సునయన ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ నల్లి సంగీత్ కుంచె నుంచి జాలువారిన అల్లూరి చిత్రం
సాక్షి, రంపచోడవరం(రాజమండ్రి) : తూర్పు మన్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం ఇప్పటికీ గిరిజనాల్లో స్ఫూర్తిని రగిలిస్తోంది. అల్లూరి సీతారామరాజును ఏజెన్సీ గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఆదివాసీల తరఫున బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యం చేసి అల్లూరి పోరాడారు. అల్లూరి రంపచోడవరం, అడ్డతీగల, దేవీపట్నం, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తికెళ్లిన భవనాలు నేటికీ పదిలంగా ఉంచారు. అల్లూరి జరిపిన పోరాటాలకు జ్ఞాపకాలుగా ఉంచారు. రంప గిరిజనుల తరఫున అల్లూరి చేసిన రంప పితూరి చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
అప్పట్లో అల్లూరి అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టలో రెండేళ్లు వ్యవసాయం చేశారు. ఏజెన్సీలో ఏటా గిరిజనులు అల్లూరి జయంతి, వర్ధంతి ఘనంగా నిర్వహిస్తారు. పైడిపుట్టలో వ్యవసాయం అడ్డతీగల మండలం పైడిపుట్ట గ్రామంలో అల్లూరి సీతారామరాజు కొంతకాలం వ్యవసాయం చేశారు. విప్లవ భావాలతో ఉన్న ఆయన దృష్టిని మార్చాలని అల్లూరి తండ్రి స్నేహితుడు, పోలవరం డిప్యూటీ కలెక్టర్ ఫజుల్లాఖాన్ సీతారామరాజును పైడిపుట్ట పంపించి 30 ఎకరాల భూమి ఇచ్చారు. తల్లి సూర్యనారాయణమ్మ, తమ్ముడు సత్యనారాయణరాజులో కలిసి వ్యవసాయం చేశారు. మూలికా వైద్యం చేసే అల్లూరి వద్దకు గిరిజనులు ఎక్కువగా వచ్చే వారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండాలని, ఉద్యమాలపై వెళ్లవద్దని చెప్పారు. ఫజుల్లాఖాన్ చనిపోయాక అల్లూరి విప్లవోద్యమ బాట పట్టారు.
పైడిపుట్ట గ్రామం
తల్లిని, తమ్ముడిని ఎడ్లబండిపై భీమవరం పంపించి తాను మాత్రం అడవుల్లోకి వెళ్లిపోయారు. పైడిపుట్టలో నివాసం ఉన్న సీతారామరాజు రోజూ అడ్డతీగల సైకిల్‌పై వెళ్లి పత్రికలు చదివేవారు. సీతారామరాజుపై నిఘా ఉంచి బ్రిటిష్ వారు రామరాజు దినచర్య రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆయన ఉద్యమంలోకి వెళ్లే ముందు పైడిపుట్టలో భూమి ఇచ్చిన దుశ్చర్తి ముఠాదారు చెక్కా లింగన్నదొరకు తిరిగి భూమిని ఇచ్చి రాసిన లేఖ నేటికీ పదిలంగా ఉంది. రంప రాజ్యాన్ని మునసబుదారు భూపతి పాలనలో ఉండేది.
తరువాత అతడి వారసులు పాలించారు. వారు పంట, తాటిచెట్లపై పన్నుల భారం మోపారు. అది తట్టుకోలేక గిరిజనులు తిరగబడ్డారు. గిరిజనులు జరిపిన రంప పితూరీకి అల్లూరి అండగా నిలిచారు. ఏజెన్సీలో పోలీస్‌స్టేషన్లపై అల్లూరి దాడి బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు సాయుధ పోరాటమే మార్గమని భావించిన అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు.1922లో విశాఖ జిల్లా చింతపల్లి, 23న కేడీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌పై దాడులు చేసి ఆయుధాలు కొల్లాగొట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనికులను రంగంలో దింపింది. కొంత కాలం వ్యవధి తరువాత 1922 అక్టోబర్ 15న అడ్డతీగల, 19న రంపచోడవరం పోలీస్‌స్టేషన్లపై దాడి చేశారు.
అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై తన అనుచరులతో దాడి చేసిన అల్లూరి సీతారామరాజు తాను గతంలో నివాసం ఉన్న పైడిపుట్ట వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది. అక్కడ కొంత సమయం గిరిజనులతో అల్లూరి మాట్లాడారు. అక్కడి నుంచి గంగవరం మండలం మోహనాపురం మీదుగా రంప గ్రామానికి వచ్చారు. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి అల్లూరి నడయాడిన మన్యం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి అల్లూరి దాడి చేసిన పోలీస్‌స్టేషన్లు, ఆయన నివాసం, వ్యవసాయం చేసిన పైడిపుట్ట, బ్రిటిష్ వారి చేతిలో చనిపోయిన కొయ్యూరు, అల్లూరి సమాధి ఉన్న కేడీ పేట వరకు పర్యాటకులు తిలకించేలా అభివృద్ది చేయాల్సి ఉంది.
కృత్తివెంటి స్కూల్లో అల్లూరి విద్యాభ్యాసం
రామచంద్రపురం : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగిన అల్లూరి సీతారామరాజు ప్రాథమిక విద్యాభ్యాసం ఏడాది పాటు రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు స్కూల్లో సాగింది. ప్రముఖ న్యాయవాది కృత్తివెంటి పేర్రాజు పంతులు వంద ఎకరాల భూమిని దానం చేసి పట్టణంలో 1905లో జాతీయ పాఠశాల అనే నామకరణం చేసి మిడిల్ స్కూల్‌ను స్థాపించారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఈ పాఠశాలను మొదట్లో స్థాపించారు. సమర వీరుడు అల్లూరి సీతారామరాజు రామచంద్రపురం కృత్తివెంటి మిడిల్ స్కూల్‌లో 6వ తరగతి విద్యను అభ్యసించినట్టు చెబుతున్నారు. నాలుగో తరగతిని తుని రాజావారి పాఠశాలలో 1913 జూలై 25న (అడ్మిషన్ నంబర్797) చేరినట్టు అప్పట్లో వార్తాపత్రికల ద్వారా తెలిసింది.
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నడయాడిన కృత్తివెంటి స్కూల్
1915–16లో సీకే గోవిందరాజు ప్రధానోపాధ్యాయుడిగా ఉండగా కృత్తివెంటి మిడిల్ స్కూల్‌లో అల్లూరి సీతారామరాజు ఆరో తరగతి చదివినట్టు స్పష్టమవుతోంది. అనంతరం ఆయన కాకినాడ పీఆర్ హైస్కూల్‌లో, నర్సాపురంలో చదివినట్టు తెలుస్తోంది. అల్లూరి నడయాడిన పాఠశాలగా నేటికీ పలు సందర్భాల్లో పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో వక్తలు చెబుతుంటారు. 2006 జనవరి 9న పాఠశాల శత జయంతి ఉత్సవాల్లో కూడా అల్లూరిని పూర్వవిద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment