెన్సీలో ఆగ్రహం మారేడుమిల్లి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ కుండ్ల సీతామహాలక్ష్మి, మండల కో–ఆష్షన్ సభ్యుడు బులసుమిల్లి వెంకట్రావు (చంటి), పార్టీ జిల్లా కార్యదర్శి గొర్లె బాలజీబాబు స్థానిక విలేకరులతో శనివారం మాట్లాడారు. నమ్మి ఓట్లు వేసిన ఏజెన్సీ ప్రాంత ప్రజలకు రాజేశ్వరి తీరని ద్రోహం చేశారన్నారు. గతంలో టీడీపీ నాయకులు రూ.20 కోట్లు ఆఫర్ చేసినా తాను డబ్బుకు లోగలేదని, జగన్మోహన్రెడ్డి వల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పిన రాజేశ్వరి ఇపుడు ఎందుకు పార్టీ మారారని ప్రశ్నించారు. కేవలం డబ్బు కోసమే ఆమె పార్టీ మారారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలంతా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారని, ఆమె పార్టీ వీడినంత మాత్రన నష్టం ఏమిలేదన్నారు. సమావేశంలో మారేడుమిల్లి, సున్నంపాడు, తాడేపల్లి ఎంపీటీసీ సభ్యులు గొర్లె అనిల్ ప్రసాద్(బాబి), కానెం విజయలక్ష్మి, ఉలుగుల చిన్న సోమిరెడ్డి, వైస్ ఎంపీపీ సాదల రామయమ్మ, జీఎం వలస, సున్నంపాడు సర్పంచులు చెదల అరుణ కుమారి, చెదల రామిరెడి, మండల కార్యదర్శి బి.గంగరాజు, సొసైటీ ఉపాధ్యక్షుడు కుండ్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వణుకుతున్న వెంకటాపురం
సాక్షి, రాజమహేంద్రవరం/చింతూరు: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో 16 మంది మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే చింతూరు ఏజెన్సీలోని వెంకటాపురం గ్రామం అంతుచిక్కని వ్యాధులతో వణుకుతోంది. పదిహేను రోజుల్లో గ్రామంలో ముగ్గురు మృత్యువాత పడగా మరో పది మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామస్తులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఆదివాసీలు భయంతో గ్రామాన్ని వీడి ఇతర గ్రామాలకు వెళ్లిపోతున్నారు. 30 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని గాదిరాస్ నుంచి వలస వచ్చిన 20 కుటుంబాలకు చెందిన 110 మంది చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో నివాసముంటున్నారు. వీరంతా గ్రామ సమీపంలోనే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు వారాల్లో ముగ్గురు మృతి గ్రామానికి చెందిన మడకం వుంగయ్య(18) అనే యువకుడు 15 రోజుల క్రితం అంతుచిక్కని వ్యాధితో మృతిచెందగా వారం క్రితం కొవ్వాసి జోగయ్య(25) అనే యువకుడూ అకస్మాత్తుగా మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మంగమ్మ భర్త మడివి గంగయ్య(60) బుధవారం మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మడకం సుక్కమ్మ, మడివి దేవయ్య, పొడియం లింగయ్య ఒళ్లంతా మంట, జ్వరం, దగ్గు, నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా వుంది. కాగా, వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులు ఏడుగురాళ్లపల్లిలోని ఆసుపత్రికి వెళ్లకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సదరు నాటువైద్యుడు కుండల్లో ఏవో ఆకులు పెట్టి మంత్రాలు చదువుతూ ఆకులతో ఆమె ఒంటిపై నిమురుతున్నాడు. కాగా, వ్యాధుల కారణంతో చాలామంది భయాందోళనలతో గ్రామాన్ని వీడుతున్నారు. వాగు నీరే తాగునీరు... గ్రామంలో 20 కుటుంబాలు నివాసముంటున్నా తాగునీటి కోసం ఇక్కడ ఒక్క బోరు కూడా లేదు. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని వాగుకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి ఏడు కిలోమీటర్ల దూరాన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి చిన్నపాటి కాలిబాట మాత్రమే ఉంది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరిగినా విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత మరణాలు కూడా కాటుకపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సవలం సత్తిబాబు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో వైద్య సిబ్బంది కూడా అడపాదడపా వస్తున్నారని.. తామే వారాంతపు సంత రోజుల్లో ఆసుపత్రికి వెళ్తుంటామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వ్యాధుల పరిస్థితిని తెలుసుకున్న ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి చెందిన వైద్య బృందం శుక్రవారం ఆ గ్రామానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించింది. సకాలంలో వైద్యం అందకే మరణాలు వివిధ వ్యాధుల వల్లే గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయి. సకాలంలో వైద్యం తీసుకోకపోవడంతో వ్యాధులు ముదురుతున్నాయి. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తాం. – డాక్టర్ పుల్లయ్య, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో. -
చాపరాయి బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
చాపరాయి బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన శనివారం ఉదయం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి జర్వపీడితులను పరామర్శించారు. బాధితులు చాలా నీరసంగా ఉండటాన్ని చూసి చలించిపోయారు. రక్తహీనతతో బాధితులు బాధపడుతున్నట్లు డాక్టర్ల ద్వారా తెలుసుకున్న వైఎస్ జగన్ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘ఇప్పటివరకూ వైద్య పోస్టుల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ప్రకటించలేదు?. ఏజెన్సీలో ఎన్నిసార్లు పర్యటించినా మార్పు కనిపించడం లేదు. కనీస సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి సదుపాయాలు, రోడ్లు, తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 108కి డీజిల్ కూడా వేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని అన్నారు. -
వైఎస్ జగన్ వస్తున్నారని..
-
వైఎస్ జగన్ వస్తున్నారని..
కాకినాడ/రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో విషజ్వర బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలియగానే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జ్వర బాధితులను హడావుడిగా ఇంటికి పంపించేశారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది చాపరాయి విషజ్వర బాధితులను శుక్రవారం డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. వైఎస్ జగన్ రాకముందే బాధితులను పంపించేయాలన్న టీడీపీ నేతలు ఒత్తిళ్లకు వైద్యులు తలొగ్గారు. జ్వరం నయంకాక ముందే తమను డిశ్చార్జ్ చేశారని గిరిజనులు మీడియా ముందు వాపోయారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోనూ వైద్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో జ్వర బాధితులను డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ డాక్టర్ల తీరుపై బాధితులు మండిపతున్నారు. వ్యాధి పూర్తిగా నయంకాకుండా తమను పంపించేయాలనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గిరిసీమలో మార్మోగిన గోవిందనామం
-కన్నుల పండువగా శ్రీనివాస కళ్యాణం -రంపచోడవరం వీధుల్లో శోభాయాత్ర రంపచోడవరం : ‘గోవిందా.. హరిగోవిందా..’ అన్న దేవదేవుని నామస్మరణతో రంపచోడవరం మారుమోగింది. అన్నమయ్య సంకీర్తనలు, కోలాటాలు, గిరిజన నృత్యాలు, భజన బృందాలతో స్థానిక పీఎంఆర్సీ నుంచి ఐటీడీఏ, అంబేడ్కర్ సెంటర్ మీదుగా శోభాయాత్ర సాగింది. పవనగిరి వ్యవస్థాపకుడు తణుకు వెంకటరామయ్య యాత్రకు నేతృత్వం వహించారు. నారాయణగిరి వెంకటేశ్వరస్వామి ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు ఆదివారం శ్రీనివాసుని కల్యాణం వేదమంత్రాలు, మేళాతాళాల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద కల్యాణం ద్వారకా తిరుమల పండితుల మంత్రాలు, చిలకపాటి విజయయరాఘవచారి వ్యాఖ్యానంతో జరిగింది. ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై కల్యాణ వేదిక వద్దకు భక్తుల కోలాహలం నడుమ తీసుకువచ్చారు. రెండు గంటలు జరిగిన కల్యాణమహోత్సవాన్ని దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తిలకించారు. తొలుత మంత్రి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ దంపతులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. వారికి దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 108 దేవాలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ద్వారకా తిరుమల దేవస్థానం ఉప దేవాలయంగా ఇక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం సదుపాయం కోసం సీఎంతో చర్చించానున్నట్లు తెలిపారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజనులు భక్తిభావంతో మెలగాలని, ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దేవాదాయశాఖ అధికారులు వేంద్ర త్రినాథరావు, హిందూధర్మరక్షణ ట్రస్ట్ చైర్మన్ పీఆర్కే ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, సర్పంచ్ వై.నిరంజనీదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కారుకోడి పూజ, సాదిక్ మాస్టార్ తదితరులు పాల్గొన్నారు. -
భక్త జనసంద్రం.. నారాయణగిరి క్షేత్రం
ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన చినజీయర్‌స్వామి రంపచోడవరం : నారాయణగిరి క్షేత్రం వేంకటేశ్వరస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. ఆలయంలో మంగళవారం నుంచి జరుగుతున్న కార్యక్రమాలు శుక్రవారానికి మూడో రోజుకు చేరాయి. చినజీయర్‌స్వామి ఆలయానికి వచ్చి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముహూర్త సమయానికి మేళాతాళాల మధ్య ధ్వజస్తంభ అవరోహణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి జీయర్‌స్వామి మాట్లాడారు. రంపచోడవరంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారని హిందూధర్మ పరిరక్షణకు ఇదో తార్కాణమన్నారు. గుడి నిర్మాణంలో ఎంతో కృషి చేసిన సాదిక్‌మాస్టార్‌ను ఆయన అభినందించారు. భక్తులు సనాత హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల ఆలయ అధికారి వేండ్ర త్రినాథరావు, దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శుక్రవారం ఉదయం చిన్నజీయర్‌స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పోటెత్తారు. -
భవితకు భరోసా శూన్యం
ఏడాది తరువాత సాదాసీదాగా.. తీరు మారని ఐటీడీఏ పాలకవర్గం సమావేశం రంపచోడవరం : ఏడాది తరువాత నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం యథాలాపంగా జరిగింది. గిరిజనులకు భరోసా ఇచ్చే ఒక్క చర్యా తీసుకోలేదు. పోలవరం నిర్వాసితులు, అటవీ హక్కుల చట్టం అమలు తీరుతో పాటు జీసీసీ వంటి శాఖల అంశాలను విస్మరించారు. ప్రతి త్రైమాసికానికీ నిర్వహించాల్సిన పాలకవర్గ సమావేశం ఏడాది తరువాత నిర్వహించడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ చైర్మన్, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీలు టి రత్నబాయి, రెడ్డి సుబ్రమణ్యం, ఎంపీలు తోట నరసింహం, కొత్తపల్లి గీత, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు పాల్గొన్నారు. సమావేశాల రద్దు మీ ఇష్టమేనా? ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి తేదీ ప్రకటించి అధికారులు ఇష్టమెచ్చినట్లు రద్దు చేయడంపై ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అధికారులను నిలదీశారు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టరాజ్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఐటీడీఏ అధికారుల తీరును రెడ్డి సుబ్రమణ్యం తప్పు పడుతూ ఏడాదిగా సమావేశం నిర్వహించకపోవడానికి కారణం చెప్పాలన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. ఎంపీ గీత గో ఎహేడ్ అంటూ మాట్లాడంపై ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అసహనం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. హోలీ ఏంజెల్స్ డైరెక్టర్‌ను అరెస్టు చేయలేదా? గిరిజన విద్యార్థినులను చిత్రహింసలకు గురిచేసిన హోలీఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మధుసూదనరావును ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఎమ్మెల్యే రాజేశ్వరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, పరారీలో ఉన్నాడని కలెక్టర్ చెప్పగా, పోలీసులు తలుచుకుంటే అరెస్టు చేయడం ఎంతసేపని ఆమె ప్రశ్నించారు. బొమ్మూరు ఆశ్రమ పాఠశాల బాలికలను ౖలైంగికంగా వేధించిన ఏటీడబ్ల్యూఓపై కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. విచారణ జరుగుతోందన్న పీఓ వివరణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు ఒక్కసారి కూడా పాఠశాల విద్యార్థుల ప్రగతిని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్సీ టి.రత్నబాయి మాట్లాడుతూ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని, ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని అన్నారు. పోషకాహార లోపంతోనే మతా, శిశు మరణాలు ఏజెన్సీలో పోషకాహార లోపంతోనే మతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, వాటి నివారణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్నారు. ఐసీడీఎస్ ద్వారా అదనంగా పోషకాహారం అందడం లేదన్నారు. వెలుగు ద్వారా నిర్వహించే పౌష్టికాహార కేంద్రాలను మూసివేశారన్నారు. వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలని, అంబులె¯Œ్సలు అందుబాటులో ఉంచాలని జెడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ ప్రగతి కాగితాలకే పరిమితం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ప్రగతి కాగితాలకే పరిమితమైనట్టుందని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా మంజూరు చేసిన పనులు నేటికీ ప్రారంభించలేదని ధ్వజమెత్తారు. రంపచోడవరం మండలంలో రహదారులకు ప్రతిపాదనలు పెట్టడం లేదని ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి అనడంతో గిరిజన సంక్షేమ ఇంజనీర్‌కు ఆయనకూ వాగ్వాదం జరగ్గా, ఈఈ పీకే నాగేశ్వరరావు రోడ్డు నిర్మాణం కోసం పెట్టిన ప్రతిపాదనలు చదివినిపించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్, ఏఎస్పీ అద్నా¯ŒS నయీం ఆస్మీలు పాల్గొన్నారు. -
పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం
రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రంపచోడవరం : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. వారికి న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ, ఆర్ అండ్ అర్ అధికారి ఎ.ఎస్.దినేష్‌కుమార్‌ను కలిసి నిర్వాసితుల సమస్యలపై చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విలీన మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న భూములకు రైతులు కోరుతున్నట్టు భూమికి భూమి గానీ, నష్టపరిహారం గానీ చెల్లించాలని డిమాండ్ చేశారు. డీ పట్టా భూములు కలిగిన గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూమినే నమ్ముకున్న ఆ కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వకుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పొందేందుకు ముంపు గ్రామాల్లోని ప్రతి ఒక్కర్ని అర్హులుగా గుర్తించాలన్నారు. కొంత మంది పేర్లు సర్వే లిస్టులో లేవని, ఇలాంటి పొరపాట్లను సవరించి అందరికీ న్యాయం చేయాలని కోరారు. పోలవరం పునరావాస కాలనీల్లోని నిర్వాసితుల పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. అధికారులు నేరుగా అక్కడికి వెళ్లి చూస్తే వారు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయన్నారు. పునరావాస కాలనీకి వెళ్లిన గిరిజన రైతులకు ఇంకా భూమికి భూమి ఇవ్వలేదని చెప్పారు. కాలనీ ఒకచోట, ఎందుకూ పనికిరాని కొండలు ఒక చోట చూపారన్నారు. ఇచ్చిన ప్యాకేజీ సొమ్ముతో ఇప్పటి వరకూ గడిపారని, తక్షణం వారికి సాగుకు అనుకూలంగా ఉన్న భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుతో రైతులు కూలీగా మారి పనులు కోసం మైదాన ప్రాంతాలకు వలస పోతున్నారని ఆవేదన చెందారు. భూమికి భూమి ఇచ్చేందుకు చేపట్టిన భూసేకరణ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఎందుకు పనికిరాని కొండలను నిర్వాసితులకు ఇచ్చేందుకు సేకరించి, వాటిని చదును చేసే పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. -
‘గొప్పలకు పోకండి, వసతులు కల్పించండి’
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడేందుకు వచ్చిన వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంపచోడవరంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పెంచిన మెస్ చార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని జగన్ కు విద్యార్థులు తెలిపారు. పిల్లలకు కనీస సౌకర్యాలు లేకపోవడంపై జననేత అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్, బహిరంగ మల విసర్జన లేని వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు, వసతులు కల్పించాలని మండిపడ్డారు. 750 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు సిబ్బందే ఉన్నారని, ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు పెరగలేదని తెలుసుకుని ఆవేదన చెందారు. తమ ప్రభుత్వం వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీయిచ్చారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయకుండా రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కును సీఎం చంద్రబాబు హరిస్తున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయడం లేదని జగన్ ఆరోపించారు. -
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
రంపచోడవరం: కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం శిశు మరణాలు సంభవించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో వైఎస్ జగన్ బుధవారం నుంచి రెండురోజుల పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, పౌష్టికాహారం అందకపోవడం వల్ల ఒక్క రాజవొమ్మంగిలోనే వారం నుంచి రెండు నెలల వయస్సులోపు 15 మంది చిన్నారులు చనిపోయారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజవొమ్మంగి మండలంలోపరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఇక్కడ నిరుపేదలు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1300 కోట్లు అవసరమైతే రూ. 780 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నదని తప్పుబట్టారు. తాను ఇటీవల సీఎం చంద్రబాబుకు లేఖ రాశాక ఆరోగ్యశ్రీకి రూ. 262 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. -
పోలవరంతోపాటు గిరిజనులూ ముఖ్యమే
-
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
మీ త్యాగాలు మర్చిపోం: వైఎస్ జగన్
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసాయిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో బుధవారం పోలవరం నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. పోలవరం కోసం భూములు ఇచ్చిన రైతులు, గిరిజనులకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి తీసుకున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్యాకేజీ ఇచ్చి స్థానికుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రతి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే కనీసం రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8 లక్షల ఎకరాలపై గిరిజనులకు మహానేత వైఎస్సార్ హక్కులు కల్పిస్తే, చంద్రబాబు ఒక్క ఎకరా ఇవ్వకపోగా భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ‘పోలవరం కావాలి, నిర్వాసితులకు న్యాయం’ జరగాలని నినదించారు. నిర్వాసితులు త్యాగాలు మర్చిపోమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు 19 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని వైఎస్ జగన్ హామీయిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులను జగన్ మాట్లాడించారు. కిశోర్ సత్యనారాయణ పోలవరం కారణంగా సర్వస్వం కోల్పోతున్నాం సరైన జవాబుదారితనం లేకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు మాకు అన్నివిధాలా నష్టం చేశారు దేవిపట్నం మండలంలో 6 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి మాకు 15 ఎకరాల భూమి ఉంది రూ. 2 లక్షల 8 వేల చొప్పున 2012లో పరిహారం ఇచ్చారు. ఈ డబ్బుతో సెంటు భూమి కొనలేని పరిస్థితి భూమికి భూమి ఇస్తామని ఇవ్వలేదు డబ్బులు తీసుకోనివి 2500 ఎకరాలు ఉన్నాయి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని అడుగుతున్నాం చల్లన్న దొర(గిరిజనుడు) మాకు 15 ఎకరాల పొలం ఉంది ఒక్కొక్కరికి ఒక్కో మాదిరిగా ధరలు ఇచ్చి మా మధ్య గొడవలు పెడుతున్నారు గతంలో తక్కువ ధరలు ఇచ్చారు, ఇప్పుడు ఎక్కువ ధరకు భూములు తీసుకుంటున్నారు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మాకు పరిహారం ఇవ్వాలి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రేటు, తూర్పుగోదావరి జిల్లాలో మరో రేటుకు భూములు తీసుకుంటున్నారు అందరికీ ఒకేవిధంగా న్యాయం చేయాలి ఆరండల్ పేట వాసి అందరి ఆమోదంతో పోలవరం కట్టండి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం 20 ఏళ్ల పాటు మా జీవనోపాధికి ప్రభుత్వం హామీయివ్వాలి నిర్వాసితుల కుటుంబంలో చదువుకున్న వారికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలి పట్టిసీమ నిర్వాసితులకు ఇచ్చినట్టుగా పరిహారం కల్పించాలి 6 పంచాయతీలు ముంపు ఎదుర్కొంటున్నాయి మిగిలిన 8 పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు -
పోలవరంతోపాటు గిరిజనులూ ముఖ్యమే: జగన్
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన గిరిజనులకు న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో వైఎస్ జగన్ బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అందరికీ అవసరమని, ఆ ప్రాజెక్టు వస్తేనే ఏపీ బాగుపడుతుందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. గిరిజనుల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారని, వారికి న్యాయంగా రావాల్సిన పరిహారం కూడా ఇవ్వడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై చూపిస్తున్న ధ్యాస.. భూములిచ్చిన వారిపై ప్రభుత్వం చూపడం లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు వల్ల నిర్వాసితులు పడుతున్న కష్టాలను తెలిపేందుకు స్వయంగా వారికే మైక్ ఇచ్చి మాట్లాడించారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
రంపచోడవరం: రంపచోడవరంలో వస్త్ర, కిరణా షాపులు నిర్వహిస్తూ రెండు రోజులుగా అదృశ్యమైన మంచెం వెంకటలక్ష్మి (32) మంగళవారం సాయంత్రం సీతపల్లి పాత రోడ్డులో బ్రిడ్జి దగ్గర కాలువలో విగతజీవిగా కనిపించింది. మైదాన ప్రాంతం రామచంద్రపురానికి చెందిన ఈమె పశ్చిమగోదావరి జిల్లా చర్ల గ్రామానికి చెందిన సత్తిబాబుతో కలిసి వ్యాపారం చేస్తూ సహజీవనం చేస్తున్నది. ఇటీవల వీరు గొడవపడి పోలీస్‌స్టేçÙ¯ŒSలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు ఉండగానే ఇద్దరు ఒక నిర్ణయానికి కలిసి వ్యాపారం చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే సత్తిబాబు ఆదివారం సాయంత్రం సీతపల్లి పాతరోడ్డులో కాలువలో దూకడంతో అక్కడ ఉన్న జాలర్లు, స్థానికులు రక్షించి 108లో రంపచోడరవం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర వైద్యం కోసం కాకినాడ తరలించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తితో వెంకటలక్ష్మి వెళ్లి కాలువలో దూకిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేసినట్లు సీఐ గీతరామకృష్ణ తెలిపారు. సీఐ, ఎస్సై జె.విజయబాబు సంఘటన స్థ్ధలాన్ని పరిశీలించారు. కాగా కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన కిరణ్‌కుమార్‌ను వివాహం చేసుకున్న వెంకటలక్ష్మి భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం సత్తిబాబుతో సహజీవనం చేస్తున్నది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని పాత ఆంధ్రాబ్యాంకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. బైక్‌పై ముగ్గురు విద్యార్థులు రంపచోడవరం నుంచి గోకవరం వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన నరేష్(20), తూర్పుగోదావరి జిల్లా కొంకుదూరు గ్రామానికి చెందిన అనిల్(20) అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. రవికుమార్(20) అనే మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కానిస్టేబుల్ అరెస్ట్
రంపచోడవరం : మహిళా హోంగార్డుతో వివాహేతర సంబంధం సాగిస్తున్న కానిస్టేబుల్‌ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి స్థానిక పోలీసు క్వార్టర్స్‌లో అరెస్టు చేశారు. ఏఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో రంపచోడవరం పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ప్రదీప్ ఇటీవల ప్రత్తిపాడుకు బదిలీ అయ్యాడు. కాగా ప్రదీప్, మహిళా హోంగార్డు ఆదివారం అర్ధరాత్రి పోలీసు క్వార్టర్స్‌లో కలిశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త కారం రాజన్నదొర తన బంధువులతో వెళ్లి, ఆ క్వార్టర్‌ను చుట్టుముట్టి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి, వారిని అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచామని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్సై తెలిపారు. ఇలాఉండగా తన భార్య, ఆ కానిస్టేబుల్ కలిసి గతంలో తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని రాజన్నదొర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
600 కేజీల గంజాయి పట్టివేత
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 600 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒకరిని అరెస్టే చేశారు. అలాగే లారీని సీజ్ చేశారు. భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆగంతకుడు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
తుఫాన్ వాహనం బోల్తా: 14 మందికి గాయాలు
వై రామవరం(తూర్పుగోదావరి జిల్లా): వై రామవరం మండలం డొంకరాయి వద్ద తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. సీలేరు సమీపంలోని దారాలమ్మ గుడికి వెళ్లి వస్తోండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా అమలాపురానికి చెందిన వారు. వారందరినీ సమీపంలోని రంపచోడవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టుల యత్నాలను తిప్పికొడుతున్నాం..
రంపచోడవరం :ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పట్టు సాధించేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారని ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనమైత్రి, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గిరిజనులకు పోలీసులు దగ్గరయ్యారని పేర్కొన్నారు. గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికి చింతూరు పోలీస్ స్టేషన్‌కు నిర్భయంగా వస్తున్నారని చెప్పారు. ఎటపాక వైటీసీ కేంద్రంగా గిరిజన యువతకు పారా మెడికల్ కోర్సుల్లో శిక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒడిశా, విశాఖ ఏజెన్సీలలో మావోయిస్టులు ఆర్మీ మిలీషియూ సభ్యులతోనే మనుగడ సాగిస్తున్నారని చెప్పారు. తూర్పు ఏజెన్సీలో మావోయిస్టు దళాల సంచారం ఉందని, వారి కదలికలపై గట్టి నిఘా ఉందని తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ అడ్నాన్ నయూం ఆస్మీ పాల్గొన్నారు. -
పిచ్చి కుక్క దాడిలో నలుగురికి గాయాలు
రాజమండ్రి: గోదావరి జిల్లాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులపై దాడికి దిగింది. దీంతో నలుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైరవిహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. -
కొండలు కరిగించి..కోట్లు కొల్లగొట్టి..
క్వారీల్లో బినామీల కాసుల వేట యంత్ర పరికరాలు సీజ్ చేసిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు అక్రమార్కుల యత్నాలు రంపచోడవరం :అమాయక గిజనుల పేరిట లీజులు సంపాదిస్తున్న బడాబాబులు అనధికారికంగా క్వారీలు నిర్వహిస్తూ దర్జాగా కాసుల వేట సాగిస్తున్నారు. కొండలు కరిగించేసి దర్జాగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇదంతా నిజమేనని నిర్ధారిస్తున్న అధికారులు కూడా ఏ చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అడ్డతీగల మండలం పులిగోగులపాడు పరిసరాల్లో సర్వే నంబర్-24లో ఉన్న నల్ల మెటల్ క్వారీయే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ క్వారీ నిర్వహణకు లీజు మంజూరైంది. కానీ దీనిని బినామీలు నడుపుతూ, కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని గత ఏడాది ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి రంపచోడవరం సబ్‌కలెక్టర్ గంధం చంద్రుడు ఈ క్వారీని తనిఖీ చేశారు. బినామీల ఆధ్వర్యంలోనే క్వారీ నడుస్తున్నట్లు తేల్చి, క్వారీ లీజు రద్దు చెయ్యాలని సూచిస్తూ మైనింగ్ శాఖకు నివేదిక పంపించారు. కొద్ది రోజులు పనులు నిలిపివేసిన బినామీదారులు క్వారీని తిరిగి ప్రారంభించారు. దీనిపై రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గనుల శాఖ డెరైక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లీజు పొందిన ప్రాంతంతోపాటు అనుమతి లేని ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరుపుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ విజిలెన్స్ అధికారులు ఆరు నెలల క్రితం తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే పేర్కొన్న అంశాలు వాస్తవమేనని తేల్చారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని మైనింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌ను ఆదేశించారు. అయినప్పటికీ అధికారులను మేనేజ్ చేసుకుని ఈ క్వారీలో నల్లమెటల్ను బినామీదారులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఆర్డీఓ జీవీ సత్యవాణి నాలుగు రోజుల క్రితం క్వారీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. నల్లమెటల్ సేకరణకు వాడుతున్న యంత్ర పరికరాలను సీజ్ చేశారు. కాగా బినామీదారులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి, క్వారీని యథాతథంగా నడుపుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలియవచ్చింది. -
ప్రభుత్వ వైద్యసేవలపై ఎమ్మెల్యే అసంతృప్తి
రంపచోడవరం : సామాన్య గిరిజనులకు ప్రభుత్వాస్పత్రిపై నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత వైద్యులుపై ఉందని, అంతేగాని రిఫరల్ పేరుతో రోగులను రాజమండ్రి, కాకినాడ తరలించడం కాదని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రాజేశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని, ఏరియా ఆస్పత్రికి వెళితే పలు కారణాలు చూపి బయటకు పంపితున్నారని ఫిర్యాదులు చేస్తున్నారంటే మీ వైద్యసేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆమె వైద్యులనుద్దేశించి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, పార్టీ రాష్ర్ట కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డిలతో కలిసి స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముత్యాల గంగభవాని అనే మహిళ ప్రసవవేదనలో వస్తే రక్తం తక్కువగా ఉందని రిఫర్ చేశారు. ఆమె రంపచోడవరం క్రిస్టియన్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ స్థానికంగా ఉండడం లేదనే ఫిర్యాదుపై ఆరా తీశారు. రోగుల పట్ల ఆస్పత్రి సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రాయుడు అనే రోగికి మలేరియా పరీక్షలు నిర్వహించి మలేరియా లేదని నిర్ధారణ చేశారు. అదే వ్యక్తి బయట ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేస్తే మలేరియా అని తేలింది. కనీసం రక్త పరీక్షలు నిర్ధారణ సక్రమంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆస్పత్రిలో రోగులకు మంచినీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. రాత్రి సమయంలో డ్యూటీ వైద్యుడు అందుబాటులో ఉండడం లేదని, రోగుల బంధువులు వైద్యుల క్వార్టర్స్‌కు వెళ్లి పిలుచుకు వస్తుంటే చిరాకు పడుతున్నారనే ఫిర్యాదు వచ్చిందన్నారు. రక్త నిల్వ కేంద్రంలో రక్తం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రి వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, పత్తిగుళ్ల రామాంజనేయులు, జల్లేపల్లి రామన్నదొర, రాపాక సుధీర్ , బోండ్ల వరప్రసాదరావు తదితరులు ఉన్నారు. -
భయం గుప్పిట్లో ‘తూర్పు’ మన్యం
రంపచోడవరం :రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని సుకుమ జిల్లాలో మావోయిస్టుల రక్తపాతాన్ని సృష్టించి, పలువురు పోలీసులను పొట్టన పెట్టుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో ప్రకంపనలు రేపింది. వాస్తవానికి ఈ ఘటనకు ముందే గత కొన్ని వారాలుగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా జిల్లాలో వరుస పెట్టి మిలీషియా సభ్యులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. పోలీసులు సైతం నిఘాను, ఒత్తిడిని పెంచారు. ఈ నేపథ్యంలో సుకుమలో మందుపాతర సంఘటన ఇక్కడ ఏజెన్సీలో కలకలం సృష్టించింది. విస్తృతస్థాయిలో గాలింపు చేపట్టిన పోలీసులకు తాజా సంఘటన పెనుసవాలుగా మారింది. జిల్లా కేంద్రం కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే బస్సు సర్వీసులను, అటూ విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే కొన్ని ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే మావోయిస్టులకు సహకరిస్తున్నారని పోలీసులు, పోలీసులకు సహకరిస్తున్నారని మావోలు గిరిజనులను లక్ష్యంగా చేసుకోవడంతో అటవీ గ్రామాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మిలీషియా సభ్యుల ద్వారా గ్రామాల్లో పట్టు సాధించేందుకు మావోయిస్టుల కసరత్తు చేస్తున్నారు. దీంతో పోలీసులు మిలీషియా సభ్యుల అరెస్టులు, లొంగుబాట్లపై దృష్టి సారించారు. కాగా మంగళవారం నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాల నేపథ్యంలో మావోలు దాడులకు తెగబడే అవకాశం ఉందని మారుమూల పోలీస్ స్టేషన్ల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఇన్ఫార్మర్లే మావోయిస్టుల లక్ష్యం! ఆంధ్రా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో విస్తరించిన దట్టమైన దండకారణ్యం ప్రస్తుతం మావోయిస్టులకు రక్షణ స్థావరంగా ఉంది. మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకూ మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్లే టార్గెట్‌గా మావోయిస్టులు ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు వ్యూహరచన చేసినట్టు తెలిసింది. తాజా సంఘటనతో దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. చింతూరు మండలం సరిహద్దుల్లో మావోయిస్టులు శబరి ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు వేయడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దుమ్ముగూడెం, చింతూరు మండలాల్లో పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ కొందరిని వారు లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. సుకుమ ఘటన, పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో జిల్లా మన్యంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. -
49మంది మావో'ఇష్టులు' లొంగుబాటు
రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. 49మంది మావోయిస్టు సానుభూతి పరులు శనివారం రంపచోడవరం ఏసీపీ విజయ రామరావు, ఓఎస్డీ శివశంకర్ ఎదుట లొంగిపోయారు. పోలీసుల కౌన్సెలింగ్ వల్లే వారు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు ప్రజల కోసం ఉన్నారని, సంఘ వ్యతిరేకశక్తులకు గ్రామీణులు ఆశ్రయం కల్పించవద్దని ఈ సందర్భంగా ఏసీపీ, ఓఎస్డీ సూచించారు. -
అటవీసీమలో అవినీతి ఊడలు
రంపచోడవరం :బహుళార్థ సాధకమైన పోలవరం ప్రాజెక్టు అవినీతిపరులైన అధికారులకు స్వార్థసాధకంగా మారింది. పంట పొలాలకు నీటి ని అందించాల్సిన ఈ ప్రాజెక్టు పేరుతో వారు తమ పంట పండించుకున్నారు. విద్యుత్ కాంతులు వెదజల్లాల్సిన ఈ మహా నిర్మాణం మాటున తమ ఇళ్లు చక్కబెట్టుకున్నారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే గిరిజన రైతులకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన భూమి అభివృద్ధి సాకుతో రూ.అరకోటికి పైగా ఆరగించారు.పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన గిరిజన రైతులకు భూమికి భూమి ఇవ్వాలని నిర్ణయించిన అప్పటి రాష్ర్ట ప్రభుత్వం సాగుకు అనువైన భూముల్ని మాత్రమే ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని నిర్దేశించింది. అయితే ఐటీడీఏ, ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై కొండపోడు భూముల చదును పేరుతో నిధులు నొక్కేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సుమారు రెండువేల మందికి భూమికి భూమి ఇచ్చేందుకు రెండువేల ఎకరాల కొండపోడు భూములు అవసరం. 2006-2007లో రెవెన్యూ శాఖ అడ్డతీగల మండలంలో 105 ఎకరాలను, దేవీపట్నం మండలంలో 42.52 ఎకరాలను, గంగవరం మండలంలో 870 ఎకరాలను, రంపచోడవరం మండలంలో 1112.69 ఎకరాలను.. మొత్తం 2130.21 ఎకరాలను గుర్తించింది. నిర్వాసితుల్లో కొందరు సాగుకు పనికి రాాని ఆ భూములు తమకు వద్దని నిరాకరించారు. ఉదాహరణకు దేవీపట్నం మండలం పరగసానిపాడు, బోడిగూడెం, ఎం.రావిలంక గ్రామాలకు చెందిన నిర్వాసితులకు రంపచోడవరం మండలం కన్నారంలో చదును చేసిన కొండపోడు భూములను చూపినా తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయినా అధికారులు నాటి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆ భూముల అభివృద్ధికే పూనుకున్నారు. అక్కడ తుప్పలను తొలగించి, చదును చేసేందుకు పునరావాస నిధుల నుంచి రూ.కోటీ 20 లక్షలు ఖర్చు పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. తుప్పలు తొలగించినట్టు చెపుతున్న ఆ భూములే ఇప్పుడు చిట్టడవుల్లా కనిపిస్తున్నాయి. విజిలెన్స్ నిర్ధారించినా చర్యలు శూన్యం కాగా నిర్వాసిత రైతులకు ఇచ్చేందుకు గుర్తించిన భూముల్లో యంత్రాలతో తుప్పలు తొలగించి, చదును చేసిన వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రాగా విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నిజమేనని తేల్చారు. వారు నివేదిక అందజేసి కొన్నేళ్లయినా.. నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలా లేదు. తరతరాలుగా జీవించిన గ్రామాలను, జీవికను ఇచ్చిన భూములను వదిలి పునరావాస కాలనీలకు వచ్చిన నిర్వాసితులు సాగు చేసుకునేందుకు భూములు లేక, చేసేం దుకు కూలిపనులు దొరక్క అలమటిస్తున్నారు. జాతికి వెన్నెముక వంటి ప్రాజెక్టు పేరుతో తమ బతుకులకు దారీతెన్నూ లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారిం చాలి. నిర్వాసితులకు అందుబాటులో ఉన్న చోట భూములను అభివృద్ధి చేసి అప్పగించాలి. గతంలో జరిగిన అవినీతికి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి. -
అనంతబాబుపై కేసులో హైకోర్టు స్టే
రంపచోడవరం : జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)పై అరకు ఎంపీ కొత్తపల్లి గీత దాఖలు చేసిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీ వైపు వెళ్లడంపై అనంత ఉదభాస్కర్ పత్రికల్లో ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె ఆయనపై విశాఖపట్నం 4వ పట్టణ పోలీసు స్టేషన్లో ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసు అక్రమమని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ అనంత ఉదయభాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయాన్ని అనంతబాబు ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయమే గెలిచింది: అనంత బాబు స్వార్థ ప్రయోజనాలు కోసం తనపై అక్రమంగా, అన్యాయంగా అధికార పార్టీ అండదండలతో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ న్యాయమే గెలిచిందని అనంతబాబు ఆప్రకటనలో పేర్కొన్నారు. -
మళ్లీ పేలిన మావోల తూటా
వై.రామవరం/రంపచోడవరం/అడ్డతీగల : వై.రామవరం మండలం చామగడ్డ పంచాయతీ పరిధిలోని జంగాలతోట గ్రామంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు తమ మాజీ కమాండరైన మువ్వల నరేష్ అలియాస్ లచ్చి అలియాస్ లక్ష్మణరావు (25)ను కాల్చి చంపారు. నరేష్ మూడురోజులుగా మండలానికి సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వేమనపాలెంలో అత్త వారింట్లో ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి 8 మంది సాయుధ మావోయిస్టులు అక్కడికి వెళ్లారు. నరేష్‌ను బలవంతంగా జంగాలతోట తీసుకువచ్చి, నడిరోడ్డుపై గుండెలకు తుపాకీ గురిపెట్టి కాల్చడంతో అక్కడికక్కడే మరణించాడు. 2006లో పోలీసులకు లొంగిపోయిన నరేష్ అప్పటి నుంచి వారికి ఇన్ఫార్మర్గా మారాడని, హెచ్చరించినా మారకపోవడంతో హతమార్చామని గాలికొండ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు హత్యాస్థలంలో లేఖ పెట్టారు. హత్య వార్త తెలిసిన సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సై ఎస్.లక్ష్మణరావు, సిబ్బంది జంగాలతోట చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నవయసులోనే దళంలో చేరిన నరేష్ విశాఖ జిల్లా ఎండకోటకు చెందిన నరేష్ 12 ఏళ్ల వయసులోనే 2001లో మావోయిస్టు దళంలో సభ్యునిగా చేరాడు. 2005లో ఏరియా కమిటీ సభ్యునిగా, 2006లో పలకజీడి ఏరియా కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2006లోనే పోలీసులకు లొంగిపోయాడు. మావోయిస్టుల నుంచి ప్రాణభయం ఉండడం తో వై.రామవరంలో నివసిస్తున్నాడు. లొంగిపోయాక దారకొండ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదివిన నరేష్ మూడేళ్లుగా వ్య వసాయం చేస్తున్నాడని, ఇప్పుడిలా పొట్టన పెట్టుకున్నారని తల్లిదండ్రులు రోదించారు. నరేష్ రెండేళ్ల క్రితం హేమలతను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు ఒక పాప. తనకు, బిడ్డకు ఎవరు దిక్కని హేమలత సంఘటనా స్థలంలో బోరున విలపించింది. 2007లో అదే గ్రామంలో ఘాతుకం.. జిల్లా మన్యం చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. 2007లో జంగాలతోటలోనే ఊలెం రాంబాబు అనే వ్యక్తిని పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో మావోయిస్టులు హతమార్చారు. 2011లో వై.రామవరం మండలం పాతకోట వద్ద రోడ్డు నిర్మాణ యంత్రాలను తగులబెట్టిన మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని ఇలా చాటుకున్నారు. కొంత కాలంగా చాప కింద నీరులా క్యాడర్‌ను బలోపేతం చేస్తూ వచ్చి, ఇప్పుడు వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ హత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్న ఈ ప్రాంతంలో హత్యకు తెగబడడం పోలీసుల్ని సై తం ఆశ్చర్యపరిచింది. ఈ హత్యతో కొన్నేళ్లుగా తూర్పు ఏజెన్సీలో ఉన్న ప్రశాంతత భగ్నమైనట్టయింది. మావోయిస్టులు పొరుగున విశాఖ, ఒడిశా, ఖమ్మంల్లో దాడులకు పాల్పడినప్పుడు ఇక్కడే తలదాచుకుంటున్నారు. గతంలో గిరిజనులను ఇన్ఫార్మర్లన్న నెపంతో చంపిన మావోయిస్టులు ఇప్పుడు మళ్లీ అలాంటి ఘాతుకానికి పాల్పడడం, ఈ నేపథ్యంలో పోలీసులు మరింత కరకుగా వ్యవహరించే అవకాశం ఉండడం వారిని కలవరపరుస్తోంది. ముఖ్యనేతల ఆధ్వర్యంలో దాడులకు సిద్ధం! కొంత కాలంగా మావోయిస్టు అగ్ర నాయకులు సైతం జిల్లాలో సంచరిస్తున్నట్టు వచ్చిన వార్తలకు ఈ సంఘటన బలం చేకూర్చుతోంది. మావోయిస్టులు విశాఖ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఉద్యమంలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వీరు దాడులకు సిద్ధమవుతున్నట్టు ని ఘా వర్గాలు భావిస్తున్నాయి. కార్యకలాపాలను విస్తృతం చేసేం దుకు పక్కా ప్రణాళికతో ఉన్నారనడానికి నరేష్ హత్యే సాక్ష్యమంటున్నారు. 2004లో మావోయిస్టులతో చర్చల అనంతరం ప్రభుత్వం నిపేధం విధించింది. దీంతో నల్లమల, ఉత్తర తెలంగాణ ల్లో ఉద్యమం బలహీనపడి, ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి కార్యకలాపాలు సాగించారు. అనంతరం జరిగిన ఎన్కౌంటర్లలో అగ్రనాయకులు దేవన్న, సుధాకర్ చనిపోవడంతో ఇక్కడ ఉద్యమానికి పెద్దదెబ్బ తగిలింది. గోపన్న అరెస్టు తరువాత విశాఖ, తూర్పు ఏజెన్సీలో క్యాడర్ లొంగుబాట్లతో పట్టును కోల్పోయా రు. ఇంత కాలానికి తిరిగి పంజా విసరడం.. ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారనడానికి సంకేతంగా భావించొచ్చు. గిరిజన యువకుడి హత్య హేయం రంపచోడవరం : ఇన్ఫార్మర్ అన్న నెపంతో మావోయిస్టులు గిరిజన యువకుడిని హతమార్చడం హేయమని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. మావోయిస్టుల విషయంలో ఇక దూకుడుగా వ్యవహరిస్తామని, విశాఖ ఎస్పీతో చర్చించి గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దింపి, గాలిస్తామని చెప్పారు. వై.రామవరం మండలం జంగాలతోటలో మావోయిస్టులు కాల్చి చంపిన నరేష్ మృతదేహాన్ని ఎస్పీ రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్య కేవలం మావోయిస్టులు ఉనికి చాటుకోవడానికే చేశారన్నారు. గాలికొండ ఏరియా దళ సభ్యులు శరత్, ఆనంద్, జాంబ్రి, ఆజాద్‌తో పాటు 12 మంది వరకూ దళ సభ్యులు ఈ హత్యకు కారకులని తెలుస్తోందన్నారు. దీనిపై వై.రామవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. విశాఖ సరిహద్దులో పని చేస్తున్న గాలికొండ ఏరియా కమిటీ తూర్పులోనూ సంచరిస్తూ దళాల్లో యువకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. 2001లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన నరేష్ అనంతరం బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశాడని, వ్యాన్ కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నాడని చెప్పారు. మావోయిస్టులకు సహకరించినా, చందాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తేడు ప్రాంతంలో మావోల కదలికలు ఉన్నాయని, సరిహద్దు రాష్ట్రంలోని మల్కనగిరిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏజెన్సీలో ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశామని, ఏజెన్సీలోని పోలీస్స్టేషన్లకు గట్టి భద్రత ఉందని చెప్పారు. ఖమ్మం నుంచి విలీనమైన ఆరు పోలీస్ స్టేషన్లు సోమవారం నుంచి తూర్పు గోదావరి పోలీసు విభాగం ఆధ్వర్యంలో నడుస్తాయన్నారు. ఆయన వెంట ఏఎస్పీ విజయరావు ఉన్నారు. -
'తూర్పు, పశ్చిమ'లోకి ముంపు మండలాలు
హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్లలో ముంపు మండలాలను చేర్చింది. కుకునూరు, వేలూరుపాడు మండలాలను జంగారెడ్డిగూడెం డివిజన్లో కలిపింది. బూర్గంపాడులోని ఆరుగ్రామాలు కూనవరం, చింతూరు, సీఆర్పూర్, భద్రాచలం డివిజన్లోని గ్రామాలను రంపచోడవరం డివిజన్లో చేర్చినట్టు నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. -
రుణవిముక్తి కాకుంటే రణమే..
రంపచోడవరం : ఓట్లు రాబట్టుకోవడానికి ఇచ్చిన రుణమాఫీ హామీని.. గద్దెనెక్కాక గడ్డిపరకంత ఖాతరు చేయని చంద్రబాబు తమ కన్నెర్రకు గురి కాక తప్పదని మన్యసీమలోని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టు తమ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఎలుగెత్తారు. డ్వాక్రా రుణాల మాఫీ విషయమై ఇచ్చిన మాటకు కట్టుబడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరిని నిరసిస్తూ ఏజెన్సీలోని ఆ సంఘాల మహిళలు సోమవారం రంపచోడవరంలో కదం తొక్కారు. రహదారి సదుపాయం లేని మారుమూల గ్రామాల నుంచి, కాలినడకన కొండకోనలను అధిగమించి సైతం తరలి వచ్చిన మహిళలు సీపీఎం కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించి చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మహిళలు, రైతుల ఓట్లతో గెలుపొంది, ఇప్పుడు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. మహిళా సంఘం నాయకురాలు కె.చెల్లాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటించి, నేటి వరకూ పట్టించుకోకపోవడం మహిళలను మోసగించడమే అన్నారు. డ్వాక్రా సంఘాలకు సంపూర్ణ రుణమాఫీ చేయకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వాగ్దానానికి ఎగనామం పెట్టడానికి ఇప్పుడు అనేక రకాల కారణాలు చూపడం సిగ్గుచేటన్నారు. కాగా ఇందిరా క్రాంతిపథం అధికారులు డ్వాక్రా సంఘాల నుంచి అనధికారంగా రూ.1000 వసూలు చేయడంపై విచారణ జరిపించాలని పీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. పీఓ గంధం చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. స్థానికంగా ఉన్న డ్వాక్రా మహిళా సంఘాల సమస్యలను సమగ్ర నివేదిక ద్వారా తెలియజే స్తే పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఎం.సుబ్రమణ్యం మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ జరిగే వరకూ అన్ని సంఘాలను కలుపుకొని ఆందోళన చేస్తామన్నారు. రుణాల వసూలు కోసం బ్యాంకులు తీవ్ర ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం నుంచి రుణమాఫీ విషయంలో సృష్టమైన హామీ వచ్చేవరకు కూడా డ్వాక్రా మహిళా సంఘాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గి రిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.బాపన్నదొర, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు సిరిమల్లి రెడ్డి, ఆశ వర్కర్స్ యూ నియన్ అధ్యక్షురాలు కె.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సెటిల్మెంట్లు చేస్తే చర్యలు
రంపచోడవరం, మారేడుమిల్లి:న్యాయం కోసం బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వస్తే వెంటనే కేసు నమోదు చేయాలని, అలా చేయకుండా సెటిల్మెంట్లు చేస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ హెచ్చరించారు. రంపచోడవరం డివిజన్లో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తూర్పు సరిహద్దు ప్రాంతంలో మావోల కదలికలు ఎక్కువగా ఉన్నాయని గాలికొండ, కోరుకొండ దళాలు సరిహద్దులో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు ఏజెన్సీలో 2008 నుంచి మవోల కదలికలు పూర్తిగా తగ్గాయని, ప్రస్తుతం గుర్తేడు ఏరియాలో మావోల కదలికలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్టుల కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రాలో విలీనమైన మండలాల నుంచి ఆరు పోలీస్ స్టేషన్లు తూర్పు పరిధిలోకి వచ్చాయని, కొత్తగా మరో సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం ఏర్పాటు అవసరం ఉందన్నారు. మావోల ప్రభావం ఎక్కువగా ఉన్న చత్తీస్గడ్ కుంట ఏరియాలో శబరి ప్లాటూన్ సంచారం ఉందని, మావోలకు చెక్ పెట్టేందుకు కూంబింగ్ జరుగుతుందని, వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు. విలీన ప్రాంతంలో పోలీస్ సిబ్బంది నియమకానికి సమయం పడుతుందని, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం గుర్తేడులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఉందని ఎస్పీ చెప్పారు. గిరిజన యువత మావోల ఉద్యమంవైపు ఆకర్షితులు కావడం లేదని, ఇందుకు ఉపాధి అవకాశాలు పెరగడం చైతన్యం రావడమే కారణమని పేర్కొన్నారు. మావోల ప్రభావిత ప్రాంతాల్లో ఐఏపీ నిధులతో చేపట్టిన పనుల ప్రగతిపై పరిశీలించామని, గిరిజన యువత చైతన్యానికి వివిధ అంశాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టామన్నారు. తూర్పు సరిహద్దులోని గ్రామాల్లో గంజాయి సాగు చేస్తూ ఏజెన్సీ ప్రాంతం మీదుగా బయటకు రవాణా చేస్తున్నారని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసులు గంజాయి అక్రమార్కులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సి.హెచ్.విజయరావు ఉన్నారు. అనంతరం ఆగస్టు 15 సందర్భంగా రంపచోడవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి పోలీస్ మీట్ విజేతలకు ఎస్పీ ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు కృష్ణారావు, రాంబాబు, ఉమర్, ముక్తేశ్వరరావు, ఎస్సై విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై మన్యం మహిళల కన్నెర్ర
అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తాం.... టీడీపీకే ఓట్లు వేయమని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడుపై మన్యం మహిళలు కన్నెర్ర చేశారు. రుణమాఫీపై మాట తప్పిన బాబు సర్కార్‌పై డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని ఏడు మండలాల పరిధిలోని గ్రామల నుంచి డ్వాక్రా మహిళలు నిన్న రంపచోడవరం తరలి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథకం కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీపై చంద్రబాబు చెబుతున్న కుంటిసాకులపై వారు నిప్పులు చెరిగారు. డ్వాక్రా మహిళలకు ట్వాక్రా వేశారంటూ ధ్వజమెత్తారు. డ్వాక్రా సంఘాలకు చెందిన సుమారు 50వేలమంది రుణమాఫీ కోసం పడిగాపులు పడుతున్నారు. అయితే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీతో 30 కోట్ల మేర రుణం మాఫీ అవుతుందని మహిళలు ఆశపడ్డారు. ఓట్లు వేయించుకున్న బాబు... సీఎం అయినా ఆ హామీ అమలు చేయకపోవటంతో నిరాశ చెందారు. అధికారంలోకి వచ్చాక బాబు రుణాలు రద్దుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినందునే మహిళలు, రైతులు ఓట్లు వేశారన్నారు. బేషరతుగా రుణాలు మాఫీ చేయాలని లేకుంటే ఈ నెల 18న ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత మాట మారుస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై డ్వాక్రా మహిళలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు ట్వాక్రా వేసిన చంద్రబాబు అసలు ఆదాయ వ్యయాలపై శే్వతపత్రం విడుదలచేస్తే గుట్టు రట్టు కాగలదని అన్నారు. -
అడవుల్లో... అడ్డంకుల్ని అధిగమించి...
ఇటీవల దక్కిన ‘లెజెండ్’ ఘన విజయంతో ఊపు మీదున్న హీరో నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో తన తాజా చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణమవుతోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాలలో దిగ్విజయంగా జరిగింది. ‘‘నిజానికి, ఏజెన్సీలో భారీ వర్షాలు కురిసి, ఈ చిత్ర షూటింగ్‌కు అంతరాయం తలెత్తింది. 7 రోజులనుకున్న షెడ్యూల్ 13 రోజుల దాకా విస్తరించింది. అయినప్పటికీ, కష్టనష్టాలకు వెరవకుండా ముందుకెళ్ళి, ముందుగా అనుకున్న సన్నివేశాలను అనుకున్నట్లుగా చిత్రీకరించి, ఈ షెడ్యూల్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాం’’ అని నిర్మాత రుద్రపాటి రమణారావు ‘సాక్షి’కి చెప్పారు. ఎత్తై భారీ వృక్షాల మధ్య, అటవీ ప్రాంతంలో జరిగిన ఈ షెడ్యూల్లో కొన్ని పోరాట దృశ్యాలనూ, కథానుగుణంగా కొన్ని టాకీ సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఈ ఏజెన్సీ షెడ్యూల్లో హీరో బాలకృష్ణ, హీరోయిన్ త్రిషతో పాటు చలపతిరావు, గీత, చిత్రలేఖ, శ్రావణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘దాదాపు 30 మంది ఫైటర్లతో ప్రధాన పోరాట సన్నివేశాలు తీశాం. వర్షాలు అడ్డంకి సృష్టించినప్పటికీ వెనుదిరిగి రాకుండా, ఓ కొత్త నిర్మాత ఇలా హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళిన 250 మంది యూనిట్‌తో అక్కడే బస చేసి, అనుకున్న రీతిలో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం అరుదైన విషయం’’ అని ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ చెప్పారు. రాజమండ్రికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా అందని లొకేషన్లో ప్రకృతి పరిసరాల మధ్య తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శక, నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వెంకట ప్రసాద్ ఛాయాగ్రహణం, రవీందర్ కళాదర్శకత్వం నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించాల్సి ఉంది. ‘‘రేపటి నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్, తదితరప్రాంతాల్లో పది రోజుల పాటు కొన్ని ప్రధాన పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు.