పోలవరంలో.. మరో అవినీతి రత్నం | Corruption in polavaram project | Sakshi
Sakshi News home page

పోలవరంలో.. మరో అవినీతి రత్నం

Published Mon, Jun 11 2018 2:46 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Corruption in polavaram project - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో అవినీతి పర్వమిది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం పనులు)లో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌– రాతి, మట్టికట్ట) మిగిలిన పనుల పూర్తికి 809.53 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా అంచనా వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం అమాంతం మూడింతలు.. అంటే  రూ.2,400 కోట్లకుపైగా పెంచింది. అంతేగాక ఈ పనులను లంప్సమ్‌(ఎల్‌ఎస్‌)–ఓపెన్‌ విధానంలో రత్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌ అనే సంస్థకు నామినేషన్‌ పద్ధతిపై కట్టబెట్టింది.

కేవలం సీఎం చంద్రబాబునాయుడు నోటిమాటపైనే ఈ పనుల్ని కట్టబెట్టేయడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అనుమతి తీసుకోలేదు.. సరికదా కనీసం రాష్ట్ర జలవనరులు, ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండానే ఆ సంస్థకు పనులు అప్పగించడం గమనార్హం. 2015–16 ధరల ప్రకారం ఈసీఆర్‌ఎఫ్‌ పనుల విలువ రూ.1,417.73 కోట్లు కాగా, ఇందులో ఇప్పటివరకు 608.2 కోట్లు ఖర్చు చేశారు.

ఆ మేరకు మరో రూ.809.53 కోట్లు మాత్రమే వ్యయం చేయాల్సి ఉండగా.. ఇప్పుడీ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,400 కోట్లకుపైగా పెంచేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు, మంత్రి దేవినేని ఉమాకు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనులను రత్నాకు అప్పగించేందుకే సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళుతున్నారు.ఆ సంస్థ పనులు ప్రారంభించాక బిల్లులు చెల్లించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అక్రమంగా నామినేషన్‌ పద్ధతిపై అప్పగించడాన్ని కేబినెట్‌లో ఆమోదముద్ర వేయించి సక్రమం చేసుకునేలా వ్యూహం రచించారు.

ముడుపుల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడం.. ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేయడంలో సర్కారు వైఫల్యంపై ప్రజలను ఏమార్చడానికి ఈసీఆర్‌ఎఫ్‌ పునాది గోడ(డయా ఫ్రమ్‌ వాల్‌) పూర్తవడంతోనే ప్రాజెక్టు పూర్తయినట్లుగా చిత్రీకరించడానికిగాను భారీ ఎత్తున పైలాన్‌ ఆవిష్కరించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంపై అధికారవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఈసీఆర్‌ఎఫ్‌ పనులు రత్నాకు అప్పగించడంతో హెడ్‌ వర్క్స్‌లో పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టినట్లయింది. ప్రధాన కాంట్రాక్టర్‌ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ ‘కమీషన్‌ ఏజెంట్‌’ పాత్రకు పరిమితం కానుంది.

పునాది పనుల్లోనే భారీగా ముడుపులు..
పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసేది ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లోనే. జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి అంటే 194.6 టీఎంసీలకు చేరాక.. వరద నీటిని స్పిల్‌ వే ద్వారా నదిలోకి మళ్లిస్తారు. ఈసీఆర్‌ఎఫ్‌ను 2,454 మీటర్ల పొడవున మూడు భాగాలుగా(564 మీటర్ల పొడవున గ్యాప్‌–1, 1750 మీటర్ల పొడవున గ్యాప్‌–2, 140 మీటర్ల పొడవున గ్యాప్‌–3) నిర్మించేందుకు గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించడానికి ఎగువన 2,050 మీటర్ల పొడవుతో ఒక కాఫర్‌ డ్యామ్‌(మట్టికట్ట), దిగువన 1,417 మీటర్ల పొడవున మరో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి. 2015–16 ధరల ప్రకారం ఈ పనుల విలువ రూ.1,417.73 కోట్లు. ఈసీఆర్‌ఎఫ్‌ పునాది గోడ నిర్మాణ పనులకోసం ఇప్పటికే రూ.462.2 కోట్లు ఖర్చు చేశారు.

కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణానికి పునాది(జెట్‌ గ్రౌటింగ్‌) పనులకు రూ.146 కోట్లకుపైగా బిల్లులు చెల్లించారు. అంటే కేవలం పునాది పనులకోసమే 608.2 కోట్ల వ్యయమైంది. ఈసీఆర్‌ఎఫ్‌ పునాది గోడ పనుల బిల్లులు ఎల్‌ అండ్‌ టీ–బావర్, కాఫర్‌ డ్యామ్‌ పనుల బిల్లులు కెల్లర్‌ సంస్థకు చెల్లించడం ద్వారా ముఖ్యనేత భారీగా కమీషన్లు రాబట్టుకున్నారు. ఈ లెక్కన ఈసీఆర్‌ఎఫ్, కాఫర్‌ డ్యామ్‌ పనుల వ్యయం రూ.809.53 కోట్లే. కానీ ఈ పనుల అంచనా వ్యయాన్ని అంతకు మూడింతలు.. అంటే రూ.2,400 కోట్లకుపైగా పెంచేయడానికి రంగం సిద్ధం చేశారు.

ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ పోయి..
ఈసీఆర్‌ఎఫ్‌ పనులను తొలుత ఎల్‌ అండ్‌ టీ సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కానీ కమీషన్లపై బేరం కుదరకపోవడంతో షాపూర్‌జీ పల్లోంజీని ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ తెరపైకి తెచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈలోగా మంత్రి దేవినేని ఉమా జోక్యం చేసుకుని తన మిత్రుడు ఎం.ఎం.ఎల్‌.నరసింహంకు చెందిన రత్నా ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రాజెక్ట్స్‌కు అప్పగించాలని ప్రతిపాదించారు.

కమీషన్ల లెక్క తేలడంతో అదే సంస్థకు పనులు అప్పగించాలని జలవనరులశాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే కేంద్రం జారీ చేసిన పీపీఏ గెజిట్‌ నోటిఫికేషన్‌లో సెక్షన్‌9(1) ప్రకారం.. పీపీఏ అనుమతి లేకుండా కొత్త కాంట్రాక్టర్‌కు నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించకూడదని జలవనరులశాఖ అధికారులు తేల్చిచెప్పారు. దాంతో అధికారులపై మండిపడిన సీఎం.. నోటిమాటపై రత్నాకు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు అప్పగించేశారు.

లంప్సమ్‌(ఎల్‌ఎస్‌)–ఓపెన్‌ విధానంలో నామినేషన్‌పై పనులప్పగించడం వల్ల.. నిర్దేశించిన పనులకంటే ఎక్కువగా చేసినట్లు చూపితే ఆ మేరకు అదనంగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని జలవనరులశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా సూచనల మేరకు ఆదివారం ఈసీఆర్‌ఎఫ్‌ పనుల వ్యవహారంలో ట్రాన్స్‌ట్రాయ్‌ వద్ద ఉన్న యంత్రాలను రత్నా సంస్థ స్వాధీనం చేసుకున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.


అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన
పోలవరం హెడ్‌వర్క్స్‌లో స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనుల్లో రూ.1,196 కోట్ల విలువైన పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్‌ నుంచి తొలగించిన ప్రభుత్వం, వాటి అంచనా వ్యయాన్ని రూ.1,483 కోట్లకు పెంచేసి.. గతేడాది నవంబర్‌ 27న జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌ను కేంద్రం తప్పుబట్టింది. దాంతో ఈ వివాదం నుంచి గట్టెక్కేందుకు పాత ధరకే నవయుగ సంస్థ ఆ పనులు చేయడానికి ముందుకొచ్చిందని సీఎం ప్రకటించారు. టెండర్ల వివాదం నేపథ్యంలో గత జనవరి 11న విజయవాడలో పీపీఏ సర్వసభ్య సమావేశం జరిగింది.

పోలవరం పనుల్లో కాంట్రాక్టర్‌ను తొలగించాలన్నా.. కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలన్నా తమ అనుమతి తీసుకోవాలన్న నిబంధనలను పీపీఏ సీఈవో సౌమిత్రి హల్దార్‌ గుర్తుచేశారు. ఖజానాపై భారం పడదని.. ఒకవేళ అదనపు భారం పడితే రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వడంతో ఆ పనులను నవయుగకు నామినేషన్‌పై అప్పగించడానికి పీపీఏ అనుమతిచ్చింది. కానీ పీపీఏ కళ్లకు గంతలుకట్టి అప్పట్లో రూ.1,243.67 కోట్ల విలువైన పనులను ఆ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టారు.

గతనెల పదిన స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌కు సంబంధించి మిగిలిన రూ.921.87 కోట్ల విలువైన పనులను పీపీఏ అనుమతి తీసుకోకుండానే అదే సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌తో మార్చి 3, 2013న ఈపీసీ విధానంలో ప్రభుత్వం చేసుకున్న కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయకుండా.. తాజాగా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించిన పనులకు ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానాన్ని వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధం. దీనివల్ల ఖజానాపై తీవ్రభారం పడుతుందని జలవనరులు, ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన వ్యక్తపరిచినా చంద్రబాబు బేఖాతరు చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement