అటవీసీమలో అవినీతి ఊడలు
రంపచోడవరం :బహుళార్థ సాధకమైన పోలవరం ప్రాజెక్టు అవినీతిపరులైన అధికారులకు స్వార్థసాధకంగా మారింది. పంట పొలాలకు నీటి ని అందించాల్సిన ఈ ప్రాజెక్టు పేరుతో వారు తమ పంట పండించుకున్నారు. విద్యుత్ కాంతులు వెదజల్లాల్సిన ఈ మహా నిర్మాణం మాటున తమ ఇళ్లు చక్కబెట్టుకున్నారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే గిరిజన రైతులకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన భూమి అభివృద్ధి సాకుతో రూ.అరకోటికి పైగా ఆరగించారు.పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన గిరిజన రైతులకు భూమికి భూమి ఇవ్వాలని నిర్ణయించిన అప్పటి రాష్ర్ట ప్రభుత్వం సాగుకు అనువైన భూముల్ని మాత్రమే ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని నిర్దేశించింది. అయితే ఐటీడీఏ, ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై కొండపోడు భూముల చదును పేరుతో నిధులు నొక్కేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సుమారు రెండువేల మందికి భూమికి భూమి ఇచ్చేందుకు రెండువేల ఎకరాల కొండపోడు భూములు అవసరం.
2006-2007లో రెవెన్యూ శాఖ అడ్డతీగల మండలంలో 105 ఎకరాలను, దేవీపట్నం మండలంలో 42.52 ఎకరాలను, గంగవరం మండలంలో 870 ఎకరాలను, రంపచోడవరం మండలంలో 1112.69 ఎకరాలను.. మొత్తం 2130.21 ఎకరాలను గుర్తించింది. నిర్వాసితుల్లో కొందరు సాగుకు పనికి రాాని ఆ భూములు తమకు వద్దని నిరాకరించారు. ఉదాహరణకు దేవీపట్నం మండలం పరగసానిపాడు, బోడిగూడెం, ఎం.రావిలంక గ్రామాలకు చెందిన నిర్వాసితులకు రంపచోడవరం మండలం కన్నారంలో చదును చేసిన కొండపోడు భూములను చూపినా తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయినా అధికారులు నాటి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆ భూముల అభివృద్ధికే పూనుకున్నారు. అక్కడ తుప్పలను తొలగించి, చదును చేసేందుకు పునరావాస నిధుల నుంచి రూ.కోటీ 20 లక్షలు ఖర్చు పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. తుప్పలు తొలగించినట్టు చెపుతున్న ఆ భూములే ఇప్పుడు చిట్టడవుల్లా కనిపిస్తున్నాయి.
విజిలెన్స్ నిర్ధారించినా చర్యలు శూన్యం
కాగా నిర్వాసిత రైతులకు ఇచ్చేందుకు గుర్తించిన భూముల్లో యంత్రాలతో తుప్పలు తొలగించి, చదును చేసిన వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రాగా విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నిజమేనని తేల్చారు. వారు నివేదిక అందజేసి కొన్నేళ్లయినా.. నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలా లేదు. తరతరాలుగా జీవించిన గ్రామాలను, జీవికను ఇచ్చిన భూములను వదిలి పునరావాస కాలనీలకు వచ్చిన నిర్వాసితులు సాగు చేసుకునేందుకు భూములు లేక, చేసేం దుకు కూలిపనులు దొరక్క అలమటిస్తున్నారు. జాతికి వెన్నెముక వంటి ప్రాజెక్టు పేరుతో తమ బతుకులకు దారీతెన్నూ లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారిం చాలి. నిర్వాసితులకు అందుబాటులో ఉన్న చోట భూములను అభివృద్ధి చేసి అప్పగించాలి. గతంలో జరిగిన అవినీతికి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి.