Vantala Rajeswari
-
చంద్రబాబు ఝలక్‌తో తలో దారి!
అల్లూరి సీతారామరాజు: అరకు పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. క్షుద్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన చంద్రబాబు నిర్ణయాలను పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అరకు పార్లమెంట్ టికెట్ బీజేపీకి కేటాయింపు.. టీడీపీలో సీనియర్లను పక్కనబెట్టి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం వంటి పరిణామాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల పరిస్థితి తలోదారి అన్నట్టుగా ఉంది. అరకు పార్లమెంట్ టికెట్‌ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం వారికి మింగుడు పడటం లేదు. ఏమాత్రం ఉనికి లేని బీజేపీకి టికెట్ ఎలా కేటాయిస్తారని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కూటమి (బీజేపీ) అభ్యర్థి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు మద్దతుగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ తరఫున అరకు ఎంపీగా గెలుపొందిన ఆమె పార్టీకి దూరంగా ఉంటూ స్వప్రయోజనాలకోసం ఐదేళ్ల పదవిని వాడుకున్నారని, నియోజకవర్గంలో ఎన్నడూ కనిపించని ఆమె తరఫున ఎలా ప్రచారం చేయాలని వారు మదనపడుతున్నారు. ఆమైపె ఆర్థికపరమైన అంశాలతోపాటు ఎస్టీ కాదని కేసులు ఉన్నాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె కోసం ప్రచారం చేయలేమని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు బహిరంగంగానే చెబుతున్నారు. మొదటి నుంచి ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీకి పట్టు ఎక్కువ. పార్టీ ఫిరాయించిన నాటి నుంచి కొత్తపల్లి గీతపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించిన వంతల రాజేశ్వరి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పారు. ఇదే పరిస్థితి కొత్తపల్లి గీతకు కూడా తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ శ్రేణులు మొరపెట్టుకున్నా.. రంపచోడవరం అసెంబ్లీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నాయకత్వంలో ఆందోళన చేసినప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేదు. పార్టీలో సీనియర్లను కాదని మిరియాల శిరీష దేవికి ఎలా టికెట్ ఇస్తారని, దీనివల్ల నష్టం జరుగుతుందని పార్టీ శ్రేణులు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. నెలరోజుల క్రితం పార్టీలోకి వచ్చిన ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు అనుచరులు బహిరంగంగా విమర్శించారు. టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషదేవి భర్త భాస్కర్‌కు సంబంధించిన కేసుల వివరాలను టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు స్వయంగా చంద్రబాబుకు అందజేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసగించినట్టుగా ఆయనకు వివరించారు. ఈ పరిస్థితుల్లో శిరీషదేవిని అభ్యర్థిగా కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్పదని తెలియజేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. రెబల్‌గా బరిలోకి? చంద్రబాబు ఇచ్చిన ఝలక్‌తో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఇంటికే పరిమితమయ్యారు. టీడీపీ తనకు రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చినప్పటికీ వైఎస్సార్సీపీని విడిచి వెళ్లేది లేదని అప్పటిలో ప్రకటించిన వంతల రాజేశ్వరి ఆ తరువాత పార్టీ ఫిరాయించడంపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే ఆమె ఓటమికి కారణమైంది. అప్పటిలో పార్టీ మారేదిలేదని ఆమె ప్రకటించిన దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలావుండగా ఎన్నికల్లో టీడీపీ రెబల్‌గా పోటీచేయాలా లేదా అనే దానిపై వంతల రాజేశ్వరి అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇవి చదవండి: కాలవ మోసం.. ఇదే సాక్ష్యం! -
సీఎంకు వం‘తలపోటు’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై ఎన్నికై.. స్వార్థ ప్రయోజనాల కోసం ‘పచ్చ’కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి అసమ్మతి సెగ తగిలింది. ఆమెపై టీడీపీ పాతకాపులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. స్వప్రయోజనాలతో ఆమె పార్టీ మారినా వైఎస్సార్ సీపీ కేడర్ టీడీపీలోకి వెళ్లలేదు. ఒకరిద్దరితో మాత్రమే ఆమె ‘పచ్చ’ కండువా వేసుకున్న దుస్థితి నాడు చోటు చేసుకుంది. టీడీపీలో వెళ్లిన తరువాత ఆమె అక్కడ పూర్వం నుంచీ పని చేస్తున్న నాయకులను కలుపుకోలేకపోయారు. దీంతో ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఆమె చేసిందేమీ లేదం టూ ఆ పార్టీ సీనియర్లు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై అధిష్టానానికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. అమరావతిలోని సీఎం నివాసానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. వంతలకు టిక్కెట్టు ఇవ్వద్దని చంద్రబాబు ఎదుటే ఆందోళనకు దిగారు. తమ మాట కాదని వంతలకు టిక్కెట్టు ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు. ఆమెకు వ్యతిరేకంగా పని చేయడమే కాకుండా.. ఒకరిద్దరిని ఇండిపెండెంట్లుగా పోటీకి దింపి దెబ్బ కొడతామని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. పెళ్లినాటి మాటలు విడాకుల రోజున ఉండవన్నట్టు.. తిరిగి టిక్కెట్టు ఇచ్చే విషయమై ఆమె పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ ని ఎన్నికల వేళ అమలు చేసే విషయంలో అధినేత ఊగి సలాటలో పడ్డారు. టీడీపీ పాతకాపులు తీవ్రస్థాయిలో అసమ్మతి రాగం ఆలపిస్తుండడంతో రాజేశ్వరికి టిక్కెట్టు ఖరారు చేసే విషయమై చంద్రబాబు ఇరకాటంలో పడ్డా రు. ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇవ్వద్దంటూ సీఎం నివా సం ముందు ఆందోళన చేసినవారిలో టీడీపీ రంపచోడవరం అధ్యక్షుడు అడబాల బాపిరాజు, గంగవరం అధ్యక్షుడు పాము అర్జున్, మారేడుమిల్లి అధ్యక్షుడు సూరిబాబు గౌడ్, విలీన మండలాల నాయకులు తదితరులు ఉన్నారు. మరిన్ని వార్తాలు.. -
ముంపు మండలాల్లో వైఎస్ జగన్ పర్యటన ఖరారు
జూలై 2న రానున్నారని ప్రకటించిన ఎమ్మెల్యే రాజేశ్వరి, యువ నేత అనంతబాబు ప్రజలను అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు రేఖపల్లి(వీఆర్‌పురం) : విలీన మండలాల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటన జూలై 2వ తేదీన ఖరారైందని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) ప్రకటించారు. రేఖపల్లిలో శనివారం వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించి పర్యటనపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కాపు ఉద్యమం కారణంగా ఈ నెల 16వ తేదీన ఖరారైన పర్యటనను రద్దు చేసుకున్న విషయూన్ని గుర్తు చేశారు. పశ్చిమ పర్యటన అనంతరం... జులై 1వ తేదీన జగన్ మోహన్‌రెడ్డి ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా విలీన మండలాల్లో పర్యటించిన అనంతరం తూర్పు విలీన మండలాల్లో 2న పర్యటిస్తారన్నారు. భద్రాచలంలో రాత్రి విశ్రాంతి తీసుకొని 2న ఎటపాక మండలం మీదుగా కూనవరం చేరుకొని అక్కడి నుంచి రేఖపల్లిలో నిర్వాసిత రైతులతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం రేఖపల్లి చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాచర్ల గంగులు, ఆవుల మరియాదాస్, రమేష్ నాయుడు, కడియం రామాచారి, మంత్రిప్రగడ నరసింహారావు, ఎండీ మూసా, కొవ్వూరి రాంబాబు, వైఎస్సార్ సీపీ మండలాల కన్వీనర్లు పొడియం గోపాల్, ఆలూరి కోటేశ్వర రావు, కిశోర్‌బాబు, వై.రామలింగారెడ్డి, వాసు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
'రూ.100 కోట్లు ఇచ్చినా వెళ్లం.. మేం వైఎస్ఆర్సీపీతోనే..'
హైదరాబాద్: రూ.20 కోట్లు కాదు కదా రూ.100 కోట్లు ఇచ్చినా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ స్పష్టం చేశారు. తాము శాశ్వతంగా వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతామని చెప్పారు. ఎప్పటికైనా టీడీపీ ఓ మునిగే పడవ అని ఆమె అన్నారు. ఆ పార్టీలోకి పోయి ఏం చేయాలని, అలా చేస్తే జనాలు ఛీ కొడతారని అన్నారు. ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే టీడీపీ కుట్రలు చేస్తుందని ఆమె మండిపడ్డారు. అందుకే రంపచోడవరం వంతల రాజేశ్వరీకి రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని అన్నారు. గిరిజన బిడ్డలమైన తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిరిజన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నందున వారిని లాక్కునేందుకే టీడీపీ కుట్రలు చేస్తుందని ఆ కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు. -
'పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామన్నారు'
హైదరాబాద్: పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని వైఎస్సార్ సీపీకి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వెల్లడించారు. తాను డబ్బుకు లొంగే మనిషిని కాదని స్పష్టం చేశారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె 'సాక్షి'తో మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యే అయ్యాయని, చివరివరకు వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోని వచ్చానని చెప్పారు. విశ్వసనీయతతో పనిచేస్తానని, రాజకీయాల్లో కొనసాగినంతకాలం జగనన్న వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తన గురించి అనవసరంగా కొన్ని ప్రతికలు, వార్తా చానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తనను అడగకుండా ఎలా రాస్తారని ఆమె ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీ జిల్లా సారథి జ్యోతులకు ఘన స్వాగతం
కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యాక తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చిన ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘన స్వాగతం లభించింది. వివిధ ప్రాంతాల్లో ఆయనను పార్టీ శ్రేణులుపూలమాలలతో ముంచెత్తారు. జ్యోతుల హైదరాబాద్ నుంచి ఉదయం జగ్గంపేట నియోజకవర్గంలోని స్వగ్రామమైన ఇర్రిపాక చేరుకున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనను కలిసి అభినందించారు. అనంతరం అన్నవరం వెళ్లిన జ్యోతులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావుతో కలిసి జ్యోతుల సత్యదేవుని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకున్న ఆయనకు సర్పవరం జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, రెడ్డి వీరవెంకటసత్యప్రసాద్, తోట సుబ్బారావునాయుడు, కాకినాడ సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణా సంచాకాల్చి జ్యోతులను పూలమాలలతో ముంచెత్తారు. అనంతరం జ్యోతుల జేఎన్టీయూ, భానుగుడి, టూ టౌన్, మెయిన్‌రోడ్ మీదుగా బాలాజీచెరువు సెంటర్‌కు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా ప్రచార, ఎస్సీ సెల్, రైతు విభాగం కన్వీనర్లు రావూరి వెంకటేశ్వర్లు, శెట్టిబత్తుల రాజబాబు, రెడ్డి రాధాకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, పి.గన్నవరం నియోజకవర్గ నాయకుడు విప్పర్తి వేణుగోపాలరావు తదితరులున్నారు. -
త్వరలో సిటీబస్సు సర్వీసులు : డిప్యూటీ సీఎం
కాకినాడ సిటీ: త్వరలో రాజమండ్రి, కాకినాడ నగరాల్లో సిటీ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఉపముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. జిల్లాలో వివిధ డిపోల నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఐదు బస్సు సర్వీసులను సోమవారం మంత్రి కాకినాడ డిపోలో జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన ఉపప్రణాళిక నిధులతో ప్రవేశపెట్టిన మూడు ఏజెన్సీ ప్రాంత కొత్తసర్వీసులను రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కాకినాడ, రాజమండ్రి నగరాలకు త్వరలో జవహర్లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకం ద్వారా 35 చొప్పున ఆధునిక సిటీబస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి.రమాకాంత్ మాట్లాడుతూ కాకినాడ నుంచి అనంతపురానికి సూపర్‌లగ్జరీ, రాజోలు నుంచి తిరుపతికి డీలక్స్ సర్వీసులను ప్రారంభించామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద ఏలేశ్వరం నుంచి మోహనాపురానికి, ఏలేశ్వరం నుంచి వంతంగికి, గోకవరం నుంచి కొత్తవీధి కి సర్వీసులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరం కో-ఆర్డినేటర్ అనంత ఉదయ్‌భాస్కర్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. పుష్కరాలపై ఎనిమిదిన సమావేశం గోదావరి పుష్కరాలపై సమీక్షించేందుకు ఈ నెల 8న రాజమండ్రిలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చినరాజప్ప వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి పెద్దాపురం : ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సోమవారం మండలంలోని కట్టమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్టీకరణ చట్టం ప్రకారం కౌన్సెలింగ్ ఉమ్మడిగానే జరగాలని, విద్యా అంశం పదేళ్లు ఉమ్మడి గానే ఉంటుందని తాను, మరో ఉపముఖ్యమంత్రి కె.వి.కృష్ణమూర్తి గవర్నర్‌ను కలిశామని చెప్పారు. కౌన్సెలింగ్వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా, ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో కౌన్సెలింగ్‌లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిందన్నారు. యథావిధంగా ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. రాజప్పకు సత్కారం స్థానిక సామర్లకోట రోడ్డు మార్గంలో ఉన్న క్రైస్తవ స్వర్ణదేవాలయంలో నిర్వహిస్తున్న తైలాభిషేకం పండగ సోమవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ క్రీస్తుబోధనలు అనుసరణీయమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైబిల్ మిషన్ ఉపాధ్యక్షుడు సంజీవరావు, స్వర్ణదేవాలయం కన్వీనర్ జి.ఆర్. ఇమ్మానుయేలు ఆధ్వర్యంలో మత పెద్దలు చినరాజప్పను సత్కరించారు. తైలాభిషేకం పండగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజాసూరిబాబు, మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మన్యం ప్రాంతాన్ని ‘అల్లూరి’ జిల్లాగా చేయాలి
రంపచోడవరం: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనమైన ఖమ్మం జిల్లాలోని మండలాలతో కలిపి ఏజెన్సీలోని 17 మండలాలతో అల్లూరి సీతారామరాజు గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈమేరకు ఐటీడీఏ పాలకవర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె పేర్కొన్నారు. గిరిజన జిల్లా ఏర్పాటుకు అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ప్రతిపాదనలు రూపొందించి తనకు అందజేయాలని ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడుకు ఎమ్మెల్యే సూచించారు. ఖమ్మం జిల్లాలోని మండలాల విలీనంపై ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం విలీన మండలాలకు సత్వరమే ప్రభుత్వ పరంగా పౌరసేవలు అందించేందుకు ఐటీడీఏ సబ్ యూనిట్‌ను నెలకొల్పాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం స్థానికంగా నెలకొల్పేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ టి.రత్నబాయి పాల్గొన్నారు. పీఓ గంధం చంద్రుడు మాట్లాడుతూ సమయం లేకపోవడంతో వలన అందరికీ గురువారం సమాచారం ఇవ్వలేకపోయామని అందువల్ల శుక్రవారం సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. అందరి సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన చీఫ్ కమిషనర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన విలీన మండలాలపై ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి రూ.310 కోట్లు, రక్షిత తాగునీరు కోసం రూ.108 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. అల్లూరి జిల్లా ఏర్పాటుకు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ అనంత ఉదయభాస్కర్(అనంత బాబు), కొమ్మిశెట్టి బాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి తదితరులు పాల్గొన్నారు. -
తుదిశ్వాస వరకు జగనన్న వెంటే..వంతల రాజేశ్వరి
రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రంపచోడవరం, న్యూస్‌లైన్ : మారుమూల ప్రాంతానికి చెందిన నిరుపేద గిరిజన మహిళ నైన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభకు వెళ్లేందుకు అవకాశం కల్పించిన జగనన్న వెంటే నా తుది శ్వాస వరకూ ఉంటానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. గిరిజనులపై తరగని ప్రేమాభిమానాలను జగనన్న చూపించారన్నారు. మండలంలోని వాడపల్లి సర్పంచ్ కోసు వెంకటరమణ వివాహానికి ఎమ్మెల్యే రాజేశ్వరి, రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) సోమవారం హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వారి స్వార్థం కోసం ఇద్దరు ఎంపీలు పార్టీని విడిచి వెళ్లినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదన్నారు. అనంతరం గ్రామంలో గిరిజనులను కలసి ఎన్నికల్లో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొంత మంది గిరిజనులు చెప్పిన సమస్యలను విన్నారు. త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, ఎంపీటీసీ సభ్యురాలు కారుకోడి పూజ, కాంతం, నాయకులు కాపారపు రూతూ, రామాంజనేయులు, సీహెచ్ రాజు, నాగు తదితరులు పాల్గొన్నారు. -
రంపచోడవరం వైఎస్సార్సీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి
రంపచోడవరం, న్యూస్‌లైన్ :రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంతల రాజేశ్వరి బరిలో నిలిచారు. పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్‌ను ఇక్కడ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించడంతో ఆయన నామినేషన్ వేశారు. అయితే సోమవారం నాటి పరిశీలనలో ఉదయభాస్కర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పార్టీ తరఫున ద్వితీయ ప్రాధాన్యత అభ్యర్థిగా నామినేషన్ దాఖ లు చేసిన రాజేశ్వరి పేరును పార్టీ ఖరారు చేసింది. రాజకీయ నేపథ్యం గల కుటుంబానికి చెందిన రాజేశ్వరి 2006లో అడ్డతీగల ఎంపీపీగా పనిచేశారు. ఆమె తండ్రి వంతల కొండబాబు 1987లో అడ్డతీగల మండల ఉపాధ్యక్షుడుగా, 1989లో అడ్డతీగల ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు వంతల సూర్యనారాయణరెడ్డి దాకోడు సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. అడ్డతీగల మండలం దాకోడుకు చెందిన రాజేశ్వరి భర్త సోంబాబు వ్యవసాయం చేస్తారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏజెన్సీలోని ఆదిమ గిరిజన తెగ ల్లో ఒకటైన కొండరెడ్డి కులానికి చెందిన రాజేశ్వరి అన్ని వర్గాల ఆదరణతో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.