రంపచోడవరం: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనమైన ఖమ్మం జిల్లాలోని మండలాలతో కలిపి ఏజెన్సీలోని 17 మండలాలతో అల్లూరి సీతారామరాజు గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈమేరకు ఐటీడీఏ పాలకవర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె పేర్కొన్నారు. గిరిజన జిల్లా ఏర్పాటుకు అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ప్రతిపాదనలు రూపొందించి తనకు అందజేయాలని ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడుకు ఎమ్మెల్యే సూచించారు.
ఖమ్మం జిల్లాలోని మండలాల విలీనంపై ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం విలీన మండలాలకు సత్వరమే ప్రభుత్వ పరంగా పౌరసేవలు అందించేందుకు ఐటీడీఏ సబ్ యూనిట్‌ను నెలకొల్పాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం స్థానికంగా నెలకొల్పేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ టి.రత్నబాయి పాల్గొన్నారు.
పీఓ గంధం చంద్రుడు మాట్లాడుతూ సమయం లేకపోవడంతో వలన అందరికీ గురువారం సమాచారం ఇవ్వలేకపోయామని అందువల్ల శుక్రవారం సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. అందరి సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన చీఫ్ కమిషనర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్‌ల అధ్యక్షతన విలీన మండలాలపై ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
రోడ్ల నిర్మాణానికి రూ.310 కోట్లు, రక్షిత తాగునీరు కోసం రూ.108 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. అల్లూరి జిల్లా ఏర్పాటుకు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ అనంత ఉదయభాస్కర్(అనంత బాబు), కొమ్మిశెట్టి బాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి తదితరులు పాల్గొన్నారు.
మన్యం ప్రాంతాన్ని ‘అల్లూరి’ జిల్లాగా చేయాలి
Published Sat, Jul 26 2014 12:54 AM | Last Updated on Fri, Aug 17 2018 8:01 PM
Advertisement